Share News

పొంచివున్న నైపుణ్యాల సంక్షోభం

ABN , Publish Date - Aug 06 , 2026 | 03:49 AM

ఢిల్లీలో జరిగిన జెన్ జీ ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసి విస్తరించటం దేశాన్ని నివ్వెరపరిచింది. ‘నీట్‌’ పరీక్షాపత్రం లీక్ పట్ల ఆగ్రహంగా మొదలైన యువత నిరసన.. చివరకు పెరుగుతున్న నిరుద్యోగం, సామాజిక నిరాశా నిస్పృహల...

పొంచివున్న నైపుణ్యాల సంక్షోభం

ఢిల్లీలో జరిగిన జెన్ జీ ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసి విస్తరించటం దేశాన్ని నివ్వెరపరిచింది. ‘నీట్‌’ పరీక్షాపత్రం లీక్ పట్ల ఆగ్రహంగా మొదలైన యువత నిరసన.. చివరకు పెరుగుతున్న నిరుద్యోగం, సామాజిక నిరాశా నిస్పృహల పట్ల ప్రతిఘటనోద్యమంగా పరిణమించింది. డిగ్రీలున్నా ఉద్యోగాలు రాకపోవటం, ఆకాంక్షలు పెరుగుతున్నా తగినంతగా అవకాశాలు లేకపోవటం యువతను తిరగబడేలా చేసింది. ప్రవేశ పరీక్షాపత్రం లీకవటం యువతను సమీకరించే ఒక నిప్పురవ్వ మాత్రమే. దాని వెనక దాగివున్న సంక్షోభం నిజమైనది, సంక్లిష్టమైనది.

పాఠశాలల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు.. మన విద్యావ్యవస్థ చాలామేర కుప్పకూలింది. పిల్లల్లో 80శాతం మంది స్కూలు విద్యలో పాసవుతున్నారు కానీ, వారికి చదువులో ఎటువంటి నిజమైన పునాదీ ఉండటం లేదు. ఇందులో వారి తప్పు కూడా ఏమీ లేదు. బట్టీపట్టటం ద్వారా నేర్చుకోవటం, మూకుమ్మడి కాపీయింగ్‌లతో పాసవటం అనే అవ్యవస్థ వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది.

రెండోది, విద్యార్థులు ఏం నేర్చుకున్నారో బేరీజు వేసే పరీక్షా పద్ధతులు అర్థరహితంగా ఉండటంతో.. అత్యధిక శాతం ఆరాటపడే ‘స్టెమ్‌’ (సైన్స్–టెక్నాలజీ–ఇంజినీరింగ్–మ్యాథ్స్‌) కోర్సుల్లో చేరేందుకు ప్రత్యేకంగా పోటీ ప్రవేశ పరీక్షలు అవసరమయ్యాయి. మూడోది, చాలా సందర్భాల్లో రాష్ట్రాలు నిర్వహించే పరీక్షా పద్ధతుల్లో విశ్వసనీయత లోపిస్తోంది. బోర్డు ప్రమాణాల్లో రాష్ట్రాల మధ్య భారీ అంతరం ఉంటోంది. దీంతో, ప్రామాణిక, నిష్పాక్షిక, న్యాయమైన బేరీజు కోసం దేశవ్యాప్తంగా ఒకే ప్రవేశ పరీక్ష అవసరమవుతోంది.

నాలుగోది, వైద్య కళాశాలలు పుట్టగొడుగుల్లా పెరిగినప్పటికీ, ఎంపిక చేసిన కొన్ని కళాశాలలు మాత్రమే యువ మెడికోలకు కనీస ప్రమాణాల శిక్షణను అందించగలుగుతున్నాయి. కాబట్టి, లక్షలాది మందికి వైద్య కళాశాలల్లో సీట్లు అందుబాటులో ఉన్నా, మెరుగైన కొన్ని కళాశాలలకే డిమాండ్ ఉంది. వాటిల్లో చేరేందుకు ఉత్తమ ర్యాంకుల కోసం విపరీత పోటీ ఉంటోంది.

అయిదోది, మెడికల్ పోటీ ప్రవేశ పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేసే డిమాండ్‌కు అనుగుణంగా అనేక కోచింగ్ సెంటర్లు వెలిశాయి. పదవ తరగతి తర్వాత శిక్షణ–చదువును విభాగాలవారీ ప్యాకేజీలతో అందించనారంభించాయి. పోటీ, పాఠశాల పునాదులు బలహీనంగా ఉండటం వల్ల.. ఆ రెండేళ్లపాటు యువ విద్యార్థులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.


ఇంత మితిమీరిన ఒత్తిడి వాతావరణంలో, పరీక్షా పత్రం లీక్ అయిందంటే– అది యువతకు, వారి తల్లిదండ్రులకు శరాఘాతమే. ఈ నేపథ్యంలో నీట్ పేపర్ లీక్‌ అంతటి అలజడికి దారితీయటంలో ఆశ్చర్యమేమీ లేదు. విద్యార్థులు, తల్లిదండ్రుల బాధను గ్రహించి కేంద్ర ప్రభుత్వం సహానుభూతితో సకాలంలో బలంగా స్పందించి ఉండాల్సింది. రాజకీయంగా సున్నితంగా వారితో కూర్చుని మాట్లాడాల్సింది. అలాగాక, సవాలక్ష సమస్యల్లో ఇదొకటి అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరించింది. భారీఎత్తున యువత స్వచ్ఛందంగా తరలివచ్చే ఓ ఉద్యమానికి నిప్పురవ్వ రాజుకుంటోందని అంచనా వేయలేకపోయింది.

అధికారాన్వేషణలో మునిగితేలే మనలాంటి సమాజంలో ఇలాంటి తక్షణ రాజకీయ పర్యవసానాలు రసవత్తరంగా అనిపిస్తాయిగానీ, మనం ఆ నిప్పురవ్వను దాటి ఆలోచించాలి. ఏమాత్రం ఆజ్యం తగిలినా ఓ పెద్ద విస్ఫోటనానికి దారితీసే మూలాల్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. మన ‘విద్య–నైపుణ్యాలు– ఉపాధి అవకాశాల’ అభివృద్ధి వలయాన్ని దెబ్బతీసే ఒక లోతైన సంక్షోభం అందులో దాగివుంది.

ప్రస్తుతం మన దేశంలో ప్రతిష్ఠాత్మక కోర్సుల్లో చేరుతున్నవారికి కూడా నైపుణ్యాలు ఉండటం లేదు. ఉద్యోగాల్లోకి తీసుకోవటానికి చాలామందికి తగిన నైపుణ్యాలు లేవు. 13.5 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో కేవలం 15–20శాతం మందికే ఉద్యోగాలకు తగిన కనీస నైపుణ్యాలున్నాయని అంచనా.

ఏళ్ల తరబడి కాలేజీల్లో చదువుకున్నాక, ఒక విలువ లేని డిగ్రీతో యువత బయటకు వస్తున్నారు. వైద్య గ్రాడ్యుయేట్లకు కూడా శిక్షణ అరకొరగా ఉంటోంది. పట్టభద్రుల సంఖ్యతో పొంతన లేకుండా వైద్య పోస్టు గ్రాడ్యుయేట్ సీట్లు అతితక్కువ సంఖ్యలో ఉండటంతో, అందులో చేరగలగటం భగీరథ ప్రయత్నంలా మారుతోంది. ఎలాగోలా మరో ప్రవేశపరీక్షలో నెగ్గి, పోస్టుగ్రాడ్యుయేట్ శిక్షణ తీసుకున్న తర్వాత కూడా, వైద్య వృత్తి ప్రాక్టీస్‌కి తగిన నైపుణ్యాలు, నమ్మకం కోసం పేరొందిన వైద్య నిపుణుల వద్ద కొన్నేళ్లపాటు సహాయకులుగా పనిచేయాల్సి వస్తుంది. ఎంతో విలువైనవిగా భావించే ‘స్టెమ్‌’ కోర్సుల పరిస్థితే ఇంత ఇబ్బందికరంగా ఉంటే, ఇతర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఏటా చేరే సుమారు 90లక్షల మంది విద్యార్థుల పరిస్థితేమిటో ఊహించుకోవచ్చు.

ఉద్యోగ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారిపోతోంది. యూనివర్సిటీ డిగ్రీలు అంతేవేగంగా ప్రాధాన్యాన్ని కోల్పోతున్నాయి. ఈ చదువులోనూ అత్తెసరు ప్రమాణాలుంటే.. ఇక ఆ దుస్థితికి అంతుండదు. కాబట్టి, నైపుణ్యాల అంతరం అనేది మనం తక్షణం దృష్టి సారించాల్సిన అంశం.

ఏ ఆధునిక ఆర్థిక వ్యవస్థకయినా అత్యున్నత నైపుణ్యాలున్న టెక్నోక్రాట్లు పరిమిత సంఖ్యలోను, నైపుణ్యాలున్న శ్రామిక ఉద్యోగులు పెద్దసంఖ్యలోను అవసరం. కానీ భారత్‌లో ఆ పిరమిడ్ తలకిందులుగా ఉంది. భారత్‌లో కేవలం 50శాతం ఐ.టి.ఐ సీట్లు భర్తీ అవుతున్నాయి. కొద్దిమంది యువత మాత్రమే ఐ.టి.ఐల్లో చేరుతున్నారు (సుమారు 13.20 లక్షలు). పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ఇంకా తక్కువమంది (సుమారు 6.4 లక్షలు) విద్యార్థులు నమోదు చేసుకుంటున్నారు. ఇంజినీరింగ్‌లో చేరేవారితో (13.54 లక్షలు) పోలిస్తే, వారి సంఖ్య అలా తక్కువగా ఉండటం ఏ అభివృద్ధి చెందిన దేశంలోనూ కనిపించని సరళి. ఈ కోర్సులన్నిటిలోనూ ఎక్కువమంది విద్యార్థులు నిజమైన నైపుణ్యాలు, ఉత్పాదకత లేకుండా కేవలం సర్టిఫికెట్లు, డిగ్రీలు అందుకుంటారు.


చైనా ప్రతి సంవత్సరం 16.62 లక్షల మంది ఇంజినీర్లకు అద్భుతమైన శిక్షణనిస్తుంది. వారంతా నిజమైన టెక్నోక్రాట్లు, నైపుణ్యాలున్న ఇంజినీర్లు. అదేవిధంగా, ఆ దేశం వృత్తి విద్యలో 56.40 లక్షల యువతకు నిజమైన నైపుణ్యాల్ని అందిస్తుంది. చైనాలో పాఠశాల విద్య పునాదులు కూడా చాలా ప్రామాణికంగా ఉన్నాయి.

మనం స్కూళ్లు, కళాశాలలను దాదాపు అందరికీ అందుబాటులోకి విస్తరించాం. కానీ కొన్ని ఖరీదైన విద్యాసంస్థల్లో తప్ప, చాలా సందర్భాల్లో చదువుల నాణ్యత అధ్వానంగా ఉంటోంది. ఈ మొత్తంలో బాధితులు– మధ్యతరగతి, పేద కుటుంబాల విద్యార్థులు, తల్లిదండ్రులు. సంపదసృష్టిలో ‘జెన్ జీ’కి నిజమైన అవకాశం లభించాలంటే, మన విద్యను, నైపుణ్యాల అభివృద్ధిని సమూలంగా మార్చుకోవాలి.

ఆపైన సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలను సృష్టించటానికి మనం చేయాల్సింది చాలా ఉంది. అది వేరే చర్చ. నిశితంగా పరిశీలించే ప్రతి ఒక్కరికీ విద్యారంగంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభం గురించి తెలుసు. యువ జనాభాపరంగా మనకున్న అద్భుతావకాశాల్ని మనం వృథా చేసుకుంటున్నాం. ఆ అవకాశం ఎల్లకాలం కొనసాగదు. త్వరలో ముగుస్తుంది. త్వరపడి, దృఢ సంకల్పంతో వ్యవహరిస్తేనే అవకాశాన్ని మనం సద్వినియోగం గావించుకోగలం.

రాజకీయంగా ఒక స్థూల ఏకాభిప్రాయానికి రావాల్సిన అంశమిది. ఎందుకంటే, ప్రతి పార్టీకీ ఇందులో గరిష్ఠ వ్యూహాత్మక రాజకీయ ప్రయోజనం దాగివుంది. విద్యను నియంత్రించేది రాష్ట్రాలు కాబట్టి, ఎక్కువ కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుంది.

రాజకీయాలు, పరిపాలన, పౌర సమాజం, మీడియా, విద్యారంగంలోని మనమంతా సంఘటితమై నిర్మాణాత్మక, సృజనాత్మక పరిష్కారంతో ఈ సంక్షోభంపై స్పందించాల్సి ఉంది. ఆయాసం తప్ప ఫలితంలేని పడికట్టు పదాలకు, చేసిన తప్పుల్నే మళ్లీ మళ్లీ చేసే యథాతథ పాలనా ధోరణికి ఇక కాలం చెల్లింది. మనం ఈ సవాలుకు దీటుగా, యుద్ధ ప్రాతిపదికన స్పందించకపోతే.. ఈ సంక్షోభం మన రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్ని, సమాజాన్ని కమ్మేస్తుంది. మన భవిష్యత్తును కుంగదీస్తుంది.

n డాక్టర్ జయప్రకాశ్‌ నారాయణ్

ప్రజాస్వామ్య పీఠం (ఎఫ్.డి.ఆర్),

లోక్‌సత్తా వ్యవస్థాపకులు

ఇవీ చదవండి:

'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్‌ జీకి రూ.2 వేల కోట్లు

Updated Date - Aug 06 , 2026 | 03:49 AM