Share News

రైతన్నలు ఆహార సైనికులు

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:12 AM

శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేది సైనికులైతే, ఆకలి నుంచి దేశాన్ని రక్షించేది రైతన్నలు. నేడు ఆకాశహర్మ్యాలు పెరుగుతున్నాయి, ఐటీ రంగాలు విస్తరిస్తున్నాయి...

రైతన్నలు ఆహార సైనికులు

శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేది సైనికులైతే, ఆకలి నుంచి దేశాన్ని రక్షించేది రైతన్నలు. నేడు ఆకాశహర్మ్యాలు పెరుగుతున్నాయి, ఐటీ రంగాలు విస్తరిస్తున్నాయి. కానీ మనం తినేది సాఫ్ట్‌వేర్ కాదు. ఎన్ని సిరులున్నా అన్నం తినాల్సిందే. దురదృష్టవశాత్తూ, నేటి పాలకవర్గాలు పరిశ్రమలకు, మౌలిక సదుపాయాలకు ఇచ్చే ప్రాధాన్యాన్ని పచ్చని పొలాలకు, చెమట చిందించే రైతుకు ఇవ్వడం లేదు. రైతుల పరిస్థితి క్షేత్రస్థాయిలో దయనీయంగా ఉంది. విత్తనం నుంచి ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్ డీజిల్ వరకు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సబ్సిడీలు తగ్గుతుండటంతో రైతుపై భారం రెట్టింపవుతోంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం (సాగు ఖర్చు + 50 శాతం లాభం) మద్దతు ధర కల్పించాలనే డిమాండ్ దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉంది. ఒకవైపు అనావృష్టి, మరోవైపు అతివృష్టితో పంటలు నష్టపోతున్నా, ‘ఫసల్ బీమా’ వంటి పథకాలు రైతుకు సకాలంలో అందడం లేదు. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక, దళారుల చేతిలో మోసపోతూ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒకవైపు వానలు లేక, మరోవైపు వరదలతో పంట నష్టపోతున్నా రైతుకు అందే సాయం అంతంత మాత్రమే.

ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు దాదాపు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. ఇది వినడానికి పెద్ద మొత్తంగా అనిపించినా, మొత్తం బడ్జెట్ వ్యయంలో ఇది కేవలం స్వల్ప శాతం మాత్రమే. గత ఏడాదితో పోలిస్తే ఎరువుల సబ్సిడీని తగ్గించారు. ఏటా రూ.6,000 ఇచ్చే పీఎం–కిసాన్ సాయం 8 సంవత్సరాలైనా అలాగే ఉంది తప్ప, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, సాగు ఖర్చులకు అనుగుణంగా దానిని పెంచలేదు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ‘రైతు బంధు’ లేదా ‘రైతు భరోసా’ వంటి ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాయి తప్ప, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే నీటిపారుదల ప్రాజెక్టులు, మార్కెటింగ్ సౌకర్యాలు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకు ఆశించిన నిధులు కేటాయించడం లేదు. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడికి ఎంత గౌరవం ఇస్తున్నామో, మన ఆకలి తీర్చే ఆహార సైనికుడికీ అంతే గౌరవం ఇస్తున్నామా? సమాజం రైతును కరుణతో కాదు, గౌరవంతో చూడాలి. పాలకులు వ్యవసాయాన్ని కేవలం ఓట్ల రాజకీయం కోసం కాకుండా, ఒక లాభసాటి వ్యాపారంగా, దేశ భద్రతాంశంగా మార్చాల్సిన బాధ్యత తీసుకోవాలి. బడ్జెట్ కేటాయింపులు కేవలం అంకెలుగా కాకుండా, రైతు జీవితాల్లో కాంతిని నింపేవిగా ఉండాలి.

విశ్వ జంపాల, విశ్వ సమాజం వ్యవస్థాపకులు

ఇవి కూడా చదవండి

ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..

IPL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 27 , 2026 | 01:12 AM