Share News

మారిన రాజకీయం.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం

ABN , Publish Date - May 14 , 2026 | 12:57 AM

ఇరవయ్యవ శతాబ్దం మొదటి ఐదు దశాబ్దాలు రెండు ప్రపంచ యుద్ధాలు, వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాలు చరిత్రను చాలా మలుపులు తిప్పాయి. మన దేశం కూడా ఆ చరిత్రలో భాగమే...

మారిన రాజకీయం.. ప్రమాదంలో ప్రజాస్వామ్యం

ఇరవయ్యవ శతాబ్దం మొదటి ఐదు దశాబ్దాలు రెండు ప్రపంచ యుద్ధాలు, వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమాలు చరిత్రను చాలా మలుపులు తిప్పాయి. మన దేశం కూడా ఆ చరిత్రలో భాగమే. గత ఎనిమిది దశాబ్దాలుగా భారతదేశంలో రాజ్యాంగం ఆధారిత ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉంది. స్వాతంత్ర్యోద్యమ నేపథ్యంలో వచ్చిన కొన్ని నవలల్లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది అని భావోద్వేగంతో ఒక మధ్యతరగతి ఒక పేదవాడికి చెపితే, ‘‘అయితే ఏమవుతుంది?’’ అని అమాయకంగా అడగడం మనోహర్‌ మలగాంకర్‌ తన ‘బెండ్‌ ఇన్‌ గాంజెస్‌’ అనే నవలలో రాశాడు. మన ప్రాంతంలో చాలా చర్చకు వచ్చిన కన్యాశుల్కంలోని జట్కావాడు... ‘‘భారతదేశానికి స్వాతంత్ర్యం రాబోతున్నది’’ అని గిరీశం అంటే– ‘‘మన ఊరిలోని హెడ్‌ కానిస్టేబుల్‌ మారతాడా?’’ అన్న ప్రశ్న చాలా దూరదృష్టితో రాసిందే. సంభాషణ చాలా సాధారణమైనదిగా కనిపించినా బలప్రయోగం లేని ఒక రాజ్యం వస్తుందా అన్న పేదవాడి ప్రశ్న అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ రెలవెంట్‌ అనిపిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే రాజ్య బలప్రయోగం మీద నియంత్రణ.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం చాలా ఆటుపోట్లకు గురయ్యింది. చాలా మూడవ ప్రపంచ దేశాలలో ఈ మాత్రం ప్రజాస్వామ్యం కొద్దికాలమైనా నిలువలేకపోయింది. చాలా దేశాలు నియంతృత్వంలోకి, సైనిక పాలనలోకి వెళ్లిపోయాయి. మన దేశంలో ప్రజాస్వామ్యం కొనసాగడానికి ఒక సమగ్రమైన రాజ్యాంగం తోడ్పడింది. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలకమైన పాత్ర నిర్వహించాడనే కీర్తి ఆయనకు దక్కింది. రాజ్యాంగం మీద దాడి పెరిగిన కొద్దీ అంబేడ్కర్‌ను మననం చేసుకోవడం పెరుగుతున్నది. ఈ రాజ్యాంగంలోని ప్రాపంచిక దృక్పథం పెట్టుబడిదారీ ఆర్థిక నమూనాని ఒకవైపు అంగీకరిస్తూనే సోషలిస్టు సమాజ నిర్మాణం జరగాలని ఒక మధ్యేమార్గ ప్రయోగాన్ని వాగ్దానం చేసింది. ధనిక వర్గాలకి పెట్టుబడిదారీ పంథా, పేద వర్గాలకు సోషలిస్టు వ్యవస్థ అన్న ఒక మార్గం వేసే ప్రయత్నం చేసింది. దేశం ఎనిమిది దశాబ్దాలుగా ఒక చిక్కు మార్గంలోనే చిక్కుకుంది.


ఏ ప్రజాస్వామ్య వ్యవస్థ అయినా పేదల ప్రస్తావన లేకుండా, అసమానతల తగ్గింపు, అందరికీ అవకాశాలు, మనుషులంతా సమానమే అన్న భావన లేకుండా నిలువడం కష్టం. అందరూ సమానమే అన్న భావనను డా. అంబేడ్కర్‌ చాలా దూరదృష్టితో, ఎన్నికలలో రాజకీయంగా మనం సమానత్వాన్ని కల్పించాం. ఒక మనిషి, ఒక ఓటు, ఒకే విలువ. ఈ సమానత్వం ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని సాధించకపోతే మనం ఎంతో కష్టపడి నిర్మించుకున్న ప్రజాస్వామ్య సౌధాన్ని ప్రజలు బద్దలుకొడతారు అని హెచ్చరిక చేశాడు. కానీ విచిత్రంగా సామాన్య ప్రజలు రాజ్యాంగాన్ని స్వంతం చేసుకుంటున్నారు, పాలకులు రాజ్యాంగం మీద దాడి చేస్తున్నారు.

ఎన్నికల రాజకీయాలలో రాజ్యాంగం కల్పించిన సమానత్వం డా. అంబేడ్కర్‌ ఆశించిన సమానత్వ దిశలో కాక సమాజంలోని తీవ్ర అసమానతలు ఎన్నికలను నిర్దేశించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఎనిమిది దశాబ్దాలలో మొదటి రెండు దశాబ్దాలలో సోషలిస్టు నమూనా లాంటి వ్యవస్థ అన్న భావజాలం ప్రచారంలో ఉండేది. కానీ క్రమక్రమంగా పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడుతూ వచ్చింది. ఇందిరాగాంధీ నాయకత్వంలో ఈ వైరుధ్యం కొంత స్పష్టత పొంది సమాజంలోని అసంతృప్తి విభిన్న ఉద్యమాలకు దారితీసింది. ఈ అసంతృప్తిని గ్రహించిన ఇందిరాగాంధీ పేదరికాన్ని రాజకీయాలలో ఒక ప్రధాన అంశంగా ముందుకు తీసుకురావడంతో ఎన్నికలలో పెద్ద ఎత్తున ఓట్లను సమీకరించుకోగలిగారు. ఆమె భావజాలం వల్ల ధనిక వర్గాల సమీకరణ బలపడడం, పేద వర్గాల ఆకాంక్షలు పెరగడం వల్ల వైరుధ్యాలు తీవ్రతరం కావడంతో సంక్షోభంలో చిక్కుకున్న ఇందిరాగాంధీ... రాజ్యాంగంలో ప్రజలకు కల్పించిన ప్రాథమిక హక్కులను రద్దు చేసి, అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. భారతదేశంలోని ‘రాజ్యాంగ ప్రజాస్వామ్యం’ (కాన్‌స్టిట్యూషనల్‌ డెమోక్రసీ) ఎంత బలహీనంగా ఉందో ఒక్కసారి బయటపడింది. ఏ కారణం వల్ల ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తివేసి ఎన్నికలు ప్రకటించిందో ఇప్పటికీ ఆ కారణాలు పూర్తిగా విశ్లేషించలేదు.

ఆమె ఎన్నికలు ప్రకటించినప్పుడు జయప్రకాశ్‌ నారాయణ్‌, అటల్‌బిహారీ వాజ్‌పాయ్‌, అరుణ్‌శౌరి కలిసి ప్రతిపక్షాలు ఏం చేయాలి అని చర్చించినప్పుడు అరుణ్‌శౌరి ఎన్నికలను బహిష్కరించాలి అని ప్రతిపాదిస్తూ... ‘‘నియంత ఎప్పుడూ తన విజయాన్ని గ్యారెంటీ చేసుకోకుండా ఎన్నికలకు వెళ్లరు’’ అని అంటే, ‘‘ప్రజలను మనం అంత తక్కువ అంచనా వేయకూడదు. సమాజం భయంలో ఉన్న మాట వాస్తవం. జనాన్ని మనం సమీకరించగలిగితే వ్యక్తులుగా భయపడుతున్న వాళ్లే సమిష్టిలో ధైర్యాన్ని కూడగట్టుకుంటారు. భయానికి మందు సమిష్టిలోనే ఉంది’’ అని జయప్రకాశ్‌ నారాయణ్‌ చెప్పారని అరుణ్‌శౌరి వ్యక్తిగత చర్చలో నాతో అన్నాడు. అటల్‌బిహారి వాజ్‌పాయ్‌ కూడా జేపీ వాదనతో అంగీకరించడంతో ఎన్నికలలో పాల్గొనాలనే నిర్ణయం తీసుకున్నామని అరుణ్‌శౌరి అన్నాడు.


ఎన్నికల రాజకీయ చరిత్రలో మనదేశంలో 1977లో మొదటిసారిగా ప్రజలు భయం నుంచి బయటపడి అధికార పార్టీనే కాక, వ్యక్తిగతంగా ఇందిరాగాంధీని కూడా ఓడించారు. అప్పటి వరకు బలమైన నాయకుడు లేదా నాయకత్వం కేంద్రంగా నడిచే రాజకీయాల స్థానంలో సమిష్టి నాయకత్వం అధికారంలోకి వచ్చింది. భావజాలపరంగా భిన్న భావజాలాలున్న కమ్యూనిస్టు పార్టీ, జార్జ్‌ ఫెర్నాండెజ్‌, జగ్జీవన్‌రాం, మొరార్జీ దేశాయ్‌, అటల్‌బిహారీ వాజ్‌పాయ్‌, ఆడ్వాణీ... ఈ సమిష్టి నాయకత్వంలో భాగం. ఇంత వైవిధ్యమైన, వైరుధ్యమైన సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. ఎన్నికలలో ప్రజలు అంత పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినా, అంత ప్రజాబలం ఉన్నా జనతా పార్టీ కూలిపోవడం వెనుక ఓట్ల రాజకీయాల కంటే భిన్న ప్రయోజనాల మధ్య వైరుధ్యాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నదన్నది ఒక వాస్తవ అనుభవంలోకి వచ్చింది.

ఇందిరాగాంధీ రెండవసారి గెలిచినప్పుడు ఆమె రాజకీయ పరిభాషలో చాలా మార్పు వచ్చింది. ప్రధానంగా ఆమె పేదల గురించి మాట్లాడడం చాలావరకు తగ్గించింది. భిన్న వర్గాల మధ్య వైరుధ్యాలు ఎక్కడికి దారితీస్తాయో అన్న అనుమానంతో ‘దేశ సమగ్రత, సమైక్యత’ అనే నినాదాన్ని ముందుకు తీసుకువచ్చింది. దీంతో బాటు తన సోషలిస్టు భావజాలం స్థానంలో పెట్టుబడిదారీ మార్గమే ఏకైక మార్గం అనే నిర్ణయానికి రావడం, ఆమె హఠాన్మరణంతో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి కావడంతో రాజ్యాంగంలోని సోషలిస్టు భావజాలం గురించి మాట్లాడడం దాదాపు రద్దైపోయింది.

పెట్టుబడిదారీ పంథా నియో లిబరలిజం అవతారం తీసుకోవడంతో దానికుండే కొన్ని కనీస ప్రమాణాలు– ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడం, ధనప్రవాహం నిరోధించడం, రాజ్యాంగ సంస్థల స్వయంప్రతిపత్తిని కాపాడడం, విశ్వవిద్యాలయాలు సృజనాత్మక సంస్థలుగా పనిచేయడం– లాంటివి కూడా పాటించలేదు.


ఈ నేపథ్యంలోనే ఎన్నికల రాజకీయాల స్వభావమే మారిపోయింది. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రజాస్వామ్యం అనే భావనను విస్తృతంగా ఉపయోగించి పెరుగుతున్న సంపదకు ఒక గౌరవాన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంది. కొంతవరకు ప్రజల మద్దతును కూడగడుతుంది. నియో లిబరలిజానికి ఆ అవసరం కూడా లేకుండా పోయింది. రాజ్య స్వభావమే చాలా మార్పునకు గురయింది. సంపద జగన్నాథ రథచక్రాల లాగా ముందుకు పోతున్నది. ఇందిరాగాంధీ 1970లలో అప్పటి వైరుధ్యాల వల్ల రాజ్యాంగాన్ని తాత్కాలికంగా పక్కకు పెడితే, అప్పటి ప్రతిపక్షాలు పోరాడాయి. కాని కలిసి పనిచేయలేకపోయాయి. కనీసం జనతాపార్టీ కొంతకాలం అయినా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అప్పటి సంక్షోభం కంటే తీవ్రమైనదైనా ప్రతిపక్షాలు కలిసే ప్రయత్నమే ముందుకు సాగడం లేదు. కలిసి ఎన్నికలలో పోటీచేయడం సాధ్యమే కావడం లేదు. వీటిని కలపడానికి ఒక జయప్రకాశ్‌ నారాయణ్‌ వంటి నాయకుడెవ్వరూ లేరు. ఎన్నికలు సారంలోనే కాదు రూపంలో కూడా మారిపోయాయి. ఎన్నికలే ప్రజాస్వామ్యం కాదు. అవి ప్రజాస్వామ్యంలో ఒక భాగం. నిజమైన ప్రజాస్వామ్యం ప్రజాచైతన్య స్థాయిని బట్టి, నిరంతర జాగరూకతను బట్టి, సమస్యలకు సమిష్టిగా స్పందించే ఒక సజీవ పౌరసమాజం మీద ఆధారపడి ఉంటాయి. రాజ్యాంగాన్ని, ఎన్నికల వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని ఒక మానవీయ సమసమాజ స్వప్నాన్ని కాపాడుకోవడం ఇప్పుడు చాలా అవసరం.

ప్రొ. జి.హరగోపాల్‌

ఇవి కూడా చదవండి..

ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు

ఐఆర్‌జీసీకి నిధులు ఎలా వస్తున్నాయి.. చెబితే రూ.145 కోట్లు ఇస్తామంటున్న అమెరికా..

Updated Date - May 14 , 2026 | 12:57 AM