Share News

బీజేపీలో ఎంత కలవరాన్ని సృష్టించిందో!

ABN , Publish Date - Jul 29 , 2026 | 02:24 AM

‘నేటి యువతరం తప్పుదారి పట్టలేదు. దిశానిర్దేశం లేకుండా వారు వ్యవహరించడంలేదు. వారితో చర్చించాలి కానీ వారిని నియంత్రించకూడదు. నిబంధనల్ని కాదు, కారణాల్ని వారు అడుగుతారు. వివరణలు కోరతారు...

బీజేపీలో ఎంత కలవరాన్ని సృష్టించిందో!

‘నేటి యువతరం తప్పుదారి పట్టలేదు. దిశానిర్దేశం లేకుండా వారు వ్యవహరించడంలేదు. వారితో చర్చించాలి కానీ వారిని నియంత్రించకూడదు. నిబంధనల్ని కాదు, కారణాల్ని వారు అడుగుతారు. వివరణలు కోరతారు. జిజ్ఞాస వారి లక్షణం. తిరుగుబాటు వారి స్వభావం’.. ఈ మాటలన్నది ఏ కమ్యూనిస్టు నాయకుడో కాదు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్. జూలై 24న అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన విశ్వ మాంగల్య సభలో ఆయన ఆ మాటలు అంటున్న సమయంలో.. అక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో, జంతర్ మంతర్ వద్ద దెబ్బతిన్న యువ సమూహం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. సరిగ్గా 24 గంటల అనంతరం కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ‘ఆలస్యమైనా చివరకు మంచి పనిచేశారు..’ అని 92 ఏళ్ల మురళీమనోహర్ జోషీ వ్యాఖ్యానించారు. భాగవత్ ప్రకటన చేయడానికి ఒక రోజు ముందే, విద్యార్థులపై లాఠీచార్జి దారుణమని ఆ కురు వృద్ధుడు వ్యాఖ్యానించారు. పరీక్షా వ్యవస్థపై విద్యార్థుల ఆందోళన న్యాయసమ్మతమేనని కూడా జోషీ సమర్థించారు.

ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే యువత నుంచి వచ్చిన ఒత్తిడి మాత్రమే కాదు, బీజేపీ, సంఘ్‌లో అంతర్గత శక్తుల నుంచి వచ్చిన ఒత్తిడి కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైనట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ వద్ద జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన తీవ్రత ఆలస్యంగానైనా బీజేపీలో ఎంత అంతర్గత కలవరాన్ని సృష్టించిందో కూడా అర్థమవుతోంది. తన ఆమరణ నిరాహార దీక్ష ద్వారా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు బలం చేకూర్చిన లద్దాఖ్ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్ ఒకప్పుడు మోదీ సమర్థకుడు. ఆర్టికల్ 370 రద్దు చేసి, లద్దాఖ్‌ను జమ్మూ–కశ్మీర్ నుంచి వేరు చేసినప్పుడు ఆయన హర్షాతిరేకంతో ఉప్పొంగిపోయారు. లద్దాఖ్‌ను ఆరవ షెడ్యూల్‌లో చేరుస్తామని బీజేపీ హామీ ఇచ్చినప్పుడు ఆయన బీజేపీకి అనుకూలంగా ఎన్నికల్లో ప్రచారం చేశారు. రాహుల్‌గాంధీ భారత జోడో యాత్రలో పాల్గొనేందుకు వచ్చిన ఆహ్వానాన్ని కూడా వాంగ్‌చుక్‌ తిరస్కరించారు. అలాంటి వ్యక్తిని బీజేపీ వ్యతిరేకంగా మార్చుకుంది. ఆయనే కాదు, జంతర్ మంతర్‌కు వచ్చిన యువతీ యువకుల్లో ఒకప్పుడు మోదీని, బీజేపీని అభిమానించి తర్వాత వ్యతిరేకంగా మారిన వారెందరో ఉన్నారు. ‘నేను కూడా నా తల్లిదండ్రులతో కలిసి మోదీకి ఓటు వేశాను. ఢిల్లీలో జంతర్ మంతర్ ప్రదర్శనకు వస్తుంటే వారు ఏ మాత్రం అభ్యంతరం చెప్పలేదు’ అని ఒక యువతి చెప్పింది. అనేకమంది కేంద్ర మంత్రులు, ఎంపీల ఇళ్లలో కూడా వారి పిల్లలు సీజేపీ ప్రదర్శనకు సంఘీభావం ప్రకటించారని బీజేపీ నేతలే అంటున్నారు. జంతర్ మంతర్ ప్రదర్శనలో పంజాబ్, ముంబై, హరియాణా, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల నుంచి ఇంజనీర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, ఎంబీఏ, లా విద్యార్థులు, రైతు కుటుంబాల పిల్లలు అనేకమంది కనపడ్డారు. లూజ్ జీన్స్, టీషర్టులు, రకరకాల వస్త్రధారణ, నెత్తికి చుట్టుకున్న బ్యాండ్లతో ఉన్న వీరిని ఏ రాజకీయ పార్టీతోనూ అంటగట్టలేము.


ఈ విద్యార్థులే ఇవాళ పార్లమెంటు అజెండాను నిర్ణయిస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయిన తర్వాత ఏడు రోజులకు మొదటిసారి మంగళవారం మధ్యాహ్నం నుంచి లోక్‌సభ సజావుగా సాగింది. అందుకు కారకులు విద్యార్థులే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికే కాదు, పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం ఆగమేఘాలపై బిల్లు తేవడానికి, ప్రధానమంత్రి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఈ బిల్లు గురించి ప్రకటించడానికి, ప్రతిపక్షాలు కూడా చివరకు చర్చకు సిద్ధపడడానికి వారే కారకులు. స్మృతి ఇరానీ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వరకు మోదీ హయాంలో నలుగురు విద్యామంత్రులు మారారు. ప్రతి విద్యామంత్రి హయాంలో ఏదో ఒక వివాదం ఉంటూనే వచ్చింది. కానీ విద్యార్థుల ఒత్తిడి మేరకు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఒక్క ధర్మేంద్ర ప్రధాన్‌కే ఏర్పడింది. రాజీనామా చేసిన తర్వాత పార్లమెంటు ఆవరణలో ధర్మేంద్ర అడుగుపెడితే బీజేపీ ఎంపీలు ఆయనకు జిందాబాద్ అంటూ ఘనస్వాగతం పలికారు. కిరీటం తొడిగారు. దేనికి? ఎవరి ఆదేశాలతో ఎందుకు సన్మానం చేశారు? కింద పడ్డా తమదే పై చేయి అని చెప్పుకునేందుకే ఆ పని చేసినట్లు స్పష్టమవుతోంది. దానివల్ల నష్టం ఎవరికి? వారికే కాదూ!

నెల రోజులకు పైగా శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తూ పరీక్షా పత్రాల లీక్‌కు విద్యామంత్రి నైతిక బాధ్యత వహించాలని కోరిన యువతీ యువకులతో దేశవ్యాప్తంగా ఎంతోమంది కనెక్టయ్యారు. పార్లమెంటుకు ఊరేగింపుగా వెళ్లి లాఠీచార్జిలకు తలలు పగిలి, పెల్లెట్ల ముక్కలు ఆ యువజనుల శరీరాల్లోకి చొచ్చుకుపోయినప్పుడు అనేకమంది తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సీజేపీలో ఉన్నవారే సంఘ వ్యతిరేక శక్తులైతే, వారి ప్రతినిధులతో కేంద్రమంత్రులు మూడు దఫాలు ఎందుకు చర్చలు జరిపారు? విద్యావ్యవస్థలో సంస్కరణలపై వారితో కూడా చర్చిస్తామని ఎందుకు వాగ్దానం చేశారు?

నిజానికి ప్రతి ఉద్యమంలోనూ ఎంతో కొంత హింసాకాండ, విధ్వంసం జరుగుతూనే ఉన్నది. జయప్రకాశ్ నారాయణ్ నిర్వహించిన సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో కూడా డైనమైట్లతో రైల్వే వంతెనలు పేల్చివేసేందుకు కుట్ర జరిగిందని ఆరోపణలు వచ్చాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమ సమయంలో కూడా హింసాకాండ చెలరేగింది. చాలాసార్లు పోలీసుల దమనకాండ జరిగిన తర్వాత దాన్ని సమర్థించుకునేందుకు ఈ సంఘ వ్యతిరేకుల కోణం ముందుకు వస్తుంది. అంతమాత్రాన మొత్తం ఉద్యమానికి విశ్వసనీయత లేకుండాపోదు. ప్రతి నిరసనను నేరంగా చిత్రించడం కొంతకాలం వరకు చెల్లుతుందేమో కానీ అన్ని సమయాల్లోనూ చెల్లదు. నిరసన తెలిపేవారి ఆగ్రహాన్ని గౌరవించడం అధికార వ్యవస్థలో ఉన్నవారు నేర్చుకోవాలి. లేకపోతే పాలనా వ్యవస్థలపై శాశ్వత వ్యతిరేకత ఏర్పడుతుంది. మోహన్ భాగవత్ ఆలస్యంగానైనా చేసిన వ్యాఖ్యల్లో ఈ వివేచన కనపడుతోంది.


అసలు కాంగ్రెస్ సరిగా వ్యవహరించి ఉంటే విద్యార్థులు రోడ్డుకెక్కాల్సిన అవసరం వచ్చేది కాదు. జూన్ 6న సీజేపీ ఏర్పడడంపై వచ్చిన ప్రతిస్పందన చూసిన తర్వాతగానీ కాంగ్రెస్ బలంగా గళం విప్పలేదు. మే మొదటి వారంలో పేపర్ లీక్ జరిగి, మే 12న పరీక్ష రద్దయిన తర్వాత కాంగ్రెస్ తీవ్రంగా ప్రతిస్పందించి ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసేందుకు చేయాల్సినన్ని ప్రయత్నాలు చేయలేదు. జూన్ 17న రాజస్థాన్‌లోని కోటాలో ‘ఛాత్రోంకి గుంజ్’ పేరిట విద్యార్థుల ర్యాలీని నిర్వహించిన రాహుల్‌గాంధీ ఆ తర్వాత 23 రోజుల పాటు అదృశ్యమై జర్మనీలో కాలక్షేపం చేశారు. సీజేపీ వ్యవస్థాపకుడు ఢిల్లీలో ప్రవేశించి తమ ఆందోళన తీవ్రతరం చేసిన తర్వాత, పార్లమెంటు సమావేశాలు మరో మూడు రోజుల్లో జరుగుతాయనగా రాహుల్‌లో మళ్లీ చలనం వచ్చింది. రాజకీయాల్లో నిరంతరత్వం, నిత్య క్రియాశీలత్వం లేకపోతే పరిస్థితి మరొకరి చేతుల్లోకి వెళుతుందన్న విషయం రుజువైంది. మునుపటిలాగా నాటకీయంగా ధర్నాలు చేయడం, అరెస్టు కావడం వల్ల ప్రజల సానుభూతి లభించదని కాంగ్రెస్ గ్రహించాలి. 2014 నుంచీ పార్లమెంట్‌ను కాంగ్రెస్‌ స్తంభింపజేయడం, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం వంటివి చేస్తూనే ఉన్నది. ఎన్నికల రాజకీయాల్లో కానీ, ప్రభుత్వ వైఖరిలో కానీ ఏ మార్పు వచ్చింది? కేవలం నెలరోజుల నిరసనతో కాక్రోచ్ పార్టీ ప్రభుత్వాన్ని దిగివచ్చేలా చేయగలిగింది. అటువంటి నైతిక స్థైర్యం కాంగ్రెస్, ప్రతిపక్షాలకు ఎందుకు లేకుండా పోయింది?

పార్లమెంటులో బిల్లులు ప్రవేశపెట్టినంత మాత్రాన విద్యావ్యవస్థలో మార్పులు వస్తాయని చెప్పడానికి వీలు లేదు. కొత్త ఐఐటీలు, మెడికల్ కాలేజీలు తెరిచినంత మాత్రాన ఉన్నత విద్యారంగంలో నాణ్యత మెరుగుపరచలేము. ఇవాళ్టికీ ప్రపంచంలోని అత్యుత్తమ వంద యూనివర్సిటీల్లో ఏ ఒక్క భారతీయ విశ్వవిద్యాలయానికీ స్థానం లేదు. ప్రతి ఏటా కేంద్ర బడ్జెట్ పరిమాణం విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, గత 12 సంవత్సరాల్లో కేంద్ర బడ్జెట్‌లో విద్యకు లభిస్తున్న వాటా గణనీయంగా తగ్గింది. 2013–14లో మొత్తం కేంద్ర బడ్జెట్‌లో విద్యకు 4.65 శాతం కేటాయించగా, 2025–26 నాటికి ఆ వాటా 2.5 శాతానికి పడిపోయింది. విద్యకే కాదు, పరిశోధనకు కూడా దేశంలో ప్రాధాన్యం తగ్గిపోతోంది. కాంగ్రెస్ హయాంలో విద్యా ప్రమాణాలపై, విద్యా సంస్థల్లో సౌకర్యాలపై, ఉన్నత విద్యకూ, ఉపాధికీ సంబంధం లేకపోవడంపై మురళీమనోహర్ జోషి, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, నరేంద్రమోదీ తదితర బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారని చరిత్రపుటల్లోకి వెళితే తెలుస్తుంది. మరి ఇప్పుడు పరిస్థితి ఎంత మేరకు మారింది? అనేకసార్లు పరీక్ష పత్రాలు లీక్‌ అయినప్పటికీ విద్యార్థులు వీధిలోకి వస్తే కానీ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు పెట్టాలన్న ఆలోచన ముందే ఎందుకు రాలేదు? 2024లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటేకానీ కొన్ని పరీక్షా కేంద్రాల్లో తిరిగి పరీక్షను నిర్వహించలేదు. ఇప్పుడు మొత్తం పరీక్షలనే రద్దు చేయాల్సి వచ్చింది. పైగా తాము ఆగమేఘాలపై కట్టుదిట్టంగా పరీక్షలను సరిగా నిర్వహించడమే ఘనకార్యంగా ప్రచారం చేసుకుంటున్నారు. పేపర్ లీక్ కాకుండా పరీక్షలను సరిగా నిర్వహించామని ఎన్నికల ప్రణాళికలో చెప్పుకునే రోజులు కూడా వస్తాయేమో!


2047 నాటికి వికసిత్ భారత్ సాధించేవరకు ఉన్న మధ్య కాలాన్ని అమృతకాలంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ అమృత కాలంలోనే బొద్దింకల దండు నిరసన తెలపడం ఒక రకంగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగేందుకు జరిగిన శుభపరిణామంగా భావించాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడాన్ని అవమానంగా భావించనక్కర్లేదు. జరిగిన పరిణామాల్ని ఆత్మావలోకనం చేసుకుని తగిన చర్యలు తీసుకునేందుకు లభించిన అవకాశంగా భావించాలి. బహుశా ఈ విషయం గ్రహించినందువల్లనేనేమో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనికి ఎన్టీఏ పరీక్షల సంస్కరణలపై టాస్క్‌ఫోర్స్ చైర్మన్ బాధ్యతలు అప్పజెప్పారు. ఆయన నాయకత్వంలోనే యూపీఏ హయాంలో అతిపెద్ద బయోమెట్రిక్ గుర్తింపు వ్యవస్థగా నిలిచిన ఆధార్ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. దేశంలో ప్రస్తుతం కనపడుతున్న డిజిటల్ పరివర్తనలో ఆయన కీలకపాత్ర పోషించారు. సాంకేతిక నిపుణులకు, మేధావులకు పార్టీలతో ప్రమేయం ఉండదు. అందుకే మోదీ ఆయనకు కీలక బాధ్యతలు అప్పజెప్పారు. ఇదే దిశలో ప్రభుత్వం ముందుకు సాగుతూ ఎప్పుడూ రాజకీయాలపైనే కాక, పాలనా వ్యవస్థలో కీలక మార్పులు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటే హర్షించని వారుండరు. మరో మూడేళ్లలో ఇలాంటి మధ్యంతర దిద్దుబాటు చర్యలు (మిడ్ కోర్స్ కరెక్షన్) తీసుకునేందుకు అవకాశం ఉన్నది. అలా జరగకపోతే నష్టపోయేది అధికారపక్షమే.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి..

విదేశీయులే లక్ష్యంగా కోట్ల రూపాయల సైబర్ మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్

నేనెక్కడికీ పారిపోలేదు: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 02:24 AM