Share News

ఆ రాజ్యాంగ రక్షకులు ఇప్పుడేరీ?

ABN , Publish Date - Oct 07 , 2026 | 02:22 AM

పోలీసు రాజ్యం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే న్యూఢిల్లీకి రండి. ప్రభుత్వ నెలవులు, అమాత్యుల నివాసాలు ఉన్న రహదారులలో తిరిగేందుకు...

ఆ రాజ్యాంగ రక్షకులు ఇప్పుడేరీ?

పోలీసు రాజ్యం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే న్యూఢిల్లీకి రండి. ప్రభుత్వ నెలవులు, అమాత్యుల నివాసాలు ఉన్న రహదారులలో తిరిగేందుకు ప్రయత్నించండి! కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసం, ఎన్నికల కమిషన్ కార్యాలయం, పార్లమెంటు, జంతర్ మంతర్ చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకు పోలీసులు బారికేడ్లను నిర్మించి అడుగడుగునా మోహరించారు. ఐడీ కార్డులు చూపిస్తే కానీ మీడియా ప్రతినిధులను సైతం పోలీసులు అనుమతించడం లేదు. వాహనాలను ఎక్కడో ఒక చోట నిలిపేసి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి. రోడ్లపై ప్రతి కొన్ని అడుగులకూ మైకులను ఏర్పాటు చేసి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవి వింటే వెన్ను జలదరిస్తుంది. సైన్యంలో తిరుగుబాటును ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తే భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 160 కింద, ప్రభుత్వాధికారులు జారీ చేసే ఆదేశాలను ధిక్కరిస్తే సెక్షన్ 223 కింద కఠిన చర్యలు తీసుకుంటామని ఆ మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. ప్రదర్శనకారులకు దూరంగా ఉండాలని, పోలీసులు తీసుకునే చర్యలకు ఆటంకం కలిగించరాదని హెచ్చరిస్తున్నారు.

కోట్లాది ఓటర్ల పేర్లను ఓటర్‌ జాబితాల నుంచి తొలగిస్తున్నారని, ఓట్ల చోరీతో బీజేపీ గెలిచేందుకు దోహదం చేస్తున్నారని ఆరోపిస్తూ గాంధీ జయంతి రోజున కాక్రోచ్ జనతా పార్టీ, ప్రతిపక్షాలు ఆందోళనను ప్రకటించినప్పటి నుంచీ ఇదే పరిస్థితి. మంగళవారం ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు నుంచి నిర్వాచన్‌ సదన్‌ (ఎన్నికల కమిషన్ కార్యాలయం)కు తలపెట్టిన ఊరేగింపును అడ్డుకునేందుకు ఈ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ముంబైలో సీజేపీ నిర్వహించిన ధర్నాలో పదివేలమంది పాల్గొన్నప్పటికీ అది శాంతియుతంగా ముగిసింది. అయితే ఢిల్లీలో జంతర్ మంతర్ ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించి, పెద్ద ఎత్తున బలగాల్ని రప్పించడం ఒక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. దేశ రాజధానిలో నిరసన ప్రదర్శనలకు అనుమతిస్తే అవి ఉధృతం కాకుండా అడ్డుకోవడం కష్టమని ప్రభుత్వం గ్రహించినట్లు కనిపిస్తోంది.


పరిస్థితి ఇలా తీవ్రతరమయ్యేందుకు ప్రభుత్వం అసలెందుకు కారణమవుతోంది? 2024లో మూడోసారి 240 సీట్లు మాత్రమే గెలుచుకుని అధికారంలోకి వచ్చేందుకు మిత్రపక్షాల సహాయం తీసుకోవాల్సి వచ్చినప్పటి నుంచీ మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లు కనపడుతోంది. ఆ తర్వాత జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించిన తీరుపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడంలో ప్రతిపక్షాలు విజయవంతమయ్యాయి. ప్రతిపక్షాలనైతే దేశ వ్యతిరేకులని నిందించేందుకు అవకాశమున్నది. అయితే ఇప్పుడు నిరసన ప్రతిపక్షాల పరిధిని దాటిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ అవతరించిన తర్వాత లక్షల సంఖ్యలో యువజనులు ప్రతిస్పందిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు వారికి తోడుగా న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, మాజీ ఎన్నికల కమిషనర్లు, అనేక ఇతర వర్గాలు చేరడంతో ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష చర్యలను నిరసిస్తూ ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సైతం అనేక అంతర్గత నోట్‌లను లిఖితపూర్వకంగా సమర్పించారన్న వార్త ఇటీవల బయటకు పొక్కడంతో పరిణామాలు మరో మలుపు తిరిగాయి. ఆటో డ్రైవర్లు, ఇతర సామాన్య వర్గాల్లో కూడా బీజేపీ ఎన్నికల విజయాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘మేము బెంగాల్‌లో మమతా బెనర్జీ అరాచక పాలనపై పోరాడి విజయం సాధించాం. అయినప్పటికీ మాది నిజమైన విజయం అని చెప్పుకోలేకపోతున్నాం’ అని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితి ఇంతదాకా రావడానికి ప్రధాన కారణం వ్యవస్థలను తన గుప్పిట్లో ఉంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించడమేనని గట్టిగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. ప్రత్యర్థులను తుడిచిపెట్టేందుకు ఈడీ, సీబీఐ మొదలైన దర్యాప్తు సంస్థలను ఎడా పెడా ప్రయోగించడం, తమతో చేతులు కలిపిన నేర చరితులను చట్టం నుంచి రక్షించడం, సీవీసీ, కాగ్‌లను నామమాత్ర సంస్థలుగా మార్చడం మొదలైన రాజ్యాంగ విరుద్ధ చర్యలకు ప్రస్తుత పాలకులు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి. సమాచార హక్కును నీరుగార్చినప్పుడే వ్యవస్థల పనితీరుపై గౌరవం తగ్గిపోయింది. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థల పనితీరు కూడా అనుమానాస్పదంగా మారాయి. గతంలో కూడా వ్యవస్థలను అధికారంలో ఉన్నవారు ఉపయోగించుకున్న ఉదంతాలు లేకపోలేదు. కానీ మోదీ హయాంలో అన్ని వ్యవస్థలను ఉపయోగించుకున్న తీరు పచ్చిగా, తెంపరితనం లేకుండా కనిపిస్తోందన్న విమర్శలూ ఎక్కువగా ఉన్నాయి. ఈ మొత్తం క్రమంలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై కానీ, నిర్మాణాత్మకమైన అభివృద్ధి చర్యలపై కానీ జరిగే సానుకూల చర్చ గాలికి కొట్టుకుపోతోంది. తాను అధికారంలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ప్రకటించిన సేవా సంకల్ప్ అమలవుతున్న రోజుల్లోనే ఈ పరిణామాలు జరగడం ఒక వైరుధ్యం. 2014లో 282 సీట్లు, 2019లో 303 సీట్లు గెలుచుకుని ఎవరి అవసరమూ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా హిందూ ఓటర్లను పెద్దఎత్తున తన వైపునకు తిప్పుకున్నప్పుడు ఎవరూ ఎన్నికల కమిషన్‌ను తప్పుపట్టలేదు. అయితే ఆ విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ఆయన ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలే ప్రస్తుత ఈ పరిస్థితికి కారణమని చెప్పక తప్పదు.


మన రాజ్యాంగ వ్యవస్థలలో మరి దేనికంటే ముందు న్యాయ వ్యవస్థ, మరీ ముఖ్యంగా సర్వోన్నత న్యాయస్థానం సముచిత రీతిలో స్పందించి ఉంటే ఈ పరిస్థితి ఇలా తయారయ్యేది కాదు. ఎన్నికల అక్రమాలకు పాల్పడినందుకు నాడు ఇందిరాగాంధీని ఆరేళ్ల పాటు లోక్‌సభ నుంచి బహిష్కరించిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్‌మోహన్ ‌లాల్‌ సిన్హా లాంటి వారు కానీ, ఆమెకు పార్లమెంటులో మాట్లాడే హక్కు, ఓటు వేసే హక్కు లేకుండా చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ లాంటి వారు కానీ ఇప్పుడు లేరు. కేశవానంద భారతి తీర్పు ద్వారా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ముట్టుకునేందుకు వీలులేదని చెప్పిన న్యాయమూర్తులు, ప్రధానమంత్రి ఎంపికను న్యాయ పరిధిలో లేకుండా చేసేందుకు రూపొందించిన 39వ రాజ్యాంగ సవరణను కొట్టివేసిన న్యాయమూర్తులు ఇప్పుడేరీ?

నిజానికి ఎన్నికల కమిషనర్ల నియామకం గత ఏడు దశాబ్దాలుగా ఏకపక్షంగా జరుగుతోందని, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, సీజేఐలతో కూడిన ఉన్నతాధికార కమిటీ ద్వారా వారిని నియమించాలని 2023లో జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ధైర్యంగా తీర్పునిచ్చింది. అయితే ఏ ప్రభుత్వం మాత్రం ఎన్నికల కమిషనర్లపై పట్టు కోల్పోవాలనుకుంటుంది? మోదీ సర్కార్‌ వెన్వెంటనే పార్లమెంటులో చట్టం చేసి కమిటీ నుంచి ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ఆ స్థానంలో కేంద్ర మంత్రిని నియమించింది. ఈ చట్టం వల్ల జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా నియమించేందుకు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. విచిత్రమేమంటే తమ రాజ్యాంగ బెంచ్ ఇచ్చిన తీర్పుపై కనీసం మధ్యంతర స్టే విధించేందుకు కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. అంతేకాదు సీఈసీ, ఇద్దరు కమిషనర్లపై ఎలాంటి సివిల్, క్రిమినల్ చర్యలకూ ఆస్కారం లేకుండా వారిని కాపాడేందుకు రూపొందించిన బిల్లునూ ఉన్నత న్యాయస్థానం కొట్టివేయలేదు. ఇక పెద్ద ఎత్తున ఓటర్లకు ఓటు హక్కును తొలగిస్తున్నారంటూ పలు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌నూ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ కొట్టివేశారు. ఓటర్ల జాబితా నిర్వహణ అంతర్గత పరిపాలన చర్య అని, దానిపై కోర్టు జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాతే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ‘సర్‌’ పేరుతో దేశవ్యాప్తంగా ఓటర్ల తొలగింపు కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. సుప్రీంకోర్టు కాగితంపై ఆదేశాలు జారీ చేసినప్పటికీ బెంగాల్‌లో ఎన్నికల ముందు ఓటర్లకు న్యాయం జరగలేదు. 27 లక్షలమందికి పైగా ఓటర్ల తొలగింపు జరిగితే వారిలో 22 లక్షల మంది 19 ట్రిబ్యునళ్లకు అప్పీళ్లు దాఖలు చేసుకున్నారు. వీటిపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా 16.10 లక్షల కౌంటర్ అప్పీళ్లు దాఖలు చేశారు. సుప్రీంకోర్టు మెతక వైఖరితో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగించే ప్రమాదం తలెత్తింది. పైగా కొందరు యువకులు ఎలాంటి పనీ పాటల్లేకుండా బొద్దింకల్లాగా మారారని, మీడియాలోనూ, సోషల్ మీడియాలోను చేరి అందరిపై దాడులు చేయడం వారికి అలవాటు అయిందని జస్టిస్ సూర్యకాంత్ అలవోకగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలే బొద్దింకల పార్టీ ఏర్పాటుకు, యువత వారికి భారీ మద్దతునిచ్చేందుకు దారితీశాయి. తొలుత విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారకులైన వారు ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలతో గొంతు కలుపుతున్నారు.


ఇప్పుడు రోజురోజుకూ నిరసన తెలిపే వర్గాల సంఖ్య పెరిగిపోతోంది. ‘రిక్షా తొక్కేవాడికైనా, కోటీశ్వరుడికైనా ఓటు హక్కు సమానమే. దాన్ని తొలగించే హక్కు ఎవరికీ లేదు’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్వల్ భుయాన్ వ్యాఖ్యానిస్తే, ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదమైన ఓటు హక్కు ప్రమాదంలో పడిందని మాజీ న్యాయమూర్తి జస్టిస్ రోహింటన్ నారీమన్ వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల వ్యాఖ్యలు, పెరుగుతున్న ప్రజాందోళనను చూసే జ్ఞానేశ్ కుమార్ తొలగింపుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బహుశా విచారణకు స్వీకరించి ఉంటుంది. సుప్రీంకోర్టు అనుమతితోనే ఫామ్‌–6లో మార్పు చేశామన్న ఎన్నికల కమిషన్ వాదననూ తిరస్కరించింది. ఏది ఏమైనా వ్యవస్థల విశ్వసనీయత పెరగాలంటే ప్రభుత్వ వైఖరిలోనైనా మార్పు రావాలి. లేకపోతే సర్వోన్నత న్యాయస్థానం అయినా జోక్యం చేసుకుని తన విశ్వసనీయతను కాపాడుకోవాలి. లేనిపక్షంలో వ్యవస్థలు అభద్రతలో పడి కన్నుమిన్ను గానక తీసుకునే చర్యల వల్ల సమాజం అల్లకల్లోలమయ్యే ప్రమాదం ఉన్నది.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు..

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్

Updated Date - Oct 07 , 2026 | 02:22 AM