Share News

US Global Dominance: అమెరికా ఆధిపత్యానికి తలొగ్గడమా

ABN , Publish Date - Jan 07 , 2026 | 03:00 AM

‘నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి’ అని మహాకవి శ్రీశ్రీ ఏనాడో ఘోషించారు. సామ్రాజ్యవాదం కొనసాగుతున్నంతకాలం ప్రపంచ చరిత్రలో ఆ నగ్న సత్యం స్థిరంగా...

US Global Dominance: అమెరికా ఆధిపత్యానికి తలొగ్గడమా

‘నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి’ అని మహాకవి శ్రీశ్రీ ఏనాడో ఘోషించారు. సామ్రాజ్యవాదం కొనసాగుతున్నంతకాలం ప్రపంచ చరిత్రలో ఆ నగ్న సత్యం స్థిరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. గత వారం వెనెజువెలా అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని అర్ధరాత్రి పూట అమెరికా దళాలు అపహరించి తమ దేశానికి తరలించిన తీరు ఎవరికైనా ఒళ్లు గగుర్పొడిపింపచేసే ఘట్టం. ఇది వెనెజువెలాపై యుద్ధం కాదని, మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశాధ్యక్షుడిపై అమెరికా చట్టాల ప్రకారం చేపట్టిన చర్య మాత్రమేనని, ఆ దేశాన్ని ఆక్రమించుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో, అమెరికా చమురు కంపెనీలు వెనెజువెలాలో ప్రవేశించి వందలకోట్ల డాలర్లతో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తాయని కూడా ఆ పెద్ద మనిషి ప్రకటించారు. రాజకీయ సుస్థిరత నెలకొనేవరకు వెనెజువెలాను తామే నడిపిస్తామని అమెరికా అధ్యక్షుడు చెప్పారు. నిజానికి గత ఆగస్టు నుంచీ అమెరికా యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలు వెనెజువెలా చుట్టూ మోహరిస్తూ విధ్వంసక దాడులు చేస్తూనే ఉన్నాయి. అయినా గత వారాంతంలో వెనెజువెలాకు వ్యతిరేకంగా తాము చేసింది యుద్ధం కాదని ట్రంప్‌ నిస్సిగ్గుగా ప్రకటించారు.

వెనెజువెలా చమురు నిల్వలపై దృష్టి పెట్టినందువల్లే అమెరికా ఆ దేశాధ్యక్షుడిని అపహరించిందన్న విషయం ప్రపంచంలో ఎవరూ కాదనలేని వాస్తవం. చమురు తవ్వకాలను ప్రభుత్వ రంగంలో నిర్వహించడమే కాకుండా ఆ సహజ సంపదను డాలర్ ధరలకు కాకుండా ఇతర దేశాలకు, ముఖ్యంగా చైనాకు విక్రయించుకోవడాన్ని అమెరికా సహించలేకపోయింది. గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ తమ పెట్రోలియం ఉత్పత్తులను డాలర్ ధరలకు కాకుండా యూరోలకు అమ్ముకున్నప్పుడు కూడా అమెరికా ఇదే విధంగా వ్యవహరించింది. 2003లో ఇరాక్ ను ఆక్రమించిన తర్వాత అమెరికా తొలుత చేసిన పని ఇరాకీ చమురును మళ్లీ డాలర్లకు అమ్ముకోవడమే. నిజానికి ఇరాక్ రసాయన ఆయుధాలు తయారు చేస్తున్నదన్న నెపంతో అమెరికా ఆ దేశాన్ని దురాక్రమించింది. అయితే ఇరాక్‌లో మూకుమ్మడి మారణాయుధాలు ఉన్నట్టు ప్రపంచానికి రుజువుచేయలేకపోయింది. డాలర్‌కు బదులు ప్రత్యామ్నాయ కరెన్సీ గురించి యోచించినందువల్లే మానవత్వ పరిరక్షణ పేరుతో లిబియా అధినేత గడాఫీని ఊచకోత కోసి ఆ దేశాన్ని సర్వనాశనం చేసేంతవరకూ అమెరికా ఊరుకోలేదు. వెనెజువెలా కూడా డాలర్‌తో నిమిత్తం లేకుండా రకరకాల కరెన్సీల్లో, బార్టర్ పద్ధతుల్లో చమురు అమ్మడం ప్రారంభించింది. చైనాకు ఆ దేశ కరెన్సీ యువాన్‌లోనే చమురు అమ్మింది. దీనితో మాదకద్రవ్యాల ఉగ్రవాదం, నియంతృత్వం, ప్రజాస్వామ్యం పేరుతో అమెరికా వెనెజువెలా అధ్యక్షుడిని అపహరించింది.


నిజానికి ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు డాలర్ ఆర్థిక శృంఖలాల నుంచి విముక్తి పొందాలని ఆలోచిస్తున్నాయి. భారత్‌ ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి రూపాయి ధరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. అయితే తాము సాంకేతిక సర్దుబాట్లు మాత్రమే చేసుకున్నామని, డాలర్ ఆధిపత్యాన్ని ప్రశ్నించడం లేదని న్యూఢిల్లీ సర్దిచెబుతోంది. డాలర్ ఆధిపత్యం కూలిపోవడాన్ని అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. డాలర్ ఆధిక్యతను తగ్గించే ఏ అంతర్జాతీయ చట్టాలను, సార్వభౌమాధికారాలను అమెరికా సహించదు. తమ ఆర్థిక ఆధిపత్యాన్ని ఆమోదించినంతమేరకే అమెరికాకు ఏ దేశంతోనైనా స్నేహం. లేకపోతే ఇరాన్, లిబియా, వెనెజువెలా లాగా క్రూరమైన అణిచివేతలకు గురికావల్సివస్తుంది. ఆంక్షలు, తిరుగుబాట్లు, సైనిక చర్యలు చేపడతామన్న హెచ్చరికలతో వెనెజువెలాలో అల్లకల్లోలం సృష్టించిన తర్వాతే అమెరికా గత శనివారం అర్ధరాత్రి రంగంలోకి దిగింది. చైనా రాయబారితో వెనెజువెలా అధ్యక్షుడు మదురో చర్చలు జరిపి ఆ దేశంతో తమకు బలమైన సంబంధాలు ఉన్నాయని ప్రకటించిన మూడుగంటల్లోనే అమెరికా సైనిక దళాలు ఆయనను అపహరించి తమ దేశానికి తీసుకువెళ్లాయి.

అసలు ఒక దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నదో లేదో, అక్కడ ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయో లేదో నిర్ధారించే హక్కు అమెరికాకు ఎక్కడిది? నిజానికి ఎన్ని అప్రజాస్వామిక, నియంతృత్వ దేశాలతో అమెరికా సంబంధాలు కొనసాగించడం లేదు? అమెరికా న్యాయస్థానాలే ప్రపంచ కోర్టుల్లాగా వ్యవహరించడం సబబేనా? ప్రపంచ దేశాల మధ్య శాంతిని సంరక్షించడం ఐక్యరాజ్యసమితి విధ్యుక్త ధర్మం. మరి వెనెజువెలాపై అమెరికా ఆగడాన్ని ఆపలేకపోయినప్పుడు సంస్థ ఉనికికి ఏమైనా అర్థం ఉన్నదా? ఒక దేశ పాలకులను ఆ దేశ ప్రజలే నిర్ణయించాలన్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ఒడంబడికకు అర్థం ఏమైనా ఉన్నదా? అమెరికా ఎప్పుడూ ఈ నిబంధనలను పాటించలేదు. 1989లో పనామా అధ్యక్షుడు నొరెగాను బుష్ ప్రభుత్వం ఇదే విధంగా బంధించి తమ దేశానికి తీసుకువెళ్లింది. ప్రపంచంలో అనేక దేశాల్లో నాయకత్వ మార్పులకు, విధ్వంసకాండలకు పూనుకున్న అమెరికా ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు నేర్పుతూ ఉంటుంది. 2011లో సీనియర్ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ నేతృత్వంలో పాకిస్థాన్ వెళ్లిన బృందానికి అమెరికా విశ్వరూపం కనిపించింది. ఆ దేశంలో సీఐఏ ఏజెంట్ రేమండ్ డేవిస్ తన కారు వెనుక వస్తున్న ఇద్దరు పాకిస్థానీ యువకులను అనుమానించి ఉత్తి పుణ్యాన కాల్చి చంపాడు. ప్రజలు తీవ్ర నిరసన తెలిపేసరికి అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. క్షణాల్లో అమెరికా ప్రత్యేక విమానం లాహోర్‌లో దిగింది. లాహోర్ జైలులోనే విచారణ జరిపించి అతడిని విడుదల చేశారు. ఆ యువకుల కుటుంబ సభ్యులకు బ్లడ్ మనీ చెల్లించి అమెరికాలో ఉపాధి కల్పించే ఏర్పాట్లు చేశారు. అదే ప్రత్యేక విమానంలో రేమండ్ డేవిస్‌తో పాటు వారిని కూడా ఆమెరికాకు తీసుకువెళ్లారు.


పాక్‌ ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లో నిరసన తెలిపినా చేసేదేమీలేకపోయింది. రావల్పిండికి కూతవేటు దూరంలో ఉన్న అబోటాబాద్‌లో తల దాచుకున్న బిన్లాడెన్‌ను అమెరికా సైన్యాలు ఎలా హతమార్చాయో అందరికీ తెలిసిందే. వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అపహరించేందుకు సహకరించిన ముగ్గురు వెనెజువెలా అధికారులను కూడా ఆమెరికాకు రాచమర్యాదలతో తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. 1984లో భోపాల్‌లో యూనియన్ కార్బైడ్‌లో విషవాయువు లీక్‌ అయి వేలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా ఆ సంస్థ చైర్మన్, అమెరికన్ దేశస్థుడు వారెన్ ఆండర్సన్ స్వదేశానికి సురక్షితంగా పారిపోయేందుకు మన ప్రభుత్వమే వీలు కల్పించింది. భారత న్యాయస్థానం ఆండర్సన్‌ను నేరస్థుడుగా ప్రకటించినప్పటికీ ఆయన నిర్దోషి అని అమెరికా వాదిస్తోంది. ఆండర్సన్‌ను భారత్‌కు పంపించేందుకు ససేమిరా అంటోంది. మన న్యాయస్థానాలను ఎవరు లెక్కచేస్తారు?

వెనెజువెలా అధ్యక్షుడిని కళ్లకు గంతలు కట్టి, చేతులకు సంకెళ్లు వేసి ఒక జంతువులా అమెరికా బంధించి తీసుకువెళ్లిన ఘటన యావత్ప్రపంచ ప్రజలను నివ్వెరపరిచింది. భారతదేశం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. యూరోపియన్‌ దేశాలు ఆచితూచి స్పందిస్తున్నాయి. ట్రంప్‌ను వ్యక్తిగతంగా కానీ, అమెరికా సైనిక చర్యను కానీ తప్పుపట్టేందుకు మనం వెనుకాడవలిసి వస్తోంది. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడం సరైనది కాదని మనం చెప్పలేకపోతున్నాం. మన విదేశాంగ శాఖ ప్రతినిధి మదురో అపహరణ ఘటనపై ఆందోళన వ్యక్తం చేసి మిన్నకుండిపోయారు. ట్రంప్ మన దేశం పట్ల వ్యవహరిస్తున్న తీరు దృష్ట్యా ఆయనను శత్రువుగా చేసుకునేందుకు భారత్‌ ఏ మాత్రం సిద్ధంగా లేదు. అమెరికాతో మన ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా దిగజారిపోకూడదన్న ఉద్దేశంతో భారత్ వ్యవహరిస్తోంది. అమెరికా ఇప్పటికే మన దేశంపై 50శాతం టారిఫ్‌లను విధించింది. జౌళి ఉత్పత్తులు, ఆభరణాలు, ఇంజనీరింగ్ వస్తువులు, రసాయనాల ఎగుమతులకు భారీ నష్టాలు వాటిల్లుతున్నాయి. వాణిజ్య లోటు తీవ్రంగా పెరిగిపోతోంది. అమెరికాతో జరుగుతున్న వర్తక చర్చలు ఎప్పటికి కొలిక్కి వస్తాయో తెలియని పరిస్థితి ఉన్నది.


భారత రాయబారి వినయ్ క్వాత్రా గత నెలలో తనతో సమావేశమయ్యారని, రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించామని, టారిఫ్‌ను తగ్గించేందుకు ట్రంప్‌ను ఒప్పించాలని బతిమిలాడారని ట్రంప్ కుడిభుజం, అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహం సోమవారం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో విలేఖరులకు చెప్పారు. ఆయన ప్రక్కనే ఉన్న ట్రంప్ స్పందిస్తూ రష్యా నుంచి చమురును కొనుగోలుచేయడం పూర్తిగా ఆపకపోతే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని హెచ్చరించారు. ‘భారత్ నన్ను సంతోషపెట్టాలనుకుంటోంది. మోదీ మంచివాడే. నేను సంతోషంగా లేనని ఆయనకు తెలుసు– నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. రష్యా చమురు అంశంపై సహాయపడకపోతే టారిఫ్‌లను పెంచవచ్చు..’ అని ట్రంప్ చెప్పారు. వెనెజువెలాపై దాడి జరిపిన తర్వాత అమెరికా భారత్‌కు చేసిన హెచ్చరిక ఇది.

అమెరికా అధ్యక్షుడు అసలు మన ప్రధానమంత్రికి సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వాలి? ఆయన చెప్పినట్లు మనం ఎందుకు నడుచుకోవాలి? ఆయనను మోదీ ఎందుకు సంతోషపెట్టాలి? ప్రస్తుతానికి మౌనంగా ఉంటే ట్రంప్ మనను ప్రేమిస్తారనుకోవడం భ్రమ. ట్రంప్ వైఖరిపై కలవరపడుతున్న ప్రపంచ దేశాలతో ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాలతో కలిసి చర్చించే వాతావరణాన్ని ఏర్పర్చుకునేందుకు భారత్ ఎందుకు చొరవతీసుకోకూడదు? యూరోపియన్ యూనియన్ దేశాలకంటే ఎంతో పెద్దదైన భారత దేశం ఈ ప్రపంచంలో ఎవరికీ భయపడదని, తన విదేశాంగ వ్యవహారాలు, ఆంతరంగిక భద్రత తానే నిర్ణయించుకోగలదని చెప్పే పరిస్థితులు రావాలి. అలీన విధానం, వ్యూహాత్మక స్వతంత్రత ఆధారంగా అంతర్జాతీయ వేదికలపై మనం తలెత్తుకోగలగాలి.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవీ చదవండి:

హైకోర్టును ఆశ్రయించిన రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్.. అందుకేనా?

కవిత కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యమేమీ లేదు: మల్‌రెడ్డి రంగారెడ్డి

Updated Date - Jan 07 , 2026 | 03:00 AM