ఈ పరిణామాలు దేనికి సంకేతం?
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:42 AM
‘అయోధ్య రామమందిరంలోని హుండీల్లో ఉన్న డబ్బును తస్కరించడంపై ఆచితూచి మాట్లాడండి. ఈ అవినీతి వ్యవహారం మొత్తం హిందూ సమాజానికి మనస్తాపం కలిగించింది. కొంతమంది తప్పుడు వ్యక్తుల మూలంగా ఇది జరిగింది...
‘అయోధ్య రామమందిరంలోని హుండీల్లో ఉన్న డబ్బును తస్కరించడంపై ఆచితూచి మాట్లాడండి. ఈ అవినీతి వ్యవహారం మొత్తం హిందూ సమాజానికి మనస్తాపం కలిగించింది. కొంతమంది తప్పుడు వ్యక్తుల మూలంగా ఇది జరిగింది. నేరస్థులను ప్రభుత్వం వదిలిపెట్టదు’ అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ కీలక నేతల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్య ఘటనలు బీజేపీని ఎంతగా కుదిపివేశాయో నితిన్ నబీన్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి బీజేపీ ఆఫీసు బేరర్లు, కార్యవర్గ సభ్యులను నియమించడంతో పాటు కేంద్ర ప్రభుత్వంలోనూ భారీ ఎత్తున మార్పులు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సన్నద్ధమవుతున్న తరుణంలో అయోధ్యలో దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ఈ మార్పులకు శ్రీకారం చుట్టి పార్టీకి, ప్రభుత్వానికి కొత్త రూపురేఖలు తీర్చిదిద్దేందుకు మోదీ సన్నద్ధమయ్యారు. అనేక స్థాయిల్లో కీలక చర్చలు జరిపారు. కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులతో ఆయన వేర్వేరుగా, కలిసికట్టుగా గంటల తరబడి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మార్పులు తప్పవన్న సంకేతాలనిచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి, విద్యామంత్రి, సహా పలువురు మంత్రులకు స్థానచలనం తప్పదని సంకేతాలు రావడంతో ఆయా శాఖల నిర్వహణ సవ్యంగా లేదన్న విషయం స్పష్టమవుతోంది. ప్రధానమంత్రి ఆమోదయోగ్యత శాతం పెరుగుతోందని ఎప్పుడూ సర్టిఫికెట్లు ఇచ్చే మార్నింగ్ కన్సల్టెన్సీ సంస్థ ఈసారి మోదీకి ప్రజాదరణ 75–78శాతం నుంచి 68–70శాతానికి పడిపోయిందని చెప్పడం గమనార్హం. కనుక ప్రధానమంత్రి జాగ్రత్తపడాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే తలపెట్టిన మార్పులకు ఇది సరైన సమయం కాదనుకున్నారో, లేక అంతర్గతంగా ఏ సమస్యలు వచ్చాయో కానీ ప్రధానమంత్రి వాటిని వాయిదా వేసుకున్నట్లే కనిపిస్తోంది. తమపై వేటు తప్పదేమో అనుకున్న పలువురు మంత్రులు ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
అయోధ్య ఘటనే కాదు, అనేక అంశాలపై దేశంలో ఏదో ఒక వివాదం రేగుతూనే ఉన్నది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించిన ఈక్విటీ నిబంధనలపై వివాదం రగులుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నీట్– యూజీ నిర్వహణలో అక్రమాలు, వరుస పేపర్ లీకేజీలు తీవ్ర సంచలనం సృష్టించాయి. విద్యార్థుల నిరసనకు మద్దతుగా లద్దాఖ్‌కు చెందిన ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ గత ఎనిమిది రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ–20 ఇథనాల్ బ్లెండింగ్ విధానంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం వల్ల ఆహార భద్రత దెబ్బతిన్నదని, విధానాల రూపకల్పనలో కొందరు మంత్రుల ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అండమాన్, నికోబార్ దీవుల్లో రూ.90 వేలకోట్ల ‘గ్రేట్ నికోబార్ మెగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్’పై కేంద్ర ప్రభుత్వం–పర్యావరణ వేత్తలు, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది.
ఈ పరిణామాలన్నిటిపై ఈ నెల 20న ప్రారంభమవనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు తీవ్ర గందరగోళం సృష్టించేందుకు సన్నద్ధం కావచ్చు. అయితే ప్రతిపక్షాలు అనేవి ఎక్కడున్నాయి? ఇండియా కూటమిలో కీలక భాగస్వాములైన తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఆమ్ ఆద్మీ పార్టీల్లోంచి భారీ ఫిరాయింపులు జరగడంతో ఆ పార్టీలు అస్తిత్వం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. తమిళనాడులో టీవీకేతో కాంగ్రెస్ చేతులు కలిపిన తర్వాత ఆ జాతీయ పార్టీకి డీఎంకే దూరమైంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నది. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన స్వతంత్ర అభ్యర్థిని గెలిపించిన తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా ఉనికి ప్రశ్నార్థకమైంది. తాము ఇండియా కూటమిలో భాగం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ దృష్ట్యా పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు ఒకటి రెండు రోజులు గందరగోళం సృష్టించినా, ఆ తర్వాత బీజేపీ తన అజెండాను నెరవేర్చుకునేందుకు ఎలాంటి అడ్డూ లేకపోవచ్చు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే ప్రతిపక్షాలు తీవ్రంగా బలహీనం కావడం, పార్లమెంటు రూపురేఖలు మారడం దేశ రాజకీయాల్లో కీలకమైన పరిణామం అని చెప్పక తప్పదు. ఇంతకంటే ముఖ్యమైనది 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, 131వ రాజ్యాంగ సవరణ బిల్లును మళ్లీ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధం కావడం. గత ఏప్రిల్‌లోనూ, తర్వాత జరిగిన ప్రత్యేక సమావేశాల్లోనూ ఈ బిల్లులను ప్రతిపక్షాలు బలంగా అడ్డుకోవడంలో విజయం సాధించాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ రెండు బిల్లులూ ఆమోదం పొందితే దేశ రాజకీయ, రాజ్యాంగ వ్యవస్థల్లో కొన్ని కీలక మార్పులు జరుగుతాయని అందరూ గట్టిగా భావిస్తున్నారు. ఈసారి మహిళలకు రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లులకు రెండింట మూడవ వంతు మెజారిటీ సాధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. ఈ బిల్లు ఆమోదం పొందితే ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కల సేకరణతో నిమిత్తం లేకుండా గత జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరుతుంది. ఈసారి పెరిగే సీట్ల సంఖ్యను కూడా నిర్దిష్టంగా బిల్లులో సూచించే అవకాశాలున్నాయి. అంతేకాదు, ప్రభుత్వం ఏర్పర్చే డీలిమిటేషన్ కమిషన్ దేశవ్యాప్తంగా పలు నియోజకవర్గాల భౌగోళిక సరిహద్దులను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చివేసే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు. వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న 130వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా కీలకమైనదే. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రుల్లో ఎవరైనా ఒక సీరియస్ కేసులో అరెస్టయి 30 రోజుల పాటు జైల్లో ఉంటే వారిని మరుసటి రోజే పదవి నుంచి తొలగించేందుకు ఆ బిల్లు నుద్దేశించారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, మంత్రులపై ఎక్కుపెట్టిన అస్త్రమే ఈ బిల్లు అనే విషయం స్పష్టమవుతోంది.
అనుకున్న విధంగా పార్లమెంట్‌లో ఆధిపత్యం సంపాదించి రాజ్యాంగ సవరణల బిల్లులను వర్షాకాల సమావేశాల్లోనే ప్రభుత్వం ఆమోదింపచేసుకోగలిగితే ఇక ఏ బిల్లుకైనా ఎలాంటి అడ్డూ ఉండదు. ముఖ్యంగా ఒకే దేశం–ఒకే ఎన్నిక పేరుతో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును ఆమోదించేందుకు కూడా మార్గం సుగమమవుతుంది. జమిలి ఎన్నికలకు తాము సిద్ధమేనని బీజేపీ ముఖ్యమంత్రులు అందరూ ఇప్పటికే ప్రకటించారు. మహిళలకు రిజర్వేషన్ అమలు చేస్తూనే జమిలి ఎన్నికలు కూడా నిర్వహిస్తే తాము తిరుగులేకుండా మరోసారి అధికారంలోకి రాగలమని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే భారత ప్రజాస్వామ్యంలో అది పెద్ద రాజకీయ పరివర్తన వస్తుందనడంలో సందేహం లేదు. ఈ క్రమంలో 2028లో జరగాల్సిన తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ ఎన్నికలను సార్వత్రక ఎన్నికల వరకు వాయిదా వేయగలడం తమకు కలిసివచ్చే సదవకాశంగా బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ క్రమంలో 2029 నాటికి ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి? కొన్ని ప్రాంతీయ పార్టీలు చీలిపోవడం లేదా అస్తిత్వ పరీక్షకు గురికావడం వల్ల బీజేపీ బలోపేతమై పార్లమెంటులో ఆధిపత్యం సాధించడాన్ని కాంగ్రెస్ సీరియస్‌గా భావిస్తున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు మాయమైతే తాము వాటి స్థానంలో బలపడతామని కాంగ్రెస్ నేతలు విశ్వసిస్తున్నారు. నిజంగా అలా జరిగితే మన దేశంలో రెండు పార్టీల వ్యవస్థ ఆవిర్భవిస్తుంది. బీజేపీ యేతర, కాంగ్రెసేతర పార్టీలు క్రమంగా క్షీణించిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మన ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యకర పరిణామమా? ప్రాంతీయ ఆకాంక్షలకు ఇక దేశంలో విలువ ఉండదా? అన్న చర్చలకు ఆస్కారం లేకపోలేదు. ఒడియా, బెంగాల్, ద్రవిడ అస్తిత్వవాదం ఎన్నికల రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోవడమే ఇందుకు కారణం. అయితే ప్రాంతీయ పార్టీలు నిజంగా ప్రాంతీయ ఆకాంక్షలను పరిరక్షిస్తున్నాయా? తమ నేతల మనుగడ కోసం దేనికైనా దిగజారగలిగే ప్రాంతీయ పార్టీలు ప్రజల దృష్టిలో తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నాయా? అన్న ప్రశ్నలకు కూడా జవాబులు వెదకాల్సి ఉంటుంది.
దేశంలో ఎప్పుడూ బహుళ పార్టీల ప్రజాస్వామ్యమే అమలులో ఉన్నదన్న విషయం విస్మరించలేం. కాంగ్రెస్ ప్రధాన శక్తిగా ఉన్న కాలంలో కూడా ఏకైక శక్తిగా ఎప్పుడూ ఉండలేదు. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు సైతం కాంగ్రెస్ 364 సీట్లతో అత్యధికంగా 46శాతం ఓట్లు సాధించినప్పటికీ ప్రతిపక్షాలు 54శాతం ఓట్లతో 125 సీట్లు గెలుచుకున్నాయి. అవి సమాజంలో భిన్న వర్గాలకు ప్రాతినిధ్యం వహించాయి. 1957లో రెండవ సార్వత్రక ఎన్నికల నుంచి ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇందుకు కారణం కాంగ్రెస్ తనకు తిరుగులేదన్న అహంకారంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించడమేనని ఆ పార్టీకి కూడా తెలుసు. కాంగ్రెస్ వైఖరి పుణ్యమా అని ద్రవిడ పార్టీలు, సోషలిస్టు పార్టీలు, ప్రాంతీయ అస్తిత్వవాదం ఆధారంగా ఏర్పడ్డ పార్టీలతో పాటు విభిన్న వర్గాలకు చెందిన పార్టీలు ఏర్పడి సువిశాల భారతదేశ వైవిధ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. ఒక దశలో జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాలే శాశ్వత పరిణామంగా భావించే పరిస్థితి ఏర్పడింది. వాజపేయి లాంటి వారు ప్రాంతీయ ఆకాంక్షలను భారత బహుళ వాదానికి, సమాఖ్య స్ఫూర్తికి అవసరమైన వ్యక్తీకరణలుగా భావించారు. మళ్లీ ఇప్పుడు చరిత్ర వెనక్కు నడుస్తున్నట్లు కనపడుతోంది. ఇది ప్రమాదకరమా, లేక ఆరోగ్యకరమా అన్న చర్చ ప్రధానం కాదు. బాధాకరమైన విషయమేమిటంటే ప్రశ్నలు అడగాల్సిన ప్రతిపక్షాలు తగ్గిపోవడమే.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం
రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్