Share News

భారత్‌కు భాగవత్‌ దిశా నిర్దేశమేమిటి?

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:50 AM

‘మనం ప్రతి ఒక్కరినీ ఎలాంటి ప్రతిఘటన లేకుండా అంగీకరించాలి’ (సర్వేషాం అవిరోధేనా) అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ఒక సందర్భంలో చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100వ సంవత్సరంలో ప్రవేశించిన...

భారత్‌కు భాగవత్‌ దిశా నిర్దేశమేమిటి?

‘మనం ప్రతి ఒక్కరినీ ఎలాంటి ప్రతిఘటన లేకుండా అంగీకరించాలి’ (సర్వేషాం అవిరోధేనా) అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ ఒక సందర్భంలో చెప్పారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100వ సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ పలు సభల్లో ప్రసంగిస్తున్నారు. అనేక వర్గాల వారితో సమావేశమై సంభాషణలు జరుపుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే ఒకప్పుడు ఆర్ఎస్ ఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకించినవారు, ఆ సంస్థపై ఏ అభిప్రాయం లేని తటస్థులతో పాటు రకరకాల వర్గాల్లో దూరి తమ ఉనికిని చాటుకునే మహానుభావులు సైతం మోహన్ భాగవత్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. విద్యావేత్తలు, డాక్టర్లు, న్యాయవాదులు, వణిక్‌ ప్రముఖులు, కళాకారులు, కవులు, రచయితలు, క్రీడాకారులు, నటులు, మీడియా ప్రతినిధులు, న్యాయవాదులు, మాజీ న్యాయమూర్తులు, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు ముంబైలో అక్షయ్‌కుమార్, రణబీర్‌కపూర్‌, సల్మాన్ ఖాన్ తదితర తారాగణం భాగవత్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. మంచి సందేశాలు వ్యాప్తి చేసే సినిమాల్లో నటించినందుకు సల్మాన్ ఖాన్‌ను భాగవత్‌ ప్రశంసించారు. హైదరాబాద్‌లో వామపక్షీయులు కూడా భాగవత్ ప్రసంగానికి హాజరుకావడం గమనార్హం. ఇంత విస్తృత స్థాయిలో వివిధ వర్గాల వారిని ఒక సంస్థ ఆకర్షించడం సాధారణ విషయం కాదు.

దేశం ఇప్పుడు ఒక సైద్ధాంతిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సిద్ధాంతాల ప్రాతిపదికన జరిగిన అనేక ఉద్యమాలు పరీక్షలకు, సమీక్షలకు, వైఫల్యాలకు లోనై కొట్టుకుపోయాయి. సైద్ధాంతిక దారిద్ర్యం అంతటా తాండవిస్తోంది. సమాజం పట్ల, అణగారిన వర్గాల పట్ల సానుకూల దృక్పథంతో ఆలోచించేవారు ఒక మూసలో ఇమడలేకపోతున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా తత్వవేత్తలు ఇలాంటి సామాజిక పరిస్థితులను ఎదుర్కొని విశ్లేషించిన సందర్భాలున్నాయి. మరి మోహన్‌ భాగవత్‌ ప్రస్తుత అయోమయ పరిస్థితులలో ఏమి మాట్లాడతారా అన్న ఆసక్తితోనే అనేకమంది ఆయన సభలకు హాజరు అవుతున్నారని అర్థం చేసుకోవల్సి వున్నది. రకరకాల భావజాలాల అనుయాయులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆర్ఎస్ఎస్ విస్తరిస్తుండడం, దాని అనుబంధ రాజకీయ సంస్థ అయిన భారతీయ జనతా పార్టీ తిరుగులేని జాతీయ రాజకీయ శక్తిగా ప్రభావ ప్రాబల్యాలను సంతరించుకోవడం ఒక రకంగా సంఘ్ పరివార్ శక్తులకు సదవకాశం.


అయితే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్ కూడా ఒక నిర్దుష్టమైన స్పష్టతతో ఉన్నదా? ఈ విషయాన్ని తరచి చూడవలసిన అవసరం ఉన్నది. హెగ్డేవార్ స్థాపించిన ఆర్ఎస్ఎస్ కూడా ఇప్పటి ఆర్ఎస్ ఎస్‌కూ ఎంతో తేడా ఉన్నది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, గత పది సంవత్సరాలకు పైగా నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా కొనసాగడానికి కారణమైన ఆర్ఎస్ఎస్ ఇవాళ ఒక సంధి దశలో ఉన్నది. కేంద్రంలో మోదీ ఇవాళ ఏమి చేసినా జనం ఆర్ఎస్ఎస్ వైపు చూస్తున్నారు. మోదీ చేసిన మంచి పనులకు ఆర్ఎస్ఎస్‌కు ఎంత ఘనత లభిస్తుందో, ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలకూ ఆర్ఎస్ఎస్ జవాబుదారీ అవుతుందని చాలా మంది భ్రమిస్తున్నారు. అయోధ్యలో బాల శ్రీరాముడి ప్రతిష్ఠాపన సమయంలో నరేంద్రమోదీ వెనుక మోహన్ భాగవత్ ఉన్న దృశ్యాలను చూసినవారు మోదీకి అన్ని విషయాల్లోనూ మోహన్ భాగవత్ అండగా ఉంటారనుకోవడంలో ఆశ్చర్యం లేదు. విచిత్రమేమంటే జాతీయవాదులు అని తమను తాము చెప్పుకుంటున్నవారు కూడా మోదీ చేసిన అన్ని పనులను పిడివాదంతో సమర్థించడం, ప్రత్యర్థులపై తీవ్ర పరిభాషలో విరుచుకుపడడం ప్రస్తుత సైద్ధాంతిక అయోమయాన్ని మరింతగా తీవ్రతరం చేస్తోంది.

ఆర్ఎస్ఎస్‌కూ బీజేపీకి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చెప్పేందుకు మోహన్ భాగవత్ అనేక సమావేశాల్లో ప్రయత్నించారు. ఆర్ఎస్ఎస్‌కు ఎలాంటి రాజకీయ అధికార ఆకాంక్ష లేదని, మొత్తం హిందూ సమాజాన్ని సంఘటితం చేయడం, పౌరుల వ్యక్తిత్వాన్ని నిర్మించడం తమ ఏకైక లక్ష్యమని ఆయన ఇటీవల డెహ్రూడూన్‌లో మాజీ సైనికాధికారుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఆర్ఎస్ఎస్‌ను బీజేపీతో పోల్చి చూడకూడదని, బీజేపీ కళ్లతో ఆర్ఎస్ఎస్‌ను చూడడడం అతి పెద్ద తప్పిదమని ఆయన గత ఏడాది కోల్‌కతాలో చెప్పారు.


కాని చాలా మంది తటస్థ వాదులకు ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీయే. దాదాపు 12 ఏళ్లుగా బీజేపీ అధికారంలో లేకపోతే, ఆర్ఎస్ఎస్‌కు ఇవాళ ఇంత ప్రాధాన్యం లభించేది కాదని వారు వాదిస్తున్నారు. అధికారం అనేది ఒక అయస్కాంతం లాంటిది. ఆ అయస్కాంతానికి ఆకర్షితులైనవారందరూ నేడు ఆర్ఎస్ఎస్‌కు కూడా ఆకర్షితులవుతున్నారు. మోహన్ భాగవత్ సమావేశాలకు వచ్చిన వారందరూ ఆర్ఎస్ఎస్ భావజాలం నచ్చి వచ్చి ఉంటారని అనుకోవడానికి వీల్లేదు. భాగవత్, ఆర్ఎస్ఎస్ పెద్దల దృష్టిలో పడడం వల్ల, ఆ సమావేశాలకు హాజరయ్యామని చెప్పుకోవచ్చు; ఆ పెద్దలతో ఫోటోలు దిగి ప్రచారం చేసుకోవచ్చు; తద్వారా తమకేదో మేలు జరుగుతుందనే అభిప్రాయం అటువంటివారిలో నెలకొని ఉన్నదని స్పష్టమవుతోంది. ‘బీజేపీ అధికారంలో లేకపోతే ఆర్ఎస్ఎస్‌ను ఎవరు పట్టించుకుంటారు?’ అని ఆ సమావేశానికి వెళ్లి వచ్చిన ఒక మేధావి వ్యాఖ్యానించారు. బహుశా తమలో బలంగా లేని ఒక భావజాలం తమకు నచ్చిందని పైకి ప్రకటించడం వల్ల కొందరు ప్రయోజనాలు, పదవులు, పురస్కారాలు పొంది ఉండవచ్చు. ఈ స్వార్థపరత్వం మరికొందర్ని ఆకర్షిస్తోంది. బీజేపీలో మంత్రులుగా ఉన్నవారందరికీ సంఘ్ భావజాలం గురించి అంత బలమైన అవగాహన ఉన్నదని చెప్పేందుకు ఆస్కారం లేదు. ఈ బూటకత్వాన్ని సంఘ్ పరివార్‌లో కొందరు గమనించే ఉంటారు. ‘ముందు వచ్చిన చెవులకంటే వెనుక వచ్చిన కొమ్ములే వాడి’ అని వాపోయేవారు లేకపోలేదు.

సమాజంలో ఇలాంటి పరిణామాలు సహజమైననప్పటికీ ఇవాళ ఆర్ఎస్ఎస్ అనేది బీజేపీకంటే ఎంతో భిన్నమైన, బలమైన, విస్తృతమైన సంస్థ. బీజేపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆర్‌ఎస్ఎస్ ప్రాధాన్యం తగ్గే అవకాశాలు ఏ మాత్రం లేవు. నిజానికి ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ పార్టీకి కట్టుబడి ఉన్న సంస్థ కానే కాదు. ఒకప్పటి ఆర్ఎస్ఎస్‌కూ ఇప్పటి ఆర్ఎస్ఎస్‌కూ మధ్య చాలా వ్యత్యాసమున్నది. 1925లో ఆర్ఎస్ఎస్‌ను స్థాపించిన డాక్టర్ కేశవ్ బలిరాం హెడ్గేవార్ 1937 వరకూ కాంగ్రెస్‌లో ఉన్నారని ఎంత మందికి తెలుసు? ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించేందుకు ఒక సామాజిక భూమిక లేకపోలేదు. కాంగ్రెస్‌లో మితవాద, అతివాద ఘర్షణల పర్యవసానంగా గాంధీజీ స్వాతంత్ర్యోద్యమ నాయకత్వం చేపట్టడం, రష్యాలో విప్లవానంతరం దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడడం, అంబేడ్కర్ నాయకత్వంలో మహారాష్ట్రలోని మహడ్‌లో అస్పృశ్యులు చెరువునుంచి నీరు తాగేందుకు ఉద్యమించడం తదితర పరిణామాల సమయంలోనే ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించింది. తిలక్ వారసత్వాన్ని గౌరవించిన హెగ్డేవార్ ఆర్ఎస్ఎస్‌ను కులాలకు అతీతంగా, సమస్త కులాలను కలుపుకుపోయే సంస్థగా రూపొందించాలనుకోవడానికి కూడా సామాజిక నేపథ్యం ఎంతో ఉన్నది. భారత జాతీయ కాంగ్రెస్‌లో నెహ్రూ ఆవిర్భవించి ఆధునిక యూరోపియన్‌ సమాజాల సెక్యూలరిజం స్ఫూర్తితో కాంగ్రెస్ భావజాలాన్ని ప్రభావితం చేయడం ప్రారంభమై తరువాతే ఆర్ఎస్ఎస్‌కూ కాంగ్రెస్‌కూ మధ్య దూరం మరింత పెరిగిందనేవారున్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంతో స్వాతంత్ర్య సమరంలో ప్రజలను గాంధీ, నెహ్రూ సంఘటితపరుస్తూ దేశాన్ని ఏకతాటిపైకి తెస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్‌తో పాటు కమ్యూనిస్టు నేతలూ ప్రేక్షకులయ్యారు.


1940లో హెగ్డేవార్ మరణం తర్వాత గురూజీ అని సంఘ్ గౌరవంగా పిలుచుకునే గోల్వాల్కర్ సంఘ్ బాధ్యతలు చేపట్టడంతో ఆ సంస్థ స్వరూప స్వభావాలు మారిపోయాయి. దేశ విభజన ఆయన హయాంలోనే జరగడం, విభజన రేకెత్తించిన మత విద్వేషాల వల్ల సంఘ్ సైద్ధాంతిక స్వరూపం తీవ్రంగా మారిపోయింది. 1948లో ఆర్ఎస్‌ఎస్‌ను నిషేధించిన తర్వాత ఆయనను అరెస్టు చేశారు. గోల్వాల్కర్ మరణం తర్వాత 1973లో మూడవ సర్ సంఘ్ చాలక్ అయిన దేవరస్ గోల్వాల్కర్ కంటే భిన్నంగా ఆలోచించి రాజకీయాల్లో, సామాజిక కార్యచరణలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌కు వీలు కల్పించారు. దాన్నొక ప్రజా సంస్థగా మార్చేందుకు ప్రయత్నించారు. జనసంఘ్, సోషలిస్టులు, స్వతంత్ర పార్టీ సభ్యులతో కలిసి జేపీ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందిరాగాంధీతో ఆయనకు సత్సంబంధాలుండేవి. పీవీ నరసింహారావుతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. దేవరస్ రాజకీయ మార్గదర్శకత్వం లేకపోతే జనసంఘ్ జనతా పార్టీలో విలీనమయ్యేదే కాదు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించేదే కాదు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్ సంఘ్ చాలక్‌గా ఉన్న మోహన్ భాగవత్ దేశానికి ఏ దిశానిర్దేశం చేస్తారా అని పలువురు చూడడంలో ఆశ్చర్యం లేదు. ఈ దేశానికి మైనారిటీలను అవాంఛనీయ శక్తులుగా భావిస్తూ గోల్వాల్కర్ రచించిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’లో కొన్ని వ్యాఖ్యలకు కాలం చెల్లిందని ఆయన 2016లోనే బహిరంగంగానే ప్రకటించారు. ప్రపంచీకరణ అంటే మార్కెటీకరణ, అది ప్రమాదకరం అని ఆయన తాజాగా అన్నారు. ఆయన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్‌ను అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయే కాని ‘వన్ లీడర్– వన్ పార్టీ’గా మారిన బీజేపీని అర్థం చేసుకోవడానికి తోడ్పడకపోవచ్చు. ప్రస్తుత మోదీ పాలనలో జరుగుతున్న పరిణామాలు ‘సర్వేషాం అవిరోధేనా’ అన్న సూత్రానికి అనుకూలమా? భారత అమెరికా వర్తక ఒప్పందాన్ని ఏ కోణంలోంచి చూడాలి? జీడీపీలో ఒక శాతం కంటే తక్కువగా పరిశోధనకు కేటాయిస్తూ చైనా కంటే ఎంతో వెనుకపడి ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి..

మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

కొత్త పార్టీని ప్రకటించిన శశికళ

Updated Date - Feb 25 , 2026 | 12:50 AM