ప్రజాస్వామ్య ప్రహసనంలో మీనాక్షి అంకం
ABN , Publish Date - Jun 17 , 2026 | 12:57 AM
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసిన ఒక అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించాల్సిందిగా రాయలసీమకు చెందిన కొందరు నేతలు నాడు శాసనసభ సెక్రటరీగా ఉన్న సత్యనారాయణరావు అనే రిటర్నింగ్...
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసిన ఒక అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించాల్సిందిగా రాయలసీమకు చెందిన కొందరు నేతలు నాడు శాసనసభ సెక్రటరీగా ఉన్న సత్యనారాయణరావు అనే రిటర్నింగ్ అధికారిపై తీవ్ర ఒత్తిడి చేశారు, ప్రలోభపెట్టారు. ఆ రిటర్నింగ్ అధికారి భయభ్రాంతుడై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సంప్రదించారు. ‘మీరే ఒత్తిళ్లకూ లొంగవద్దు. నిబంధనల ప్రకారం నిర్భయంగా వ్యవహరించండి’ అని ఆయన ఆ అధికారికి చెప్పినట్లు సమాచారం. 2009లో వైఎస్ జమానాలో కనిగిరి నుంచి శాసనసభకు పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి కదిరి బాబూరావు తన అఫిడవిట్‌లో ఒకచోట సంతకం చేయడం మరిచిపోయారు. సాయంత్రం 5 గంటల వరకు ఏమీ చెప్పకుండా వ్యూహాత్మక మౌనం పాటించిన రిటర్నింగ్ అధికారి ఆ తర్వాత సంతకం లేదన్న కారణంతో బాబూరావు నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణకు సన్నిహితుడుగా బాబూరావు పేరు పొందారు. అభ్యర్థుల తలరాతను నిర్ణయించడంలో రిటర్నింగ్ అధికారులు ఎంత కీలకపాత్ర పోషిస్తారో చెప్పేందుకు ఇవి ఉదాహరణలు మాత్రమే. కురుక్షేత్ర సంగ్రామంలో ఒక్క రోజైనా పాండవులను ప్రవేశించకుండా అడ్డుకోగలిగిన శక్తి సైంధవుడికి ఉన్నట్లే, ఎన్నికల యుద్ధంలో రిటర్నింగ్ అధికారులు కూడా అప్పుడప్పుడు సైంధవ పాత్ర పోషిస్తారు. వారి శక్తి అంత బలమైనది.
ఇటీవల మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, పార్టీ ప్రధాన కార్యదర్శి మీనాక్షి నటరాజన్ నామినేషన్ పత్రాలను తిరస్కరించడంలో అరవింద్ శర్మ అనే రిటర్నింగ్ అధికారి కీలక పాత్ర పోషించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ శర్మ అంతకు ముందు లోక్‌సభలో డైరెక్టర్‌గా ఉండేవారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్న కాలంలో వ్యవసాయ మంత్రిగా ఉన్న నరేంద్రసింగ్ తోమర్ సహాయంతో అరవింద్ శర్మ మధ్యప్రదేశ్‌కు వచ్చారంటే ఆయనకు బీజేపీతో ఉన్న బలమైన సంబంధాలు ఊహించుకోవాల్సిందే. తోమర్ ఇప్పుడు మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. బహుశా మీనాక్షి నటరాజన్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఒక ఫిర్యాదు దాఖలైందన్న విషయం బీజేపీ వర్గాలకు నోటిఫికేషన్ రాకముందే తెలిసి ఉండాలి. లేకపోతే తమకు బలం లేకపోయినా మూడో అభ్యర్థిని రంగంలోకి దించేవారు కాదు. మీనాక్షి నామినేషన్ దాఖలు చేయడం, బీజేపీ వెంటనే ఆమెపై ఉన్న కేసును రిటర్నింగ్ అధికారికి గుర్తు చేయడం, ఆయన వెంటనే ఆమె నామినేషన్‌ను తిరస్కరించి, బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ప్రకటించడం అంతా ఆగమేఘాలపై జరిగిపోయింది. బీజేపీ ఏమి చేసినా అంతా పకడ్బందీగా, ఎంతో ముందుగా ప్లాన్ చేస్తుందని అర్థమవుతోంది.
గత ఏప్రిల్‌లో మూడు రోజుల పాటు పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ఆమోదించుకోలేకపోయింది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ప్రతిపక్షాలు బిల్లులు వీగిపోయేలా చేయడం ఇది మొదటిసారి. పశ్చిమబెంగాల్‌లో తొలిసారి బీజేపీ అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో ఆ పార్టీకి ఆత్మవిశ్వాసం పెరిగింది. పార్లమెంట్ ఉభయ సభల్లో అత్యధిక సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు అన్ని రకాల పద్ధతులు ఉపయోగించాలనుకున్నారు. అందులో భాగంగా 20 మంది లోక్‌సభ సభ్యులు తృణమూల్ ఎంపీలు పార్టీ నుంచి విడివడి ‘నేషనలిస్టు సిటిజన్స్ పార్టీ’ అనే ఒక అనామక పార్టీలో చేరి ఎన్డీఏకు మద్దతు ప్రకటించారు. రాజ్యసభలో ఆ పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు రాజీనామా చేశారు. మరికొందరితో బేరసారాలు జరుగుతున్నాయి. నిన్నమొన్నటి వరకు బెంగాల్ ఎన్నికల్లో మోదీని దూషించిన నేతలే ఇప్పుడు ఆయనే తమ నాయకుడని భావిస్తున్నారు. జార్ఖండ్‌లో అంబానీ కుడిభుజం పరిమళ్ నత్వానీతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి అధికార పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను వ్యూహాత్మకంగా తిరస్కరించేలా చేయడంతో మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చూశారు. అంతే కాదు, దేశ వ్యాప్తంగా 19 మంది బీజేపీ ఎంపీలు ఎలాంటి పోటీ లేకుండా విజయం సాధించారు. ఈ పరిణామాలతో ఉభయ సభల్లో తమకు తిరుగులేకుండా చేసుకుని తాము అనుకున్న బిల్లులను ఆమోదించేందుకు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేస్తోందన్న విషయం స్పష్టమవుతోంది. ఉభయ సభల్లో రెండింట మూడో వంతు మెజారిటీకి ఇంకా ఎన్డీఏ చేరువలోకి రాకపోయినప్పటికీ జూలైలో వర్షాకాల సమావేశాలు సమీపించే నాటికి బీజేపీ ఇంకెంతమందిని తమవైపు తిప్పుకుంటుందో అన్న అంశంపై దేశ రాజధానిలో చర్చ జరుగుతోంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కృతి, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఎన్డీఏకు దాసోహం అయిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రతి పార్టీలోనూ తమ మనుగడకు సంబంధించి ఒక రకమైన గుబులు బయలుదేరింది. ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా అస్తిత్వ పరీక్షలో పడ్డాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులతో సహా అనేక కీలక బిల్లులను ఆమోదింపజేసేందుకు రంగం సిద్ధం చేసిందని స్పష్టమవుతోంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే గతంలో రిటర్నింగ్ అధికారులు వివాదాస్పదంగా ప్రవర్తించినప్పటికీ మీనాక్షి నటరాజన్‌కు లభించినంత సానుభూతి ఎవరికీ లభించలేదు. ఆమె గాంధేయవాదిగా చాలా సాధారణ జీవితం సాగించే అరుదైన నాయకురాలు కావడం అందుకు కారణం కావచ్చు. ఇక్కడ రిటర్నింగ్ అధికారిని విమర్శించి లాభం లేదు. ‘మేము ఏమి చేయగలం. పైనుంచి ఆదేశాలు వస్తే?’ అని మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక అధికారి అన్నారు. ఆమెకు ఏ మాత్రం సంబంధం లేని ఒక ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా దాఖలైన కేసును సాకుగా తీసుకుని ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం పూర్తిగా అసంబద్ధంగా కనపడుతోంది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 33(ఏ) ప్రకారం చార్జిషీటు దాఖలై, ఆరోపణలు నిర్ధారించిన తర్వాత రెండేళ్ల కంటే జైలు శిక్షపడదగ్గ కేసులనే వెల్లడించాల్సి ఉంటుందని చట్టసభల్లో రిటర్నింగ్ అధికారులుగా పనిచేసిన అనేక మంది అంటున్నారు. ఒకవేళ అఫిడవిట్‌ను పూర్తిగా నింపలేదని రిటర్నింగ్ అధికారి అనుకున్నప్పటికీ కేవలం అదే కారణంతో నామినేషన్‌ను తిరస్కరించకూడదని, అభ్యర్థికి తన తప్పు సరిదిద్దుకునేందుకు మరో అవకాశం కల్పించాలని వారు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించిన రోజే జార్ఖండ్‌లో బీజేపీ అభ్యర్థికి తన అఫిడవిట్‌లో తప్పు సరిదిద్దుకోవడానికి 24 గంటల సమయం ఇచ్చారు. దేశవ్యాప్తంగా రిటర్నింగ్ అధికారులు ఇలా న్యాయబద్ధంగా వ్యవహరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక అభ్యర్థి ప్రజాస్వామికంగా ఎన్నికయ్యేందుకు అధికారులు వీలు కల్పించాలి కానీ ఆ అభ్యర్థి ఎన్నిక కాకుండా అవరోధం కల్పించడం, అధికార పార్టీ రాజకీయాలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించడం జరిగినప్పుడు మన దేశంలో ప్రజాస్వామ్యం ఆరోగ్యకరంగా లేదన్న విషయం స్పష్టమవుతున్నది.
తన నామినేషన్‌ను అన్యాయంగా తిరస్కరించారని మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు ఆ విషయంలో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది. ఆర్టికల్ 329(బి) కింద చట్టసభకు జరిగిన ఏ ఎన్నికనూ సవాల్ చేయడానికి వీలు లేదని సుప్రీంకోర్టు తేల్చింది. కావాలంటే హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాల్లో ఎన్నికల పిటిషన్‌ల పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో సుప్రీంకోర్టుకు కూడా తెలుసు. ఇప్పటి వరకు ఉన్న అనుభవం రీత్యా మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై తేలాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరికీ తెలియదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు చెప్పారు. కోర్టులు ఎన్నికల పిటిషన్లపై ప్రత్యేక బెంచ్‌లు ఏర్పాటు చేసి ఆరు నెలలలోపు నిర్ణయాలు ప్రకటించాలని 2019లో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఒక ప్రసంగంలో అన్నారు. అటు సుప్రీంకోర్టూ తేల్చక, ఇటు ఎన్నికల పిటిషన్లపై వేగంగా తీర్పురాని పరిస్థితుల్లో నలిగిపోతున్న ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షించాలి? పైగా దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో న్యాయస్థానాలు అనుసరిస్తున్న వైఖరి విచిత్రంగా ఉంటోంది. ప్రజాసమస్యలపై కేసులు దాఖలు చేస్తున్న వారిని బొద్దింకలని, పనిపాట లేని వారని, అభివృద్ధి నిరోధకులని న్యాయస్థానాలే తీర్మానించే పరిస్థితి ఏర్పడుతోంది. ‘కేంద్రం డబ్బులు ఖర్చుపెట్టి రోడ్లు నిర్మిస్తోంది. సమాచార చట్టం కింద రోడ్ల పురోగతిని ప్రశ్నించడానికీ నీవెవరివి, ఇది ఎల్లో జర్నలిజం’ అని సుప్రీంకోర్టు మంగళవారం ఒక ఆర్టీఐ కార్యకర్తను విమర్శించి కేసు కొట్టేసింది. చట్టసభల్లో మెజారిటీ సాధించేందుకు, తాము అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నించడం రాజనీతి అని కొందరు, కుటిలనీతి అని మరికొందరు అంటారు. ఏ నీతి అయినా అనుసరిస్తున్న మార్గాలు, విఫలమవుతున్న వ్యవస్థలను ప్రశ్నించడం కూడా తప్పు కాదు.
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కసరత్తు.. జూన్ 23 నుంచి సంప్రదింపులు
జులై మూడో వారంలో తల్లికి వందనం!
Read Latest Telangana News And Telugu News