మోదీ జైత్రయాత్రకు తిరుగులేదా?
ABN , Publish Date - Mar 18 , 2026 | 01:24 AM
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు ప్రకటించారు. ఇప్పుడు అందరి ఆసక్తి ఎన్నికల రాష్ట్రాలలో ఘటనా ఘటనలపై ఉన్నది. పార్లమెంటులో గత రెండు రోజులుగా సభా కార్యకలాపాలు సజావుగా...
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు ప్రకటించారు. ఇప్పుడు అందరి ఆసక్తి ఎన్నికల రాష్ట్రాలలో ఘటనా ఘటనలపై ఉన్నది. పార్లమెంటులో గత రెండు రోజులుగా సభా కార్యకలాపాలు సజావుగా సాగుతున్నాయి. గత సమావేశాల్లో సస్పెండ్ అయిన 8 మంది ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రభుత్వం, స్పీకర్ అంగీకరించడం ఉభయ పక్షాల మధ్య ఒక అవగాహన ఏర్పడిందనడానికి సూచిక. అయినా పార్లమెంటులో ఎంత హంగామా సృష్టించినా, లేక ప్రభుత్వం ఎంత మొండి వైఖరితో వ్యవహరించినా పాలక, ప్రతిపక్షాలు తమ బలాబలాలు ప్రజల కోర్టులో తేల్చుకోవాల్సిందే కదా! ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తనంతవరకు, అది ఎన్నికల ఫలితాల్లో వ్యక్తం కానంతవరకూ పార్లమెంటును స్తంభింపచేయడం వల్ల ప్రయోజనముండదు. తనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటు రెండు రోజుల పాటు చర్చించి తిరస్కరించిన తర్వాత స్పీకర్ ఓం బిర్లా తన సీటులో మళ్లీ కూర్చుని ‘ఈ రెండు రోజులూ సభా సమయం వృథా అయింది..’ అని వ్యాఖ్యానించారు.
తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రతిపక్షాలు ఓటింగ్‌కు కూడా సిద్ధపడకపోవడం ఆశ్చర్యకరం. ఓం బిర్లాను సభలో ఉన్న 233 మంది ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకిస్తున్నారనే సందేశం వెళితే ఎంత బాగుండేది? బహుశా ప్రతిపక్షాలు సంఘటితంగా లేవనే అభిప్రాయం ప్రజల్లోకి వెళుతుందని విపక్షాల వారు భావించారేమో?! అవిశ్వాస తీర్మానంపై సమాజ్‌వాది పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సంతకం పెట్టకపోవడం గమనార్హం. అయినా ప్రతిపక్ష ధర్మాన్ని పాటించి వారూ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మాట్లాడారు. ఓం బిర్లాపై పెట్టిన అవిశ్వాసంపై చర్చ జరగాల్సి ఉండగా పశ్చిమాసియాపై చర్చించాలని పట్టుబట్టి సభను స్తంభింపచేయడం కూడా కాంగ్రెస్ తమ తీర్మానం విషయంలో సీరియస్‌గా లేదని, అందుకు కారణాలున్నాయని అర్థమవుతోంది. అయినా వారి వ్యతిరేకత మోదీపైనే కానీ బిర్లాపై కాదు కదా!
నిజానికి పార్లమెంటును వేదికగా ఉపయోగించుకుని ప్రతిపక్షాలు తాము చెప్పదలుచుకున్న విషయాన్ని అద్భుతంగా వివరించి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అవకాశాలున్నాయి. గతంలో హీరేన్ ముఖర్జీ, ఇంద్రజిత్ గుప్తా, పీలూమోడీ, అటల్ బిహారీ వాజపేయి, జార్జి ఫెర్నాండెజ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు తదితరులు ప్రతిపక్షంలో ఉండగా చేసిన అద్భుత ప్రసంగాలే వారిని జాతీయ స్థాయి నాయకులుగా నిలిపాయి. వారితో పోలిస్తే రాహుల్‌గాంధీ ఇంకా పార్లమెంట్‌లో గొప్ప వక్తగా రాణించలేదనే చెప్పాలి. కాంగ్రెస్‌లో మంచి వక్తలు లేరని చెప్పలేము కానీ రాహుల్‌గాంధీ సభా ప్రతిపక్ష నాయకుడు అయినందున రాజకీయాలన్నీ ఆయన చుట్టూనే తిరుగుతాయి. సభలో మాట్లాడి లేచి నిలబడిన రెండు క్షణాలకే నర్వాణే అనో, ఎప్‌స్టీన్ అనో మొదలు పెట్టి కల్లోలం సృష్టించడం తన శైలిగా ఆయన నిరూపించుకుంటున్నారు. అదే అంశాన్ని ఒక ఉధృత ప్రసంగ ప్రవాహంలో భాగంగా చెప్పి సభ్యుల దృష్టినే కాదు, దేశాన్ని మెప్పించగల అవకాశాన్ని ఆయన కోల్పోతున్నారేమో అనిపిస్తోంది. అదే ప్రియాంకాగాంధీ వాద్రా ఇప్పటి వరకూ మూడో, నాలుగో ప్రసంగాలే చేసినా అవి బహుళ చర్చనీయాంశాలయ్యాయి. ‘నెహ్రూపై అన్ని విమర్శల్నీ ఒకేసారి చేయండి.. వాటిపై చర్చిద్దాం’ అని ఆమె సవాలు విసిరిన తర్వాత పార్లమెంట్‌లో నెహ్రూపై అధికార పార్టీ విమర్శలు సద్దుమణిగాయి. ఓం బిర్లాపై పెట్టిన అవిశ్వాసంపై జరిగిన చర్చలో తృణమూల్ ఎంపీ, 33 ఏళ్ల సినీనటి సాయోనీ ఘోష్ అంత చక్కగా మాట్లాడి, బీజేపీ వైఖరిని ఎండగట్టగలరని ఎవరూ ఊహించలేదు.
భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదృష్టమేమంటే, ప్రతిపక్షాలు అటు ఎన్నికల రంగంలో దీటుగా నిలబడలేక పోవడంతో పాటు ఇటు పార్లమెంట్ వేదికను సరిగా ఉపయోగించుకోకపోవడమే. మోదీపై ధ్వజమెత్తేం దుకు ఎన్నో అంశాలు కనపడ్డా, కాంగ్రెస్ విమర్శనాస్త్రాలు జనాన్ని అంతగా చేరుకోవడంలేదు. విచిత్రమేమంటే, భారతీయ జనతా పార్టీ అంత బలంగా లేని రాష్ట్రాల్లో కూడా మోదీ అత్యంత బలవంతుడని వాదించే మేధావులు కనపడుతున్నారు. ఉదాహరణకు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ అంత బలంగా లేదు. అయినా ఈ ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు పదినిమిషాలు మాట్లాడుకుంటే చాలు ఆ మాటా మంతీలో మోదీ పేరు పదే పదే ప్రస్తావనకు వస్తోంది. మోదీ బలాన్ని ఆయన కంటే ఎక్కువగా ఊహించేవారు పెరిగిపోతున్నారు. ‘నన్ను విమర్శించినా నేరమే, విస్మరించినా నేరమే’ అని గతంలో జర్మనీకి చెందిన ఒక నాయకుడు అన్నారట! ఈ పరిస్థితే జమిలి ఎన్నికలవైపు మోదీ దృష్టి మళ్లించేందుకు కారణమవుతోంది.
దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటకలో 2023లో ఓడిపోయిన తర్వాత బీజేపీ ఇప్పటి వరకూ కోలుకోలేదు. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ సతమతమవుతోంది. రాజకీయాల్లో యడ్యూరప్ప 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. అయినా రాజకీయాల నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా లేనని ఆయన స్పష్టం చేస్తున్నారు. మోదీ అనంతరం ఎవరు అధినేత అవుతారో జాతీయ స్థాయిలో అయోమయం నెలకొన్నట్లే కర్ణాటకలో యడ్యూరప్ప అనంతరం ఎవరు నాయకత్వం వహిస్తారో చెప్పలేని పరిస్థితి ఉన్నది. వచ్చే ఎన్నికల నాటికి కర్ణాటకలో బీజేపీ బలోపేతం అవుతుందా లేదా అన్నది ఆ పార్టీ నేతలే చెప్పలేరు. తెలంగాణలో బీజేపీ మూడో స్థానం నుంచి పైకి ఎదగడానికి నానా కష్టాలు పడుతోందని అందరికీ తెలుసు. అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న కేరళలో బీజేపీ ఎంతశాతం ఓట్లు పెంచుకుంటుందో, కనీసం పది సీట్లు అయినా సాధిస్తుందో లేదో చెప్పడం సులభం కాదు. ఇక తమిళనాడులో బీజేపీ ఎంత అయోమయంలో ఉన్నదో ఆ పార్టీ విన్యాసాలే చెబుతున్నాయి. అన్నాడీఎంకేను విడగొట్టినా, అన్నామలైని ప్రోత్సహించినా బీజేపీ పుంజుకోలేదు. చివరకు మళ్లీ అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకుని ఆ పార్టీ ఇచ్చే సీట్లపై ఆధారపడడం, చివరకు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సినీనటుడు విజయ్‌ను ఉపముఖ్యమంత్రి చేస్తామని ప్రలోభపెట్టడం వంటి విన్యాసాలు బీజేపీ చేయక తప్పడం లేదు. ఉత్తరాది రాష్ట్రాలలో ఎంత విస్తరించినా దక్షిణాది ప్రజలు బీజేపీని ఇంకా అక్కున చేర్చుకోలేదు. అక్కున చేర్చుకుని, శాలువాలు కప్పుతోంది నేతలే కానీ ప్రజలు కాదు!
బీజేపీ జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న వ్యూహం స్థూలంగా హిందూ ఓట్లను సంఘటితం చేయడం, జాతీయవాదం పేరుతో రాజకీయాలు సాగించడం, మోదీని బలమైన నాయకుడుగా చిత్రించడం. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో హిందూత్వ రాజకీయాలు ఉత్తరాదిలోనూ, పశ్చిమ భారతంలోనూ ఉన్నంత బలంగా లేవు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నెలకొన్న పరిస్థితే ఈ రాష్ట్రాల్లోనూ ఉన్నది. జాతీయవాదం కంటే భిన్నంగా ఉప జాతీయవాదం ఈ రాష్ట్రాల్లో చాపకింద నీరులాగా ఉన్నదని చెప్పవచ్చు. అందువల్ల భారతీయ జనతా పార్టీ తరహా రాజకీయాలు ఈ రాష్ట్రాల్లో సఫలీకృతమయ్యేలా చేసుకోవడమే ఆ పార్టీకి, మోదీకి అగ్ని పరీక్ష. కాంగ్రెస్‌తో పోరాడినంత సులభంగా కాంగ్రెసేతర పార్టీలు, ప్రాంతీయ శక్తులతో తలపడడం సులభం కాదని బీజేపీకి తెలియనిది కాదు. అంతేకాదు, బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో ఏ అనామకుడిని ముఖ్యమంత్రిగా నిర్ణయించినా ఆ పార్టీ నేతలు, ప్రజలు భరించారు. ఆ పరిస్థితి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో లేదు. బీజేపీ అధ్యక్షుడుగా ఆడ్వాణీ ఉన్నప్పుడు మోదీతో సహా ప్రతి రాష్ట్రంలోనూ బలమైన నాయకత్వాలను సృష్టించారు. మోదీకి ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ, ప్రాంతీయ స్థాయిలోనూ పక్కన నిలబడి జనం హర్షధ్వానాలు అందుకునే నేతలు ఎవరూ లేరు. అదే ఆయన బలం, బలహీనత కూడా.
దక్షిణాది రాష్ట్రాల్లో ఓట్ల శాతం ఎంతో కొంత పెంచుకోవడం, మిత్రపక్షాలను నిలుపుకోవడం కంటే బీజేపీ చేయగలిగింది లేదు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీని గెలిపించుకోవడం మోదీకి ఒక సవాలే. మోదీ, అమిత్ షాలు ఈసారి మమతా బెనర్జీని ఓడించేందుకు సకల విధాల ప్రయత్నిస్తున్నారు. కేవలం హిందూత్వ రాజకీయాల వల్ల బెంగాల్‌లో విజయం సాధించలేమని వారికి తెలియనిది కాదు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ పేరుతో 60 లక్షల మందికి పైగా ఓటర్లను ఏరిపారేయడం, గవర్నర్‌ను మార్చి అజిత్ దోవల్ సన్నిహితుడైన ఐపీఎస్ అధికారి ఆర్ఎన్ రవిని బెంగాల్‌కు బదిలీ చేయడం, అధికారులను మార్చడం, ఈడీ దాడులు జరిపించడంతో పాటు హిందూ ఓట్లను సంఘటితం చేసేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కేంద్రం చేస్తోంది. ఎన్నికలను ప్రకటించేందుకు ఒక రోజు ముందు కోల్‌కతా పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ హిందువులు బెంగాల్‌లో మైనారిటీలు అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్‌లో క్రమంగా బీజేపీ బలం పెరుగుతోంది. కాని నరేంద్రమోదీ–అమిత్ షాలు 2016, 2021లో మమతా బెనర్జీని ఓడించలేకపోయారు. ఇప్పుడు మూడోసారి ఆమెతో ముఖాముఖి ఢీకొంటున్నారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా 2015, 2020లలో జరిగిన ఎన్నికల్లో ఓడించలేకపోయినా మూడోసారి 2025లో తిమ్మిని బమ్మిని చేసి విజయం సాధించిన మోదీ–అమిత్ షా ఈసారి బెంగాల్‌లో ఐరుండ భైరుండ చేసి విజయం సాధించగలరా? బెంగాల్‌ను ఢిల్లీతో పోల్చగలమా? ఏమైనా, ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు, త్వరలో జరగనున్న ఎన్నికలు మరో ఎత్తు. ఈ ఎన్నికలు మోదీ పన్నెండేళ్లుగా అవలంబిస్తున్న వ్యూహాలకు ఎదురవుతున్న అగ్నిపరీక్షగా చెప్పవచ్చు. అంతర్జాతీయ స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ ఎదురవుతున్న ప్రతికూలతలను, తన విధానాలపై తలెత్తుతున్న ప్రశ్నలను అడ్డుకుని, విపక్షాల వ్యూహాలను తిప్పికొడుతూ అరివీర భయంకరుడిలా మోదీ నిలబడగలుగుతారా?
ఎ. కృష్ణారావు
(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి..
ప్రతీకారమే.. మధ్యవర్తి దేశాలకు తేల్చిచెప్పిన మొజ్తాబా
ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన