Share News

భారత్‌ వ్యూహాత్మక స్వతంత్రత ఏమైనట్టు?!

ABN , Publish Date - Mar 25 , 2026 | 05:00 AM

పశ్చిమాసియాలో ప్రజ్వరిల్లుతోన్న యుద్ధం వల్ల, కరోనా సమయంలో తలెత్తిన సంక్షోభం లాంటిదే ఇప్పుడు దేశంలో నెలకొని ఉన్నదని, అందరూ కలిసికట్టుగా ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు....

భారత్‌ వ్యూహాత్మక స్వతంత్రత ఏమైనట్టు?!

పశ్చిమాసియాలో ప్రజ్వరిల్లుతోన్న యుద్ధం వల్ల, కరోనా సమయంలో తలెత్తిన సంక్షోభం లాంటిదే ఇప్పుడు దేశంలో నెలకొని ఉన్నదని, అందరూ కలిసికట్టుగా ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రకటించారు. ప్రస్తుతానికి గ్యాస్, చమురు కొరత లేదంటూనే, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని ఆయన అనడం గమనార్హం. భారత్‌కే కాదు ప్రపంచానికే ఇంధన సంక్షోభం తలెత్తిందని ఆయన ప్రకటించారు. నిజానికి వంట గ్యాస్ విషయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం ఇప్పటికే ప్రారంభమైందని ఆయనకు తెలియని విషయం కాదు. ఒక్కసారిగా దేశంలో ఇండక్షన్ స్టవ్‌లకు డిమాండ్ పెరగడంతో వాటి ధరలూ పెరిగాయి. ఆ స్టవ్‌లు కొనలేనివారు ఆకలితో పస్తులుండడమో, ఇతరులపై ఆధారపడడమో ఇప్పటికే ప్రారంభమైంది. ‘మీ ఇంట్లో సీఎన్‌జీ ఉంది కదా.. నాలుగు రొట్టెలు చేసుకుని వెళతాను..’ అని మా పనిమనిషి అడిగింది. బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ల అమ్మకం కూడా జరుగుతోంది. 5 కేజీల సిలిండర్లలో గ్యాస్ నింపి ఇచ్చే దుకాణాలు మూతపడ్డాయి. తమకు రావాల్సిన సిలిండర్ల కోసం డీలర్లతో వినియోగదారులు గొడవలు పడుతున్న దృష్టాంతాలు కూడా ఎన్నో. ఇక రోడ్డు ప్రక్కన దుకాణాల్లో టీ, ఆహార పదార్థాల ధరలు కూడా పెరిగిపోయాయి. చాలా పెట్రోలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ప్రజలు పుకార్లను నమ్మి పెట్రోలు బంకుల ముందు బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితి భవిష్యత్‌లో ఎలా ఉంటుందో తెలియదు కనుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజల ముందుకు వచ్చారు. కరోనా సమయంలో కొందరు ఆక్సిజన్‌ను బ్లాక్‌లో అమ్మిన అనుభవం ఉన్నందువల్ల.. బ్లాక్ మార్కెటింగ్‌ను సహించబోమని ఆయన హెచ్చరించారు. అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ సమస్యలను ప్రజలు విస్మరించబోరని కూడా మోదీకి తెలియనిది కాదు. భారతదేశం దాదాపు 60శాతం ఎల్‌పీజీ దిగుమతి చేసుకుంటోంది. అందులో 90శాతం హోర్ముజ్ జలసంధి ద్వారానే రావాలి. తాజా వార్తల ప్రకారం, ఇప్పటికి అతి కష్టమ్మీద నాలుగు నౌకల్ని రప్పించుకోగలిగాం. గల్ఫ్ నుంచి పెద్ద సంఖ్యలో భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్టు పార్లమెంట్‌లో మోదీ చెప్పారు. వారు చేసే చెల్లింపుల వల్ల ఇక్కడి కుటుంబాలకు చేకూరే ప్రయోజనాలు ఇప్పుడు ఆగిపోయాయి. ‘ప్రస్తుతానికి మీకు సమస్యలు ఏర్పడతాయని మాకు తెలుసు. కానీ దీర్ఘకాలంలో ప్రపంచంలో ఏ సమస్యా లేకుండా ఉండేందుకే ఈ యుద్ధం జరుగుతోంద’ని ఇటీవల ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజర్ ఢిల్లీలో చెప్పారు. ప్రపంచంలో అన్ని దేశాల తరఫున వకాల్తా పుచ్చుకుని యుద్ధం జరిపే అధికారం ఇజ్రాయెల్‌కు కానీ, ఆ దేశ గాడ్ ఫాదర్ అమెరికాకు కానీ ఎవరిచ్చారు?


నిజానికి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే పశ్చిమాసియా పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక ప్రకటన చేయాలంటూ ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్‌ చేశాయి. పార్లమెంట్‌లో ఈ అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. చర్చ జరపకుండా మోదీ పలాయనం చిత్తగించారని రాహుల్‌గాంధీ తీవ్ర ఆరోపణ చేశారు. చివరకు ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేసి పరిస్థితిని వివరించారు, కానీ పశ్చిమాసియా పరిస్థితిపై చర్చను ఇంతవరకు నిర్వహించలేదు. తాను ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్‌లతో మాట్లాడుతున్నానని, దౌత్యపరంగానే సమస్యను పరిష్కరించుకోవాలని స్పష్టం చేశానని మోదీ తన ప్రసంగంలో చెప్పారు. కానీ, గతంలో ట్రంప్ తాను భారత్‌– పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపానని చెప్పుకున్నట్లు ఇప్పుడు మోదీ చెప్పుకునే పరిస్థితిలో లేరు. అమెరికా, ఇజ్రాయెల్‌తో భారతదేశం మోదీ హయాంలో ఎంత గాఢానుబంధాన్ని పెనవేసుకున్నదంటే.. ఆ రెండు దేశాలను విమర్శించే పరిస్థితి లేకుండా పోయింది. ఇది రెంటికీ చెడ్డ రేవడిలా మారే ప్రమాదానికి దారితీస్తోంది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో చేసిన సుదీర్ఘ ప్రసంగంలో అమెరికా, ఇజ్రాయెల్ వైఖరిని మోదీ ఏ మాత్రం విమర్శించకపోవడమే ఇందుకు నిదర్శనం. విశాఖపట్టణం తీరస్థ జలాల్లో భారత్‌ నిర్వహించిన నౌకా విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళుతున్న ఇరాన్ నౌకను హిందూ మహాసముద్రంలో అమెరికా పేల్చివేసినా భారతదేశం ఖండించలేదు. అదే సమయంలో ఇరాన్‌తో ఉన్న చరిత్రాత్మక సంబంధాన్ని కూడా భారత్ తెంచుకోలేని పరిస్థితిలో ఉన్నది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో ఆయన ఇప్పటికి రెండుసార్లు మాట్లాడి, జరిగిన దాడులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఇంధన సరఫరాకు అడ్డంకులు లేకుండా చూడాలని అభ్యర్థించారు.

నిజానికి 2003లో ఇదే విధంగా రసాయన ఆయుధాలు ఉన్నాయన్న నెపంతో ఇరాక్‌పై అమెరికా దాడులు జరిపినప్పుడు, నాడు అధికారంలో ఉన్న అటల్ బిహారీ వాజపేయి ప్రభుత్వం తీవ్రంగా ఖండించడమే కాక పార్లమెంట్‌లో తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టింది. అధికార, ప్రతిపక్షాలు కలిసి ఏకగ్రీవంగా ఆ తీర్మానాన్ని ఆమోదించి అమెరికా వైఖరిని ఖండించేలా వాజపేయి చొరవ తీసుకున్నారు. స్పీకర్ మనోహర్‌ జోషి స్వయంగా ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతూ.. అమెరికా సంకీర్ణ దళాలు ఇరాక్‌పై చేసిన దాడులను తీవ్రంగా విమర్శించారు. ఇది చాలా అసాధారణమైన తీర్మానం అని ప్రకటించిన కాంగ్రెస్ నేత జైపాల్‌రెడ్డి అమెరికా ఎంత ప్రమాదకరంగా వ్యవహరిస్తోందో వివరించారు. అమెరికా విషపూరిత కుట్రల పర్యవసానాల పట్ల భారత్‌ అప్రమత్తంగా ఉండాలని కోరారు. బీజేపీ నేత విజయ్‌కుమార్ మల్హోత్రా, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత ఎర్రన్నాయుడు, సమాజ్‌వాది పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్, సీపీఐ(ఎం) నేత సోమనాథ ఛటర్జీతో పాటు అన్ని పార్టీల నేతలు అమెరికా దౌర్జన్యాన్ని ఖండించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ గొంతును ఎవరూ నొక్కలేరని, ఏ సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నాటి విదేశాంగ మంత్రి యశ్వంత్‌సిన్హా ప్రకటించారు.


వాజపేయి ప్రభుత్వ కాలం నాటికీ, మోదీ సర్కార్‌ హయాం నాటికీ వచ్చిన మార్పులు ఏమిటి? ఇప్పుడెందుకు బీజేపీ, దాని మిత్రపక్షాలు పశ్చిమాసియాలో సంభవిస్తోన్న పరిణామాలపై నిర్దిష్టంగా వ్యాఖ్యానించలేకపోతున్నాయి? వెనెజువెలా, ఇరాన్‌లపై దాడులను ఎందుకు విస్మరించాయి?

ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అమెరికాతో మన కంటే ఎక్కువగా అంటకాగిన పాకిస్థాన్ ఇప్పుడు ఇరాన్, అమెరికాల మధ్య సంధి కుదిర్చే విషయంలో కీలక పాత్ర పోషించడం. ఆదివారం పాక్‌ సైనిక దళాల ప్రధానాధికారి ఫీల్డ్‌ మార్షల్‌ మునీర్‌– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోను, పాక్‌ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సైతం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తోనూ మాట్లాడారని బ్రిటిష్ వార్తాపత్రిక ‘ఫైనాన్షియల్ టైమ్స్’ వెల్లడించింది. టర్కీ, ఈజిప్టులతో కలిసి యుద్ధాన్ని నిలిపివేసేందుకు పాకిస్థాన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని తెలిపింది. నిజానికి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఇస్లామిక్‌ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేయడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా ఖండించింది. అలాంటి పాకిస్థాన్‌ను శిక్షించాల్సింది పోయి, సంధి యత్నాలు చేసేందుకు అమెరికా ఎందుకు అనుమతిస్తోంది?

ప్రధాని మోదీ ఇప్పటికి 68 దేశాలను సందర్శించారు. అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్, రష్యాలతో పాటు అనేక దేశాల్లో పలుసార్లు పర్యటించారు. దీనివల్ల భారత్‌ పేరు ప్రతిష్ఠలు పెరగలేదని, ఆర్థిక ప్రయోజనాలు సమకూరలేదని చెప్పలేం. పెద్ద ఎత్తున రక్షణ, పారిశ్రామిక పెట్టుబడులు, టెక్నాలజీ బదిలీలు పెరిగాయి. చైనాతో సహా అనేక దేశాల నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించిన మోదీ అనేక దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమెరికాలో 9సార్లు, ఇజ్రాయెల్‌లో రెండుసార్లు పర్యటించిన ఏకైక భారత ప్రధాని మోదీ. అధికారంలో సుదీర్ఘకాలం అంటే 8,931 రోజులను ఇటీవల పూర్తిచేసుకున్న మోదీని ఎన్డీఏ నేతలందరూ ముక్తకంఠంతో అభినందించారు. భారతదేశ ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ప్రధానిగా హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. అయినప్పటికీ ఇందిరాగాంధీ, వాజపేయి, పీవీ హయాంలో అవలంబించిన విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న మోదీ హయాంలో భారత్ వ్యూహాత్మక స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయిందా, లేక తాత్కాలికంగా వెనుకడుగు వేయాల్సి వస్తోందా అన్న విషయాన్ని చర్చించాల్సి ఉన్నది.


ఏమైనా, ప్రస్తుత సంధి దశలో మోదీ ప్రభుత్వం ఉన్నట్టుండి మహిళా రిజర్వేషన్ బిల్లును, నియోజకవర్గాల పునర్విభజనను ఆగమేఘాలపై తెర ముందుకు తీసుకురావడం కూడా మరో ఆశ్చర్యకర పరిణామం. తొలుత అనుకున్న ప్రకారం.. తాజాగా జనాభా లెక్కలను పూర్తిచేసి, నియోజకవర్గాల సంఖ్యను పెంచడంతో పాటు మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాల్సి ఉన్నది. కానీ 2011 లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏమి వచ్చింది? ఈ బిల్లులు ఆమోదం పొందితే రాజకీయ పార్టీల, ప్రజల దృష్టి పూర్తిగా నియోజకవర్గాలపై, మహిళల సీట్లపై మళ్లడం ఖాయం. దానివల్ల మోదీ ప్రభుత్వానికి అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న విధంగా రాజకీయ ప్రయోజనం లభిస్తుందా అన్నది ఫలితాలు వస్తే కానీ చెప్పలేం.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి..

5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం.. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదు: ఇరాన్

Updated Date - Mar 25 , 2026 | 05:00 AM