Share News

మృగ్యమైన మావలంకర్‌ వారసత్వం

ABN , Publish Date - Feb 11 , 2026 | 01:35 AM

‘లోక్‌సభ తొలి స్పీకర్ జీవీ మావలంకర్, రెండవ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్, రాజ్యసభ తొలి చైర్మన్, ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పార్లమెంటరీ సంస్థల పనితీరుపై గొప్ప ప్రభావాన్ని...

మృగ్యమైన మావలంకర్‌ వారసత్వం

‘లోక్‌సభ తొలి స్పీకర్ జీవీ మావలంకర్, రెండవ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్, రాజ్యసభ తొలి చైర్మన్, ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పార్లమెంటరీ సంస్థల పనితీరుపై గొప్ప ప్రభావాన్ని చూపారు. నిబంధనలు, విధానాలు, సంప్రదాయాలు, పద్ధతులను రూపొందించడంలో వారు హుందాగా, నిష్పాక్షికంగా వ్యవహరించేవారు. రాజ్యసభలో జనసంఘ్ కు ప్రాతినిధ్యం ఉండకపోయినా నేను అతిథుల గ్యాలరీల నుంచి అక్కడి చర్చలను తిలకించేవాడిని. ప్రశ్నోత్తరాల సమయం, వాయిదా తీర్మానాలు, బిల్లులు, తీర్మానాలు, స్థాయీ సంఘాలు, సావధాన నోటీసులు, సభ్యుల హక్కులు మొదలైన వాటన్నింటి గురించి నేర్చుకునే అవకాశం నాకు వారి వల్లే లభించింది. ప్రతిపక్ష బెంచీల్లో కూర్చున్న హేమాహేమీలు కూడా అధికార పక్షం వైపు కూర్చున్న సభ్యులతో సమానంగా అనర్గళంగా మాట్లాడేవారు. ప్రతిపక్షాల హక్కులకు సంరక్షకుడుగా స్పీకర్ నిజాయితీతో వ్యవహరించేవారు. ఈ ఉత్తమ సంప్రదాయాల వల్లే భారత దేశ ప్రజాస్వామ్యం పరీక్షలకు తట్టుకుని నిలబడింది. అంతర్జాతీయంగా తన ప్రతిష్ఠను నిలబెట్టుకుంది’ – ఈ మాటలు ఎవరివో కాదు, భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్‌కృష్ణ ఆడ్వాణీవి. తన ఆత్మకథ ‘ నా దేశం నా జీవితం’ లో ఒకప్పటి పార్లమెంటరీ ప్రమాణాల గురించి ఆడ్వాణీ వివరంగా రాశారు.

ఏ ప్రమాణాలైనా వ్యక్తులు నిలబెడితేనే సుస్థిరంగా ఉంటాయి. వ్యక్తులు తమ ప్రయోజనాలకోసం ప్రమాణాలను పణంగా పెడితే ఉదాహరణగా చెప్పుకోవడానికి ఏ ప్రమాణాలూ నిలువవు. సమాజంలో దిగజారుతున్న విలువలు పార్లమెంటరీ చర్చలను ప్రభావితం చేస్తే మన ప్రజాస్వామ్య పతనం ఎలా ఉంటుందో చెప్పేందుకు నేడు చట్టసభలు సాగుతున్న తీరే నిదర్శనం. ‘మీరు మాకు మార్గనిర్దేశనం చేయండి, మేము దారి తప్పితే అవసరమైతే మాకు బుద్ధి చెప్పండి. మా ప్రవర్తనను సరిదిద్దండి’ అని తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ లోక్‌సభ తొలి స్పీకర్ గణేశ్ వాసుదేవ్ మావలంకర్ ను అభ్యర్థించారు. ఎప్పుడైనా తీవ్ర విభేదాలు నెలకొన్నప్పుడు ప్రధానమంత్రి, స్పీకర్, కార్యదర్శి కలసికట్టుగా సంప్రదించుకుని సమస్యను పరిష్కరించేవారు. ఒక రోజు సభలోనే మావలంకర్, నెహ్రూ మధ్య వాగ్వివాదం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకే రోజు రెండోసారి ప్రకటన చేయాలని నెహ్రూ సంకల్పించారు. అయితే అలా మాట్లాడడం నిబంధనల ప్రకారం కుదరదని మావలంకర్ స్పష్టం చేశారు. నెహ్రూ సరేనంటూ వెనక్కు తగ్గారు. ఆర్డినెన్స్ లను మావలంకర్‌ తీవ్రంగా వ్యతిరేకించేవారు. అరుదైన పరిస్థితుల్లో మినహా ఆర్డినెన్సులు జారీ చేయవద్దని స్పష్టంగా చెప్పేవారు. ఈ విషయమై ప్రధానికి లేఖ రాసేవారు. న్యాయపరమైన సందేహం వస్తే స్వయంగా అటార్నీ జనరల్ ను సంప్రదించేవారు. స్పీకర్ న్యాయమూర్తిగా వ్యవహరించాలని మావలంకర్‌ చెప్పేవారు. నెహ్రూ కూడా మావలంకర్ కు సమున్నత గౌరవం ఇచ్చేవారు. పార్లమెంటరీ కమిటీల్లో తమ నిర్ణయాలను శల్యపరీక్ష చేస్తున్నారని అధికారులు నెహ్రూకు ఫిర్యాదు చేసినప్పుడు దాని గురించి మాట్లాడడం తన పరిధిలో లేదని, స్పీకర్ నే సంప్రదించమని సలహా ఇచ్చేవారు. అనేక విషయాలకు సంబంధించి మావలంకర్ రూపొందించిన నియమ నిబంధనలే ఇప్పటికీ ఉన్నాయి. ‘ పాలక, ప్రతిపక్షాల మధ్య సరైన సమతుల్యత ఉండేలా చేస్తూ, సభను సమర్థంగా నిర్వహిస్తూ, ప్రజల ప్రయోజనాలను కాపాడిన సభాపతి జీవీ మావలంకర్ ’అని లోక్ సభ తొలి సెక్రటరీ జనరల్ ఎమ్‌ఎన్‌ కౌల్‌ అన్నారు. పార్లమెంటు ప్రభుత్వ అధికారాలకు లోబడి ఉండకూడదని స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించాలని నిర్ణయించిన మావలంకర్ గుజరాత్ నుంచి ఎన్నికైన సభ్యుడు కావడం గమనార్హం.


మావలంకర్ మరణం తర్వాత స్పీకర్ అయిన అనంతశయనం అయ్యంగార్ కూడా అదే దారిలో నడిచారు. తిరుపతి సమీపంలోని తిరుచానూర్ లో వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అయ్యంగార్ లోక్ సభను నిష్పాక్షికంగా నడిపించేవారు. ‘ఒక నియంత పాలనలో గానీ లేదా సంపూర్ణ రాచరిక పాలనలో గానీ పౌరుల జీవనానికి, స్వేచ్ఛకు ఎలాంటి రక్షణ ఉండదు. నియంత మంచివాడైతేనే ప్రజలు క్షేమంగా ఉంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థ లో పాలకులు తమ వర్గాలకే అనుకూలంగా వ్యవహరిస్తూ చట్ట సభలో తక్కువ సంఖ్యలో ఉన్న వారిని అణిచివేసే ప్రమాదం ఉంది. ఈ ధోరణులను కఠినంగా నియంత్రిస్తూ తక్కువ సంఖ్యలో ఉన్న సభ్యుల ప్రయోజనాలను కాపాడగలిగిన వ్యక్తి సభాధ్యక్షుడు (స్పీకర్) మాత్రమే’ అని అయ్యంగార్‌ ఒక సందర్భంలో స్పష్టం చేశారు. ఇంగ్లీషులో హిరేన్ ముఖర్జీ (సీపీఐ), హిందీలో అటల్ బిహారీ వాజపేయి( జనసంఘ్)ను మించిన వక్తలు లేరని ఆయన కొనియాడేవారు. సరైన సంఖ్యాబలం లేనందువల్ల ప్రతిపక్ష నాయకుడంటూ లేకపోయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులందరికీ అయ్యంగార్ ఎంతో గౌరవం ఇచ్చి వారు మాట్లాడేందుకు వీలు కల్పించేవారు. రెండవ లోక్ సభలో అధికార ప్రతిపక్ష సభ్యులందరూ ఏకగ్రీవంగా అయ్యంగారే మళ్లీ స్పీకర్ కావాలని ప్రతిపాదించారంటే ఆయన సంపాదించిన గౌరవం, నిలబెట్టిన ప్రమాణాలే కారణం. 1972లో తిరుపతి నుంచి ఒక దళిత క్రైస్తవ ఎమ్మెల్యేను నిలబెట్టినప్పుడు ఆయనను గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థన మేరకు అనంతశయనం అయ్యంగార్ రంగంలోకి దిగారు. ‘విశిష్టాద్వైతంలోనే లౌకిక వాదం జీర్ణించుకుపోయింది’ అంటూ ఆయన తనను ప్రశ్నించిన తన వర్గీయులకు జవాబు చెప్పి ఆ ఎమ్మెల్యేను గెలిపించారు.

అయ్యంగార్‌ తర్వాత స్పీకర్ అయిన సర్దార్ హుకం సింగ్ తొలి సారి నెహ్రూ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలను ఆమోదించారు. ప్రభుత్వం కంటే పార్లమెంట్ ఆధిక్యతే ఎక్కువ అని ప్రకటించారు. ఆయన తర్వాత స్పీకర్ అయిన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన రోజే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు అనుమతించారు.


నాల్గవ లోక్‌సభ అనంతరం పార్లమెంటరీ ప్రమాణాల పతనం ప్రారంభమయింది. ఎమర్జెన్సీలో పార్లమెంటరీ కార్యకలాపాలను కనీవినీ ఎరుగని రీతిలో సెన్సార్ చేసినప్పటికీ ఉభయ సభల అధ్యక్షులు మౌనం పాటించారు. రెండు సార్లు లోక్ సభ స్పీకర్ గా ఉన్న జీఎస్ ధిల్లాన్‌ను ఇందిరాగాంధీ రాజీనామా చేయించి అదే రోజు షిప్పింగ్ మంత్రిగా నియమించారు. చట్టసభలకు ప్రభుత్వాలు లోబడి ఉండే విధంగా ఆయన రూలింగ్ లు ఇవ్వడమే అందుకు కారణం కావచ్చు. ఒక ప్రాంతీయ పార్టీ నుంచి మొదటి సారి స్పీకర్ పదవిని అధిష్ఠించిన బాలయోగి స్పీకర్ పదవి తటస్థతను ఎంతగా కాపాడారంటే ఆయన హయాంలోనే వాజపేయి ప్రభుత్వం కేవలం ఒక్క ఓటుతో పడిపోవడమే అందుకు నిదర్శనం. ఆ తర్వాత స్పీకర్ పదవిని నిర్వహించిన మహిళా నేతలు మీరాకుమార్, సుమిత్రా మహాజన్ హయాంలలో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు తలెత్తేవి. తెలంగాణ ఆందోళన మూలంగా మీరాకుమార్ పని కత్తిమీద సాములా మారితే నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత అధికార పార్టీకి, ప్రతిపక్షాలకూ మధ్య తలెత్తిన ఘర్షణాత్మక వైఖరి సుమిత్రా మహాజన్ ను ఇబ్బందుల్లో పడవేసేది. అప్పటినుంచీ ఈ ఘర్షణ మరింత తీవ్రతరం కావడం, సుమిత్ర తర్వాత స్పీకర్ అయిన ఓం బిర్లా కూడా తరచు నిస్సహాయ పరిస్థితుల నెదుర్కోవలసి వస్తోంది. గత ఆరేళ్లలో మన పార్లమెంటరీ వ్యవస్థ ప్రమాణాలు బాగా దిగజారిపోతూ వస్తోన్నాయి.

తాజాగా కాంగ్రెస్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనీయనందుకు ప్రతిపక్షాలు ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఇది మన ప్రజాస్వామ్య దుస్థితికి పరాకాష్ఠ. సైనిక దళాల మాజీ ప్రధానాధికారి మనోజ్‌ ముకుంద్‌ నరవణే తన ఆత్మ కథ ‘Four Stars of Destiny’ లో గల్వాన్‌ ఘర్షణల గురించి రాసిన విషయాలపై చర్చించడానికి అనుమతించి ఉంటే, అందుకు ప్రభుత్వం సమాధానమిచ్చి ఉంటే ఏమి జరిగేది? ప్రజలకు వాస్తవాలను బేరీజు వేసుకునేందుకు అవకాశం లభించేది. అలా కాకుండా అడ్డుకున్నందుకు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను స్తంభింపచేశాయి. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్‌పై పూర్తి స్థాయి చర్చ జరగకుండానే, లోక్‌సభలో ప్రధానమంత్రి మాట్లాడకుండానే పార్లమెంట్ సమావేశాలు నీరు కారిపోయే పరిస్థితి ఏర్పడింది. పైగా మోదీపై మహిళా ఎంపీలు దాడి చేయబోతున్నారని తనకు తెలిసిందని స్పీకర్ స్వయంగా చెప్పడం ఒక విచిత్ర పరిణామం. నిజానికి ఈ మొత్తం పరిస్థితికి ప్రభుత్వ, ప్రతిపక్షాలు పట్టువిడుపులతో వ్యవహరించకపోవడం, పార్లమెంట్‌ను తమ రాజకీయ క్రీడకు ఉపయోగించుకోవడమే కారణం. అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఒకరికి మరొకరిపై పూర్తిగా గౌరవం లోపించిన ఈ పరిస్థితుల్లో స్పీకర్ నిష్పాక్షికంగా ఉంటారని, రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారని ఎవరూ అనుకోరు. తద్వారా స్పీకర్ కూడా గౌరవం కోల్పోవడం స్పష్టంగా కనిపిస్తోంది.


‘స్పీకర్ మొత్తం సభకు ప్రాతినిధ్యం వహిస్తారు. సభ గౌరవాన్నీ, స్వేచ్ఛనూ ప్రతిఫలించేది స్పీకరే. సభ అంటే దేశం కనుక స్పీకర్ దేశంలో స్వేచ్ఛకు చిహ్నంగా ఉంటారు. కనుక ఆ పదవి గౌరవప్రదమైనది. ఈ స్థానంలో అత్యుత్తమ సామర్థ్యం, నిష్పాక్షికత గల వ్యక్తులు బాధ్యతలు నిర్వర్తించాలి’ అని నెహ్రూ అన్నారు. కానీ అప్పటి రోజులకూ, ఇప్పటి రోజులకూ పోల్చడం సాధ్యం కాదు. నాడు అధికారంలో ఉన్న వారు స్వయంగా ప్రమాణాలను నిర్దేశించి భావితరాలకు ఆదర్శంగా ఉండాలని భావించేవారు. వికసిత్ భారత్ కోసం దేశం తహతహలాడుతున్న ఈ సమయంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రమాణాలను కూడా ఫలానా తేదీ లోపు కాపాడాలనే విషయమై నేతలు తమలో తాము చర్చించుకోవడం అవసరం.

ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి..

సవరణతో తిరిగి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షాలు

బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి ఆదిత్యనాథ్

Updated Date - Feb 11 , 2026 | 01:35 AM