సంక్షేమానికి నిజంగానే ఎక్కువ ఖర్చు చేస్తున్నామా?
ABN , Publish Date - Aug 27 , 2026 | 05:06 AM
ఒకే దేశం, ఒకే జనాభా. కానీ ఏ కొలబద్దతో చూస్తామన్నదాన్ని బట్టి దేశంలో ‘పేదలు’ 5.3శాతమూ కావచ్చు, 82.1శాతమూ కావచ్చు. ఈ వైరుధ్యం సంక్షేమం అవసరంపై చర్చను మరోసారి ముందుకు తెస్తోంది. ముఖ్యంగా...
ఒకే దేశం, ఒకే జనాభా. కానీ ఏ కొలబద్దతో చూస్తామన్నదాన్ని బట్టి దేశంలో ‘పేదలు’ 5.3శాతమూ కావచ్చు, 82.1శాతమూ కావచ్చు. ఈ వైరుధ్యం సంక్షేమం అవసరంపై చర్చను మరోసారి ముందుకు తెస్తోంది. ముఖ్యంగా, జాతీయ ఆహార భద్రతా చట్టానికి కేంద్ర ప్రభుత్వం 2026 జూన్‌లో ముసా యిదా సవరణ బిల్లును విడుదల చేసిన నేపథ్యంలో ఈ ప్రశ్న మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సవరణలు మంచివా కావా అనే విషయాన్ని పక్కన పెడితే, ఈ చర్చలో తరచూ వినిపిస్తున్న ప్రశ్న ఒకటుంది: ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదుగుతున్నవేళ, దాదాపు 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వడం ఇంకా అవసరమా?’
ఈ ప్రశ్నకు ప్రధానంగా రెండు రకాల స్పందనలు వినిపిస్తాయి: ఇంత భారీ స్థాయిలో ఉచిత రేషన్ ఇవ్వడం ప్రజలను స్వయం సమృద్ధి వైపు నడిపించకుండా సంక్షేమంపై ఆధారపడేలా చేస్తోందనేది ఒక వాదన. మరోవైపు, దేశం నిజంగా అంతగా అభివృద్ధి చెందితే ఇన్ని కోట్ల మందికి ఉచిత ఆహారం ఎందుకు అవసరమవుతోందని ప్రశ్నిస్తూ, ఆర్థికవృద్ధి కథనాన్నే అనుమానించేది మరో వాదన. కానీ ఈ రెండు వాదనలూ ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నాయి: తీవ్రమైన పేదరికం నుంచి బయటపడటం, ఆర్థిక భద్రత సాధించడం ఒకటే కాదు. అందువల్ల ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ, పేదరికం తగ్గుతున్నప్పటికీ సంక్షేమం అవసరం తప్పనిసరిగా తగ్గిపోదు.
గత రెండు దశాబ్దాల్లో భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పెరిగిందన్నది వాస్తవం. అదే సమయంలో పేదరికం కూడా భారీగా తగ్గింది. ప్రపంచ బ్యాంకు 2025 జూన్‌లో విడుదల చేసిన అంచనాల ప్రకారం, రోజుకు 3 డాలర్ల పేదరిక రేఖను ప్రమాణంగా తీసుకుంటే, 2011–12లో 27.1శాతంగా ఉన్న ‘తీవ్రమైన పేదరికం’ 2022–23 నాటికి 5.3శాతానికి తగ్గింది. కానీ కథ అక్కడితో పూర్తికాదు. పేదరికం తగ్గడం వేరు, ఆర్థిక భద్రత వేరు.
పేదరికాన్ని కొలిచేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఒకే ప్రమాణాన్ని ప్రపంచ బ్యాంకు ఉపయోగించదు. దిగువ–మధ్య ఆదాయ దేశాలకు పేదరిక ప్రమాణంగా నిర్ణయించిన ‘రోజుకు 4.20డాలర్ల’ లెక్కనే తీసుకుంటే, 2022–23లో భారత జనాభాలో 23.9శాతం మంది ఆ రేఖకు దిగువన ఉన్నారు. ఎగువ–మధ్య ఆదాయ దేశాలకు ఉపయోగించే 8.30 డాలర్ల ప్రమాణాన్ని తీసుకుంటే ఈ సంఖ్య ఏకంగా 82.1శాతానికి చేరుతుంది.
పేదరికానికి సంబంధించి 5.3శాతం, 23.9శాతం, 82.1శాతం అనే మూడు సంఖ్యలు ఒక కీలక వాస్తవాన్ని బయటపెడతాయి: ఏ ప్రమాణంతో కొలుస్తామన్నదాన్ని బట్టి ‘పేద’ అనే నిర్వచనం, ఆ పరిధిలోకి వచ్చే జనాభా – రెండూ పూర్తిగా మారిపోతాయి. తీవ్ర పేదరిక రేఖను దాటినంత మాత్రాన కోట్లాది మంది ఆర్థిక అభద్రత నుంచి బయటపడినట్లు కాదు.
ప్రముఖ రాజకీయ ఆర్థికవేత్త, భారతీయ వ్యవహారాలపై నిపుణుడు ప్రొఫెసర్ డియెగో మయోరానో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తారు. తీవ్ర పేదరికం నుంచి బయటపడినప్పటికీ, భారత జనాభాలో పెద్ద భాగం పేదరికానికి కొద్దిగా ఎగువన మాత్రమే జీవిస్తోందని; అనారోగ్యం, పంట నష్టం లేదా ఆదాయంలో అకస్మాత్తుగా వచ్చే దెబ్బలు వారిని మళ్లీ పేదరికంలోకి నెట్టగలవని ఆయన ఒక పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు.
ఒక కుటుంబం అధికారికంగా దారిద్ర్య రేఖకు పైన ఉండవచ్చు. ఇంట్లో మోటార్ సైకిల్, స్మార్ట్ ఫోన్ ఉండవచ్చు. పిల్లలను ప్రైవేట్ పాఠశాలకు పంపుతుండవచ్చు. బయటకు చూస్తే అది మధ్యతరగతి కుటుంబంలా కనిపించవచ్చు. కానీ ఆ కుటుంబంలో తీవ్రమైన అనారోగ్యం, ఉద్యోగం పోవటం లేదా పంట నష్టం సంభవిస్తే? ఒక్క సంఘటనే చిన్న పొదుపును తుడిచిపెట్టి, అప్పుల్లోకి నెట్టి, ఉన్న కొద్దిపాటి ఆస్తులు అమ్ముకునేలా చేసి, ఆ కుటుంబాన్ని మళ్లీ పేదరికంలోకి తోసేయవచ్చు. అందుకే పేదరికం తగ్గడం వేరు; ఆర్థిక భద్రత సాధించడం వేరు.
ఈ ఆర్థిక అస్థిరత ఎంతమాత్రం ఊహాజనితం కాదు. ‘ఇండియా హ్యూమన్ డెవలప్‌మెంట్ సర్వే’ డేటాను ప్రపంచ బ్యాంకు విశ్లేషిస్తే ఒక విషయం స్పష్టమైంది– 2005 నుంచి 2012 మధ్య 27శాతం కుటుంబాలు పేదరికం నుంచి బయటపడగా, 7శాతం కుటుంబాలు తిరిగి పేదరికంలోకి జారిపోయాయి. ఈ కోణంలోనే 80 కోట్ల ఉచిత రేషన్ లబ్ధిదారుల సంఖ్యను కూడా చూడాలి. నిజానికి ఇది ప్రస్తుత పేదరికానికి సంబంధించిన ప్రత్యక్ష అంచనా కాదు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం గ్రామీణ జనాభాలో 75శాతం, పట్టణ జనాభాలో 50శాతం వరకు కవరేజ్ కల్పించాలన్న నిబంధనను బట్టి, 2011 జనాభా లెక్కల ఆధారంగా ఉచిత రేషన్ లబ్ధిదారుల సంఖ్య దాదాపు 81కోట్లుగా ఉంది. కాబట్టి వీరందరినీ అత్యంత పేదలుగా చూడటం కంటే, వారిలో ఎంతమంది ఆహార భద్రత వంటి రక్షణలు లేకుండా ఒక అనారోగ్యం, ఉద్యోగ నష్టం లేదా ఆదాయపు దెబ్బను తట్టుకోగలరన్నదే అడగాల్సిన అసలు ప్రశ్న.
ఇన్ని సంవత్సరాలుగా సంక్షేమ పథకాలు అమలవుతున్నప్పటికీ ఈ అభద్రత ఇంకా ఉంటే సంక్షేమం విఫలమైందనుకోవాలా? అలా తేల్చడం తొందరపాటు. సంక్షేమం ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా భద్రమైన స్థితికి తీసుకెళ్లే ఏకైక సాధనం కాదు. ఆహార భద్రత, ఉపాధి హామీ, పింఛన్లు వంటి పథకాలు ఆర్థిక దెబ్బ వచ్చినప్పుడు కుటుంబం పూర్తిగా కిందపడిపోకుండా కనీస రక్షణను కల్పిస్తాయి. మనం గమనించాల్సింది– ఇవి లేకపోతే ఆ కుటుంబాలు ఎంత త్వరగా అప్పుల్లోకి, ఆకలిలోకి జారిపోతాయన్నది. అందువల్ల ఒక సంక్షేమ పథకం విజయాన్ని ‘లబ్ధిదారుడు ఇంకా ఆర్థిక అభద్రతలోనే ఉన్నాడా?’ అనే ఒక్క ప్రశ్నతో కొలవలేం. ‘ఆ పథకం లేకపోతే వారి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉండేది?’ అన్న ప్రశ్న కూడా అడగాలి.
దీర్ఘకాలిక ఆర్థిక భద్రతకు స్థిరమైన ఉపాధి, తగిన ఆదాయం, అందుబాటులో వైద్యం, విద్య వంటి అంశాలు అవసరమే. సంక్షేమం వాటికి పూర్తి స్థాయి ప్రత్యామ్నాయం కాదు. కానీ ఆ స్థాయి భద్రత అందరికీ అందేంతవరకు, సామాజిక రక్షణ ఒక కీలకమైన ఆధారంగా ఉంటుంది.
మరి సంక్షేమంపై మనం నిజంగానే అధికంగా ఖర్చు చేస్తున్నామా? సంక్షేమ పథకాల పరిధి విస్తృతంగా ఉండటం వల్ల, దేశ సంపదలో అసాధారణంగా పెద్ద భాగాన్ని వాటికే ఖర్చు చేస్తున్నామనే అభిప్రాయం ఉంది. అయితే ఆర్థికవేత్త రీతికా ఖేరా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పది ప్రధాన సంక్షేమ పథకాలపై గత రెండు దశాబ్దాల వ్యయాన్ని పరిశీలించారు. వారి లెక్కల ప్రకారం, ఒక్క కోవిడ్ సంవత్సరంలో మాత్రమే ఈ పథకాల మొత్తం వ్యయం జీడీపీలో 3శాతాన్ని దాటింది. 2023–24లో జీడీపీలో వీటి వాటా దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఉన్న స్థాయికి పెద్దగా భిన్నంగా లేదు. ఈ పరిశీలన కొన్ని ప్రధాన పథకాలకే పరిమితమైనప్పటికీ ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది: విస్తృత కవరేజ్ ఉన్నంత మాత్రాన మనం నిజంగా అధికంగా ఖర్చు చేస్తున్నట్లా?
కోట్ల మందికి ఒక పథకం చేరుతున్నప్పటికీ, ఒక్కో కుటుంబానికి అందుతున్న సహాయం వారి వాస్తవ అవసరాలతో పోలిస్తే పరిమితంగానే ఉండవచ్చు. అందువల్ల కేవలం లబ్ధిదారుల సంఖ్యను మాత్రమే చూపిస్తూ సంక్షేమ వ్యయం తీవ్రభారంగా మారిందని తేల్చడం సరికాదు. దేశ ఆర్థిక సామర్థ్యంతో పోలిస్తే ఎంత ఖర్చు చేస్తున్నాం, ఆ ఖర్చు కుటుంబాలకు ఎంతవరకు ఆర్థిక రక్షణ కల్పిస్తోంది అన్నవే అసలైన ప్రశ్నలు.
చిన్న ఆర్థిక దెబ్బలకే కుటుంబాలు మళ్లీ పేదరికంలోకి జారే ప్రమాదం ఉన్నప్పుడు సంక్షేమాన్ని తగ్గించడం సరికాదు. కేవలం రేషన్ పంపిణీకే పరిమితం కాకుండా నాణ్యమైన ఉచిత వైద్యం, విస్తృత సామాజిక భద్రత వంటి వ్యవస్థలను అందించాలి. లబ్ధిదారుల సంఖ్య కంటే రక్షణ నాణ్యతను పెంచడమే ముఖ్యం. అందుకే సంక్షేమంపై చర్చ కేవలం సంఖ్యల చుట్టూ మాత్రమే తిరగకూడదు. ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ, పెరుగుతున్న ఆ సంపదలో కొంత భాగాన్ని పౌరుల ఆర్థిక భద్రత కోసం కేటాయించడం సహజమైన తదుపరి అడుగు కావాలి.
బహుశా అసలు ప్రశ్న ‘ఇంకా సంక్షేమం ఎందుకు?’ అన్నది కాదు. ఆర్థికంగా బలపడుతున్న భారత్, పెరుగుతున్న సంపదను తన పౌరుల ఆర్థిక భద్రతగా ఎంతవరకు మార్చగలుగుతోంది అన్నదే అసలు ప్రశ్న.
చక్రధర్ బుద్ధ
సీనియర్ పరిశోధకులు, లిబ్టెక్ ఇండియా
ఈ వార్తలనూ చదవండి:
ఆకస్మిక వరదలు అందుకే.. నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి
నేపాల్ ఎంబసీ కీలక ప్రకటన.. దిగువ ప్రాంతాలకు అలర్ట్..