ప్రపంచం తల్లడిల్లుతున్నా నిబ్బరంగా భారత్!
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:13 AM
ప్రపంచమంతా అలజడితో అట్టుడుకుతున్నప్పుడు, ఒక దేశం ప్రశాంతంగా ఉందంటే... ఆ దేశ పగ్గాలు ఒక స్థితప్రజ్ఞుడి చేతిలో ఉన్నాయని అర్థం. ప్రస్తుతం నరేంద్ర మోదీ నాయకత్వంలో...
ప్రపంచమంతా అలజడితో అట్టుడుకుతున్నప్పుడు, ఒక దేశం ప్రశాంతంగా ఉందంటే... ఆ దేశ పగ్గాలు ఒక స్థితప్రజ్ఞుడి చేతిలో ఉన్నాయని అర్థం. ప్రస్తుతం నరేంద్ర మోదీ నాయకత్వంలో బారత్ ఇలాంటి నాయకత్వాన్ని చూస్తోంది.
అగ్రరాజ్యం అమెరికా–ఇజ్రాయెల్ కూటమికీ, ఇరాన్‌కూ మధ్య రేగిన యుద్ధజ్వాలలు కేవలం ఆ దేశాలకే పరిమితం కాలేదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెన్నెముకను దెబ్బతీస్తున్నాయి. ప్రపంచానికి అవసరమైన ఇంధనంలో సింహభాగాన్ని సరఫరా చేసే గల్ఫ్ దేశాలు నేడు యుద్ధ క్షేత్రాలుగా మారడంతో చమురు సరఫరా వ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. ఈ సంక్షోభం వల్ల అగ్రరాజ్యం అమెరికా నుంచి మన పొరుగున ఉన్న శ్రీలంక వరకు అన్నీ అతలాకుతలం అవుతున్నాయి. కానీ, ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 140 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం ఎంతో నిబ్బరంగా, సురక్షితంగా ఉంది. దానికి కారణం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ ముందుచూపు, ధైర్యవంతమైన నిర్ణయాలే.
యుద్ధం కారణంగా నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. స్వయంగా అమెరికాలోనే పెట్రోల్, డీజిల్ ధరలు 25 శాతానికి పైగా పెరిగాయి. యూరప్ దేశాల పరిస్థితి వర్ణనాతీతం. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇప్పుడీ గల్ఫ్ సంక్షోభం యూరప్‌ను ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసింది. అక్కడ పరిశ్రమలు మూతపడుతున్నాయి, గృహ వినియోగానికి గ్యాస్ దొరకని పరిస్థితి నెలకొంది. మన పొరుగు దేశాల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. పాకిస్థాన్ ఇప్పటికే దివాలా అంచున నిలబడింది. విదేశీ మారకద్రవ్యం లేక చమురు నౌకలను రేవుల్లోకి రప్పించుకోలేని దైన్యం ఆ దేశానిది. ఇక శ్రీలంక, నేపాల్ తదితర దేశాల్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి అల్లర్లు చేసే స్థితికి చేరుకున్నారు. ఇంతటి భయానక వాతావరణంలో భారత్‌లో మాత్రం పెట్రోల్ బంకుల వద్ద క్యూలు లేవు, గ్యాస్ సిలిండర్ల కోసం కొట్లాటలు లేవు. యుద్ధం మొదలైన తొలి రోజుల్లో సహజంగానే ప్రజల్లో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయనీ, ఎవరూ ఆందోళన చెందవద్దనీ భరోసా కల్పించడంలో మోదీ ప్రభుత్వం విజయవంతమైంది.
అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు టన్నుకు 800 డాలర్ల మార్కును దాటినప్పటికీ, భారత ప్రభుత్వం దేశీయ వినియోగదారులపై ఆ భారం పడకుండా ఉక్కు కవచంలా నిలిచింది. దేశంలో సుమారు 32కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో 90శాతానికి పైగా ఉన్న గృహ వినియోగదారులకు నిరంతర సరఫరా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం కమర్షియల్ వినియోగంపై వ్యూహాత్మక ఆంక్షలు విధించింది. వాణిజ్య అవసరాల కంటే సామాన్యుడి వంటగదికే మొట్టమొదటి ప్రాధాన్యమిస్తూ, గృహ అవసరాలకు సరిపడా నిల్వలను కేటాయించిన తర్వాతే మిగిలిన మొత్తాన్ని ఇతర రంగాలకు మళ్లిస్తోంది.
ప్రపంచ ముడి చమురు రవాణాలో 20 నుంచి 30శాతం వాటా కలిగి, రోజుకు సుమారు 2.1 కోట్ల బ్యారెళ్ల చమురు ప్రవహించే హోర్ముజ్ జలసంధి మార్గంలో అనేక దేశాల నౌకలు దాడుల భయంతో నిలిచిపోయాయి. అయినప్పటికీ, అక్కడి నుంచి భారత ఎల్పీజీ, చమురు నౌకలు సురక్షితంగా మన తీరానికి చేరుకుంటున్నాయంటే అది ప్రధాని మోదీ సాధించిన అద్భుత దౌత్య విజయం. అటు ఇజ్రాయెల్, అమెరికా నేతలతోనూ, ఇటు ఇరాన్, అరబ్ దేశాల అధినేతలతోనూ ఆయనకు ఉన్న వ్యక్తిగత పరపతి కారణంగా భారత నౌకలకు ‘సేఫ్ పాసేజ్’ లభిస్తోంది. ఇది కేవలం రవాణా విజయం మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై భారత్ సంపాదించుకున్న గౌరవానికి నిదర్శనం.
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిశగా దూసుకుపోతున్న తరుణంలో, భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకోవడానికి అత్యంత తెలివైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. గల్ఫ్ దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే, రష్యా నుంచి తక్కువ ధరకు చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా అదుపులో ఉంచడానికి సహకరించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలపై పడే ఆర్థిక భారాన్ని ప్రజలపైకి నెట్టకుండా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి సామాన్యుడికి రక్షణ కల్పిస్తోంది. సంక్షోభ సమయంలో రాజకీయ లబ్ధి కోసం ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టే సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా, కష్టకాలంలో దేశానికి వెన్నుదన్నుగా నిలబడి, ఒక పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో మోదీ నాయకత్వం సఫలీకృతమైంది.
ప్రస్తుతం దేశంలో ఇంధన నిల్వలు నిండుగా ఉన్నాయని, సామాన్యుడికి గ్యాస్ సరఫరాలో లోటు లేదని ప్రభుత్వం గణాంకాలతో సహా భరోసా ఇస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు మాత్రం లేని గందరగోళాన్ని సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయి. వాస్తవాలను వక్రీకరిస్తూ, గ్యాస్ సిలిండర్లతో వీధుల్లోకి వచ్చి నిరసనలు చేయడం వెనుక ఉద్దేశం ధరల తగ్గింపు కాదు, కేవలం ప్రజల్లో ఆందోళనను నింపడమే. పొరుగు దేశాలైన పాకిస్థాన్, శ్రీలంకల్లో ప్రజలు పడుతున్న నరకయాతనను చూసి కూడా బుద్ధి తెచ్చుకోకుండా, భారత్ ఎదుగుదలను అడ్డుకోవాలని చూడటం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. సంక్షోభ సమయంలో వ్యవస్థలను కుప్పకూల్చాలని చూసే ఇటువంటి శక్తులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు; దేశం గెలిస్తేనే తాము గెలుస్తామన్న కనీస స్పృహ లేని ఈ పార్టీలకు కాలమే సమాధానం చెబుతుంది.
ఈ పరిస్థితుల్లో విభేదాలను పక్కన పెట్టి, ‘భారతదేశం’ అనే ఒకే గుర్తింపుతో ముందుకు సాగడమే తక్షణ కర్తవ్యం. రాబోయే పరిణామాలను ఎదుర్కొనేలా ప్రజల్ని మానసికగా, సామాజికంగా సంసిద్ధం చేయడంలో రాజకీయ పక్షాల పాత్ర కీలకం. అనవసరమైన భయాందోళనలు సృష్టించకుండా, పొదుపుగా వనరులను వాడుకోవాలని, ప్రభుత్వ సూచనలను పాటించాలని ప్రజల్లో అవగాహన కల్పించాలి. పొరుగు దేశాల్లో నెలకొన్న అరాచక పరిస్థితులు మన దేశంలో తలెత్తకుండా ఉండాలంటే, అది కేవలం ప్రభుత్వం వల్లనే సాధ్యం కాదు; ప్రతి పౌరుడూ, ప్రతి నాయకుడూ బాధ్యతగా వ్యవహరించాలి. సంక్షోభం ఎంత పెద్దదైనా, బలమైన నాయకత్వం వెనుక జాతి మొత్తం ఐక్యంగా నిలబడితే, ఈ గండం నుంచి భారత్ మరింత శక్తిమంతంగా బయటపడుతుంది.
యస్. విష్ణువరన్‌రెడ్డి
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు
ఇవి కూడా చదవండి..
5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదు: ఇరాన్