మరోసారి బ్యాంకుల కుదింపు తప్పదా?
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:57 AM
దేశంలో పలువురు వ్యాపారవేత్తలు ఆరంభించిన ప్రైవేట్ బ్యాంకులు రెండు దశలుగా జాతీయం అయ్యాయి. అలా తమ ఆధీనంలోకి వచ్చిన 28 బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం దశలవారీగా కుదిస్తూ వస్తోంది. 2008–2017 మధ్య...
దేశంలో పలువురు వ్యాపారవేత్తలు ఆరంభించిన ప్రైవేట్ బ్యాంకులు రెండు దశలుగా జాతీయం అయ్యాయి. అలా తమ ఆధీనంలోకి వచ్చిన 28 బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం దశలవారీగా కుదిస్తూ వస్తోంది. 2008–2017 మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాని 7 అనుబంధ బ్యాంకులు విలీనమయ్యాయి. 2018లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ కలిసిపోయాయి. 2020లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో రెండు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు, కెనరా బ్యాంకులో ఒకటి, ఇండియన్ బ్యాంకులో ఒకటి చేర్చడంతో ఉన్న 28 బ్యాంకులు కూడా 12 అయ్యాయి. వందేళ్లకు పైగా ఉనికిలో ఉన్న బ్యాంకులు కూడా ఈ విలీన ప్రక్రియలో నామరూపాలు కోల్పోయాయి. ఆంధ్రా బ్యాంక్‌తో తెలుగువారికి ఓ ప్రాంతీయ అనుబంధం ఉండేది. యూనియన్ బ్యాంకులో ఆంధ్రా బ్యాంకును కలుపుతున్నప్పుడు తెలుగువారు బాధపడిపోయారు.
ఈ కుదింపుల వల్ల ప్రధానంగా కేంద్ర ఆర్థిక శాఖపై నిర్వహణ భారం తగ్గుతుంది. ఒక ప్రాంతంలోని రెండు భిన్న బ్యాంకుల శాఖలు ఒక్కటైనపుడు సిబ్బంది, కిరాయి, రకరకాల బిల్లుల ఖర్చు సగానికి తగ్గిపోతుంది. దగ్గరలోని బ్యాంక్ మూసివేత జరిగినపుడు ఆ ప్రాంతంలోని ఖాతాదారులకు కొంత అసౌకర్యం కలిగే మాట నిజమే. అయితే బ్యాంకింగ్ సేవలన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చినందువల్ల బ్రాంచ్ దూరమైన బాధ కొంత తీరవచ్చు. ఇదివరలో ఉన్నట్లు సర్వీస్ ఏరియా అప్రోచ్ విధానాన్ని ఎత్తివేయడం వల్ల ఏ బ్యాంకయినా ఏ ప్రాంతంలోనైనా అప్పులు ఇవ్వొచ్చు.
భారీ లోన్ ప్రపోజల్స్ స్క్రూటినీ, శాంక్షన్ మొదలైన పనులు లోన్ హబ్‌లు చేస్తున్నందువల్ల శాఖలో పూర్తిస్థాయి అప్పుల విభాగం ఉండవలసిన అవసరం తగ్గింది. ప్రతి బ్యాంకూ పదేసి శాఖలకు ఒక లోన్ హబ్‌ను విడిగా ఏర్పాటు చేసుకొని సిబ్బంది, నిర్వహణ భారాన్ని తగ్గించుకుంటోంది. అవుట్ సోర్సింగ్ నుంచి లోన్ రికవరీ ఏజెంట్లను ఉపయోగించుకొనే విధానానికి ఆర్బీఐ అనుమతి ఉన్నందువల్ల కమిషన్‌పై మొండి బకాయిలను వసూలు చేసుకునే ప్రైవేట్ సైన్యాన్ని బ్యాంకులు వాడుకుంటున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డులు వచ్చాక ఒక్కొక్కరికీ నాలుగు బ్యాంకుల్లో ఖాతాలు అవసరమయ్యాయి. లాభదాయకతను బట్టి కస్టమర్లు క్షణాల్లో బ్యాంకులను మార్చేస్తున్నారు. ఒకప్పుడు డిపాజిట్లు, రుణాలపై ఆర్బీఐ వడ్డీ రేట్లను నిర్ణయించేది. ఇప్పుడంతా బ్యాంకుల ఇష్టమే. ఈ లెక్కన సంప్రదాయ బ్యాంకు విధానం నుంచి జాతీయ బ్యాంకులు ఎంతో దూరం జరిగిపోయాయి. అయితే ఈ విలీనమంతా ప్రభుత్వానికి మేలు జరిగే దిశలోనే జరిగిందని చెప్పాలి. కొన్ని బలహీన బ్యాంకులు ఈ విలీనం వల్ల బతికి బట్టకట్టాయి కూడా.
అయితే ఈ చర్యలు ఉద్యోగ నియామకాలపై భారీగా ప్రభావం చూపాయి. గత అయిదేళ్ల కాలంలో బ్యాంకు ఉద్యోగుల హెచ్చు తగ్గుల వివరాలు కేంద్ర ఆర్థిక శాఖ సేకరించింది. దాని ప్రకారం 2021–25 మధ్యలో 12 బ్యాంకుల్లో కేవలం నాలుగింటిలో సిబ్బంది వందల్లో పెరగగా, మిగతా ఎనిమిదింటిలో మాత్రం వేలల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఒక్క ఎస్బీఐలోనే 10 వేల మంది తగ్గిపోయారు. ఈ అయిదేళ్ల కాలంలో బ్యాంకు ఉద్యోగుల సంఖ్య కేవలం 6500 పెరిగింది. సగానికి పైగా సీనియర్ ఉద్యోగులు ఆధునిక బ్యాంకింగ్ సిస్టమ్‌కు తగినట్లు లేరని కేంద్ర బ్యాంకింగ్ డివిజన్ తేల్చినా, కొత్త నియామకాలు లేవు. కంప్యూటరైజేషన్, కుదింపు వల్ల ఉన్న సిబ్బందే ఎక్కువ అనే పరిస్థితి ఏర్పడింది. ఎస్బీఐ యోనో వంటి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు సిబ్బంది రహితంగా పనిచేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మరోసారి బ్యాంకుల కుదింపునకు కేంద్రం కమిటీ వేస్తున్నట్లు ఫైనాన్స్ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 12 ప్రభుత్వరంగ బ్యాంకులను 4 లేదా 5 బ్యాంకులుగా మార్చాలనే ఆలోచన ప్రభుత్వానిది. యూనియన్ బ్యాంకులో బ్యాంక్ ఆఫ్ ఇండియాను కలిపేసే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లు ఈ జనవరిలోనే బయటపడింది. ఇదే దారిలో ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులను తగ్గించే ప్రణాళిక కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రస్తుతం ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 9 లక్షల ఉద్యోగులున్నారు. అందులో సగం మందితో బ్యాంకులు నడిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
కుదింపుతో పాటు బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులకు ఉన్న క్యాప్‌ను 49 శాతానికి పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐ ప్రస్తుతం 20శాతం పరిమితిలో ఉంది. దానికి కూడా ప్రభుత్వ అనుమతి అవసరం. షేర్ హోల్డర్ ఓటింగ్‌లో మాత్రం 10శాతం లెక్కలోకి తీసుకుంటారు. అప్పుడే విధానపర నిర్ణయాలపై ప్రభుత్వానిది పైచేయిగా ఉంటుంది. బయటి వాటా పెరిగితే బ్యాంకులపై దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను అయిదింటికి కుదించి, వాటిలోని 49శాతం వాటాను పెట్టుబడిదారులకు అమ్మేస్తే, ఆ పెత్తనం వారి స్వప్రయోజన మార్పులకు దారి తీస్తుంది. సుమారు అర్ధ శతాబ్దం క్రితం జాతీయం చేసిన బ్యాంకుల పగ్గాలు తిరిగి వ్యాపారవేత్తల చేతుల్లోకి వెళితే సామాన్యుడి ఆర్థిక వికాసానికి ఇక్కట్లు మొదలైనట్లే.
బద్రి నర్సన్
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది