ఉన్నత విద్యకు ‘కొత్త’ గ్రహణం
ABN , Publish Date - Mar 26 , 2026 | 01:18 AM
ఉన్నత విద్యా వ్యవహారాల నిర్వహణకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) స్థానంలో ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూనుకున్నది...
ఉన్నత విద్యా వ్యవహారాల నిర్వహణకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) స్థానంలో ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూనుకున్నది. ఆ సంకల్పంతోనే ‘వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్’ (వీబీఎస్‌ఏ) బిల్లును ప్రతిపాదించింది. యూజీసీ మాజీ సభ్యుడుగా ఆ ఉన్నత విద్యా సంస్థ రద్దుకు నేను ఒక్క కన్నీటి బొట్టు కూడా కార్చను. ఎందుకని? యూజీసీ ఒక విఫల వ్యవస్థ. విద్యావేత్తలేకాదు, విధాన రూపకర్తలు సైతం ఈ విషయమై ఏకాభిప్రాయంతో ఉన్నారు. అయితే జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌పీఏ)–2020 వాగ్దానం చేసినట్టుగా యూజీసీ స్థానంలో ఒక నూతన నియంత్రణ వ్యవస్థగా వీబీఎస్‌ఏ ఆవిర్భవిస్తే దానికి నేను సంతోషంగా మద్దతునిస్తాను. ఎన్‌పీఏ వాగ్దానం చేసిన సంస్థ ఎలా ఉంటుందో కూడా ఒకసారి గుర్తుచేస్తాను: ‘వ్యవస్థలో నిరోధ సమతౌల్యాలను వ్యవస్థీకరించి, ప్రయోజనాల సంఘర్షణను సాధ్యమైనంతగా తక్కువ స్థాయిలో ఉంచుతూ అధికారాల కేంద్రీకరణను రూపుమాపే స్వతంత్ర, సాధికార సంస్థ ఒకటి ఉన్నతవిద్యా వ్యవస్థకు అత్యవసరం’.
విచారకరమైన విషయమేమిటంటే ప్రస్తుతం పార్లమెంటు స్థాయీ సంఘం పరిశీలనలో ఉన్న ప్రతిపాదిత వీబీఎస్‌ఏ బిల్లు ఎన్‌పీఏ దార్శనికతకు విరుద్ధంగా ఉన్నది. కొత్త నియంత్రణ నిర్మాణం అధికారాల కేంద్రీకరణకు దోహదం చేసేదిగా ఉన్నది. ఇది ఉన్నత విద్య కేంద్రీకరణ, అధికార యంత్రాంగం పెరుగుదల, ఉన్నత విద్య వాణిజ్యీకరణకు దారి తీసేదిగా ఉన్నది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ప్రస్తుత యూజీసీ వ్యవస్థకంటే రాబోయే వీబీఎస్‌ఏ వ్యవస్థ మరింత అధమమైనది. ఉన్నత విద్య సమున్నత లక్ష్యాల పరిపూర్తికి అది దోహదం చేయగలదని భావించడం ఒక భ్రమ మాత్రమే. 2010–13 సంవత్సరాల మధ్య యూజీసీ గౌరవ సభ్యుడిగా ఉన్న కాలంలో దేశ ఉన్నత విద్యా వ్యవహారాల నిర్వహణ ఎలా ఉంటుందో, అవి ఎలా నిర్దేశితమవుతాయో చాలా దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు లభించింది. యూజీసీ ఒక అవినీతికర, అసమర్థ సంస్థ. ప్రయోజనాల సంఘర్షణ కూడా యూజీసీలో ముమ్మరంగా ఉన్నది. యూజీసీకి బాధ్యత వహించే విద్యావేత్తలు కేంద్ర ప్రభుత్వంలోని ఒక మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ నుంచి ఫోన్ వస్తే చాలు, ఎంతో విధేయంగా లేచి నిలబడి మరీ మాట్లాడడం పరిపాటి. ఇది నమ్మవలసిన నిజం. యూజీసీ స్వయం ప్రతిపత్తి అనేది కాగితాలకే పరిమితమైన విషయం.
యూజీసీలో మొట్టమొదటి అధికారిక ప్రయోజనాల సంఘర్షణకు మార్గదర్శకాలను ఆమోదింపజేయడం ఆ సంస్థ గౌరవ సభ్యుడిగా నేను సాధించిన ఏకైక విజయం. వాటి ప్రకారం, యూజీసీ కమిటీల సభ్యులు తమకు ఏవైనా సంభావ్య ప్రయోజన వైరుధ్యాలు ఉంటే వాటిని ప్రకటించాలి. తమకు భాగస్వామ్యం లేదా ప్రమేయమున్న సంస్థలకు సంబంధించిన నిర్ణయాల నుంచి వైదొలగాలి. అయితే నేను ప్రవేశపెట్టిన ఈ విధానమే నన్ను యూజీసీ నుంచి తొలగించేందుకు దారితీసింది! రాజకీయ క్రియాశీలత అన్న ఆరోపణపై నన్ను తొలగించారు. చెప్పవచ్చినదేమిటంటే యూజీసీ వ్యవస్థ ఉన్నతస్థాయి నుంచి సకల అధర్మాచరణలతో భ్రష్టుపట్టిపోయింది. దాన్ని పై నుంచి కింది దాకా సర్వసమగ్రంగా సంస్కరించవలసిన అవసరమున్నది.
ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు. 2009లో ప్రొఫెసర్ యశ్‌పాల్ నేతృత్వంలోని ఒక కమిటీ కూడా ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. ‘భారతదేశంలో ఉన్నత విద్య పునరుద్ధరణ, పునరుజ్జీవనం’ పేరిట ఉన్న ఆ నివేదికను ప్రస్తుత సందర్భంలో చదవడం సత్ఫలితాల నివ్వగలదు. ఉన్నత విద్య ఒక వ్యాపార సరుకుకాదని, అది ఒక ప్రజా ప్రయోజనమని ఆ నివేదిక పేర్కొంది. విశ్వవిద్యాలయం ప్రాథమిక ఉద్దేశం జ్ఞాన సృష్టి, విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడం, ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించడమని స్పష్టం చేసింది. ఉన్నత విద్యారంగం లాభాపేక్షతో నడిస్తే ఆ సమున్నత లక్ష్యాలను సాధించలేమని యశ్‌పాల్ కమిటీ అభిప్రాయపడింది. ఉన్నత విద్యారంగంలో ప్రమాణాలు నాణ్యమైనవిగా ఉండాలంటే ప్రభుత్వం నిధులు ఉదారంగా అందించాలని, విద్యా వ్యాపారీకరణ, విద్యా ప్రమాణాల పతనాన్ని అరికట్టేందుకు కఠినమైన నియంత్రణ ఉండాలని నివేదిక సిఫారసు చేసింది.
ప్రస్తుత వీబీఎస్‌ఏ బిల్లు ప్రతిపాదనలు యశ్‌పాల్ కమిటీ సిఫారసులకు విరుద్ధంగా ఉన్నాయి. ఈ బిల్లు చట్టంగా అమలులోకి వస్తే మూడు ప్రతికూల పరిణామాలు ఏకకాలంలో సంభవిస్తాయి: ఉన్నత విద్యా సంస్థలు స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోతాయి; బోధనా సిబ్బందికి విద్యా సంబంధ స్వేచ్ఛ కొరవడుతుంది; ఉన్నత విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం తగ్గిపోతుంది. ఇవి ఉన్నత విద్య ప్రజా ప్రయోజనాలను నెరవేరుస్తాయా? సామాజిక న్యాయానికి దోహదం చేస్తాయా? సమాధానాలు స్పష్టమే.
ఉన్నత విద్యా వ్యవస్థకు సంబంధించి కొత్త శాసన నిర్మాణంగా ఉద్దేశించినప్పటికీ వీబీఎస్‌ఏ బిల్లు నిజానికి 2018లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన భారత ఉన్నత విద్యా కమిషన్ (హెచ్‌ఈసీఐ) కొత్త అవతారమే, సందేహం లేదు. హెచ్‌ఈసీఐ బిల్లు శాసనంగా రూపుదాల్చినప్పుడు అధికారాలు కేంద్రీకృతమై ఉన్నత విద్యావ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని, నిధుల లభ్యతను కోల్పోతుందని విద్యావేత్తలు, విద్యార్థిలోకం, రాజకీయ పక్షాల నుంచి తీవ్ర భయాందోళనలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఆ బిల్లును ఉపసంహరించుకోక తప్పలేదు. అధికారాల కేంద్రీకరణ సమస్య గురించి నేటి కొత్త బిల్లు పట్టించుకోలేదు. పైగా అదే లక్ష్యాన్ని –అధికారాల కేంద్రీకరణ– సాధించేందుకు మరింత సంక్లిష్ట సంస్థలను సృష్టించింది. సర్వాధికార హెచ్‌ఈసీఐకు బదులుగా మూడు వేర్వేరు సంస్థల –రెగ్యులేటరీ కౌన్సిల్, అక్రిడిటేషన్ కౌన్సిల్, అకడమిక్ స్టాండర్స్ కౌన్సిల్– ను పర్యవేక్షించే వీబీఎస్‌ఏ అనే సర్వోన్నత సంస్థ ఉనికిలోకి రానున్నది. అయితే అధికారాల కేంద్రీకరణ అనే మౌలిక లక్ష్యంలో ఎటువంటి పట్టు విడుపులు లేవు. ఆ మాటకొస్తే ఇది గతంలో కంటే మరింత దృఢతరమైనది. నాలుగు కీలక విషయాలలో ఈ మార్పును స్పష్టంగా చూడవచ్చు.
మొదటిది: ఈ కొత్త సంస్థల –జాతీయ విద్యా నియంత్రణ మండలి, జాతీయ అక్రిడిటేషన్ కౌన్సిల్, ఉన్నత విద్యా నిధుల మండలి, సాధారణ విద్యా మండలి– వ్యవస్థకు ఎటువంటి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఇవి వేర్వేరు విభాగాలే కానీ స్వతంత్రమైనవి కావు. వీబీఎస్‌ఏ, అది పర్యవేక్షించే మూడు సంస్థలు నిర్మాణ పరంగా ఒకే విధమైనవి. సంస్థ చైర్మన్‌ను, సభ్యులను పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ప్రాతినిధ్యం వహించేవారిని కూడా కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. తన ఇష్టానుసారం చైర్మన్, సభ్యులను తొలగించే అధికారం, మొత్తం కమిషన్‌ను కొనసాగించడం లేదా రద్దు చేసే అధికారం కేంద్రానికి ఉన్నది. తమ రాజకీయ యజమానుల తరఫున కొంతమంది ఐఏఎస్ అధికారులు వీబీఎస్‌ఏ వ్యవహారాలను నియంత్రిస్తారు.
రెండోది: ఉన్నత విద్యావ్యవస్థ నియంత్రణ ‘సులభంగా, పటిష్ఠంగా’ ఉంటుందని నూతన విద్యా విధానం–2020 ఇచ్చిన హామీకి విరుద్ధంగా వీబీసీఏకు బలవంతంగా జోక్యం చేసుకునే అధికారాలను కల్పించారు. గతంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు గానీ, మరే ఇతర ఉన్నత విద్యా నియంత్రణ సంస్థకు గానీ ఇటువంటి అధికారాలు లేవు. తన పర్యవేక్షణలోని మూడు సంస్థల సిఫారసుల మేరకు ఉన్నత విద్యా సంస్థలు, వాటి నిర్వాహకులను శిక్షించేందుకు, ఒక డిగ్రీకి గుర్తింపును రద్దు చేసేందుకు, ఒక కళాశాల లేదా ఒక విశ్వవిద్యాలయాన్ని మూసివేయాలని ఆదేశించేందుకు వీబీసీఏకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయి.
మూడోది: సమాఖ్య నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమనేది వీబీఎస్‌ఏ బిల్లులోని ఒక ప్రధాన ప్రతికూల అంశం. బహుశా అది దాని అత్యంత చెడ్డ లక్షణమని చెప్పవచ్చు. ఇప్పటికీ అత్యధిక విద్యార్థులు ఉండే ఉన్నత విద్యా సంస్థలకు నిధులు మంజూరు చేస్తూ వాటి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు వీబీఎస్‌ఏను నడపడంలో ఎటువంటి ప్రమేయం ఉండదు. 15 మంది సభ్యులలో ఒక స్థానానికి ఏటా ఒకరిని ఎంపిక చేయడం మినహా మరెలాంటి ప్రవేయానికి ఆస్కారం లేదు. ఇది కూడా వీబీఎస్ఏ ఆధ్వర్యంలోని మూడు సంస్థలకూ వర్తించదు. 2018 బిల్లు ఒక బలహీన సంప్రదింపుల వేదికను సమకూర్చింది. కేంద్ర విద్యామంత్రితో పాటు రాష్ట్ర ఉన్నత విద్యా మండళ్లు చైర్‌పర్సన్లతో కూడిన ఒక సలహా సంఘం ఉండాలని ఆ పాత బిల్లు నిర్దేశించింది. వీబీఎస్‌ఏ బిల్లు ఈ మాత్రం వెసులుబాటును కూడా ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కళాశాలలు, విశ్వవిద్యాలయాలను నెలకొల్పితే వాటి బోధనా సిబ్బంది నియామకాలు, పాఠ్య ప్రణాళికలు, ఆ విద్యాసంస్థలు పనిచేయాల్సిన తీరుతెన్నులను కేంద్రమే నిర్ణయిస్తుంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే ఆ విద్యా సంస్థల మనుగడ అనేది కేంద్ర నిర్ణయంపై ఆధారపడి ఉన్నది.
చివరగా గమనార్హమైన విషయమేమిటంటే 2018 బిల్లు వలే ప్రస్తుత వీబీఎస్‌ఏ బిల్లు కూడా నియంత్రణ విధులను, నిధుల కేటాయింపు నుంచి వేరు చేసింది. అయితే నిధులు ఎక్కడ నుంచి వస్తాయి, ఎలా కేటాయిస్తారు అనే విషయమై కొత్త బిల్లులో ఒక్క మాట కూడా లేదు. అలాగే ఉన్నత విద్యా సంస్థలలో వివక్షకు తావులేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించే విషయమై ఎటువంటి నిబంధన లేదు. ఈ విషయమై కొత్త బిల్లు ఎందుకు మౌనం వహించింది? ఈ మౌనం వీబీఎస్‌ఏ ఎలా పనిచేసేది సూచించడం లేదూ? దీనినెలా అర్థం చేసుకోవాలి? ఉన్నత విద్యను మార్కెట్ ఆధారిత వస్తువుగా మార్చడం ద్వారా, ఆ రంగం బాధ్యతల నుంచి ప్రభుత్వం వైదొలగడాన్ని అధికారికం చేసే ఒక యంత్రాంగంగా వీబీఎస్‌ఏను ఉద్దేశించారని భావించవచ్చు. విద్య ద్వారా పేదరికం నుంచి విముక్తమయ్యేందుకు ఆరాటపడుతున్న లక్షలాది మొదటి తరం విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రభుత్వ విద్య అత్యవసరమైన ప్రస్తుత తరుణంలో వీబీఎస్‌ఏ ద్వారా వారికి న్యాయం జరుగుతుందా?
యోగేంద్ర యాదవ్
(వ్యాసకర్త ‘స్వరాజ్ ఇండియా’ అధ్యక్షుడు)
ఇవి కూడా చదవండి..
నిలకడగా ఇంధన భద్రత, మరిన్ని నౌకలు వస్తున్నాయి.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం భరోసా
డీజిల్, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదు: కేంద్రం ప్రకటన