మన దేశంలో చదివితే బాగుపడలేమా?
ABN , Publish Date - Sep 24 , 2026 | 01:44 AM
‘భారత్‌లో మంచి కళాశాలలు లేవు. అందుకే నా కుమార్తెను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించాను’ – ఈ మాటలన్నది ఏ సాధారణ పౌరుడో కాదు; దాదాపు దశాబ్దకాలం పాటు గత ప్రభుత్వంలో...
‘భారత్‌లో మంచి కళాశాలలు లేవు. అందుకే నా కుమార్తెను ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించాను’ – ఈ మాటలన్నది ఏ సాధారణ పౌరుడో కాదు; దాదాపు దశాబ్దకాలం పాటు గత ప్రభుత్వంలో అత్యంత కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ముఖ్యనేత. నిజంగానే భారతదేశంలో నాణ్యమైన విద్యాసంస్థలు లేవా? దేశవ్యాప్తంగా కోట్లమంది విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలన్నీ దండగేనా?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏ ప్రకారం 6 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్య ప్రాథమిక హక్కు. అయితే పాఠశాలలో పేరు నమోదు చేసుకోవడం మాత్రమే విద్య కాదు. అర్హత కలిగిన ఉపాధ్యాయులు, సురక్షితమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, శాస్త్రీయ దృక్పథం, భాషా నైపుణ్యం, సృజనాత్మక ఆలోచన... ఇవన్నీ సమకూరినప్పుడే అది సంపూర్ణ విద్య.
ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా విధానాలు, సిలబస్‌లు మారడం పరిపాటిగా మారింది. కానీ లోపాలను శాస్త్రీయంగా సమీక్షించి, రాజకీయాలకు అతీతంగా కనీసం ఇరవై ఏళ్లపాటు నిరంతరాయంగా కొనసాగే దీర్ఘకాలిక విద్యా ప్రణాళికను అమలు చేయడంలో పాలకులు విఫలమవుతున్నారు. పాలకులు మారినప్పుడల్లా పాఠ్యపుస్తకాలు మారవచ్చు; కానీ భావితరాల భవిష్యత్తు ప్రయోగశాలగా మారకూడదు.
డిగ్రీ లేదా బీఈడీ చేసిన యువ ఉపాధ్యాయులు చాలా ప్రైవేట్ పాఠశాలల్లో తక్కువ వేతనాలతో పనిచేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్య, శిక్షణ, ఉద్యోగ భద్రత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ, అన్నిచోట్ల ఆశించిన ఫలితాలు ఎందుకు రావడం లేదు? అనేక ప్రభుత్వ పాఠశాలల్లో: ప్రధానోపాధ్యాయుల నాయకత్వ లోపం, సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత, ఏకోపాధ్యాయ పాఠశాలలు, ఉపాధ్యాయులకు బోధనేతర విధులు కేటాయించడం, ఫలితాలపై స్పష్టమైన జవాబుదారీతనం లేకపోవడం వంటివి కారణాలు.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 2014 నాటికి దాదాపు 29,268 ఉండగా, 2023–24 నాటికి సుమారు 30,000కు చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో సమస్యలు వేరేలా ఉన్నాయి. విద్యార్థులు లేని కారణంగా 2,000కు పైగా జీరో–ఎన్‌రోల్‌మెంట్ పాఠశాలలు ఉన్నాయి. అందులో వందలాది పాఠశాలలు తాత్కాలికంగా మూతపడ్డాయి. విలీనాలు (రేషనలైజేషన్), పునర్వ్యవస్థీకరణ పేరుతో పాఠశాలలు తగ్గుతుండగా, విద్యార్థులు ఎందుకు ప్రైవేట్ బాట పడుతున్నారన్న ఆత్మపరిశీలన కొరవడింది. ప్రభుత్వం ప్రతి పాఠశాల వివరం, మూసివేతకు గల కారణాలు, ప్రత్యామ్నాయ సదుపాయాలపై పారదర్శకమైన ‘పబ్లిక్ డ్యాష్‌బోర్డు’ను ఏర్పాటు చేయాలి. విద్యార్థులు లేరని పాఠశాలను మూసివేసే ముందు... వారు ఎందుకు వెళ్లిపోయారో ప్రభుత్వం తనను తాను ప్రశ్నించుకోవాలి. ప్రైవేట్ పాఠశాల అంటే అన్నిచోట్లా మంచి విద్య అని కాదు. ప్రభుత్వ పాఠశాల అంటే నాణ్యత లేదని కూడా కాదు. అయినప్పటికీ పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అప్పులు చేసి ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నాయి. వారిని ఆకర్షిస్తున్నది కేవలం ఇంగ్లీష్ మీడియం కాదు. క్రమశిక్షణ, ప్రతిరోజు పర్యవేక్షణ, ఉపాధ్యాయుల హాజరు, రవాణా, తల్లిదండ్రులతో సమాచార మార్పిడి, పరీక్షల నిర్వహణ, సంస్థపై కనిపించే బాధ్యత... ఇవన్నీ కారణాలు. కానీ ఒక కుటుంబానికి ఇచ్చే రైతుబంధు, సంక్షేమ సహాయం లేదా ఇతర ఆర్థిక లబ్ధి– కొన్ని సందర్భాల్లో ఒక పిల్లవాడి వార్షిక ప్రైవేట్ స్కూల్ ఫీజుకూ సరిపోవడం లేదు. ప్రభుత్వం ఒక చేత్తో సంక్షేమం ఇచ్చి, మరో చేత్తో నాణ్యమైన ప్రభుత్వ విద్యను బలహీనపరిస్తే, ఆ కుటుంబం తిరిగి ప్రైవేట్ ఫీజుల రూపంలో మరింత భారాన్ని మోయాల్సి వస్తుంది.
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌లో విద్యా రంగానికి కేటాయింపులు సగటున రూ.21,000 కోట్ల నుంచి రూ.22,000 కోట్ల పరిధిలో ఉంటున్నాయి. ఇది రాష్ట్ర మొత్తం బడ్జెట్ వ్యయంలో దాదాపు 7.3శాతం నుంచి 7.6శాతం వరకు మాత్రమే. దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ కేటాయింపులు గణనీయంగా పెరగాలి. కేటాయించిన నిధుల్లో కూడా సింహభాగం జీతభత్యాలకే సరిపోతుండటంతో, మౌలిక వసతులు, డిజిటల్ ల్యాబ్‌లు, ఆధునిక తరగతి గదుల నిర్మాణానికి ‘మూలధన వ్యయం’ అరకొరగానే మిగులుతోంది. బడ్జెట్‌లో సంఖ్య పెరగడం పురోగతి కాదు; తరగతి గదిలో పిల్లవాడి సామర్థ్యం పెరగడమే పురోగతి.
ఒక సమర్థుడైన ప్రధానోపాధ్యాయుడు ఒక ప్రభుత్వ పాఠశాలను మార్చగలడు. ఒక నిజాయితీగల ప్రిన్సిపాల్ ఒక కళాశాలకు కొత్త జీవం ఇవ్వగలడు. ఒక దూరదృష్టిగల వైస్ చాన్సలర్ విశ్వవిద్యాలయాన్ని పరిశోధనా కేంద్రంగా తీర్చిదిద్దగలడు. అయితే ఒక నిబద్ధతగల రాజకీయ నాయకత్వం, నిజాయితీగల సివిల్ సర్వెంట్లు కలిసి పదేళ్లు పనిచేస్తే... రాష్ట్ర విద్యావ్యవస్థను ఎందుకు మార్చలేరు? సాధ్యం అవుతుంది. దానికి కావలసింది: స్పష్టమైన ప్రమాణాలు, ఖాళీల భర్తీ, స్వతంత్ర నాణ్యతా పరీక్షలు, మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్, ఫీజు నియంత్రణ చట్టం, బడ్జెట్ పెంపు, శాసనబద్ధమైన దీర్ఘకాలిక పాలసీ.
శ్రీనాథ్
సామాజిక విశ్లేషకులు
ఈ వార్తలనూ చదవండి:
రష్యాతో వాణిజ్యానికి ఫుల్‌స్టాప్ పెట్టాలి.. భారత్‌కు ఉక్రెయిన్ పిలుపు
హోర్ముజ్‌పై కఠిన ఆంక్షలు.. కొత్త చట్టం తెచ్చిన ఇరాన్ పార్లమెంట్