Share News

ఈ ఆర్థిక తిరోగమనం తాత్కాలికమేనా?

ABN , Publish Date - May 14 , 2026 | 12:52 AM

ప్రపంచీకరణ తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా దాని ప్రతికూల ప్రభావం ప్రపంచమంతటా ఉంటున్నది. ముఖ్యంగా బలమైన ఆర్థిక పునాదులపై నిలబడని భారత్ వంటి వర్ధమాన...

ఈ ఆర్థిక తిరోగమనం తాత్కాలికమేనా?

ప్రపంచీకరణ తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏ విపత్తు సంభవించినా దాని ప్రతికూల ప్రభావం ప్రపంచమంతటా ఉంటున్నది. ముఖ్యంగా బలమైన ఆర్థిక పునాదులపై నిలబడని భారత్ వంటి వర్ధమాన దేశాలపై ఈ ప్రభావం మరింత ఎక్కువ.

వ్యవసాయం, కుటీర పరిశ్రమలు బలమైన ఆర్థిక పునాదులుగా నిలిచినంత కాలం ప్రపంచవ్యాప్తంగా ఏ ఒడిదుడుకులు సంభవించినా మన దేశం పెద్దగా చలించలేదు. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. పశ్చిమాసియాలో ఇజ్రాయిల్, అమెరికా–ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల, ప్రాణనష్టాన్ని మినహాయించి చూస్తే, ఇతరత్రా అనర్థాలు ఆ యుద్ధంలో నిమగ్నమైన దేశాలలో కంటే కూడా మన దేశంలోనే ఎక్కువగా కనపడటం జీర్ణించుకోలేని ఓ చేదు వాస్తవం.

నిన్న మొన్నటి దాకా ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చోటు సంపాదించి, మరో రెండు మూడేళ్ళలోనే మూడవ స్థానానికి ఎగబాకనుందని అందరూ భావిస్తున్న భారత్, ఇప్పుడు హఠాత్తుగా ప్రపంచ ర్యాంకింగ్‌లలో ఆరవ స్థానానికి పడిపోయింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ తన 2025–26 ఆర్థిక సంవత్సరం నివేదికలో వెల్లడించింది. నిజానికి ఇంతకుముందు భారత్ కంటే వెనుక ఉన్న యు.కె, జపాన్‌లు ఆర్థికంగా ముందుకు వెళ్ళకపోయినా ఉన్నచోట స్థిరంగానే ఉన్నాయి. భారత్ మాత్రమే తనంతట తాను వెనకబడిపోయింది.

ఈ ర్యాంకింగ్ పతనం వెనుక ఆర్థిక కారణాలు ఏమీ లేవనీ, గణాంకపరమైన అంశాల వల్లనే ర్యాంకింగ్‌ తగ్గిందనీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు. అమెరికన్ డాలర్లలో లెక్కించే రూపాయి విలువ క్షీణించడం వల్లనే ర్యాంకింగ్‌ తగ్గిందని, అలాగే దేశీయ చమురు అవసరాల కోసం పెద్ద మొత్తంలో డాలర్ల రూపంలో ముడి చమురు కొనడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందనీ, పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ సర్దుకుంటుందనీ వారు అంటున్నారు. అయితే ఈ వాదనలో పస కనిపించడం లేదు. ప్రజలను తాత్కాలికంగా మభ్యపెట్టే ఉద్దేశమే కనిపిస్తున్నది.


ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా దేశంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయన్నది నిజమే. ముఖ్యంగా సహజ వాయువుకు, ముడి చమురుకు కొరత ఏర్పడింది. వీటి ధరలు పెరిగాయి. దేశంలో అన్ని రకాల వస్తుసేవలు ప్రియంగా మారాయి. కానీ యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 కంటే ముందే అనేక రంగాల్లో స్తబ్ధత నెలకొన్నది. పారిశ్రామిక ఉత్పత్తి గత ఐదు నెలల్లో అతి తక్కువగా 4.1శాతం మేర మాత్రమే నమోదైనట్లు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) తాజా గణాంకాలు వెల్లడించాయి. క్యాపిటల్ గూడ్స్‌లో అభివృద్ధి కనపడగా, నిర్మాణ రంగంలో గత తొమ్మిది నెలల్లో కేవలం 6.7శాతం పెరుగుదల మాత్రమే ఉంది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకా వివిధ రంగాల అభివృద్ధి గణాంకాలు పూర్తిగా వెల్లడి కాలేదు. అవన్నీ వెల్లడైన తరువాత దేశంలో ఆర్థిక ప్రగతి ఏ దిశగా పయనిస్తుందో తెలుస్తుంది.

ఈ అంశాలన్నీ లెక్కలోకి తీసుకుని చూస్తే రూపాయి క్షీణత వల్ల మారకం విలువ ప్రకారం డాలర్లలోకి మార్చడంతోనే భారత జీడీపీ తక్కువగా నమోదయిందని చేస్తున్న వాదనలో నిజం లేదని అర్థం అవుతుంది. రూపాయి పతనాన్ని నిలువరించలేక ఇతరత్రా సాకులు చూపుతున్నారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం యూరో, యెన్, పౌండ్ వంటి విదేశీ కరెన్సీలపై ఎందుకు పడలేదు? మన రూపాయి పైనే ఎందుకు ఎక్కువగా పడుతున్నది? కారణం– అమెరికన్ డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలతో భారత్ అధిక మొత్తంలో లావాదేవీలు నిర్వహించడం వల్లనే డాలర్ బలపడినప్పుడల్లా మన రూపాయి క్షీణిస్తోంది.

ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా బలంగా ఉండాలంటే స్థిరమైన పెట్టుబడులు, స్థిరమైన గ్యారెంటీ ఆదాయాలు ఉండగలగాలి. ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను రక్షణ శాఖతో సహా ఇతర రంగాల్లో 50శాతానికి మించి అనుమతిస్తున్నారు. అలాగే స్టాక్ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడులను (ఎఫ్.ఐ.ఐలు) ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల జరిగే నష్టం ఏమంటే – రూపాయి విలువ క్షీణించినపుడల్లా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వేగంగా జరుగుతుంది. తాజాగా పశ్చిమాసియా యుద్ధం మొదలయ్యాక స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐల ఉపసంహరణ జోరందుకుంది. స్టాక్ మార్కెట్ నుంచి రివర్స్ ఫ్లో ఎక్కువైంది. విదేశీ ఇన్వెస్టర్లు ఒక్క భారత్‌లోనే పెట్టుబడులు పెట్టాలన్న నియమం లేదు కనుక ఆకర్షణీయంగా కనిపించే ఇతర దేశాల మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల మద్దతు కోల్పోయినపుడు దేశీయ మదుపర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. అంటే, స్థిరమైన పెట్టుబడుల్ని ఆకర్షించడానికి బదులు వ్యవస్థ మూలాలను దెబ్బతీసే పెట్టుబడులకు తలుపులు బార్లా తెరవడం అన్నది మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న సంస్థాగత బలహీనత.


ఇక స్థిరమైన ఆదాయాలు అందించే వ్యవసాయం, చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమల రంగాలకు ప్రభుత్వాలపరంగా ప్రోత్సాహం తగ్గిపోవడం మరో బలహీనత. వ్యవసాయం కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉండడం వల్ల రైతాంగానికి నష్టం వాటిల్లినపుడల్లా వారిని ఆదుకునే బాధ్యతను ఒకరిపై ఒకరు నెట్టేసుకొని కేంద్రం, రాష్ట్రాలు చేతులు దులుపుకుంటున్నాయి. ఫలితంగానే దేశ వ్యవసాయాభివృద్ధి రేటు సాలీనా 3.5శాతాన్ని మించడం లేదు. ముఖ్యంగా ఉత్పాదకతలో అభివృద్ధి సాధించలేకపోవడం మరో అతిపెద్ద బలహీనత. దీంతో పాటు దేశ జనాభాలో దాదాపు 35 కోట్ల మంది ఆధారపడిన చిన్న, సూక్ష్మ, గ్రామీణ పరిశ్రమలు కరోనాకాలంలో పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటికి అవసరమైన పెట్టుబడులను బ్యాంకుల ద్వారా రుణాల రూపంలో తక్కువ వడ్డీకి ఇప్పించి ఇతర ప్రోత్సాహకాలు కల్పించాలని గత నాలుగైదేళ్ళ నుంచి మొత్తుకుంటున్నా ఆ దిశగా అడుగులు పడటం లేదు. కీలకమైన ఈ రంగానికి అరకొరగానే ప్రోత్సాహకాలు అందిస్తున్నారే తప్ప దీన్ని పూర్తిస్థాయిలో పునరుజ్జీవింపచేయడం లేదు. ఆర్థిక రంగంలో బలహీనమైన మరొక పార్శ్వం దేశంలోని శ్రామిక శక్తికి తగిన నైపుణ్యాలు లేకపోవడం. ప్రతియేటా రకరకాల డిగ్రీలు పొంది జాబ్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్న యువతలో 65శాతం మందికి ఎటువంటి నైపుణ్యాలు లేకపోవడంతో వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం లేదు. విదేశాల్లో పనిచేసే భారతీయుల ఉత్పాదకత అద్భుతం. కానీ వారి సొంత దేశంలో మాత్రం నాసిరకం. అంటే స్వల్ప ఉత్పాదకత మాత్రమే ఉంటుందని ప్రపంచ బ్యాంకు ఏనాడో స్పష్టం చేసింది. కారణం దేశంలో వివిధ రంగాలలో పనిచేస్తున్న శ్రామిక శక్తికి పూర్తి సామర్థ్యం, పనితనం చూపించగలిగే నైపుణ్యాలు కొరవడడమే.

ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో నాలుగవ స్థానం నుంచి ఆరవ స్థానానికి దిగజారిన భారత జీడీపీ 2031 నాటికి మూడవ స్థానానికి ఎగబాకుతుందని కూడా ఐ.ఎం.ఎఫ్ తాజా నివేదిక తెలిపింది. ఇప్పటి పరిస్థితులలో ఈ ర్యాంకింగ్‌ల గురించి చర్చించాల్సిన అవసరమే లేదు. పశ్చిమాసియా యుద్ధం చూపిస్తున్న ఫలితాలను ఏ విధంగా తగ్గించుకోవాలి? రూపాయి క్షీణతను ఏ విధంగా నిలువరించాలి? ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా పట్టిపీడిస్తున్న సంప్రదాయ బలహీనతల్ని ఏ విధంగా వదిలించుకోవాలనే అంశాల పైనే కేంద్రం దృష్టిపెట్టవలసిన అవసరం ఉంది.

సి. రామచంద్రయ్య

శాసనమండలి సభ్యులు

ఇవి కూడా చదవండి..

ఉషను పెళ్లి చేసుకోకుంటే జీవితాంతం బ్యాచిలర్‌గానే.. : అమెరికా ఉపాధ్యక్షుడు

ఐఆర్‌జీసీకి నిధులు ఎలా వస్తున్నాయి.. చెబితే రూ.145 కోట్లు ఇస్తామంటున్న అమెరికా..

Updated Date - May 14 , 2026 | 12:52 AM