Share News

నేటి బాల్యానికి కావాలి డిజిటల్‌ భద్రత

ABN , Publish Date - Mar 26 , 2026 | 01:15 AM

బాలల ఆన్‌లైన్ భద్రత గురించి మన దేశంలో చర్చ ఒక ముఖ్యమైన దశకు చేరుకుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు టీనేజర్లకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాలని...

నేటి బాల్యానికి కావాలి డిజిటల్‌ భద్రత

బాలల ఆన్‌లైన్ భద్రత గురించి మన దేశంలో చర్చ ఒక ముఖ్యమైన దశకు చేరుకుంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు టీనేజర్లకు సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాలని ప్రతిపాదించాయి. ఇది ఒక మంచి పరిణామం. తెలంగాణ కూడా ఇలాంటి చట్టం అమలుపై ఆలోచించాలి. అయితే, కేవలం సోషల్ మీడియాను నియంత్రిస్తే సరిపోదు. మంచి చట్టం– సోషల్ మీడియాతో పాటు మరో నాలుగు పెద్ద ముప్పులను కూడా ఆపాలి. అవి: పిల్లలు చూడకూడని అశ్లీల (పోర్న్) వీడియోలు; తీవ్రమైన హింసాత్మక దృశ్యాలు; పిల్లలను బానిసలుగా మార్చే షార్ట్– వీడియోలు; ప్రమాదకరమైన ఆన్‌లైన్ గేమ్స్– బెట్టింగ్ యాప్‌లు. రాబోయే చట్టం ఈ నాలుగింటిని నియంత్రిస్తేనే, కుటుంబాలకు అది డిజిటల్ రక్షణ కవచంలా మారుతుంది.

ఒక రిపోర్ట్ ప్రకారం 12–18 ఏళ్ల వయసున్న అబ్బాయిల్లో 97 శాతం, అమ్మాయిల్లో 78 శాతం అశ్లీల వీడియోలు చూస్తున్నారు. మన దేశంలో కూడా ప్రతి ఇద్దరు తల్లిదండ్రులలో ఒకరు తమ పిల్లలు ఆన్‌లైన్‌లో ఇలాంటి చెడు కంటెంట్ చూడటాన్ని గమనించారు. దీన్ని అరికట్టడానికి అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం 2023లో ఒక చట్టం తెచ్చింది. దీని ప్రకారం, అశ్లీల వెబ్‌సైట్‌లు తప్పనిసరిగా చూసేవారి వయసును ఫొటో లేదా వీడియో ద్వారా నిర్ధారించుకోవాలి. లేకపోతే భారీ జరిమానాలు కట్టాలి. బ్రిటన్ కూడా పిల్లలకు చెడు కంటెంట్ చేరకముందే వెబ్‌సైట్‌లు దాన్ని ఆపేయాలని చట్టం తెచ్చింది. దీనివల్ల అక్కడ పోర్న్ సైట్లకు వెళ్లేవారి సంఖ్య 77శాతం తగ్గింది.

రెండవది– హింసాత్మక వీడియోలు. ఆస్ట్రేలియా ‘ఆన్‌లైన్ సేఫ్టీ కోడ్స్’ చట్టాల ప్రకారం హింసాత్మక, తీవ్రవాద కంటెంట్ లాంటివి వినియోగదారుల కంట పడకముందే వాటిని తొలగించడానికి టెక్నాలజీని వాడాలి. కానీ మన దేశ ఐటీ చట్టం ప్రకారం, కోర్టు లేదా ప్రభుత్వం చెబితేనే వాటిని తొలగిస్తారు. వెబ్‌సైట్‌లు సొంతంగా చెడు కంటెంట్‌ను తీసేసినా, వాళ్ళ మీద ఎలాంటి కేసులు లేకుండా చట్టంలో మార్పులు తేవాలి. మూడవది– ఎంత చూసినా అయిపోని షార్ట్ వీడియోలు. 15–60 సెకన్ల వీడియోలు పిల్లల మెదడులో డోపమైన్‌ను (సంతోషాన్నిచ్చే రసాయనం) పెంచి, వాళ్ళను దానికి బానిసలను చేస్తున్నాయి. అందుకే పిల్లల అకౌంట్లకు ఈ అనంతమైన స్క్రోలింగ్, ఆటోప్లే ఆపేసేలా చట్టం రావాలి.


నాల్గవది– గేమింగ్, బెట్టింగ్ యాప్‌లు. మన దేశ ఆన్‌లైన్ గేమింగ్ చట్టంలో పిల్లల రక్షణ గురించి పెద్దగా పేర్కొనలేదు. పిల్లలు ఈ గేమ్స్‌లో అధిక సమయం, డబ్బు ఖర్చు పెట్టకుండా పరిమితి పెట్టాలి. ఈ యాప్‌లు ఆఫ్‌లైన్‌లో ఆడినా సరే ఈ రూల్స్ వర్తించాలి. భారత ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం–2023’ కింద ఏ యాప్ వాడాలన్నా ‘తల్లిదండ్రుల అనుమతి’ ఇచ్చే విధానాన్ని అమలు చేస్తోంది. కానీ పిల్లల ఒత్తిడికి తలొగ్గి చాలామంది తల్లిదండ్రులు ఆ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా మాత్రం, 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్లాక్ చేసే బాధ్యతను తెలివిగా సోషల్ మీడియా కంపెనీపైనే మోపింది. లేకపోతే భారీగా జరిమానాలు విధిస్తుంది.

చట్టాలతో పాటు స్కూళ్లు, కుటుంబాలు కూడా మారాలి. యునెస్కో 2023 ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదిక’ దృష్టి మరల్చే ‘స్మార్ట్ టెక్నాలజీ’ని ‘ఎడ్యుకేషనల్ టెక్నాలజీ’ నుంచి వేరు చేయాలని దేశాలను కోరింది. స్మార్ట్‌ఫోన్ల వల్ల చదువు పాడవుతోందని, పిల్లలకు కేవలం చదువుకోవడానికి పనికొచ్చే బేసిక్ ఫోన్లు లేదా ట్యాబ్లెట్లు మాత్రమే ఇవ్వాలని ఎకనామిక్ సర్వే చెప్పింది. చైనాలో రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఇంటర్నెట్ పనిచేయకుండా ఫోన్లలోనే ఒక ఆప్షన్ (మైనర్ మోడ్) తీసుకొచ్చారు.

5వ తరగతి నుంచి పాఠశాలల్లో ‘డిజిటల్ పరిశుభ్రత’ పాఠ్యాంశాల ద్వారా బాలలకు గోప్యత, ఆరోగ్యకరమైన డిజిటల్ అలవాట్లను నేర్పించాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ ఫోన్ స్క్రోల్ చేస్తుంటే పిల్లలు కూడా అదే చేస్తారు, కాబట్టి తల్లిదండ్రులకు తొలుత శిక్షణ ఇవ్వాలి. మోహిత్యాంచె వడ్గావ్ వంటి మహారాష్ట్ర గ్రామాల్లో ‘డిజిటల్ డీటాక్స్ సైరన్’ వాడుతున్నారు. రాత్రి 7 గంటలకు సైరన్ మోగగానే, టీవీలు, మొబైల్స్ అన్నీ ఆపేసి, ఆ 90 నిమిషాల సమయాన్ని కుటుంబం, పిల్లల చదువు కోసం కేటాయిస్తున్నారు. నగరాలు కూడా ఇలాంటి మంచి పద్ధతులను నేర్చుకోవాలి.


‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్–2026’ మితిమీరిన సోషల్ మీడియా వాడకానికి– పెరుగుతున్న కుంగుబాటు, ఒత్తిడికి మధ్య సంబంధం ఉందని పేర్కొంది. మరోవైపు, ‘వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ 2026’ పిల్లలలో ఊబకాయం మునుపెన్నడూ లేని స్థాయిలో వేగంగా పెరుగుతోందని హెచ్చరిస్తోంది. శారీరక శ్రమ తగ్గడం వల్ల ఆరోగ్యపరమైన ముప్పు పెరుగుతోంది. 2040 నాటికి, 12 కోట్ల కంటే ఎక్కువ మంది పాఠశాలకు వెళ్లే వయసున్న పిల్లల్లో మధుమేహం, గుండె జబ్బులు, పక్షవాతం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రారంభ లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. బెంగళూరులోని నిమ్హాన్స్, ఢిల్లీలోని ఎయిమ్స్ లాంటి సంస్థలు దీనికోసం ప్రత్యేక కేంద్రాలు నడుపుతున్నాయి. ‘డిజిటల్ డీ–అడిక్షన్ కేంద్రాలు’ ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయాలి, అలాగే ఒక ఉచిత హెల్ప్‌లైన్ కూడా తీసుకురావాలి.

ఇది కుటుంబాలకు, పెద్ద డిజిటల్ కంపెనీలకు మధ్య జరుగుతున్న పోరాటం. తల్లిదండ్రులు ఒంటరిగా పోరాడలేరు. వారు సాయం కోసం శాసనసభల వైపు చూస్తున్నారు.

శ్రీనివాస మాధవ్

ఇవి కూడా చదవండి..

నిలకడగా ఇంధన భద్రత, మరిన్ని నౌకలు వస్తున్నాయి.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం భరోసా

డీజిల్, పెట్రోల్‌కు ఎలాంటి కొరత లేదు: కేంద్రం ప్రకటన

Updated Date - Mar 26 , 2026 | 01:15 AM