Share News

వలసలకు మతం ఎక్కడిది?

ABN , Publish Date - Jun 02 , 2026 | 02:46 AM

ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఇప్పుడు ఒక నినాదం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రధానపార్టీల్లో కొన్ని ఆ నినాదం చుట్టూనే రాజకీయాలను నడుపుతున్నాయి. ప్రజల్లో ఉద్వేగాలనూ శత్రుత్వ భావనలనూ రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన...

వలసలకు మతం ఎక్కడిది?

ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో ఇప్పుడు ఒక నినాదం ఎక్కువగా వినిపిస్తోంది. ప్రధానపార్టీల్లో కొన్ని ఆ నినాదం చుట్టూనే రాజకీయాలను నడుపుతున్నాయి. ప్రజల్లో ఉద్వేగాలనూ శత్రుత్వ భావనలనూ రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన జనాకర్షక నాయకులందరూ ఆ నినాదమంత్రాన్నే జపించారు. అధికార పీఠాన్ని అందుకోటానికి తహతహలాడుతున్న నేతలూ అదే అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమికొడతామన్నదే ఆ నినాదం. వ్యక్తీకరణలో ఎన్ని తేడాలైనా ఉండొచ్చు.. కానీ సారాంశంలో మాత్రం వలసదారుల లక్ష్యంగానే రాజకీయ ప్రచారం ఊపందుకుంటోంది. దీనికి ఏ ప్రజాస్వామ్యదేశమూ మినహాయింపు కాదు. అన్ని ప్రజాస్వామ్యదేశాలకూ బయట నుంచి వచ్చే వలసల సమస్య తీవ్రమవుతూ ఉంది. దీన్ని కాదనలేం. ఉద్యోగాలు, ఉపాధికోసం వచ్చే సక్రమ వలసలను బాగా తగ్గించాలనే డిమాండు ఒకవైపు ఉంటే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలనే లక్ష్యం కొన్నిచోట్ల విపరీత పోకడలు పోతోంది. అమానవీయంగా తయారవుతోంది. ఇటీవల జరిగిన బెంగాల్‌, అసాం అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమ వలసల సమస్యే బీజేపీకీ ప్రధాన ప్రచార ఆయుధంగా మారింది. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వస్తోన్న ముస్లింలతో బెంగాల్‌, అసాంల్లో జనాభా ముఖచిత్రం మారిపోతోందన్న ప్రచారానికే అది పరిమితం అవ్వలేదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోకీ అక్రమ వలసదారులు చొచ్చుకుపోతున్నారనీ అనేకచోట్ల స్థానికుల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తున్నారనీ ఆరోపించింది. ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య ఉత్పన్నమవుతోందనీ సాక్షాత్తూ కేంద్ర హోంశాఖామంత్రి అమిత్‌ షా ప్రకటించారు. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోటానికి మే 26న ఒక ఉన్నత స్థాయి కమిటీని (హైలెవల్‌ కమిటీ ఆన్‌ డెమొగ్రాఫిక్‌ చేంజ్‌) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఒక సంవత్సరంలోపు నివేదికను ఇవ్వాలని ఆ కమిటీకి నిర్దేశించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ప్రకాశ్‌ ప్రభాకర్‌ నావ్లేకర్‌ చైర్మన్‌గా ఏర్పాటైన ఆ కమిటీలో మరో నలుగురు సభ్యులు ఉన్నారు. అందులో భారత జనగణన కమిషనర్‌ కూడా ఒకరు. విచిత్రం ఏమిటంటే కమిటీ చైర్మన్‌కు జనాభాలో వచ్చే అనేక రకాల మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేసే డెమొగ్రఫీ వ్యవహారంతో అంతకుముందు పెద్దగా పరిచయం లేదు. మధ్యప్రదేశ్‌లో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న తనను ఉన్నతస్థాయి కమిటీకి చైర్మన్‌గా ప్రకటించటం ఆశ్చర్యం కలిగించిందని ఆయన వ్యాఖ్యానించినట్లు ‘ద హిందూ’ పత్రిక పేర్కొంది. కమిటీలో ఉన్న మిగతా ముగ్గురు కూడా (జనగణన కమిషనర్‌ మినహా) జనాభా అధ్యయన శాస్త్రంలో జాతీయస్థాయిలోనూ అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవారేమీ కాదు.


పొట్టచేతపట్టుకుని సరిహద్దులను దాటుకుని వచ్చి కూలీనాలీ చేసుకోవటం ఈనాటి సమస్య కాదు. స్వాతంత్ర్యానికి ముందు నుంచీ ఉంది. ఉమ్మడి బెంగాల్‌ రాష్ట్రం నుంచి అసాంలోకి ముస్లింల వలసలను బ్రిటిష్‌ పాలకులు బాగా ప్రోత్సహించారు. అంతకుముందు అసాం రాజులూ ఆ పనిని చేశారు. ఇక స్వాతంత్ర్యానంతరం తూర్పుబెంగాల్‌లో ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తం అయినప్పుడల్లా ఉపాధికోసం భారత భూభాగంలోకి ప్రజలు వలసలు రావటం సర్వసాధారణంగా మారింది. ఆ వలసలు బంగ్లాదేశ్‌ యుద్ధమప్పుడు ఇంకా ఉధృతం అయ్యాయి. ఆ తర్వాతా కొనసాగాయి. వలసలూ ఇతర కారణాలతో క్రమేపీ ముస్లిం జనాభా పెరగటం అసాం మధ్యతరగతిలో తీవ్ర అభద్రతా భావాన్ని సృష్టించింది. అసాం విద్యార్థుల సంఘం నేతృత్వంలో బెంగాలీయులకు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం ఎన్నో ఆటుపోట్లకు లోనైనా చివరకు వలసప్రజల విషయంలో ఒక ఒప్పందానికి దారితీసింది. 1985 ఆగస్టు 15న కుదిరిన ఆ ఒప్పందం ప్రకారం... 1971 మార్చి 24 అర్ధరాత్రి తర్వాత దేశంలోకి ప్రవేశించిన వారందరినీ అక్రమ వలసదారులుగా ప్రకటించి ఓటర్ల జాబితా నుంచి వాళ్ల పేర్లను తొలగించాలి. ఒప్పందం కుదిరి 40 ఏళ్లు గడిచిపోయింది. ఇప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం లభించలేదు. 1971 మార్చి 24 అర్ధరాత్రి నాటికి అసాంలో అర్హులైన పౌరులనూ వారి వారసులనూ గుర్తించి నేషనల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సీ) నవీకరించటం 2019లోనే పూర్తయినా దాన్ని ఇంకా నోటిఫై చేయలేదు. ఎన్నో వివాదాలు, అభ్యంతరాలతో ట్రైబ్యునళ్లు, కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. అక్రమ వలసదారులందరూ ముస్లింలేనని విపరీతంగా ప్రచారం జరిగినా ఎన్‌ఆర్‌సీ కసరత్తులో అది నిజం కాదని తేలింది. ఎన్‌ఆర్‌సీలో చోటుదక్కని ప్రజల సంఖ్య 19.06 లక్షలని నిర్ధారించారు. దాని ప్రకారం అక్రమ వలసదారులు అసాంలో అంతమంది మాత్రమే ఉన్నట్లు లెక్క. మిగతా 3.11 కోట్ల మంది అసాం స్థానికులే. 1,600 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చేసిన కసరత్తులో తేలిన నిజం అదే. అక్రమ వలసదారుల్లో ఏ మతం వారు ఎంతమంది ఉన్నారో ఎన్‌ఆర్‌సీ తుదిజాబితాలో అధికారికంగా పేర్కొనలేదు. అనధికారిక అంచనాల ప్రకారం హిందువులే ఆ జాబితాలో ఎక్కువగా ఉన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి హిందువులు వలసలు రావటం ఎప్పుడూ ఉంది. అన్ని పత్రాలూ పుచ్చుకుని వలసలు వచ్చే పరిస్థితి భారత ఉపఖండంలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడా లేదు. అక్రమ వలసదారుల్లో హిందువులు ఎక్కువగా ఉండటానికి ప్రధానకారణం బంగ్లాదేశ్‌లో వారి సంఖ్య గతంలోనూ ఇప్పటికీ అధికంగానే ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 1.3 కోట్ల మంది హిందువులు బంగ్లాదేశ్‌లో ఉన్నారు. బంగ్లాదేశ్‌ జనాభాలో హిందువుల శాతంలో తగ్గుదల ఉన్నా సంఖ్యాపరంగా చూస్తే పెరుగుదలే కనిపిస్తుంది.


1951లో 92 లక్షల హిందూ జనాభా ఉంటే, ఇప్పుడది 1.3 కోట్లు అయింది. అసాం ఒప్పందం ప్రకారం అక్రమ వలసదారులను మతపరంగా విభజించి చూడటానికి వీల్లేదు. 1971 మార్చి 24 అర్ధరాత్రి తర్వాత దేశంలో కాలుపెట్టిన వాళ్లందరినీ అక్రమ వలసదారులుగానే భావించాలి. హిందువులకూ ముస్లింలకూ ఇదే సూత్రాన్ని వర్తింపచేయాలి. ఎన్‌ఆర్‌సీ ప్రకారం అక్రమ వలసదారుల్లో హిందువులు అధికంగా ఉన్నట్లు స్పష్టంగా తేలటంతో కేంద్ర ప్రభుత్వం అసాం ఒప్పందానికి విరుద్ధంగా అడుగులు వేసింది. ముస్లింలను పక్కనబెట్టి హిందువులకూ మరో అయిదు మతవర్గాల వారికి మాత్రమే పౌరసత్వం కల్పించటానికి పౌరసత్వ చట్టానికి సవరణను తీసుకువచ్చింది. ముస్లింలు తరలిపోటానికి చాలా దేశాలు ఉన్నాయనీ హిందువులకు అట్లాంటి అవకాశం లేదనీ వారికి ఉన్నదల్లా ఒక్క భారతేనన్న విచిత్ర వాదనతో చట్ట సవరణను సమర్థించుకుంది. ఒక్క ఇజ్రాయెల్‌ తప్ప ఏ దేశమూ మతం ఆధారంగా ఇతర దేశాల వారికి పౌరసత్వాన్ని కట్టబెట్టటానికి ఎప్పుడూ పూనుకోలేదు. ఇక భారత రాజ్యాంగ చరిత్రలో గతంలో ఎప్పుడూ మతపరమైన భేదభావాన్ని చూపిస్తూ చట్టానికి సవరణను తీసుకురావటమూ జరగలేదు. పౌరసత్వ చట్ట సవరణతో మరో కీలక మార్పునకూ కేంద్రం శ్రీకారం చుట్టింది. అసాం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 24 తర్వాత వలసలు వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వకూడదు. పౌరసత్వ చట్టానికి తీసుకువచ్చిన సవరణ ప్రకారం, 2014 డిసెంబర్‌ 31 నాటికి దేశంలో అడుగుపెట్టిన హిందువులకూ ముస్లింయేతర ఇతర వర్గాలకూ దాన్ని ఇవ్చొచ్చు.

అక్రమంగా వలస వచ్చిన హిందువులందరికీ పౌరసత్వం కల్పించి ముస్లింలందరినీ బంగ్లాదేశ్‌ పంపించటం సాధ్యం అవుతుందా? అన్నదానికి ప్రభుత్వం దగ్గర జవాబులేదు. అసాం తరహాలోనే పశ్చిమబెంగాల్‌లో కూడా ఎన్‌ఆర్‌సీ కసరత్తుని ఆరంభించి పూర్తిచేస్తే అక్కడా పరిస్థితిలో మార్పు కనపడకపోవచ్చు. సరైన పత్రాల్లేని హిందువులు బెంగాల్‌లో కూడా పెద్దసంఖ్యలోనే తేలే అవకాశం ఉంది. గట్టిగా ప్రయత్నిస్తే వేలల్లో అక్రమ వలసదారులను బయటికి పంపొచ్చు. లక్షల మందిని అట్లా పంపటం సాధ్యం కాదు. భారత్‌లోని అక్రమ వలసదారులందరూ తమ దేశం నుంచి వెళ్లిన వారేనని బంగ్లాదేశ్‌ అంగీకరించటానికి సిద్ధంగా ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యం. అసాం, బెంగాల్లో అక్రమ వలసల వల్ల ముస్లింల జనాభా పెరిగి ఉండొచ్చు. దానికంటే కీలకమైంది.. ముస్లింల్లో సంతానసాఫల్యత రేటు ఎక్కువగా ఉండటం. ముస్లింల జనాభా గణనీయంగా పెరగటానికి అదే ప్రధాన కారణం. విద్యావ్యాప్తి పెరుగుతున్న కొద్దీ, ఆరోగ్యచైతన్యం విస్తరిస్తున్న కొద్దీ అది అన్ని మతాల్లోనూ తగ్గుతోంది. 2000 సంవత్సరం నుంచి ముస్లింల్లో సంతానసాఫల్యతా రేటు గణనీయంగా తగ్గుతోంది. 1992–93 నాటికి అది 4.4 (ఒక మహిళ సగటున కనే పిల్లల సంఖ్య) ఉంటే 2021 నాటికి 2.36కి తగ్గింది. హిందువుల్లో అది 3.3 నుంచి 1.94కి తగ్గింది. తాజా కుటుంబ ఆరోగ్యసర్వేలో వివరాలు సమగ్రంగా వెల్లడైతే ముస్లింల సంతాన సాఫల్యతా రేటు తగ్గుదల ఇంకా స్పష్టంగా కనపడే అవకాశం ఉంది.


నిజానికి భారత జనాభాతో పోల్చితే అక్రమ వలసదారుల సమస్య అంత తీవ్రమైంది కాదు. ఎక్కువలో ఎక్కువగా అరశాతానికి మించరు. వాళ్లందరూ శ్రమజీవులే. ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ప్రగతికి తోడ్పడుతున్నవారే. చౌకగా శ్రమను అందిస్తున్నవారే. అక్రమ వలసజీవుల సమస్యను ఒక మతంతో ముడిపెట్టి ఆ మతానికి చెందిన వారందరినీ అభద్రతా భావంలోకి నెట్టివేయటమే అసలు ప్రమాదంగా మారుతోంది. దేశంలోని అన్ని సమస్యలకు మైనారిటీలను వేలెత్తి చూపటం వల్ల ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. కశ్మీర్‌లో పరిస్థితులూ, పశ్చిమాసియాలో పరిస్థితులూ ఎన్ని భావోద్వేగాలు కలిగించినా భారత్‌లోని మెజారిటీ ముస్లింలు వాటికి తీవ్రంగా ప్రభావితం కాలేదు. తీవ్రవాద చర్యల్లో పాల్గొన్న వారి సంఖ్య చాలా స్వల్పం. ఈ విషయాన్ని విస్మరించి వాళ్లని అనుమానంతో చూసి, వాళ్లకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా చేసి, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన చోటు లేకుండా చేస్తే సమస్యలను కొనితెచ్చుకోవటమే అవుతుంది. జనాభాలో ఏ మతం వాళ్లు ఎంత మంది ఉన్నారన్న దానికంటే ఎలాంటి మత సంకుచిత భావాలతో ఎంతమంది ఉన్నారన్నదే ప్రధానం. ముస్లింలను ఓటు బ్యాంకులుగా చూడటాన్ని విమర్శించిన వాళ్లు హిందువులను కనీవినీ ఎరగని రీతిలో మతప్రాతిపదికగా ఓటు బ్యాంకులుగా మార్చుకోవటం అంతకంటే అనర్థాన్ని తెచ్చిపెడుతుంది. రాజకీయాల్లో మత ప్రభావం పెరిగిన చోట ప్రజాస్వామ్యం క్షీణించటమే గానీ ఎదగటం ఎక్కడా జరగలేదు. మంచికీ చెడుకీ మతపరమైన ముద్రలు వేసేచోట లౌకిక దృష్టితో, హేతుబుద్ధితో చర్చలు తగ్గిపోతాయి. కొత్త ఆలోచనలు అడుగంటిపోతాయి. అవి లేని చోట మనవని చెప్పుకొనే నవీన ఆవిష్కరణలూ ఉండవు. సాంకేతిక ప్రగతీ కనపడదు. అనుకరణలే మిగులుతాయి. దేశ జనాభాలో ముస్లింల శాతం పెరగకూడదని భావిస్తే ముందు వాళ్లను అభివృద్ధిపథంలో నడిపించటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. అది చేయకుండా ఎన్ని కమిటీలు వేసినా ప్రయోజనం ఉండదు. అక్రమ వలసలను ఆపటం అమెరికాకే సాధ్యం కావటం లేదు. ఇప్పటికీ అక్కడ 1.4 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారు. ఆ సంఖ్యతో పోల్చితే మనది చాలా తక్కువ. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వాళ్లది ఫలానా దేశమని గుర్తించటానికి ఏదో ఒక పత్రం దొరుకుతుంది. అలాంటివి ఉండబట్టే 7 లక్షల మంది భారతీయులను అక్రమ వలసదారులుగా గుర్తించారు. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన బడుగుజీవులకు అట్లాంటి పత్రాలు ఉండటం చాలా అరుదు.

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఈ వార్తలనూ చదవండి:

పెళ్లైన కొన్ని గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి..

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్ మధ్య పరస్పర దాడులు..

Updated Date - Jun 02 , 2026 | 02:46 AM