ప్రజల బ్యాంకును విదేశీ చేతుల్లో పెట్టొద్దు
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:24 AM
మీరు జాగ్రత్తగా దాచుకున్న డబ్బు, పిల్లల చదువుకోసం చేసిన డిపాజిట్లు, రైతుకు అవసరమైన కిసాన్ క్రెడిట్, చిన్న వ్యాపారస్థులకు కావాల్సిన రుణం... ఇవన్నీ ఒక బ్యాంకు నిర్ణయాధికారం కిందకు వస్తాయి....
మీరు జాగ్రత్తగా దాచుకున్న డబ్బు, పిల్లల చదువుకోసం చేసిన డిపాజిట్లు, రైతుకు అవసరమైన కిసాన్ క్రెడిట్, చిన్న వ్యాపారస్థులకు కావాల్సిన రుణం... ఇవన్నీ ఒక బ్యాంకు నిర్ణయాధికారం కిందకు వస్తాయి. ఆ నిర్ణయాధికారం ఇప్పుడు ఒక విదేశీ పెట్టుబడి సంస్థ చేతిలోకి వెళ్తోంది. అదే ఐడీబీఐ బ్యాంకు అమ్మకం!
ఐడీబీఐ బ్యాంకులోని 60.72 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్‌కు అమ్మేందుకు కేంద్ర మంత్రివర్గ ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) అక్టోబర్ 14న ఆమోదం తెలిపింది. షేరుకు రూ.81 చొప్పున మొత్తం రూ.52,878 కోట్లకు ఈ వాటా అమ్మకం జరగనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 30.48 శాతం, ఎల్ఐసీ 30.24 శాతం వాటాలను విక్రయిస్తుంది. అమ్మకం పూర్తయిన తర్వాత ప్రభుత్వం వద్ద 15 శాతం, ఎల్ఐసీ వద్ద 19 శాతం వాటాలు మాత్రమే మిగులుతాయి. ఒకరకంగా ఇది లక్షల కోట్ల ప్రజా డిపాజిట్లపై నియంత్రణను ఒక విదేశీ సంస్థకు అప్పగించడమే.
ఐడీబీఐ 1964లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రభుత్వ ఆర్థిక సంస్థ. దీర్ఘకాలిక రుణాల ద్వారా దేశ పరిశ్రమలకు ఆధారంగా నిలిచింది. సరళీకరణ విధానాల కాలంలో దీన్ని క్రమంగా వాణిజ్య బ్యాంకుగా మార్చారు. 2019లో ఎల్ఐసీ 51 శాతం వాటా తీసుకున్న తర్వాత ఐడీబీఐను ప్రైవేటు రంగ బ్యాంకుగా రిజర్వ్ బ్యాంక్ వర్గీకరించింది. ప్రభుత్వంతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్ఐసీ పెట్టుబడితో నడుస్తున్న ఐడీబీఐ ప్రైవేటు బ్యాంక్ ఎలా అవుతుంది?! ప్రస్తుతం ఈ బ్యాంకులో కేంద్రం, ఎల్ఐసీ కలిపి 95 శాతం వాటా కలిగి ఉన్నా, నియంత్రణాధికారం మాత్రం ప్రభుత్వం చేతిలో లేదు! అమ్మకానికి దారి వేయడానికి చేసిన దశలవారీ మార్పులే నేటి ఈ పరిస్థితికి దారితీశాయనే అనుమానం సహజంగా కలుగుతుంది.
ఒకప్పుడు ఐడీబీఐ మొండి బకాయిల భారంతో తీవ్ర సంక్షోభంలో పడింది. ఆ బ్యాంకును నిలబెట్టడానికి ప్రభుత్వం, ఎల్ఐసీ నుంచి భారీ మూలధనం వచ్చింది. ఎల్ఐసీ 2019లో రూ.21,624 కోట్లతో వాటా కొని, తర్వాత మరో రూ.4,743 కోట్లు పెట్టింది. ఇదంతా పాలసీదారుల సొమ్మే. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.4,557 కోట్ల పన్ను చెల్లింపుదారుల ధనాన్ని పెట్టింది.
ఇప్పుడు ఐడీబీఐ బ్యాంకు ఆర్థికంగా బలపడింది. లాభాలు పెరిగాయి. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో లాభం రూ.2,115 కోట్లు. ప్రజల డబ్బుతో బ్యాంకును బాగుచేసి, అది లాభాల దారిలోకి వచ్చాక అమ్మేయడం న్యాయమేనా? ప్రజలు చేసిన పెట్టుబడి ఫలితాన్ని ప్రైవేటు, విదేశీ సంస్థకు అప్పగించడం కాక మరేమిటి?
ప్రభుత్వం రెండు స్వతంత్ర వాల్యుయేషన్ సంస్థల అంచనాల ఆధారంగా షేరుకు రూ.75.99ను ప్రాథమిక విలువగా నిర్ణయించింది. ఫెయిర్‌ఫాక్స్ రూ.81 బిడ్ పెట్టడంతో అది ఆ విలువ కన్నా ఎక్కువేనని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, వాల్యుయేషన్ కాలంలో ఐడీబీఐ షేరు ధర రూ.61.01 నుంచి రూ.118.38 మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది. అంటే షేరు ధర ఒక్కసారి రూ.118 దాటింది. అలాంటి పరిస్థితిలో రూ.81 ధర నిజంగా సరైనదేనా అనే సందేహం కలుగక మానదు.
అంతేకాదు, ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా విలువైన భూములు, భవనాలుఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 50 ఎకరాల స్థలం ఉందని ఐడీబీఐ ఉద్యోగుల ఐక్యవేదిక చెబుతోంది. ఈ స్థిరాస్తుల నిజమైన మార్కెట్ విలువ పూర్తిగా లెక్కలోకి తీసుకున్నారో లేదో ప్రజలకు స్పష్టంగా తెలియాలి.
2003లో ఐడీబీఐ చట్టం తెచ్చినప్పుడు పార్లమెంటు స్థాయీ సంఘం ప్రభుత్వ వాటా 51 శాతం కంటే తగ్గకూడదని సూచించింది. అప్పటి ఆర్థికమంత్రి జస్వంత్ సింగ్ పార్లమెంట్లో ఆ మేరకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వ వాటా 15 శాతానికి పడిపోతోంది. అంటే ఆ హామీ నేరుగా ఉల్లంఘనకు గురవుతోంది. మరీ ముఖ్యంగా, ప్రభుత్వం వద్ద మిగిలిన 15 శాతం వాటాను కూడా భవిష్యత్తులో ఓపెన్ మార్కెట్లో అమ్మేందుకు సీసీఈఏ అధికారాలు ఇచ్చింది. అంటే ఇది కేవలం నియంత్రణ మార్పు కాదు, ప్రభుత్వ ఉనికినే క్రమంగా తుడిచేయడానికి సిద్ధమయ్యారని అర్థం.
ఫెయిర్‌ఫాక్స్‌కు ఇప్పటికే సీఎస్బీ బ్యాంకులో సుమారు 40 శాతం వాటా ఉంది. విలీనం జరిగితే రెండు వేర్వేరు సేవా నిబంధనలు కలిగిన ఉద్యోగులు ఒకే సంస్థలోకి వస్తారు. వేతనాలు, పింఛన్లు, పదోన్నతులు, సేవా షరతులు ఎలా ఉంటాయో ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. సీఎస్బీ యాజమాన్యం బ్యాంకింగ్ పరిశ్రమ ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం గత పదేళ్లుగా జరిగిన రెండు వేతన సవరణలను అమలు చేయలేదు. న్యాయబద్ధమైన ఒప్పందాల అమలు కోసం ఉద్యోగులు నిరంతరం చేస్తున్న పోరాటాలను ఫెయిర్‌ఫాక్స్ యాజమాన్యం ఖాతరు చేయట్లేదు. అలాంటి అనుభవం ఐడీబీఐ ఉద్యోగులకు కూడా పునరావృతం కాదా?!
ఐడీబీఐలో వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారు, మహిళలు, దివ్యాంగులు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఈ బ్యాంకు ప్రభుత్వ రంగంలో ఉన్నంత వరకే రిజర్వేషన్ల రక్షణ ఉంటుంది. ప్రైవేటీకరణ తర్వాత కొత్త నియామకాల్లో ఆ అవకాశం శాశ్వతంగా పోతుంది. జరగబోయే పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? ఇది కేవలం ఉద్యోగుల విషయం మాత్రమే కాదు. రైతులు, చిన్న వ్యాపారులు, మహిళలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుతున్న విధానమే ప్రశ్నార్థకం అవుతుంది. లాభం మాత్రమే లక్ష్యంగా ఉండే విదేశీ పెట్టుబడితో నడిచే ప్రైవేటు బ్యాంకు తక్కువ లాభాల శాఖలను, చిన్న రుణాలను నిర్లక్ష్యం చేసే ప్రమాదం ఉంది. ఐడీబీఐకి దేశవ్యాప్తంగా వేల శాఖలున్నాయి. లక్షలాది జన్‌ధన్ ఖాతాలు, బీమా, అటల్ పెన్షన్ ఖాతాలు ఈ బ్యాంకుపై ఆధారపడి ఉన్నాయి. రూ.3 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లు ప్రధానంగా సామాన్య ప్రజలవే. వారు డబ్బు దాచింది ప్రభుత్వ అండ ఉందన్న నమ్మకంతోనే.
డిపాజిటర్లు భయపడనవసరం లేదని ప్రభుత్వం చెబుతున్నది. కానీ అమ్మకం తర్వాత ఉద్యోగుల సేవా నిబంధనలు, రిజర్వేషన్లు, శాఖల నిర్వహణ, రుణ విధానాలపై చట్టబద్ధమైన హామీలు బహిరంగంగా ప్రకటించలేదు. మాటలతో సరిపెట్టకుండా రాతపూర్వక హామీలు ఇవ్వాలి. ‘మేము, ఎల్ఐసీ వాటాదారులుగా కొనసాగుతాం’ అని ప్రభుత్వం చెబుతోంది. కానీ 15, 19 శాతాల మైనారిటీ వాటాలతో బ్యాంకు విధానాలపై నియంత్రణ ఉండదు! అంతేకాదు, ఈ ఒప్పందం ఇంకా రిజర్వ్‌బ్యాంక్ అనుమతులపై ఆధారపడి ఉంది. ఫెయిర్‌ఫాక్స్ ‘ఫిట్ అండ్ ప్రాపర్’ ప్రమాణాలకు, నియంత్రణ షరతులకు అనుగుణంగా ఉంటుందో లేదో తేలాల్సి ఉంది.
ఐడీబీఐ అమ్మకాన్ని తక్షణమే రద్దు చేయాలి. ప్రభుత్వ వాటా 51 శాతం కన్నా తగ్గనివ్వకూడదన్న 2003 పార్లమెంటు హామీని గౌరవించాలి. ఒప్పంద పత్రాలన్నింటినీ పార్లమెంటు, ప్రజల ముందు ఉంచి చర్చ జరపాలి. అంతవరకు ఏ నిర్ణయమూ అమలు చేయకూడదు. భూములు, భవనాలతో సహా బ్యాంకు ఆస్తుల పూర్తి విలువను స్వతంత్ర సంస్థ ద్వారా నిర్ధారణ చేయాలి. ఉద్యోగుల సేవా నిబంధనలు, రిజర్వేషన్లు, పింఛన్లు, వేతన సవరణ హక్కులకు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలి. ఐడీబీఐకి అభివృద్ధి ఆర్థిక సంస్థ (డీఎఫ్ఐ) హోదా తిరిగి ఇచ్చి, పరిశ్రమలు, గ్రామీణ, చిన్న రుణాలకు చేయూతనివ్వాలి. బ్యాంకులను ముంచిన బడా ఎగవేతదారుల నుంచి బకాయిలు వసూలు చేయాలి. బ్యాంకులను అమ్మడం పరిష్కారం కాదు.
పి. వెంకటరామయ్య
బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
ఈ వార్తలనూ చదవండి:
ఆర్ఎస్ఎస్పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..
భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి