Share News

జనాభా ఆధారంగా పట్టణ విద్యా ప్రణాళిక!

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:51 AM

హైదరాబాద్‌ నగరం ప్రపంచ స్థాయి ఐటీ నగరంగా ఎదిగింది. ఆకాశహర్మ్యాలు పెరిగాయి. ఫ్లైఓవర్లు విస్తరించాయి. రియల్‌ ఎస్టేట్‌ కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. కానీ మహానగరంలో ఒక మౌన సంక్షోభం...

జనాభా ఆధారంగా పట్టణ విద్యా ప్రణాళిక!

హైదరాబాద్‌ నగరం ప్రపంచ స్థాయి ఐటీ నగరంగా ఎదిగింది. ఆకాశహర్మ్యాలు పెరిగాయి. ఫ్లైఓవర్లు విస్తరించాయి. రియల్‌ ఎస్టేట్‌ కోట్ల రూపాయల వ్యాపారంగా మారింది. కానీ మహానగరంలో ఒక మౌన సంక్షోభం నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది, అదే ప్రభుత్వ విద్య క్షీణత. నగరం ఎంత వేగంగా విస్తరించిందో, ప్రభుత్వ పాఠశాలలు అంతగా విస్తరించలేదు. ఫలితంగా లక్షలాది కుటుంబాలు తమ పిల్లల విద్య కోసం ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ నిర్లక్ష్యం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతుంది. 2016లో హైదరాబాద్‌లో 684 స్థానిక సంస్థల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 2025–26 నాటికి అవి కేవలం 691 చేరుకున్నాయి. అంటే దాదాపు పదేళ్లలో కేవలం 7 పాఠశాలలే పెరిగాయి. ఇదే సమయంలో నగర జనాభా లక్షలలో పెరిగింది. కొత్త కాలనీలు, బస్తీలు, వలస కార్మికుల నివాస ప్రాంతాలు విస్తరించాయి. కానీ ప్రభుత్వ విద్య మాత్రం అక్కడికి చేరలేదు. మూడు కార్పొరేషన్లు కలిపి ఏకంగా నగర జనాభా 1.30 కోట్లు.

ఈ ఖాళీని ప్రైవేట్ విద్యాసంస్థలు వేగంగా భర్తీ చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 1,900కు పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 7 లక్షలకు పైగా పిల్లలు చదువుతున్నారు. నగరంలోని దాదాపు 86శాతం పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తున్నారు. ఇది కేవలం ‘తల్లిదండ్రుల ఎంపిక’గా చూడలేం. ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకపోవడం, నిరంతర విద్యా వ్యవస్థ లేకపోవడం ప్రజలను ప్రైవేట్ విద్య వైపు నెట్టింది. ప్రైవేట్ పాఠశాలలు ఒక ముఖ్య విషయాన్ని అర్థం చేసుకున్నాయి. అది– పిల్లలు ఒకసారి చేరితే పదో తరగతి వరకు అదే పాఠశాలలో చదవాలనే తల్లిదండ్రుల ఆకాంక్ష. అందుకే ఎక్కువ ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుంచి పదో తరగతి వరకు నిరంతర విద్య అందిస్తున్నాయి. కానీ ఇప్పటికీ ఒకచోట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, మరోచోట ఉన్నత ప్రాథమిక పాఠశాల ఉంటున్నాయి. పాఠశాలలు మారాల్సి రావడం వల్ల చాలామంది పిల్లలు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఇటీవల నీతి ఆయోగ్‌ కూడా ప్రాథమిక స్థాయి నుంచి సెకండరీ స్థాయి వరకు ఒకే పాఠశాలలో పిల్లలు చదివే విధానం అవసరమని చెప్పింది. తెలంగాణ విద్యా కమిషన్ కూడా ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ ఆలోచనను ఇదే నేపథ్యంలో ప్రతిపాదించింది.


మహానగరంలో నూతనంగా ఏర్పడిన మూడు కార్పొరేషన్లలో ఏర్పడిన 36 డివిజన్లలో క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారం ప్రకారం, 15 లక్షల జనాభాకు కేవలం 115 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత, 40 ఉన్నత పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. ఈ పాఠశాలల్లో కేవలం 25 వేల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. పట్టణ జనాభాలో సరాసరి 13.7శాతం 6 నుంచి 14 సంవత్సరాల బాలలు ఉంటారని ఈ మధ్య జరిగిన కుల గణన సర్వే తెలిపింది. అంటే ఈ 36 డివిజన్లలో 15 లక్షల జనాభాకు 2 లక్షల మంది బడికెళ్లే వయసు బాలలు ఉంటే, కేవలం 25 (12శాతం) వేల మందికి మాత్రమే సరిపడ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అవి కూడా అరకొర వసతులతో నడుస్తున్నాయి.

కుల గణన సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న అధిక శాతం దినసరి కూలీలుగా, నైపుణ్యం లేని కూలీలుగా, వీధులలో చిన్న వ్యాపారాలు చేస్తూ అతి తక్కువ ఆదాయాలతో జీవనం కొనసాగిస్తున్నారు. జనాభాలో 78.2శాతం మంది సంవత్సరానికి కేవలం రూ.లక్ష కంటే తక్కువ సంపాదించేవారు ఉన్నారని ఈ సర్వేను పరిశీలించిన స్వతంత్ర నిపుణుల బృందం విశ్లేషణ ద్వారా తెలుస్తోంది. ఈ కుటుంబాలన్నీ తీవ్ర వెనుకబాటులో ఉన్న కులాలే అని విశ్లేషించింది. ఈ కుటుంబాల మీద ప్రైవేటు విద్య భారం ఎంత పడుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఇది కేవలం హైదరాబాద్‌ సమస్య మాత్రమే కాదు. గ్రామీణ సంక్షోభం, వ్యవసాయ అస్థిరత, ఉపాధి కొరత, జీవన అవకాశాల లోపం వల్ల లక్షలాది కుటుంబాలు నగరాలకు వలస వస్తున్నాయి. కేవలం ఉపాధి కోసమే కాకుండా తమ పిల్లలకు మెరుగైన విద్య లభించాలనే ఆశ వల్ల కూడా ఈ వలసలు జరుగుతున్నాయి. గ్రామాల్లో నాణ్యమైన పాఠశాలలు లేకపోవడం, ఉన్నత విద్య అందుబాటులో లేకపోవడంతోపాటు, ఇంగ్లీష్‌ మీడియం, నిరంతర విద్య కోసం తల్లిదండ్రులు నగరాలను ఆశ్రయిస్తున్నారు. కానీ విద్యాశాఖ ఇప్పటికీ గ్రామీణ నమూనాలతోనే పట్టణ విద్యను ప్రణాళిక చేస్తోంది. ‘ఒక కిలోమీటర్ పరిధిలో ఒక ప్రాథమిక పాఠశాల’ అనే పాత ప్రమాణం పట్టణ ప్రాంతాలకు సరిపోదు. నగరాల్లో జనసాంద్రత చాలా ఎక్కువ. ఉదాహరణకు హైదరాబాద్‌లో ప్రతి చదరపు కిలోమీటర్‌కు సుమారు 15 వేల మంది జనాభా నివసిస్తున్నారు. ఇంత భారీ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో కేవలం దూర ప్రమాణాలతో పాఠశాలల ప్రణాళిక చేయడం వాస్తవ పరిస్థితులకు అనుగుణం కాదు. పట్టణ విద్యా ప్రణాళిక జనాభా ఆధారంగా ఉండాలి. మన ప్రభుత్వాలు ఇప్పటికే అనేక సేవలను జనాభా ప్రాతిపదికన ప్రణాళిక చేస్తున్నాయి. మద్యం దుకాణాలు, పోలింగ్‌ బూత్‌లు, ఆరోగ్య సేవలు కూడా జనాభా ఆధారంగానే ఏర్పాటు అవుతున్నాయి. అయితే విద్య విషయంలో మాత్రం ఇప్పటికీ పాత ప్రమాణాలనే కొనసాగిస్తున్నారు. ఇది అత్యంత ఆందోళనకర విషయం.


పట్టణ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, మెట్రోలు, ఐటీ టవర్లు కాదు. విద్య కూడా పట్టణ మౌలిక సదుపాయాలలో భాగం కావాలి. ప్రతి కొత్త కాలనీ, పెద్ద హౌసింగ్‌ ప్రాజెక్ట్‌, విస్తరిస్తున్న నగర ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల కోసం భూమిని తప్పనిసరిగా కేటాయించాలి. ఇవి ఎవరి దయాదాక్షిణ్యాలతోనో అందుకునే సేవలు కావు. ఇది పిల్లల రాజ్యాంగ హక్కు. ప్రభుత్వ విద్యను సంక్షేమ కార్యక్రమంలా కాకుండా, పట్టణ ప్రణాళిక, సామాజిక న్యాయ కార్యక్రమంగా చూడాలి.

హైదరాబాద్‌ మహానగరం ఫ్యూచర్ సిటీ, క్యూర్ రీజియన్ భవిష్యత్తు గురించి నిజంగా ఆలోచిస్తే, ప్రభుత్వ విద్య పునర్నిర్మాణం తప్పనిసరి. లేదంటే విద్య పూర్తిగా మార్కెట్‌ ఆధారిత వ్యవస్థగా మారి, పేద, మధ్యతరగతి కుటుంబాలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. కొంతమందిని వెలివేస్తుంది. సమాన అవకాశాల సమాజం నిర్మించాలంటే బలమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థే పునాది. కాబట్టి కాలయాపన చేయకుండా విద్యానిపుణులతో తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులను పరిశీలించి తక్షణమే పట్టణ విద్యా ప్రణాళికలు తయారు చేయాలి.

ఆర్.వెంకటరెడ్డి

జాతీయ కన్వీనర్, ఎం.వి ఫౌండేషన్

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కసరత్తు.. జూన్ 23 నుంచి సంప్రదింపులు

జులై మూడో వారంలో తల్లికి వందనం!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 12:51 AM