Share News

కాలం కళ్లలో పొగ

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:17 AM

నగరాల నరాల్లో ఇప్పుడు రక్తం కాదు,సైరన్‌ల శబ్దం ప్రవహిస్తోంది.గోడలన్నీఇటుకలతో కట్టబడలేదు – భయాలతో, అనుమానాలతో, నిశ్శబ్దాలతో నిర్మించబడ్డాయి.

కాలం కళ్లలో పొగ

నగరాల నరాల్లో ఇప్పుడు రక్తం కాదు,

సైరన్‌ల శబ్దం ప్రవహిస్తోంది.

గోడలన్నీఇటుకలతో కట్టబడలేదు –

భయాలతో, అనుమానాలతో,

నిశ్శబ్దాలతో నిర్మించబడ్డాయి.

మొబైల్ వెలుగుల్లో ముఖాలు మెరుస్తున్నాయి గానీ

మనసులు మాత్రం లోడింగ్ చక్రంలా తిరుగుతూనే ఉన్నాయి.

సత్యం ఇప్పుడు అద్దం ముందర నిలబడదు;

అధికారపు రంగుల కింద నలిగిపోతూ

ముసుగుల వెనుక బందీ అవుతోంది.

పిల్లల నవ్వులు పాఠశాల మైదానాల్లో కాదు,

రీల్స్ మధ్యసెకన్ల కొద్దీ మెరిసి ఆరిపోతున్నాయి.

గుక్కెడు గంజి కోసం

పేదవాడి కడుపులో యుద్ధమే జరుగుతోంది;

కానీ నిండిన గాదెల ధాన్యంపై

పందికొక్కుల పండుగ సాగుతోంది.

మతాల పేర్లతో

మనుషులను కొలిచే కాలం ఇది;

రక్తం రంగు ఒక్కటేనని

గాయాలు ఘోషిస్తున్నా...

వినాల్సిన చెవులన్నీ గోడలయ్యాయి.

చెట్లను నరికేసిన వీధుల్లో

ఇప్పుడు నీడలు కూడా అనాథలే;

పక్షులు ఆకాశాన్ని చిరునామా అడుగుతున్నాయి.

అయినా – ఒక మూలన ఇంకా ఎవరో

చీకటిలో దీపం వెలిగిస్తూనే ఉన్నారు;

ఇంకా ఎవరో రాళ్ల మధ్య

మొక్క నాటుతూనే ఉన్నారు;

అందుకే కాలం ఇంకా పూర్తిగా చనిపోలేదు –

మనిషి లోపల ఇంకా కొద్దిగా వసంతం మిగిలే ఉంది!

- యండి. ఉస్మాన్ ఖాన్

99125 80645

Updated Date - Jun 29 , 2026 | 04:18 AM