Share News

అవయవదానంపై నమ్మకం పెంచే ‘తోట’

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:38 AM

మన దేశంలో ప్రతి ఏటా వేలాదిమంది రోగులు సమయానికి దాత అవయవం దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణం ‘మృత దాతల’ సంఖ్య చాలా తక్కువగా ఉండటం. ‘బ్రెయిన్‌ డెత్‌’ జరిగిన...

అవయవదానంపై నమ్మకం పెంచే ‘తోట’

మన దేశంలో ప్రతి ఏటా వేలాదిమంది రోగులు సమయానికి దాత అవయవం దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణం ‘మృత దాతల’ సంఖ్య చాలా తక్కువగా ఉండటం. ‘బ్రెయిన్‌ డెత్‌’ జరిగిన అనేకమంది నుంచి అవయవాలు సేకరించే అవకాశం ఉన్నప్పటికీ, అవగాహన లోపం, కుటుంబ సభ్యుల్లో సందేహాలు, కొన్ని సామాజిక అపోహల కారణంగా అది జరగటం లేదు.

దేశంలో అవయవదాన చట్టం అవసరాన్ని ప్రభుత్వం ఎనభయ్యవ దశకంలోనే గుర్తించింది. అప్పట్లో అక్రమ కిడ్నీ వ్యాపారం, పేదలను ప్రలోభపెట్టి అవయవాలు కొనుగోలు చేయడం, తప్పుడు పత్రాలతో అవయవ మార్పిడులు నిర్వహించడం వంటి సంఘటనలు ఎన్నో వెలుగుచూసిన పరిస్థితుల్లో అవయవ మార్పిడి వ్యవస్థను చట్టబద్ధంగా నియంత్రించడం అత్యవసరమైంది. ఇందుకోసమే 1994లో ‘Transplantation of Human Organs Act’ అమల్లోకి వచ్చింది. అనంతరం వైద్యరంగంలో వచ్చిన మార్పులను దృష్టిలో ఉంచుకుని 2011లో ఈ చట్టాన్ని సవరించి, ‘Transplantation of Human Organs and Tissues Act (THOTA)’గా విస్తరించారు. తరువాత ‘THOTA Rules–2014’ ద్వారా చట్టం అమలుకు విధివిధానాలను ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది.

ఈ చట్టం తీసుకొచ్చిన అత్యంత ముఖ్యమైన మార్పు ‘బ్రెయిన్‌ డెత్‌’కు చట్టబద్ధ గుర్తింపు ఇవ్వడం. గుండె వెంటిలేటర్‌ సహాయంతో కొట్టుకుంటున్నప్పటికీ, మెదడు శాశ్వతంగా పనిచేయడం ఆగిపోయి, తిరిగి కోలుకునే అవకాశం లేనప్పుడు– ఆ వ్యక్తిని వైద్యపరంగా, చట్టపరంగా మరణించినట్టుగా, ‘జీవన్మృతుని’గా గుర్తిస్తారు. అలాంటి దాత నుంచి గుండె, కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కంటి కార్నియాలు, చర్మం, ఎముకలు వంటి అనేక అవయవాలు, కణజాలాలను సేకరించి మరెందరికో కొత్త జీవితం ఇవ్వవచ్చు. ఒక మృతదాత ఎనిమిదిమందికి పైగా ప్రాణాలను కాపాడగలడు. దాతకు రక్షణ కల్పించడం, రోగికి న్యాయం చేయడం, అక్రమ అవయవ వ్యాపారాన్ని అరికట్టడం– ఈ మూడు సూత్రాలపై ‘తోట’ చట్టం నిర్మితమైంది. ఈ చట్టం ప్రకారం అవయవదానం రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి జీవించి ఉన్న వ్యక్తి తన కిడ్నీ లేదా కాలేయంలోని కొంత భాగాన్ని దానం చేయడం. కేవలం తల్లిదండ్రులు, తోబుట్టువులు, పిల్లలు, భార్య లేదా భర్త, తాత, అమ్మమ్మ, నానమ్మ మాత్రమే చట్టరీత్యా అవయవాన్ని దానం చేయవచ్చు. ఇతరులు దానం చేయాలంటే తప్పనిసరిగా ఆథరైజేషన్‌ కమిటీ అనుమతి తీసుకోవాలి. రెండవది జీవన్మృతులైన (బ్రెయిన్‌ డెడ్‌) వారి నుంచి అవయవాలను సేకరించడం. ప్రపంచవ్యాప్తంగా మృతదాతల నుంచి ఎక్కువ అవయవాలు లభిస్తున్నప్పటికీ, భారతదేశంలో ఇప్పటికీ ఎక్కువ మార్పిడులు రక్తసంబంధీకుల ద్వారానే జరుగుతున్నాయి.


‘బ్రెయిన్‌ డెత్‌’ను ప్రత్యేక అర్హత కలిగిన వైద్యుల బృందం నిర్దిష్ట పరీక్షలు చేశాకనే ధ్రువీకరిస్తుంది. ‘తోట’ చట్టంలో మరో ముఖ్యమైన అంశం Organ Allocation. దాత అవయవం ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం డబ్బు, పరిచయాలు లేదా పరపతి ఆధారంగా గాక, రోగి వైద్య పరిస్థితి, వెయిటింగ్‌ లిస్ట్‌లో సీనియారిటీ, బ్లడ్‌ గ్రూప్‌, టిష్యూ అనుకూలత వంటి శాస్త్రీయ ప్రమాణాల ఆధారంగా ఉండాలి. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే ముఖ్యమైన నిబంధన.

‘తోట’ చట్టంలో Human Organ Traffickingపై కఠిన నిబంధనలు ఉన్నాయి. అవయవాలను కొనడం, అమ్మడం, మధ్యవర్తిత్వం చేయడం, తప్పుడు పత్రాలు సృష్టించడం, డబ్బు కోసం దానం చేయించడం, చట్టవిరుద్ధ మార్పిడులు నిర్వహించడం చట్టరీత్యా నేరం. ఈ చట్టం ప్రకారం ఇలాంటి నేరాలకు 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ.20 లక్షల నుంచి రూ.1 కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించిన ఆసుపత్రుల రిజిస్ట్రేషన్‌ రద్దు చేయవచ్చు. సదరు వైద్యులపై కూడా చర్యలు తీసుకోవచ్చు.

ఇప్పటి అవసరం ‘తోట’ చట్టాన్ని మార్చడం కంటే, మరింత సమర్థవంతంగా అమలు చేయడం. ఆ దిశగా ముఖ్యమైనది ‘నేషనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ రిజిస్ట్రీ’. ప్రస్తుతం దేశంలో ఎన్ని మార్పిడులు జరిగాయి అనే సమాచారం ఉన్నప్పటికీ, ప్రతి ఆసుపత్రి అవయవాలు ఇచ్చిన, తీసుకున్నవారి నిర్దిష్ట సమాచారం, దీర్ఘకాల ఫలితాలను ఏకరీతిన నమోదుచేసి జాతీయస్థాయిలో నివేదించే వ్యవస్థ మరింత బలోపేతం కావాలి. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఒక ‘నేషనల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ రిపోర్ట్‌’ విడుదల చేయాలి. అందులో ఎన్ని మార్పిడులు జరిగాయి? ఎంతమంది వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నారు? ఎంతమంది దాతలు లభించారు? ఏ రాష్ట్రాలు మెరుగైన పనితీరు చూపించాయి? వంటి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. మరో ముఖ్యమైన అంశం హాస్పిటల్‌ ఆడిట్‌. అవయవ మార్పిడి చేసే ప్రతి ఆసుపత్రిలో బ్రెయిన్‌ డెత్‌ కేసులను క్రమం తప్పకుండా సమీక్షించాలి. దాతగా మారే అవకాశం ఉన్న ప్రతి రోగిని గుర్తించారా? కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారా? ఎందుకు అవయవదానం జరగలేదు? అనే అంశాలను పరిశీలిస్తే మృతదాతల సంఖ్య గణనీయంగా పెరగవచ్చు.


జీవించినవారు దాతలైతే వారి ఆరోగ్యాన్ని కూడా దీర్ఘకాలం పర్యవేక్షించాలి. అవయవ దానం చేసిన వ్యక్తి ఆరోగ్యం, మానసిక స్థితి, జీవన నాణ్యతను సంవత్సరాల పాటు పరిశీలించే విధానం దేశవ్యాప్తంగా అమలులోకి రావాలి. ఇంకో ముఖ్యమైన అంశం ‘డిజిటల్‌ ట్రాన్స్‌పరెన్సీ’. దేశవ్యాప్తంగా ఒకే విధమైన డిజిటల్‌ వెయిటింగ్‌ లిస్ట్‌, ఆర్గాన్‌ అలొకేషన్‌ సిస్టమ్‌ ఉంటే అవయవాల కేటాయింపుపై అనవసర అనుమానాలు తగ్గుతాయి. ‘THOTA Act’ భారతదేశంలో అవయవదానానికి బలమైన పునాది వేసింది. ఈ చట్టం దాతను రక్షిస్తుంది, రోగికి న్యాయం చేస్తుంది, అక్రమ అవయవ వ్యాపారాన్ని అరికడుతుంది. కానీ చట్టం ఒక్కటే సరిపోదు. ప్రజల్లో అవగాహన, ఆసుపత్రుల బాధ్యత, ప్రభుత్వ పర్యవేక్షణ, పారదర్శక డేటా, నైతిక వైద్య విధానం– ఈ ఐదు అంశాలు కలిసొస్తేనే భారతదేశంలో అవయవదానం నిజమైన ప్రజా ఉద్యమంగా మారుతుంది.

డా. శ్రీభూషణ్‌ రాజు

హెడ్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ, ‘నిమ్స్‌’

ఈ వార్తలు కూడా చదవండి..

సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం

రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్

Updated Date - Jul 08 , 2026 | 05:38 AM