నూతన ఆవిష్కరణలకు నెలవైన కలెక్టర్ల వ్యవస్థ
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:24 AM
జిల్లా కలెక్టర్ల సదస్సులు 1995కు ముందు తరచుగా జరిగేవి కాదు. ఆనాటి ముఖ్యమంత్రులు ప్రారంభోపన్యాసం ఇచ్చి టీ బ్రేక్ తరువాత నిష్క్రమించేవారు. తరువాత ప్రభుత్వ ప్రధాన...
జిల్లా కలెక్టర్ల సదస్సులు 1995కు ముందు తరచుగా జరిగేవి కాదు. ఆనాటి ముఖ్యమంత్రులు ప్రారంభోపన్యాసం ఇచ్చి టీ బ్రేక్ తరువాత నిష్క్రమించేవారు. తరువాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పలు శాఖల ప్రగతి, శాఖల మధ్య సమన్వయంతో పాటు జిల్లాలలోని సమస్యలను కార్యదర్శులు, శాఖాధిపతులు చర్చించేవారు. ఒక్కోసారి ముఖ్యమంత్రులు ముగింపు సమావేశానికి వచ్చి, సమావేశపు సారాంశం తెలుసుకొని కొన్ని నిర్ణయాలు ప్రకటించేవారు.
చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయ్యాక కలెక్టర్ల బాధ్యతలు, పనితీరు, కలెక్టర్ల సదస్సుల రూపురేఖలు మారిపోయాయి. ప్రారంభోపన్యాసం నుంచి వందన సమర్పణ వరకు రెండు రోజులు ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం మొత్తం ఉండేది. శాఖలవారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ఈ సదస్సులు జరిగేవి. ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, స్వయం సహాయక బృందాల ఏర్పాటు వంటి కార్యక్రమాలలో ప్రజలను భాగస్వాములను చేస్తూ కలెక్టర్లను పేదరిక నిర్మూలన, గ్రామీణాభ్యుదయానికి ప్రధాన చోదకునిగా మార్చారు. ఇంకోవైపు సాంకేతికతను పరిపాలనలో వినియోగించడానికి అధికారులకు, సిబ్బందికి కంప్యూటర్ వినియోగంలో శిక్షణ, రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ, ఈ–సేవ లాంటి వినూత్న పథకాల అమలుపై కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యత పెట్టారు. కార్యాలయాల్లో సుపరిపాలనకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఆ సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం, పారదర్శకత లాంటి నూతన దృక్పథం అలవాటయింది. విజన్ 20–20 కింద దీనినే స్మార్ట్ ప్రభుత్వంగా ఆనాడు పరిగణించారు.
2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి జిల్లాను యూనిట్‌గా తీసుకొని ఆర్థిక పురోగతిని (జీఎస్‌డీపీ) సాధించే దిశగా ప్రణాళికలు రూపొందాయి. జిల్లాలోని వివిధ వనరులను వినియోగించి జీఎస్‌డీపీ పెంచి ప్రగతిపథంలో నడిపే బాధ్యత కలెక్టర్‌కు ఇచ్చారు. జిల్లాల్లో ఉండే భౌగోళిక, సామాజిక పరిస్థితులకు, వనరులకు అనుగుణంగా ఆయా జిల్లాల ఆర్థిక ప్రగతికి, మానవ వికాసానికి కావలసిన సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు, కార్యాచరణ బాధ్యతలను కలెక్టర్లపై ఉంచారు. ప్రభుత్వ కార్యనిర్వహణ పూర్తిగా సాంకేతికత, డిజిటల్ డేటా, రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానం, కృత్రిమ మేధ లాంటి కొత్త సాధనాల వల్ల క్షణాలపై పాలన (రియల్ టైం గవర్నెన్స్) విధానం ద్వారా వేగవంతమైన, కచ్చితమైన, దోష రహిత నిర్ణయాలు తీసుకోగల్గిన వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పటి నవతరానికి చెందిన ఉన్నత మేధో సంపత్తి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువ కలెక్టర్ల పనితీరుకు పదునుపెట్టే విధంగా ఇటీవలి కాలంలో నిర్వహించే కలెక్టర్ల సదస్సులు ఉంటున్నాయి.
ఇటీవల అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల ఆరో సదస్సులో తమ జిల్లాల్లో చేసిన వినూత్న ఆవిష్కరణలను, వాటి ఫలితాలను కలెక్టర్లు ఉత్సాహంగా పంచుకున్నారు. అత్యంత వర్షాభావ అన్నమయ్య జిల్లాలో వివిధ శాఖల మానవ వనరులను, సాంకేతికతను, ఆ ప్రాంత ప్రజల అనుభవాలను జోడించి, వివిధ ప్రభుత్వ పథకాల నిధులను అనుసంధానించి సాగు/తాగు నీటి లభ్యతను, భూగర్భ జలాలను పెంచే వినూత్న జలధార పథకాన్ని కలెక్టర్ చేపట్టారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రిమోట్ సెన్సింగ్ పరిజ్ఞానాన్ని ఆయా నదీ పరీవాహక ప్రాంతాలలో లభించే నీటి లభ్యతను పరిశీలించి ఎక్కువ నీటి లభ్యత కలిగిన పరీవాహక ప్రాంతం నుంచి తక్కువ నీటి లభ్యత ఉన్న పరీవాహక ప్రాంతానికి నీటిని తరలించే ఒక కొత్త ఆలోచన అమలు చేసి సత్ఫలితాలు రాబట్టారు. అదే విధంగా వివిధ జిల్లా కలెక్టర్లు వారి వారి జిల్లాలలో ఉన్న పరిస్థితులను, అవకాశాలను అవగాహన చేసుకుని తదనుగుణంగా కొన్ని ప్రయోగాలు చేశారు. అనకాపల్లి జిల్లాలో నెట్ జీరో కాన్సెప్ట్ కింద హాస్టళ్లలో, పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసి పోషకాహార స్థిరత్వాన్ని, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించారు. చిత్తూరు జిల్లాలో వ్యక్తిగత డిజిటల్ ఆరోగ్య రికార్డులు సృష్టించి ప్రజా ఆరోగ్య వ్యవస్థను సంజీవిని అనే పేరుతో బలోపేతం చేశారు. నెల్లూరు జిల్లాలో గ్రామసభలు నిర్వహించి భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే ప్రయోగాన్ని అమలు చేస్తున్నారు. ఇలా చాలానే ఉన్నాయి. ఈ పథకాలు ఏవీ కూడా ప్రభుత్వం నిర్దేశించినవి కావు. కానీ ఆయా కలెక్టర్లు స్థానిక ప్రజల సమస్యల పట్ల స్పందించి, పరిశీలించి, విశ్లేషించి వారి తెలివిని వినియోగించి స్థానికంగా వివిధ శాఖలకు కేటాయించిన నిధులను కన్వర్జెన్స్ విధానంలో చేపట్టిన గొప్ప ఆవిష్కరణలు.
రానున్న రోజుల్లో నిరంతరం సాంకేతికను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే చంద్రబాబు నాయుడు దార్శనికతతో స్వర్ణాంధ్ర విజన్– 2047 సాధించే దిశగా ఈ యువ కలెక్టర్లు ద్విగుణీకృత ఉత్సాహంతో పాటుపడతారని ఆశిద్దాం.
డా. పి.కృష్ణయ్య
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి
ఇవి కూడా చదవండి
ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..
IPL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..