Share News

అణ్వస్త్ర రహిత ప్రపంచం కలయేనా?

ABN , Publish Date - Aug 06 , 2026 | 03:47 AM

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలలో 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో అమెరికా మొట్టమొదటిసారిగా అణ్వాయుధాలను ప్రయోగించింది. యురేనియంతో చేసిన ‘లిటిల్ బోయ్‌’ ఆయుధం హిరోషిమా నగరాన్ని ధ్వంసం చేసి...

అణ్వస్త్ర రహిత ప్రపంచం కలయేనా?

జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలలో 1945 ఆగస్టు 6, 9 తేదీల్లో అమెరికా మొట్టమొదటిసారిగా అణ్వాయుధాలను ప్రయోగించింది. యురేనియంతో చేసిన ‘లిటిల్ బోయ్‌’ ఆయుధం హిరోషిమా నగరాన్ని ధ్వంసం చేసి, 80 వేలకు పైగా ప్రజల్ని చంపింది. ప్లూటోనియం బాంబు నాగసాకిలో ప్రయోగించగా పేలుళ్లలో 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తదుపరి రోజుల్లో ఈ మరణాలు రెండు లక్షలు దాటాయి. రేడియేషన్ ప్రభావం తరతరాలను వెంటాడింది. ఘోర పర్యవసానాలను జపాన్ ప్రజలు చవిచూశారు. ఇప్పుడు ప్రపంచంలో అంతకుమించి పదుల రెట్ల శక్తిమంతమైన బాంబులు పలు దేశాల వద్ద ఉన్నాయి. నేడు ప్రపంచంలోని అణ్వస్త్ర దేశాల వద్ద 12 వేలకు పైగా అణ్వస్త్రాలు ఉన్నాయి. వాటిలో అత్యధిక భాగం అమెరికా, రష్యాల వద్దే ఉన్నాయి. హిరోషిమా, నాగసాకిల విషాదం జరిగి 80 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ అణ్వస్త్ర ముప్పు ప్రపంచ ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నది.

ఇరాన్‌ అణ్వస్త్రాన్ని తయారు చేస్తోందనే నెపంతో... ప్రపంచంలో 5 వేల పైచిలుకు అణ్వస్త్రాల్ని కల్గి ఉన్న అమెరికా, ఇజ్రాయెల్‌తో కలిసి ఫిబ్రవరి 28 నుంచి ఆ దేశంపై యుద్ధం చేస్తున్నది. అణుశక్తిని శాంతియుత ఇంధన తయారీ కోసమే వాడతామని ఇరాన్ చెబుతున్నా, 2015లో ఇరాన్ P5+1 దేశాలతో JCPOA అణు ఒప్పందం కుదుర్చుకున్నా, అమెరికా ఇంకా కట్టుకథల్నే వల్లిస్తూ, ఇరాన్‌తో పశ్చిమాసియాకు ముప్పని చెబుతోంది. విచిత్రమేమంటే ఇజ్రాయెల్ దగ్గర 200 పైగా అణ్వస్త్రాలున్నా అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌.పి.టి)పై సంతకం చేయలేదు. జనవరి 1, 1967కు ముందు అణ్వాయుధాల్ని లేదా అణుపేలుళ్ల పరికరాలను తయారు చేసిన, పేల్చిన దేశాలను అణ్వాయుధ దేశాలుగా నిర్వచించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ‘ఐఏఈఏ’కు కీలకమైన ధ్రువీకరణ బాధ్యతలు అప్పగించారు. ఇజ్రాయెల్ తన అణ్వాయుధాల్ని పరిశీలించటానికి ఈ అంతర్జాతీయ అణుశక్తి సంస్థకు ఇంతవరకూ అనుమతినీయలేదు. కానీ ఇరాన్, తనిఖీకి అభ్యంతరం పెట్టలేదు. కనుక ఎవరి నుంచి ఎవరికి ముప్పో స్పష్టంగా తెలుస్తున్నది. ఎన్‌.పి.టి 1970 నుంచి అమలులోకి వచ్చింది. 1995 మే నెలలో ఈ ఒప్పందాన్ని నిరవధికంగా పొడిగించారు. 191 దేశాలు సంతకాలు చేశాయి. అణు నిరాయుధీకరణ, అణుశక్తి శాంతియుత వినియోగం కోసమే ఉండాలనీ, అణ్వాయుధాలను ఇతర అణుపేలుళ్ల పరికరాలను తయారు చేయకూడదని, మరే విధంగానూ వాడకూడదనే షరతులకు ఈ దేశాలు కట్టుబడి ఉండటంతో పాటు వేరే దేశాలకు అణు ఆయుధ తయారీలో సహాయపడకూడదు.

అంతర్జాతీయ రక్షణ పర్యవేక్షణ సంస్థగా ఐఏఈఏ ఒక నిర్దిష్ట ధ్రువీకరణ బాధ్యతను కలిగి ఉంది. అణ్వాయుధాలు లేని దేశాలు ఎన్‌.పి.టి కింద స్వీకరించిన బాధ్యతల అమలును ఈ సంస్థ ధ్రువీకరిస్తుంది. 2025 డిసెంబరు నాటికి అణ్వాయుధాలు లేని 183 దేశాలు ఈ సమగ్ర రక్షణ ఒప్పందాలను అమలులోకి తీసుకొచ్చాయి. ఎన్‌.పి.టిపై సంతకం చేయని ఇజ్రాయెల్ అణ్వాయుధాలను చట్టపరంగా ధ్రువీకరించుకోలేదు. 1960 నుంచి తన దగ్గర ఉన్న అణ్వాయుధాల గురించి ప్రపంచానికి తెలియపర్చకుండా ప్రత్యర్థులను నిరోధించటానికి ప్రయత్నం చేస్తున్నది.


ఇదిలా ఉండగా ఇటీవల సౌదీ అరేబియా కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ఒప్పందాన్ని ఆమోదించారు. దీని ప్రకారం సౌదీ అరేబియా తన సొంతగడ్డపై యురేనియంను సుసంపన్నం చేసుకునే సామర్థ్యంతో పౌర అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకోటానికి వీలు ఉంటుంది. ఇది అమెరికా దీర్ఘకాలిక అణు నిరాయుధీకరణ విధానంలో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా సౌదీలో అమెరికా కంపెనీల అణు పరిశ్రమ నిర్మాణ మార్గాన్ని సులభం చేస్తుంది. అమెరికా–సౌదీ అరేబియాల మధ్య అణు సహకారంపై పలువురు అధ్యక్షుల హయాంలో చర్చలు కొనసాగాయి. ఇజ్రాయెల్‌ను దౌత్యపరంగా సౌదీ అరేబియా గుర్తించాలని తద్వారా అణు సహకారం అందిస్తామని జో బైడెన్ చెప్పారు. గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం తర్వాత ఆ చర్చలు నిలిచిపోయాయి. తాజాగా ట్రంప్ ప్రభుత్వం నిబంధనలను సడలించి చర్చలను పునరుద్ధరించిన తర్వాత కుదిరిన ఒప్పందం 30 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అణుశక్తి దిగ్గజం వెస్టింగ్‌హౌస్‌తో సహా పలు అమెరికా కంపెనీలు సౌదీ అరేబియాలో అణురంగ అభివృద్ధికి కృషి చేయటం ద్వారా భవిష్యత్తులో సౌదీ అరేబియాను అణ్వస్త్ర దేశంగా తయారు చేసే ప్రమాదం పొంచి ఉంది. దీనితో పశ్చిమాసియాలో శాంతి ఎండమావై, ఆయుధ పోటీతో ప్రమాదం పెరగనున్నది.

మరోవైపు చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో బలపడుతూ అమెరికాతో పోటీపడుతున్నది. పీపీపీ జీడీపీలో (కొనుగోలు శక్తి సమాన జీడీపీ) అమెరికాను అధిగమించింది. ఇప్పటికే తన పీపీపీ 44 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా కంటే ముందంజలో ఉంది. ఆర్థిక పోటీతో పాటు ప్రచ్ఛన్నయుద్ధంలో సోవియట్ యూనియన్‌తో జరిగినట్లుగా చైనా ఆయుధ పోటీ కూడా అమెరికాతో పెరుగుతున్నది. ఈస్ట్ ఈజ్ రైజింగ్ ఇప్పుడు అణ్వస్త్ర పోటీని కూడా తాకింది. 2020లో కేవలం 200 అణ్వస్త్రాలున్న చైనా, 2026 నాటికి 600కు పెంచుకుంది. 2035 నాటికి 1500 వరకూ అణ్వస్త్రాలు చైనా అంబులపొదిలోకి చేరుకొంటాయని అమెరికా అంచనా వేస్తోంది. చైనా, పాకిస్థాన్‌ల ఆయుధ పెరుగుదల మన దేశానికి కూడా శ్రేయస్కరం కాదు. ప్రపంచంలో అనేక ప్రజా సమస్యలున్నాయి. కనుక అణ్వస్త్ర ఉత్పత్తిని ఆపి అమెరికా, రష్యా, చైనాలు ఒక చోట కూర్చొని మొత్తం అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయటంపై దృష్టిని కేంద్రీకరించాలి. ఇప్పటికే ఉన్న అణ్వస్త్రాలతో మన భూగోళాన్ని అనేకసార్లు విధ్వంసం చేయొచ్చు. ఇంకెందుకీ ఆయుధ పోటీ? ప్రపంచ దేశాలు అన్నవస్త్రాలపై, ఉద్యోగాలు, వైద్యం, శాంతి, పర్యావరణంపై దృష్టి సారిస్తామని భావితరాలకు భరోసానిస్తూ, ‘హిరోషిమా డే’ సందర్భంగా ప్రతిజ్ఞ పూనాలి.

బుడ్డిగ జమిందార్

ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం

(నేడు ‘హిరోషిమా డే’)

ఇవీ చదవండి:

'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్‌ జీకి రూ.2 వేల కోట్లు

Updated Date - Aug 06 , 2026 | 03:47 AM