Share News

పతనమవుతున్న డాలర్‌ వైభవం

ABN , Publish Date - Apr 08 , 2026 | 02:10 AM

అమెరికాపై ప్రపంచ దేశాలు క్రమేణా విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. సుంకాలు, ఆంక్షలతో సకల దేశాలను బెదిరించడం మొదలుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై యుద్ధానికి వెళ్లి...

పతనమవుతున్న డాలర్‌ వైభవం

అమెరికాపై ప్రపంచ దేశాలు క్రమేణా విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. సుంకాలు, ఆంక్షలతో సకల దేశాలను బెదిరించడం మొదలుపెట్టిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై యుద్ధానికి వెళ్లి అనూహ్య ఉపద్రవాలను కొనితెచ్చుకుంటున్నాడు. స్వదేశంలోను, విశాల ప్రపంచంలోను పరిహాసాల పాలవుతున్నాడు. ఆయన విధానాలు అమెరికా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయి.

సైనిక సామర్థ్యాలకు తోడుగా దౌత్యనీతి, రాజకీయ విధానాలు యుద్ధ జయాపజయాలను నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తాయి. రాజకీయ పర్యవసానాలను కాకుండా అంతర్జాతీయ విపణిని దృష్టిలో పెట్టుకుని ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలు న్యూయార్క్ షేర్ బజార్‌కు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తున్నాయి. భారీగా వాటిల్లుతున్న దీర్ఘకాలిక నష్టాన్ని నివారించలేకపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా పెత్తనానికి సంకేతం డాలర్. ఈ కరెన్సీ ప్రాభవ ప్రాబల్యాలు చమురు క్రయవిక్రయాలపై ఆధారపడి ఉన్నాయనడం సత్యదూరం కాదు. 1973లో అరబ్బు–ఇజ్రాయెల్ యుద్ధం అనంతరం చమురు ధరలు మిన్నంటాయి. నాటి అమెరికా విదేశాంగ మంత్రి మరుసటి సంవత్సరం హెన్రీ కిసింజర్ చొరవతో 1974లో సౌదీ అరేబియా –అమెరికా మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అంతర్జాతీయంగా చమురు విక్రయాలన్నీ అమెరికన్ డాలర్లలో నిర్వహించాలి. అప్పటి నుంచీ ప్రపంచవ్యాప్త వాణిజ్య లావాదేవీలలో డాలర్ ప్రాముఖ్యం ప్రథమ ప్రాధాన్యం నుంచి ఏకైక అంతర్జాతీయ మారకంగా పరిణమించింది. చివరకు తెలుగునాట గ్రామీణ బ్యాంకుల నుంచి విదేశాలలో అంతర్జాతీయ బ్యాంకుల దాకా స్విఫ్ట్ కోడ్ విధానం, ప్రపంచ బ్యాంకు కార్యకలాపాలు సమస్తం అమెరికా కనుసైగల్లో జరుగుతున్నాయి. అంతర్జాతీయ వాణిజ్యంలో చమురు సింహభాగం ఆక్రమించడం, అది అమెరికన్ కరెన్సీతో అనుసంధానమై ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు అన్నీ కూడా న్యూయార్క్‌లోని అమెరికా కేంద్ర బ్యాంకు (ఫెడరల్‌ రిజర్వ్‌)లో తమ తమ దేశాల బంగారం నిల్వలను భద్రపరచుకున్నాయి. అంతర్జాతీయ లావాదేవీలలో సత్వర చెల్లింపులకు తోడుగా తమ కరెన్సీలో ఒడుదుడుకులు తలెత్తిన సందర్భాలలో ఈ బంగారం నిల్వలను ఆయా దేశాలు వాడుకుంటాయి.


ఇటీవలి కాలంలో అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలపై అమెరికా రాజకీయ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చమురు దేశాల సంపాదనతో బలోపేతమైన అమెరికా డాలర్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తిరుగులేని పెత్తనం చలాయిస్తోంది. చమురు ఉత్పత్తిలో అగ్రగాములు అయిన ఇరాక్‌, రష్యాలు తమ సంపదను అమెరికా కేంద్ర బ్యాంకులో భద్రపరచుకోగా అమెరికా ఆ ఆస్తులను కబళించడంతో ప్రపంచం విస్తుపోయింది. ట్రంప్ రెండో రాకడతో ప్రపంచ ఆర్థిక, రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ దృష్ట్యా డాలర్‌పై విశ్వాసంతో ముందుకెళితే మున్ముందు పెనుముప్పు వాటిల్లవచ్చని గ్రహించిన అనేక దేశాలు తమ బంగారం నిల్వలను అమెరికా కేంద్ర బ్యాంకు నుంచి ఉపసంహరించుకుంటున్నాయి. భారత్‌ గత ఆర్థిక సంవత్సరంలో 100 టన్నుల బంగారాన్ని వెనక్కు తీసుకున్నది. ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న ఫ్రాన్స్, జర్మనీ, చైనా సైతం అమెరికా నుంచి తమ బంగారం నిల్వలను వెనక్కి తీసుకుంటున్నాయి.

బంగారాన్ని స్వదేశాలకు తీసుకువెళ్లడంతో పాటు ప్రత్యామ్నాయ మారకంపై కొన్ని దేశాలు దృష్టి సారించాయి. ఈ విషయంలో చైనా చురుగ్గా ఉన్నది. ఇరాన్‌తో పాటు వెనెజువెలా అమెరికా డాలర్లలో కాకుండా చైనా కరెన్సీ యువాన్లలో తమ చమురు వాణిజ్యాన్ని నిర్వహించాయి. ఈ రెండు దేశాల చమురును ప్రధానంగా దిగుమతి చేసుకునే దేశం చైనా. రష్యా సైతం అదే బాటను అనుసరిస్తూ డాలర్ పెత్తనానికి ఎదురు తిరుగుతోంది. ఈ రెండు దేశాలే కాకుండా కొన్ని ఇతర దేశాలు సైతం డాలర్‌ యేతర కరెన్సీలో అంతర్జాతీయ చెల్లింపులకు ఆసక్తి చూపుతున్నాయి. భారత్ సహా బ్రిక్ దేశాలు సి.ఐ.పి.ఎస్.తో పాటు ఎస్.పి.ఎఫ్.ఎస్ విధానంలో అంతర్జాతీయ చెల్లింపులకు శ్రీకారం చుట్టాయి. అమెరికన్ డాలర్‌లో కాకుండా ఇతర కరెన్సీలలో విదేశీ చెల్లింపులు చేసే దేశాలను అదనపు సుంకాలతో దండిస్తామని అమెరికా అధ్యక్షుడు పలుమార్లు హెచ్చరించడం ఇక్కడ గమనార్హం. ఈ పరిస్థితులలో అమెరికా కేంద్ర బ్యాంకులో తమ బంగారం నిల్వలను తగ్గించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాయి.

ప్రస్తుతం హోర్ముజ్‌ జలసంధి దిగ్బంధంలో చైనా కరెన్సీలో తమకు చెల్లింపులు జరిపిన వారి నౌకలను మాత్రమే ఇరాన్ అనుమతిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇరాన్‌తో అనాలోచితంగా ఆరంభించిన యుద్ధంతో అమెరికా నష్టపోతుండగా రష్యా, చైనాలు మౌనంగా ఉంటూ గరిష్ఠ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నాయి. పరస్పర పొంతన లేకుండా ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలతో ఆయన వ్యక్తిగత ప్రతిష్ఠ పలుచన అవడమే కాకుండా అమెరికా ఆర్థిక వ్యవస్థ సైతం కుదేలు అవుతోంది.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

Updated Date - Apr 08 , 2026 | 02:10 AM