Share News

‘సర్‌’: ప్రవాస ఓటర్ల మాటేమిటి?

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:54 AM

విదేశాలలో, ప్రత్యేకించి గల్ఫ్ దేశాలలో ఉపాధి పొందుతున్న తెలుగువారు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ తెలుగు ప్రవాసుల ఉనికి విషయమై ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాలకులకుగానీ, రాజకీయ పక్షాలకుగానీ...

‘సర్‌’: ప్రవాస ఓటర్ల మాటేమిటి?

విదేశాలలో, ప్రత్యేకించి గల్ఫ్ దేశాలలో ఉపాధి పొందుతున్న తెలుగువారు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ తెలుగు ప్రవాసుల ఉనికి విషయమై ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాలకులకుగానీ, రాజకీయ పక్షాలకుగానీ శ్రద్ధాసక్తులు లేవు. కారణమేమిటి? తమ ప్రాధాన్యాన్ని విడమర్చి చెప్పడంలో ప్రవాసుల వైఫల్యమే, సందేహం లేదు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ చౌకబారు ప్రచారం చేసుకునే ప్రవాసుల సంఘాలు మాతృదేశంలో జాతి భవిష్యత్తును నిర్ణయాత్మకంగా ప్రభావితం చేసే పరిణామాల పట్ల ఉదాసీనత అవలంబించడం సహేతుకమేనా? నాయకులమని చెప్పుకునే వారిలో నిర్మాణాత్మక దృక్పథం లోపించడం నిరాశా నిస్పృహలు కలిగిస్తోంది.

జీవనోపాధికై గల్ఫ్ దేశాలకు వచ్చిన తెలుగువారిలో అత్యధికులు గ్రామీణులే. వీరి విద్యార్హతలు అంతంత మాత్రమే. చిన్న చితకా పనులు చేస్తూ ప్రతి నెలా క్రమం తప్పకుండా పెట్రో దినార్లను పంపడం ద్వారా స్వదేశంలోని కుటుంబాలను పోషించుకునే ఈ శ్రామిక జనులలో ఎక్కువ భాగం బడుగు, బలహీన వర్గాలవారే. పరాయి దేశంలో నివసిస్తున్నా, వారి మనసంతా సదా మాతృదేశమూ, కన్న ఊరు చుట్టే.

భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమంలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఆ ‘సవరణ’ ప్రక్రియ అసంఖ్యాక ప్రవాసులపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం చూపించడం ఖాయం. ఇప్పటి వరకు ‘సర్‌’ పూర్తయిన రాష్ట్రాలలో లక్షలాది వలస కార్మికులు, మహిళలు నష్టపోయారనేది కొట్టివేయలేని ఒక కఠోర సత్యం. ఇక విదేశీ ఉపాధి వలసలు ఎక్కువగా ఉన్న తెలుగు రాష్ట్రాలలో ‘సర్‌’ ప్రభావం మున్ముందు ఉంటుందనే వాస్తవాన్ని ప్రవాసులు అంతగా అర్థం చేసుకోవడం లేదు. 2002 సంవత్సరం నాటి ఓటర్ల జాబితాతో నూతన ఓటర్లను అనుసంధానం చేసే మ్యాపింగ్ ప్రక్రియ ఈ ‘సవరణ’లో అత్యంత కీలక భాగం. ప్రవాస కార్మికులు అవగాహనా రాహిత్యంతో ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. వారికి సరైన మార్గదర్శకత్వం చేసే నాయకత్వం కూడా కరువయింది. గల్ఫ్‌లో వివిధ రాజకీయ పార్టీల కార్యక్రమాలను పండుగల తరహాలో నిర్వహిస్తూ నాయకులమని చెప్పుకునే పెద్ద మనుషులు సైతం ‘సర్‌’పై శ్రద్ధ చూపడం లేదు.


‘సర్’ వలన అస్మదీయులు– తస్మదీయులు అనే వివక్ష లేకుండా వేలాడుతున్న కత్తి వైపు కన్నెత్తి చూడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తుది జాబితా అనంతరం తెలుగు రాష్ట్రాలలోని కొన్ని నియోజకవర్గాల ముఖచిత్రాలు మారిపోతాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి జిల్లాలోని పుల్లంపేట, కోనసీమ జిల్లా సఖినేటిపల్లి, శ్రీకాకుళం జిల్లా పలాస మండలాలు; తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా వేల్పూరు, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలాలలోని పలు గ్రామాల వారు అనేక మంది, కచ్చితంగా చెప్పాలంటే ప్రతి గ్రామ జనాభాలోనూ సగం మంది కంటే ఎక్కువగా గల్ఫ్ దేశాలలో జీవనోపాధి పొందుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌ మహానగర పాతబస్తీలోని అన్ని నియోజకవర్గాల నుంచి కూడా గల్ఫ్‌కు వలస వచ్చిన ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. సక్రమంగా ‘సవరణ’ జరిగి, ప్రస్తావిత ప్రాంతాల ఓటర్‌ జాబితాల నుంచి భారీ సంఖ్యలో ఓట్లను తొలగించవల్సి వస్తే అనేక నియోజకవర్గాల రాజకీయ ముఖచిత్రాలు మారిపోతాయి.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో ఆరు నెలలకు మించి నివాసం ఉండని పక్షంలో అతను లేదా ఆమె పేరును తొలగించాలి, ప్రవాసులే కాదు, రాజకీయ నాయకులు సైతం ఓటరుగా తాము నమోదైన ప్రదేశాలలో నివసిస్తూ ఉండరనేది వేరే విషయం. ప్రవాసులు తమ పాస్‌పోర్టుల్లో చిరునామాగా పేర్కొన్న ప్రదేశంలో ప్రవాస ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉన్నది. అయితే దేశవ్యాప్తంగా ఇలా ప్రవాస ఓటరుగా నమోదు చేసుకునే వారి సంఖ్య స్వల్పాతి స్వల్పమే. ప్రవాస ఓటరుగా నమోదయితే రేషన్‌కార్డు గల్లంతవుతుందనే భయానికి తోడుగా పేర్లు, వయస్సులోని వ్యత్యాసాల కారణాన ఈ రకమైన నమోదుకు అత్యధికులు ఇష్టపడడం లేదు.

ప్రవాసులకు సంబంధించిన ఈ కీలక అంశాలపై సరైన సమాచారంతో సుదూర దేశంలో బతుకుదెరువు పొందుతున్న తోటి స్వదేశీయులకు దిశా నిర్దేశం చేయవల్సిన ప్రవాస నాయకగణం పట్టించుకోవడమే లేదు. ఈ ఉపేక్షా వైఖరికి వారు తక్షణమే స్వస్తి చెప్పాలి.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కసరత్తు.. జూన్ 23 నుంచి సంప్రదింపులు

జులై మూడో వారంలో తల్లికి వందనం!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 12:54 AM