ప్రవాసుల ప్రాణాలను హరిస్తున్న మనో రుగ్మతలు
ABN , Publish Date - Feb 11 , 2026 | 01:31 AM
ఆశల ఆరాటంలో జీవనపోరాటం విషాదాంతమవడం ఎంత బాధాకరం! దురదృష్టవంతులు అయిన కొంతమంది ప్రవాస భారతీయుల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. కన్నవారికి, కట్టుకున్నవారికి...
ఆశల ఆరాటంలో జీవనపోరాటం విషాదాంతమవడం ఎంత బాధాకరం! దురదృష్టవంతులు అయిన కొంతమంది ప్రవాస భారతీయుల గురించి నేను ప్రస్తావిస్తున్నాను. కన్నవారికి, కట్టుకున్నవారికి దూరంగా ఉండే ప్రవాసుల జీవితాలు యాంత్రికంగా సాగిపోతుంటాయి. అనురాగాలు, ఆప్యాయతలు కరువై ఎంతో మంది ప్రవాసులు మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. పట్టుమని మూడు పదుల వయసు కూడా లేని యువకులు కన్న ఊరులో ఇల్లు, ఇంకా కొద్దిపాటి ఆస్తులు సమకూర్చుకునేందుకై అష్టకష్టాలు పడి ఈ సుదూర సీమలకు వచ్చి బతుకు పోరులో అలసిపోతున్న తీరును చూస్తే జాలి కలుగుతోంది. రేయింబవళ్ల రెక్కల కష్టం తరువాత నెలాఖరులో ఆదాయ వ్యయాల లెక్కలు చూసుకుంటూ నైరాశ్యంలోకి జారిపోతున్నారు. ఇది వారి మానసిక సమతుల్యతను దెబ్బతీసి శారీరక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.
సామాజిక మాధ్యమాలలో– సంఘ జీవన పోకడలపై వ్యాఖ్యానాలు, విమర్శలు చేయడంలో వీరు చలాకీగా ఉంటారు. అయితే స్వీయ కుటుంబ పరిస్థితులపై తమ అంతరంగంలోని ఆవేదనను ఎవరికీ చెప్పుకోలేక మానసికంగా నలిగిపోతున్న ప్రవాసులు తక్కువ మందేమీ కాదు. అంతులేని ఆ మనోవ్యధల భారంతో కొంతమంది జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. అవి సహజ మరణాలే, అయితే హైపర్ టెన్షన్‌తో సంభవిస్తున్న విషాదాలవి. గల్ఫ్ దేశాలలో ఉద్యోగులు, కార్మికులుగా ఉన్న వారిలో సంభవిస్తున్న ఇటువంటి సహజ మరణాల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిపోయింది. గాడి తప్పుతున్న మానసిక ఆరోగ్య పరిస్థితులకు అవి అద్దం పడుతున్నాయి.
ఆర్థిక సమస్యలు ఉన్న వారు సరే, జీవన పరిస్థితులు సవ్యంగా ఉన్న వారు సైతం మానసిక కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడడమే దిగ్ర్భాంతి కలిగిస్తోంది. ఇరవై నాలుగు సంవత్సరాల వరికుప్పల రాకేశ్ ఇటీవల దుబాయిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక అసమానతల భారతంలో సగటు మనిషి జీవన పోరాటానికి ఈ దురదృష్టకర యువకుడు ఒక ప్రతీక. రాకేశ్ బాల్యంలోనే తండ్రిని కోల్పోయాడు. తన కుటుంబ భవిష్యత్తు కొరకు గల్ఫ్‌కు వచ్చాడు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వీర్నపల్లి అనే ఒక చిన్న గ్రామంలో తను నివసించడానికి రెండు గదుల సొంత ఇంటి నిర్మాణం మాత్రమే అతడి లక్ష్యం. ఆ లక్ష్యంతో ఎడారి దేశానికి వచ్చిన రాకేశ్, ఆశించిన స్థాయిలో సంపాదించలేకపోయాడు. సెలవు రోజు రాత్రి మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడిపాడు. మిత్రులు అందరూ వెళ్ళిన తర్వాత తన పరిస్థితిపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి మృతదేహం ఇంకా దుబాయిలోనే ఉంది. మారుమూల గ్రామంలో సొంత భూమిలో రెండు గదుల చిన్న ఇల్లు కట్టుకోవడానికి ఆ యువకుడు గల్ఫ్ బాటను ఎంచుకున్నా మనోరథంలో సఫలీకృతం కాలేక ప్రాణాలు పగొట్టుకున్నాడు. అతనే కాదు, కామారెడ్డి జిల్లాకు చెందిన మొహమ్మద్ యాసిన్ అనే 28 ఏళ్ళ యువ ఇంజనీర్ సమస్యల సుడిగుండం నుంచి బయటపడేందుకు మార్గం కనిపించక, మక్కా పుణ్యక్షేత్రంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయిన తరువాత లభించగా ఇంకా సౌదీలోనే ఉన్నది. ఇలాగే, బంధుమిత్రులు చాలా మంది ఉన్నా తన బాధలను ఎవరికీ చెప్పుకోలేకపోయిన హైదరాబాద్ మహిళ హుమేరా అమ్రీన్ తన ముగ్గురు పసిపిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించి విఫలమయింది. ఆత్మహత్యాయత్నం చట్ట విరుద్ధం కావడంతో ఆమె ప్రస్తుతం జైలులో ఉంది. ఆర్థికంగానే కాకుండా, ఇతరత్రా అంతా సవ్యంగా ఉన్నప్పటికీ హైదరాబాద్ నగర శివారులో ఇటీవల ఒక గల్ఫ్ ప్రవాసుడి భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడడం సమాజానికి అనేక సవాళ్ళు విసిరింది. మానసిక సమస్యలతో సంభవిస్తున్న విషాద మరణాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
భారత జనాభాలో 15 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఆర్థిక అసమానతలు ఆ రుగ్మతలకు ప్రధాన కారణమని ప్రభుత్వ నివేదికలే వెల్లడిస్తున్నాయి. కన్న ఊరు, మాతృదేశం దాటిన తరువాత ఆ మనోరుగ్మతలు ఎడారి ఏకాంతంలో మరింతగా పెచ్చరిల్లుతున్నాయి. మనిషి స్మార్ట్ ఫోన్‌తో తనకు తాను ఎంతగా మమేకమైనా, మానసిక శాంతి కొరవడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఒక కాకి చనిపోతే ఎన్నో కాకులు అక్కడికి చేరి గట్టిగా అరుస్తాయి. అయితే ఒక మనిషి చనిపోతుండగా ఆ దృశ్యాన్ని తమ స్మార్ట్ ఫోన్‌లో రికార్డు చేసే మనుషులు, సాటి మనుషులుగా ఎదుటివారికి ఎంత వరకు తోడ్పడుతున్నదీ ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. గల్ఫ్ దేశాలలోని ప్రవాసులలో భారతీయులే కాకుండా ఆఫ్రికా దేశాల వారూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సవాలక్ష సమస్యలతో, తినడానికి తిండి లేని నిరుపేద దేశాల నుంచి వచ్చిన ఆ ప్రవాసులు ఆత్మస్థైర్యంతో జీవిస్తుండగా, భారతీయులు ఎందుకు తమ జీవితంపై విరక్తి చెందుతున్నారనేది అంతుపట్టని ప్రశ్న.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి..
సవరణతో తిరిగి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షాలు
బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి ఆదిత్యనాథ్