Share News

ఉద్యమ కెరటాలు నిలిచేనా?

ABN , Publish Date - Jul 29 , 2026 | 02:21 AM

మాతృదేశంలో జన చైతన్య ఉరుములు మెరుపులకు సంబంధిత ప్రవాసులు స్పందించడం సహజం. ప్రవాస భారతీయ యువత అలనాటి స్వాతంత్ర్యోద్యమం నుంచి నేటి జంతర్ మంతర్‌ పోరాటం దాకా ప్రతి ప్రజాప్రతిఘటనకు...

ఉద్యమ కెరటాలు నిలిచేనా?

మాతృదేశంలో జన చైతన్య ఉరుములు మెరుపులకు సంబంధిత ప్రవాసులు స్పందించడం సహజం. ప్రవాస భారతీయ యువత అలనాటి స్వాతంత్ర్యోద్యమం నుంచి నేటి జంతర్ మంతర్‌ పోరాటం దాకా ప్రతి ప్రజాప్రతిఘటనకు ప్రభావశీలంగా ప్రతిస్పందిస్తూనే ఉన్నది.

మాతృదేశంలో యువత చేస్తున్న ఉద్యమానికి సంఘీభావంగా విదేశాలలోని యువత నుంచి లభించిన స్పందన ఆశ్చర్యం కలిగించింది. కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ప్రజ్వరిల్లిన విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరాలలో నిర్వహించిన ప్రదర్శనలలో ప్రవాస యువ భారతీయులు అంచనాలకు మించి పాల్గొన్నారు. పాలనా వ్యవస్థల్లో అవినీతి నిర్మూలనకై 2011లో అన్నా హజారే నిర్వహించిన ఉద్యమ సందర్భంలో కంటే ఎక్కువగా జంతర్ మంతర్ విద్యార్థుల పోరుకు ప్రవాస భారతీయ యువత స్పందించింది.

అయితే గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయ సమాజం మాత్రం ‘బొద్దింకల పోరు’పై ఆచితూచి స్పందించింది. ఈ దేశాలలో సీబీఎస్‌ఈ అనుబంధ భారతీయ పాఠశాలలు 170 దాకా ఉన్నాయి. ఈ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులలో, స్వదేశంలో వైద్య విద్యాభ్యాసానికి తాపత్రయ పడే వారి సంఖ్య తక్కువేమీ కాదు. ‘నీట్’ పరీక్షా కేంద్రాలు సైతం ఈ దేశాలలో ఉన్నాయి. ‘నీట్’ ప్రవేశ పరీక్ష ప్రశ్న పత్రాలు లీక్‌ కావడం, తరువాత ఆ పరీక్ష రద్దు కావడం, పిమ్మట ఇరాన్ యుద్ధం మూలంగా సీబీఎస్‌ఈ సంవత్సరాంత పరీక్షలూ రద్దయ్యాయి. ఈ పరిణామాలతో గల్ఫ్ దేశాలలోని సీబీఎస్‌ఈ పాఠశాలల భారతీయ విద్యార్థులు నష్టపోయారు. అమెరికా, ఐరోపా, ఇతర పాశ్చాత్య దేశాలలోని భారతీయ విద్యార్థులు ఆయా దేశాల విద్యావిధానంలో విద్యనభ్యసిస్తారు. భారతీయ విద్యా విధానాలతో వారికి సంబంధముండదు. వివిధ పాశ్చాత్య దేశాలలోని ప్రవాస భారతీయులు ఉత్సాహంగా ముందుకు వచ్చి సీజేపీ పోరాటానికి బాసటగా నిలిచారు. అయితే గల్ఫ్‌లోని ప్రభావిత విద్యార్థులు కనీసం సామాజిక మాధ్యమాలలో కూడా తమ అసంతృప్తిని వ్యక్తీకరించలేదు!

వర్తమాన భారత రాజకీయాలలో ఒక వినూత్న సంచలనాన్ని సృష్టించిన అభిజిత్‌ దీప్కే (సీజేపీని ప్రారంభించిన జెన్‌–జీ పోరాటకారుడు) భారతీయ యువత మానసిక అలజడిని సరిగ్గా అర్థం చేసుకున్నాడు. వారిలో పోరాట జ్వాల రగిలించాడు. అధికారాన్ని ప్రశ్నించే యువశక్తికి ప్రతీకగా ప్రభవించాడు. ప్రశ్న పత్రాల లీకులకు వ్యతిరేకంగా జరిగిన సీజేపీ ఉద్యమం యువతలో గూడుకట్టుకున్న అసంతృప్తి, ఆగ్రహాన్ని సంపూర్ణంగా వ్యక్తం చేసేందుకు ఒక వేదిక అయింది. స్వదేశంలో అవకాశాలు లేకనే యువత విదేశీబాట పడుతోందనే విషయాన్ని నిజాయితీగా అంగీకరించాలి.


ఆక్రోశం, ఆవేదన ఎంతగా ఉన్నా వాటిని వ్యక్తీకరించేందుకు అవసరమైన ధైర్యసాహసాలు అందరికీ ఉండవు. విదేశాలలో ఉన్నా, స్వదేశంలో ఉన్నా వర్తమాన సామాజిక అంశాల పట్ల స్పందించడం అనేది వ్యక్తుల చైతన్యశీలతపై ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకించి వృత్తిపరంగా మెరుగైన అవకాశాలు, వ్యక్తిగత ఆర్థిక సమున్నతికి విదేశాలకు వచ్చే భారతీయులలో మాతృభూమిలోని సామాజిక ఉద్యమాలు, పోరాటాల పట్ల సహానుభూతి చూపేవారు ఎంతోమంది ఉండరు.

అభిజిత్ దీప్కే వలే బోస్టన్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన రాజన్ కిలెచంద్ దుబాయిలోని ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్తలలో ఒకరు. ఆ విశ్వవిద్యాలయానికి 25 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చిన వితరణశీలి. అయితే స్వదేశంలోని సామాజిక ఉద్యమాలపై ఆయన అంతగా ఆసక్తి చూపరు. సంపన్న ప్రవాస భారతీయులలోని అత్యధికులకు రాజన్‌ ఒక ప్రతీక.

మొత్తం మీద స్వల్ప సంఖ్యలో ఉండవచ్చుగానీ విదేశాలలోని భారతీయ యువత మాతృభూమిలో సంభవిస్తున్న సంఘటనల పట్ల చురుగ్గా ప్రతిస్పందిస్తుందని చెప్పవచ్చు. ఈజిప్టు నుంచి బంగ్లాదేశ్ దాకా ఆగ్రహంతో గళమెత్తి ప్రభుత్వాలను కూల్చివేసిన యువత, కొత్త పాలకుల విధానాలను ప్రభావితం చేయడంలో విఫలమయిందనేది ఒక చేదు సత్యం. దశాబ్దం క్రితం ఇదే ఢిల్లీలో దుమారంతో పాటు ఒక ఆశను రేకెత్తించిన విద్యార్థి నాయకుడు కన్నయ్య కుమార్ ఉద్యమం తదనంతర కర్తవ్య సాధనలో ఎంతవరకు సఫలీకృతమయిందనేది కూడా గుర్తు చేసుకోవాలి. రాజకీయ క్రీడల్లో భాగం కాకుండా భావితరాలకు మేలు జరిగేలా నిర్మాణాత్మకంగా అడుగులు ముందుకు వేయవలసిన బాధ్యత ఉద్యమిస్తున్న భారతీయ యువతపై ఉన్నది.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి..

విదేశీయులే లక్ష్యంగా కోట్ల రూపాయల సైబర్ మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్

నేనెక్కడికీ పారిపోలేదు: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 02:21 AM