Share News

‘మేధా’ శిఖరాలపై భారత్‌

ABN , Publish Date - Feb 25 , 2026 | 12:47 AM

ఐటీ రంగంలో భారతీయ ప్రతిభ సాధిస్తోన్న పురోగతి అద్భుతమైనది. భారత్‌కు ఉన్న ‘విశ్వగురు’ అన్న ప్రఖ్యాతిని అది సార్థకం చేస్తోంది. ఆ సాంకేతికత అధునాతన వికాసంలో యువ భారతీయుల విజయాల ఆలంబనతో దేశ ప్రతిష్ఠను మరింతగా ఇనుమడింపచేసేందుకు...

‘మేధా’ శిఖరాలపై భారత్‌

ఐటీ రంగంలో భారతీయ ప్రతిభ సాధిస్తోన్న పురోగతి అద్భుతమైనది. భారత్‌కు ఉన్న ‘విశ్వగురు’ అన్న ప్రఖ్యాతిని అది సార్థకం చేస్తోంది. ఆ సాంకేతికత అధునాతన వికాసంలో యువ భారతీయుల విజయాల ఆలంబనతో దేశ ప్రతిష్ఠను మరింతగా ఇనుమడింపచేసేందుకు భారతీయ దౌత్యవేత్తలు అపూర్వ కృషి చేస్తున్నారు. నవ నవీన సాంకేతికత కృత్రిమ మేధ (ఏఐ) బహుముఖీన ప్రభావంపై ఇటీవల న్యూఢిల్లీలో నిర్వహించిన అయిదు రోజుల అంతర్జాతీయ సదస్సు ఆ కృషిలో భాగమే. అమెరికా, యూరోపియన్‌ దేశాలను ఎంతగా ఆకర్షించిందో, అరబ్‌ దేశాలను, లాటిన్‌ అమెరికాను, ఆఫ్రికా దేశాలనూ అంతగా ఆకర్షించిన విశిష్ట సదస్సు అది. కొన్ని కారణాలతో మనతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న కెనడాతో పాటు, ఐటీ, ఏఐలలో చాలా ముందంజలో ఉన్న దేశాలు కూడా భారత్ ఆహ్వానాన్ని మన్నించి న్యూఢిల్లీ సదస్సులో పాల్గొన్నాయి. అధునాతన సాంకేతికతల అభివృద్ధిలో భారత సామర్థ్యంపై ప్రపంచ దేశాలకు పరిపూర్ణ విశ్వాసం ఉన్నదనడానికి ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌–2026’ ఒక తిరుగులేని తార్కాణం. ఇటువంటి సదస్సులలో గల్ఫ్ దేశాల రాచకుటుంబీకులు పాల్గొనడం చాలా అరుదు. గల్ఫ్‌లో అత్యధిక డేటా సెంటర్లు నిర్వహిస్తూ, వాటి సామర్థ్యాన్ని మరింతగా పెంపొందించడానికి ప్రయత్నిస్తోన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పక్షాన అబుదాబి యువరాజు షేక్‌ ఖాలీద్ ఈ న్యూఢిల్లీ సదస్సులో పాల్గొన్నారు. సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ యూఏఈ యువరాజుకు స్వాగతం పలుకగా, ప్రధాని మోదీ ఆయన గౌరవార్థం విందు ఇచ్చారు. సౌదీ అరేబియా ఉన్నతాధికార వర్గాలు కూడా ఈ సదస్సులో పాల్గొన్నాయి. ఈ ఏఐ సదస్సును విజయవంతం చేసేందుకు భారత విదేశాంగ శాఖ అధికారులు రేయింబవళ్ళు కష్టపడ్డారు. కొన్ని విషయాలకు సంబంధించి, ఆహ్వానితులు అడిగిన సమాచారం ఇవ్వడానికి నిజాయితీగా శ్రమించారు. ఆ సందర్భంలో తెలుగు రాష్ట్రాల అధికార వర్గాలను కూడా భారత దౌత్యవేత్తలు సంప్రదించిన విషయం కొందరికి మాత్రమే తెలుసు. అగ్ర రాజ్యాలు, యూరోపియన్‌ యూనియన్‌, ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకులతో పాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ మొదలైన టెక్‌ దిగ్గజాలు పాల్గొన్న ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌తో భారత్‌ యశోచంద్రికలు మరింతగా విరాజిల్లాయి.


బ్రిటన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌లు మాత్రమే ఇప్పటివరకు అంతర్జాతీయ ఏఐ సదస్సులు నిర్వహించాయి. ఆ మూడు దేశాల్లో సదస్సుల కంటే న్యూఢిల్లీ సదస్సే బాగా విజయవంతమయింది. రానున్న కాలంలో కృత్రిమ మేధస్సు రంగానికి దిశానిర్దేశం చేసే స్థాయిలో ఈ సదస్సు జరిగిందనడంలో అతిశయోక్తి లేదు. పారిస్ సదస్సులో అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అమెరికా, బ్రిటన్‌లు పారిస్‌ డిక్లరేషన్‌లో భాగస్వాములు అయ్యేందుకు నిరాకరించాయి. అయితే న్యూఢిల్లీ డిక్లరేషన్‌పై ఎటువంటి అభ్యంతరాలు లేకుండా ఆ రెండు దేశాలు సైతం సంతకం చేశాయి. సదస్సులో భాగంగా జరిగిన 500 గోష్ఠులలో అమెరికా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్‌ సహా 88 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కీలక భూమిక వహించనున్న కృత్రిమ మేధస్సు రంగం కేవలం కొందరి చేతులలో కేంద్రీకృతం కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని, తప్పుడు సమాచార వ్యాప్తి నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌ కోరింది. ఈ నవీన సాంకేతికతను ప్రపంచ దేశాల ఆర్థికాభివృద్ధికి ఒక చోదక శక్తిగా మార్చాలని భారత్‌ పిలుపునిచ్చింది. తద్వారా భారత్ తన నాయకత్వపు దార్శనికతను స్ఫూర్తిదాయకంగా వెల్లడించింది. బహు భాషలు విలసిల్లుతోన్న భారత్‌లో ప్రతి భారతీయుడూ ఏఐని తన మాతృభాషలో వినియోగించుకునేందుకు వీలుగా ‘సర్వం’ పేర ఆవిష్కృతమైన భారతీయ భాషల విధానం (ఎల్.ఎల్.ఎం, ఎస్.ఎల్.ఎం) ప్రపంచానికి ఒక దిక్సూచిగా నిలిచింది.

‘కృత్రిమ మేధస్సు రూపకల్పన, అభివృద్ధి భారత్‌లో జరిగినా వాటి ఫలాలు, ప్రయోజనాలు సమస్త దేశాలకు చెందుతాయని’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఆయన గంభీరవాణి ఇంట కంటే బయటే ఎక్కువగా ప్రతిధ్వనించింది. కనుకనే దేశంలోకి భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి అనేది ఇక్కడ గమనార్హం. కృత్రిమ మేధస్సు పనితీరు, దాని విధి విధానాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బాలారిష్టాల దశలో ఉన్నాయి. ఇందుకు భారత్ మినహాయింపు కాదు. కృత్రిమ మేధస్సు, డేటా సెంటర్లకు అవసరమైన నీటి లభ్యత, స్థల సేకరణ, ఇతర మౌలిక ఆవశ్యకతలపై ఆశాజనక చర్చ జరగలేదు. అదే విధంగా ఏఐతో కొత్త ఉద్యోగాల సృష్టి, ఉన్న ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే అవకాశాలను కూడా సదస్సు విస్మరించింది.


కృత్రిమ మేధస్సును ప్రోత్సహించడంలో భాగంగా పలు ప్రైవేటు సంస్థలు కూడా న్యూఢిల్లీ సదస్సులో పాల్గొన్నాయి. వాటిలో ఒక ప్రైవేట్‌ విశ్వవిద్యాలయం కూడా ఉన్నది. చైనాలో రూపొందిన ఒక మర కుక్కను తమ స్వంత ఆవిష్కరణగా ఆ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయం ప్రకటించుకుని అభాసుపాలైంది. సదరు ప్రైవేటు విశ్వవిద్యాలయ మహిళా ప్రతినిధి తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేసిన వాదనలతో అసలు వంచన రచ్చకెక్కింది. ఇది ముమ్మాటికీ దగా అనడంలో సందేహమేమీ లేదు. విషయం తెలిసిన వెంటనే అధికారులు ఆ మరకుక్కను ప్రాంగణం నుంచి తొలగించి తమ బాధ్యతను నిర్వర్తించారు, అయితే అప్పటికే దానిపై ఎంతో రభస జరిగిపోయింది. ప్రాంగణం వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శన భారత్‌ పేరు ప్రతిష్ఠలకు మచ్చగా మిగిలిపోయింది. ఏదేమైనా, అంతర్జాతీయంగా భారత్‌ కీర్తిని ఇనుమడింపజేసిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌–2026’ను దేశీయంగా రచ్చకీడ్చడం జాతి ప్రయోజనాలకు అనుగుణంగా రూపొందుతున్న విదేశాంగ విధానానికి విఘాతం కలిగించడమే.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

ఇవి కూడా చదవండి..

మాజీ మంత్రి మల్లారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు..

కొత్త పార్టీని ప్రకటించిన శశికళ

Updated Date - Feb 25 , 2026 | 12:47 AM