పశ్చిమాసియా కల్లోలంలో భారత్ అభివృద్ధి
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:57 AM
మధ్యప్రాచ్య దేశాలలో తరచూ యుద్ధ ఉద్రిక్తతలు నెలకొనడం పరిపాటి. ఈ దేశాల చమురు ఉత్పత్తులపై ఆధారపడ్డ దేశాలు, మరీ ముఖ్యంగా భారత్ యుద్ధ పరిస్థితులు తలెత్తిన ప్రతిసారీ తీవ్ర...
మధ్యప్రాచ్య దేశాలలో తరచూ యుద్ధ ఉద్రిక్తతలు నెలకొనడం పరిపాటి. ఈ దేశాల చమురు ఉత్పత్తులపై ఆధారపడ్డ దేశాలు, మరీ ముఖ్యంగా భారత్ యుద్ధ పరిస్థితులు తలెత్తిన ప్రతిసారీ తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొంటుంది. ఇప్పుడూ అదే జరుగుతోంది. భారత్‌కు ఈ అవస్థలు అనివార్యం. అరబ్ దేశాలు, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఉత్పన్నమైన ప్రతిసారీ చమురు ధరలు పెరుగుతాయి. వెన్వెంటనే ద్రవ్యోల్బణం ముమ్మరమవుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతికి విఘాతం వాటిల్లుతుంది.
1971లో పాకిస్థాన్‌తో యుద్ధం, పిమ్మట రెండేళ్ళు దేశవ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం. గోరుచుట్టుపై రోకటిపోటులా 1973లో అరబ్బు దేశాలు–ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో చమురు ధరల పెరుగుదల. ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో భారత్ అల్లాడిపోయింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఆకలిదాడులకు దారితీసిన పరిస్థితులపై ప్రఖ్యాత నటుడు మనోజ్‌కుమార్ ‘రోటీ కపడా ఔర్ మకాన్’ అనే సినిమా నిర్మించారు. ఈ దేశభక్తి ప్రపూరిత సినిమాను ఆ తరం వారు విశేషంగా ఆదరించారు. 1970ల్లో బాక్సాఫీసు బద్దలుకొట్టిన బాలీవుడ్ సినిమాలలో అదొకటి. ప్రస్తుతం ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా–ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ పరిణామాలను గమనిస్తుంటే, నాటి పరిస్థితులు గుర్తుకు వస్తున్నాయి.
1973లో అరబ్–ఇజ్రాయెల్ యుద్ధానికి ముందు చమురు పీపా ధర 1.5 డాలర్లు. మధ్యప్రాచ్యంలో యుద్ధాగ్నులు ప్రజ్వరిల్లిన ప్రతిసారీ చమురు ధర సైతం తప్పనిసరిగా అధికమవుతుంది. ఇరాన్‌లో ఇస్లామిక్ విప్లవం(1979) సంభవించిన తరువాత చమురు పీపా ధర 35 డాలర్లకు పెరిగింది! 1991లో మొదటి గల్ఫ్ యుద్ధం నాటి నుంచి ప్రస్తుత ఇరాన్ యుద్ధం వరకు చమురు ధర పలుమార్లు పెరిగింది. ధర పెరిగిన ప్రతిసారీ భారత్ ఆర్థిక పురోగతి ప్రమాదంలో పడుతూ వస్తోందని మరి చెప్పనవసరం లేదు.
1973 ఇజ్రాయెల్ యుద్ధం తాకిడిని చవిచూసిన తరువాత ప్రత్యామ్నాయ మార్గాలపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగా బొగ్గు ఉత్పత్తిని పెంచింది. 1990వ దశకంలో సరళీకృత ఆర్థిక విధానాలతో పారిశ్రామికాభివృద్ధి ఇతోధికమయిన కారణంగా చమురు, సహజ వాయువు అవసరాలు మున్నెన్నడు లేని విధంగా పెరిగిపోయాయి. వాటి దిగుమతులపై ఆధారపడడమూ అనూహ్యంగా పెరిగిపోయింది. కీలకమైన విద్యుత్ ఉత్పత్తి రంగంలో కాలుష్యకారక వాయు ఉద్గారాలను నియంత్రించేందుకు బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తూ క్రమేణా సహజవాయువు వినియోగాన్ని అధికం చేశారు. అయితే విద్యుదుత్పాదనకు వినియోగిస్తున్న సహజవాయువు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేదే కావడం గమనార్హం.
చమురు వినియోగంలో రవాణా రంగానిది ప్రథమ స్థానం. రవాణా కార్యకలాపాలలో సహజవాయువు వినియోగం ఆశించిన విధంగా పెరగలేదు. రైల్వేస్‌లో సైతం డీజిల్ వినియోగం ఎక్కువే అయినా 90శాతానికి పైగా రైల్వే లైన్లు విద్యుదీకరణ కావడంతో ఆ చమురు వినియోగం 62శాతానికి తగ్గింది. విద్యుదుత్పాదనలో సహజవాయువుకు ప్రాధాన్యం అంతకంతకూ పెరిగిపోతోంది. వ్యవసాయ రంగంలో సన్నకారు రైతుల సాగు బావులకు విద్యుత్ పంపు సెట్లు అందించడం ద్వారా గ్రామీణ విద్యుత్ సరఫరాకు ఊతమివ్వడం డీజిల్ వినియోగాన్ని తగ్గించడంలో భాగమే. గ్రామీణ సహకార విద్యుత్ సరఫరాలో సుప్రసిద్ధమైన సిరిసిల్లలోని ‘సెస్’లో 70శాతం విద్యుత్ వ్యవసాయ రంగానికే వినియోగమవుతున్నది. అనేక రాష్ట్రాలలో వ్యవసాయ పంపుసెట్లు ఇప్పటికీ డీజిల్‌పై ఆధారపడి ఉండగా ఎరువుల కర్మాగారాలు గ్యాస్ ఆధారితంగా ఉన్నాయి. ఎరువుల ఉత్పత్తికి అవసరమైన రసాయనాలు సైతం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతున్నాయన్న విషయం విస్మరించలేనిది.
భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి అనేది దిగుమతి చేసుకుంటున్న చమురు ధరలపై ఆధారపడి ఉన్నది. ఇరాన్, ఇజ్రాయెల్, అరబ్ దేశాలు, అమెరికా రాజకీయాలు, సైనిక సమీకరణలు, భౌగోళిక పరిస్థితుల కారణాన ఉత్పత్తి, సరఫరాలో ఏ కొద్దిపాటి అంతరాయం ఏర్పడినా భారత ఆర్థిక వ్యవస్థను అది ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
అరేబియా సముద్ర తీరస్థ ఇరాన్, అరబ్ దేశాల నుంచే కాకుండా అమెరికా, రష్యా నుంచి సైతం భారత్ తనకు అవసరమైన చమురును దిగుమతి చేసుకుంటోంది. గల్ఫ్ నుంచి భారత్‌కు చమురు రవాణా ఖర్చు పీపాకు ఒక డాలర్ లోపు కాగా అమెరికా నుంచి ఆ రవాణా ఖర్చు 14.50 డాలర్లు. పైగా రవాణాకు పట్టే సమయమూ అధికమే. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురును స్థానిక విపణిలో విక్రయించకుండా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అరేబియా సముద్ర తీరస్థ ఎనిమిది దేశాలు భారత్‌కు చమురు సరఫరా చేస్తున్నాయి. అదే అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడానికి ప్రాధాన్యమిస్తే మార్కెట్ ఆధిపత్య ధోరణితో వ్యవహరించే ఆ ఒక్క దేశంపై మాత్రమే ఆధారపడవల్సి ఉంటుంది. మధ్యప్రాచ్యంలోని సున్నిత ధార్మిక, రాజకీయ అంశాలకు తోడుగా సైనిక సమీకరణలు, దౌత్య వ్యవహారాల విభిన్న సవాళ్ళ మధ్య భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక్కడ ఎక్కడా కూడా ఏ ఒక్క మాట తూలినా, తప్పటడుగు వేసినా భారత ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవల్సివస్తుంది.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఇవి కూడా చదవండి..
5 రోజుల పాటు దాడులు నిలిపివేస్తున్నాం.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదు: ఇరాన్