Share News

కాపలాదారులు

ABN , Publish Date - Aug 03 , 2026 | 03:03 AM

భూమి స్థావర జంగమాల జనని లోలోన సంఘర్షణ లేనంతవరకే కూరిమి నీరు నిశ్శబ్ద తరంగిణి తరంగ ఘర్షణ తాకనంత వరకే తాలిమి..

కాపలాదారులు

భూమి స్థావర జంగమాల జనని

లోలోన సంఘర్షణ లేనంతవరకే కూరిమి

నీరు నిశ్శబ్ద తరంగిణి

తరంగ ఘర్షణ తాకనంత వరకే తాలిమి

నిప్పు నిగూఢ నిశీధి

ఒరిపిడి సోకనంత వరకే ఓరిమి

గాలి రహస్య సంచారి

పీడన లేనంతవరకే పిల్ల తెమ్మెర

ఆకాశం అదృశ్య పదచిత్రం

శోధన.. రోదనయ్యే విఫలయత్నం

సృష్టి నియమాలు గతి తప్పి సంచరిస్తే

పంచభూతాలు ప్రళయగీతాలై పల్లవిస్తాయి

సమాజ చలనాల సంక్షోభాలు

నిరసన స్వరాలను స్వాగతిస్తాయి

చెదలంటని నిప్పు

నిలువుండని నీరు

పంజరాల్లో ఇమడని ఝంఝా మారుతం

తొక్కుడు బండంత ఓపికున్న పుడమి

నిశ్చల, నిర్భీతిల నింగి

పంచభూతాల సారమైన ఈ పావురాలెవరు

పంకిలాన్ని కడగాలనుకుంటున్న పసికూనలు

చిలుమెక్కిన ఖడ్గాలు సేదదీరే సమయాన

పదునెక్కిన గొంతులు

ప్రశ్నల కొడవళ్ళెత్తుతున్నాయి

జెన్జీలో..

దేశ జెండాను గుండెలపై మోసే

యువ నరాల స్వరాలను మీటే ఝంకారాలో..

ఎవరైతే నేమి..

వీళ్ళు మన పిల్లలు

ఒప్పులే చేస్తున్నారో

చిన్న చిన్న తప్పులే చేస్తున్నారో

శిలలుగా ఉన్న ఈ సమూహాలను

శిల్పాలుగా మలచే చేతులు సమాజానివే

ఇప్పుడు కాలానికి ఒక కాపలాదారు కావాలి

కలల్ని చెదిరిపోనివ్వని కనురెప్పలు కావాలి

వాళ్లు వీళ్లేనేమో!

గాజోజు నాగభూషణం

98854 62052

ఇవి కూడా చదవండి:

దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు: భువనేశ్వర్

ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన

Updated Date - Aug 03 , 2026 | 03:03 AM