ఇంధన భద్రత భవిష్యత్తు ఏమిటి?
ABN , Publish Date - Apr 17 , 2026 | 02:11 AM
ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. పేద దేశాల ప్రభుత్వాలే కాకుండా సంపన్న దేశాల పాలకులు సైతం ఇంధన అభద్రత గురించి....
ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. పేద దేశాల ప్రభుత్వాలే కాకుండా సంపన్న దేశాల పాలకులు సైతం ఇంధన అభద్రత గురించి తమ ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇంధన వనరుల లభ్యత విషయంలో చాలా విపత్కర పరిస్థితులు దాపురించనున్నాయని ప్రభుత్వాలు స్పష్టం చేస్తున్నాయి. మరి సమీప భవిష్యత్తులో ప్రపంచ ఇంధన భద్రత స్థితిగతులు ఎలా ఉండనున్నాయి? ఇదొక ఆవశ్యక ప్రశ్న.
పశ్చిమాసియాలో అర్థరహిత యుద్ధం వల్ల సంభవించిన భారీ ప్రాణ నష్టం, ఆస్తినష్టాన్ని విస్మరించవద్దని కోరుతున్నాను. చమురు సరఫరాలలో అంతరాయం వల్ల యుద్ధ భూమికి సుదూర ప్రాంతాలలోని ప్రజలకు ఎదురవుతున్న కష్ట నష్టాలు అన్నీ ఇన్నీ కావు కదా. వంటగ్యాస్ కొరతతో లక్షలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న వెతలు వర్ణనాతీతమైనవి. చాలా కుటుంబాలు తమ ఆదాయంలో అధిక భాగాన్ని ఎల్పీజీ సిలిండర్లను సమకూర్చుకునేందుకే వెచ్చిస్తున్నాయి. మన దేశంతో సహా అభివృద్ధి చెందుతున్న దేశాలు చమురు దిగుమతులకు భారీ వ్యయం చేస్తున్నాయి. పెరిగిన చమురు ధరలు ఆర్థిక వ్యవస్థలను కుదేలుపరుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ మార్పు పర్యవసానాలతో సతమతమవుతున్న రైతులు ఎరువుల కొరతతో మరిన్ని కష్టాల బారిన పడ్డారు. ప్రపంచ ఆహార సరఫరాకు ముప్పు వాటిల్లనున్నదని మరి చెప్పాలా? ఇరాన్‌పై అగ్రరాజ్య యుద్ధంతో నియమాల ఆధారిత ప్రపంచ వ్యవస్థ కూలిపోయింది. ఆ అహేతుక యుద్ధం పట్ల పలు దేశాల నాయకుల ప్రతిస్పందన చాలా పిరికితనంతో కూడుకుని ఉన్నది.
ఈ యుద్ధ పర్యవసానాలు ప్రపంచ ఇంధన భద్రతపై ఎటువంటి ప్రభావాన్ని చూపనున్నాయి? ఈ అనుచిత యుద్ధం ప్రజ్వరిల్లక ముందే ప్రపంచ దేశాలు ఇంధన పరివర్తన కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్నాయి. విద్యుదుత్పత్తికి బొగ్గు స్థానంలో పునరుత్పాదక ఇంధన వనరులను అధికంగా వినియోగిస్తున్నాయి. పెట్రోలు, డీజిల్‌తో నడిచే వాహనాలకు బదులుగా విద్యుత్ వాహనాల వాడకం పెరిగిపోతోంది. 2025లో ప్రపంచ విద్యుదుత్పత్తిలో పునరుత్పాదక ఇంధనవనరుల వాటా ఇంచుమించు 50 శాతంగా ఉన్నదని అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ నివేదిక ఒకటి వెల్లడించింది. ఆ ఏడాది అదనపు విద్యుదుత్పత్తిలో 85శాతం పునరుత్పాదక విద్యుత్ వనరుల మూలంగానే సమకూరిందని కూడా ఆ నివేదిక పేర్కొంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ ఇంధన పరివర్తన అందరూ భావిస్తున్నట్టుగా చైనాలో గానీ, యూరోపియన్ దేశాలలోగానీ సంభవించడం లేదు. మార్పుకు తీవ్రంగా లోనవుతున్న 74 దేశాల సంయుక్త సంస్థ భాగస్వామ్యంతో ‘ఎంబెర్’ అన్న థింక్ ట్యాంక్ వెలువరించిన ఒక నివేదిక ప్రకారం ఆ దేశాలు ఎలెక్ట్రోటెక్‌ను వేగవంతంగా అమలు చేస్తున్నాయి. మరింత స్పష్టంగా చెప్పాలంటే సౌర, పవన తదితర అధునాతన విద్యుత్ సాంకేతికతలను ఉపయోగించుకోవడం ద్వారా ఇంధన పరివర్తనను వేగవంతం చేస్తున్నాయి.
చాలా వరకు అల్పాదాయ ఆర్థిక వ్యవస్థలు అయిన ఈ దేశాలన్నీ ఇంధన దిగుమతిదారులే. కోట్లాది ప్రజల మౌలిక అవసరాలను తీర్చగల ఇంధన సమృద్ధి ఈ దేశాలకు లేదు. అయితే సౌర ఫలకాలు, బ్యాటరీలు, విద్యుత్ వాహనాల ధరలు భరించదగినవిగా ఉన్నందున వాటిని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. సౌర విద్యుదుత్పత్తిలో నాంబియా, టోగో, బ్యాటరీల విక్రయాలలో జోర్డాన్, కిర్గిస్థాన్, విద్యుత్ వాహనాల వినియోగంలో నేపాల్, శ్రీలంక ముందంజలో ఉన్నాయని ‘ఎంబెర్’ నివేదిక పేర్కొంది. నేపాల్, శ్రీలంకలో రోడ్లపైకి కొత్తగా వస్తున్న వాహనాలో 70శాతం విద్యుత్ వాహనాలేకావడం గమనార్హం.
ప్రస్తుత అంతరాయం ఇంధన దిగుమతుల వ్యయాన్ని విపరీతంగా పెంచివేసింది. ఫలితంగా ఇంధన భద్రతను సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకతపై అన్ని దేశాలు జాగృతమయ్యాయి. చాలా దేశాలు బొగ్గు, కర్ర బొగ్గు మొదలైన సొంత వనరులను మరింత ఎక్కువగా వినియోగించుకుంటున్నాయి. ఇదే సమయంలో శిలాజ ఇంధనాలను కాకుండా పునరుత్పాదక ఇంధనాలను ఉపయోగించుకునేందుకు అనేక దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ పరిణామాలు ఇంధన భవిష్యత్తుకు కొత్త రూపునివ్వనున్నాయి. ప్రస్తుత చమురు, గ్యాస్ సంక్షోభం స్వల్పకాలికమైనది కాదు. హోర్ముజ్ మూసివేత వల్ల ప్రపంచ చమురు సరఫరాలో 20శాతానికి అంతరాయమేర్పడింది. ఆ జలసంధిని తెరిచినప్పటికీ ఇటీవలి యుద్ధంలో పశ్చిమాసియాలో దెబ్బతిన్న చమురు ఉత్పత్తి కేంద్రాల పునరుద్ధరణకు చాలా సమయం పడుతుంది. చెప్పవచ్చినదేమింటే శిలాజ ఇంధనాలు ఇంకెంతమాత్రం చవకగా లభించవు; సమృద్ధిగా అసలే లభించవు.
విద్యుత్ ఉత్పత్తి వ్యయం ఆర్థికాభివృద్ధికి అయ్యే వ్యయంతో సమానం. ఎందుకంటే వస్తువులను ఉత్పత్తి చేయడానికి, సేవలను రవాణా చేయడానికి, సాంకేతిక పురోగతిని నడిపించడానికి విద్యుత్ ఒక ప్రాథమిక, ప్రత్యామ్నాయం లేని ముడిసరుకు. విద్యుత్ చౌకగా అందుబాటులో ఉన్నప్పుడు పరిశ్రమలు విస్తరిస్తాయి. ఉత్పాదకత పెరుగుతుంది. విద్యుత్ వ్యయాలు అధికంగా ఉన్నప్పుడు ఆర్థిక కార్యకలాపాలు మందగించి వృద్ధి పరిమితమవుతుంది. ఈ పరిస్థితులు ఇంధన భద్రత ప్రణాళికలను పునః రూపొందించుకోవల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయి. విద్యుత్ వాహనాలతో సహా హరిత సాంకేతికతల తయారీ సామర్థ్యాన్ని ఇతోధికంగా పెంపొందించుకోవల్సి ఉన్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కాలుష్య రహిత ఇంధన వనరులను మరింత సమర్థంగా ఉపయోగించుకోవల్సిన అవసరమున్నది. నిజానికి పలు దేశాలు ఇప్పటికే ఈ విషయంలో శ్రద్ధ చూపుతున్నాయి. అయితే జాతీయ ఇంధన భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ కాలుష్య రహిత ఇంధన పరివర్తనకు శ్రద్ధ చూపుతున్నాయనేది గమనార్హం. అయితే ఈ అనివార్య ఇంధన పరివర్తన వాతావరణ ఉపశమనం (హరిత గృహ వాయువుల ఉద్గారాలను తగ్గించేందుకు లేదా నిరోధించేందుకు చర్యలు తీసుకోవడం)కు విశేషంగా దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు.
నేనిది రాస్తున్నప్పుడు భవిష్యత్తు ఆశాజనకంగా కన్పించడం లేదు. ప్రపంచ సమాజం తిరోగమిస్తోంది. దశాబ్దాలుగా జీవన ప్రమాణాలలో వచ్చిన మెరుగుదలలు అంతరిస్తున్నాయి. అసమానతలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ సహకారం కృశించిపోతోంది. మన ప్రపంచం దారుణంగా విచ్ఛిన్నమయింది, అనేక విధాలుగా విభజితమయింది. ఇటువంటి పరిస్థితుల్లో వాతావరణ మార్పు రూపేణా ధరిత్రికి, మానవాళి మనుగడకు వాటిల్లుతోన్న ప్రమాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కోవడం ఎలా సాధ్యమవుతుంది?
సునీతా నారాయణ్
(‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ డైరెక్టర్ జనరల్,
‘డౌన్ టు ఎర్త్’ సంపాదకురాలు)
ఇవీ చదవండి:
మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ
డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి