US Venezuela Conflict: ప్రపంచ దేశాలు ఖండించాల్సిన దుశ్చర్య
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:40 AM
వెనెజువెలా దేశంపై దాడి చేసి, అధ్యక్షుడిని బందీ చెయ్యడం ద్వారా అమెరికా అంతర్జాతీయ న్యాయసూత్రాల్ని, మర్యాదల్ని, హక్కుల్ని అధిగమించింది. ఈ దురాక్రమణకు అధ్యక్షుడు ట్రంప్ అక్కడి...
వెనెజువెలా దేశంపై దాడి చేసి, అధ్యక్షుడిని బందీ చెయ్యడం ద్వారా అమెరికా అంతర్జాతీయ న్యాయసూత్రాల్ని, మర్యాదల్ని, హక్కుల్ని అధిగమించింది. ఈ దురాక్రమణకు అధ్యక్షుడు ట్రంప్ అక్కడి కాంగ్రెస్ అనుమతి తీసుకోలేదు. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్‌లో చర్చించలేదు. వెనెజువెలా అధ్యక్షుడిపై ఆరోపణలకు రుజువులు లేవు. ఆ సార్వభౌమ దేశం వల్ల అమెరికాకు జరిగే తక్షణ అపకారం, బెదిరింపులు కూడా ఏమీ లేవు, కుంటిసాకులు తప్ప. ఇది ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాల్సిన దుశ్చర్య.
ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్న దేశం వెనెజువెలా. రెండున్నర దశాబ్దాలుగా అక్కడి ప్రభుత్వాలు ఆ నిల్వలపై అమెరికా కంపెనీలను పెత్తనం చేయనీయడం లేదు. డాలర్‌పై ఆధారపడడం లేదు. అక్కడి ప్రభుత్వం మారి, తమ మాట వినే పాలకులు వస్తే తప్ప, అమెరికా ప్రయోజనాలు నెరవేరవు. కాబట్టి వెనెజువెలా అధ్యక్షుడు మాదకద్రవ్యాల సరఫరా ప్రోత్సహిస్తున్నాడని, ట్రంప్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ దేశంపై సైనిక దాడి చేసి, అధ్యక్షుడు మదురోను బందీ చేసి అమెరికా జైలుకి, కోర్టుకి తరలించారు. ఇలాగే గతంలో పనామా పట్ల అమెరికా వ్యవహరించింది. రానున్న రోజుల్లో కొలంబియా, క్యూబాల్ని కూడా ఇదే బాట పట్టిస్తామని ట్రంప్ హుంకరిస్తున్నారు. ఇది ప్రపంచ దేశాల్ని ప్రమాదంలోకి నెట్టే అరాచక ధోరణి. స్పష్టమైన ఖండనలతో అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందించకపోతే తీరని నష్టం తప్పదు. ఏ దేశానికి ఆ దేశం తన స్వలాభాపేక్షతో పక్కనున్న బలహీన దేశాల్ని, వనరుల్ని కబళిస్తే అశాంతి, అభద్రత రాజ్యమేలుతాయి. ట్రంప్ చేష్టల్ని నియంత్రించకపోతే అమెరికాతో సహా అన్ని దేశాలకీ నష్టమే.
డా. డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ
ఇవీ చదవండి: