Share News

గిరిజన కలం పలుకుతోంది

ABN , Publish Date - Mar 16 , 2026 | 01:54 AM

గిరిజన సంస్కృతిని పరిరక్షిస్తున్నాం అన్న పేరుతో వారికి ప్రత్యేక స్థానం ఆపాదించి వారినీ వారి ప్రాంతాలనూ ప్రత్యేక వార్తా కథనాలుగానూ, పరిశోధక అంశాలుగానూ ఎంచుకున్నాం తప్ప వారి జీవన స్థితిగతుల...

గిరిజన కలం పలుకుతోంది

గిరిజన సంస్కృతిని పరిరక్షిస్తున్నాం అన్న పేరుతో వారికి ప్రత్యేక స్థానం ఆపాదించి వారినీ వారి ప్రాంతాలనూ ప్రత్యేక వార్తా కథనాలుగానూ, పరిశోధక అంశాలుగానూ ఎంచుకున్నాం తప్ప వారి జీవన స్థితిగతుల గురించి, వారిదైన ఆస్తిత్వం, పేదరికం, జీవన పోరాటాల గురించి ఆలోచించే తీరిక మనకు లేదు. నిన్నటిదాకా వారి గోడు వారు వ్యక్తం చేసుకునే అంత అక్షర పరిజ్ఞానం వారికి లేదు, ఉన్న కొద్ది మౌఖిక సాహిత్యమూ తెలుగు జానపద సాహిత్యంలో అంతర్భాగం అయిపోయి గిరిజన సాహిత్యం అనే పలుకే లేకుండా పోయింది. ఇప్పుడిపుడే తమకు అందుబాటులో గల తెలుగు సాహిత్యం సాయంతోనే గిరిజనులు తమ భావవ్యక్తీకరణ చేయడం ఆరంభించారు. గిరిజన యువత మొదట ఆకలి బాధ తీర్చుకోవడానికి ప్రభుత్వ గిరిజన ఆవాస కేంద్రాల్లో చేరి క్రమేణా బడిబాట పట్టి వరి బువ్వ రుచితో పాటు అక్షరాల రుచి మరిగి ఉన్నత చదువులు చదివి ఉద్యోగ ఉపాధి బాట పట్టి తమలోని అక్షర జ్ఞానం సాయంగా సృజనాత్మకత పెంచుకొని రచయితలుగా రూపాంతరం చెందారు.

18వ శతాబ్దం నుండే ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రారంభమైన గిరిజన సాహిత్యం అన్ని ప్రాంతాలకు వ్యాపించినా, అదంతా గిరిజనేతరులు రాసిన ‘‘సానుభూతి గిరిజన సాహిత్యం’’ అనే చెప్పాలి. 21వ శతాబ్దం ప్రారంభంలో మొదలైన గిరిజన యువత సాహితీ సృజనతో గిరిజన సాహిత్యం రూపురేఖలు మారిపోయాయి. అచ్చమైన స్వానుభవ ప్రామాణిక గిరిజన సాహిత్యం మొదలైంది. ఎవరి బాధ గురించి వారే చెప్పడంలో ఆ బాధ తీవ్రత పూర్తిగా తెలు స్తాయన్నది, ఒకరి బాధను మరొకరు చెప్పడంలో ఆ తీవ్రత పలచబడుతుంది అన్నది స్వాను భవ గిరిజన సాహితీవేత్తల వాదన. గిరిజన సమాజాన్ని విభజించుకున్నట్టే స్వానుభవ గిరిజన సాహిత్యాన్ని కూడా మైదాన ప్రాంత, అటవీ ప్రాంత గిరిజన సాహిత్యా లుగా విభజించుకోవచ్చు.

మైదాన ప్రాంత గిరిజన జాతి లంబాడాలకు లిపి లేకపోయినా వారి సాహిత్యం తెలుగు లిపి సాయంతో వెలువడుతూ ‘కేంద్ర సాహిత్య పురస్కారం’ పొందే స్థాయికి చేరుకుంది. ఈ సామాజిక వర్గ గిరిజనులు విద్యాపరంగా కూడా విశేషమైన కృషి చేస్తూ విశ్వవిద్యాలయ చదువులతో పాటు పరిశోధనలు సైతం చేసి వివిధ శాఖల్లో ఉన్నత, అత్యున్నత, రంగాలలో పదవులు చేపడుతున్నారు. సృజన రంగంలో కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. నిజామాబాద్‌కు చెందిన సునావత్ రమేష్ కార్తీక్ నాయక్ తమ లంబాడా కుటుంబాల్లో నిత్యం చూసే సంఘటనలనే కథా వస్తువులుగా చేసుకుని వారి సంస్కృతీ సాంప్రదాయాలను ప్రపంచానికి చెప్పాలనే లక్ష్యంతో గోర్ బంజారా కథలను చక్కని శైలిలో అక్షరీకరించి ‘ఢావ్లో’ (విషాదగీతం) అనే కథా సంపుటి రాశాడు. 26ఏళ్ల వయసులోనే 2024 కేంద్ర సాహిత్య యువ పురస్కారాన్ని పొందిన తొలి గిరిజన యువరచయితగా చరిత్రలో నిలిచాడు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యుడు గోనా నాయక్ తన జీవిత చిత్రాన్ని కావ్యంగా రాసిన ‘బతుకు’ (2022) దీర్ఘ కవిత తొలి బంజారా గిరిజన దీర్ఘ కవితగా నిలిచింది. వీరు విశ్వవిద్యాలయ స్థాయిలో లంబాడ భాషా వికాసం కోసం విశేషమైన కృషి చేస్తున్నారు.


గిరిజన తొలి మహిళా ఉపకులపతిగా, పరిశోధకురాలిగా నిలిచిన ఆచార్య సూర్యాధనుంజయ్ ‘నల్లగొండ జిల్లా బంజారా సాహిత్యం జీవన చిత్రణ’పై పరిశోధన చేశారు. ‘బంజారా నానీలు’, ‘కొంగు బంగారం’ వంటి రచనలు చేశారు. ‘కాక్లా’ (2008) బంజారా కథతో ప్రసిద్ధి పొందిన తొలి బంజారా కథకుడు భూక్యా తిరుపతి కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడే. మరికొందరు బంజారా యువత కూడా తమ లంబాడా సాహితీ వికాసం కోసం కృషి చేస్తున్నారు.

రాయలసీమకు చెందిన ఎరుకల సామాజిక వర్గ తొలి గిరిజన రచయితగా పలమనేరు బాలాజీ పేరు చెప్పాలి. ఉద్యోగరీత్యా మండల అభివృద్ధి అధికారిగా ఉంటూనే రచయితగా కృషి చేస్తున్నారు. 1991లోనే కథారచనకు శ్రీకారం చుట్టినా, మొదట సాధారణ సామాజిక అంశాల కథలు రాసిన తర్వాత తమ సామాజిక వర్గ నేపథ్య కథలు రాయటం మొదలుపెట్టారు. 2009లో ‘గది లోపలి గోడ’ అనే తొలి గిరిజన కథ రాశారు, అనంతరం ‘ఏకలవ్య కాలనీ’ (2024) పేరుతో పూర్తి గిరిజన కథా సంపుటి ప్రచురించారు. నెల్లూరు ప్రాంతానికి చెందిన ఉపన్యాసకుడు వర్ధమాన గిరిజన కథా రచయిత, పరిశోధకుడు పులి చెంచయ్య తమ యానాది గిరిజన జీవితాల వాస్తవ చిత్రాలను కథలుగా వెలువరిస్తున్నారు.

సవర గిరిజన నేపథ్యం నుంచి వచ్చిన ఆంగ్ల భాష అధ్యాపకుడు మల్లిపురం జగదీష్ ఉత్తరాంధ్ర గిరిజన జీవితాలను అద్దం పడుతూ అనేక కథలు కవితలు రాసి తొలి సవర గిరిజన కథకునిగా నిలిచారు. ఆయన రాసిన ‘అక్షరాల దారిలో’ (2000) తొలి గిరిజన కథ కాగా, పిదప ‘శిలకోల’ (2011), ‘గురి’ (2018) సంపూర్ణ గిరిజన కథా సంపుటాలు, ‘దుర్ల’ అనే కవితా సంపుటి రాశారు.

పాల్వంచకు చెందిన కోయ గిరిజన ఉపాధ్యాయని, తొలి గిరిజన మహిళ కథా రచయిత్రి పద్దం అనసూయ తెలుగు భాషపై పట్టు సాధించి చిన్నతనంలో అమ్మమ్మ చెప్పిన కథల ప్రేరణతో, తమ సంస్కృతి సాంప్రదాయాలే వస్తువులుగా కథలు రాస్తూ ‘చప్పుడు’ (2019) కథా సంపుటి వెలువరించారు. కేవలం కథలు రాయడమే కాక గిరిజన భాషల అనువాద కార్యశాలల్లో, సెమినార్లలో పాల్గొంటూ తమ గిరిజన సంస్కృతి గొంతును వినిపిస్తున్నారు.


మానుకోటకు చెందిన అధ్యాపక గిరిజన కవి పెనుక ప్రభాకర్ అచ్చంగా గిరిజన సంస్కృతి సమాజాల నేపథ్యంలో కవితలు రాసి ‘తూతకొమ్ము’ (2023) కవితా సంపుటి ప్రచురించి తొలి గిరిజన కవిగా నిలిచారు. వరంగల్ ప్రాంతానికి చెందిన మరో కోయ గిరిజన కవయిత్రి, అధ్యాపకురాలు కుంజా కళ్యాణి ‘‘నా భాషలోనే రాస్తాను, నా గొంతులోనే పలుకుతాను’’ అంటూ ‘కంకపొద’ (2024) కవితా సంపుటి ప్రచురించి తొలి గిరిజన కవయిత్రి అయ్యారు.

వ్యాస ప్రక్రియలో విశేష కృషి చేస్తున్న తొలి కోయ గిరిజన వ్యాస రచయిత గుమ్మడి లక్ష్మీనారాయణ. మహబూబాబాద్ ప్రాంతానికి చెందిన వీరు వృత్తిరీత్యా మండల విద్యాధికారిగా సేవలు అందిస్తూనే... రచయితగా తమ సామాజిక వర్గపు మూలాలను వెతుకుతున్నారు. ‘ఇప్పటికీ ఆదివాసులు వెనకడుగే...’ అనే వ్యాసం 1998లో ప్రచురితమైంది మొదలు వందలాది వ్యాసాలు రాశారు. ‘ఆదియోధులు అజరామరులు’ (2021), ‘అనంతయానం’ (2024) అనే వ్యాస సంపుటాలు ప్రచురించారు. తాడ్వాయికి చెందిన కోయ గిరిజన సహోదరులు మైపతి సంతోష్, డాక్టర్ మైపతి అరుణ్‌లు తమ జాతికి చెందిన మూలాల గురించి విస్తృత స్థాయిలో పరిశోధనలు, క్షేత్ర పర్యటనలు చేస్తూ తమ గిరిజన సాహిత్యానికి ప్రామాణికత చేకూర్చే పనిలో నిమగ్నమయ్యారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన సంతోష్ ‘నాగ పున్నమి’ (2016), ‘కోయ భాషా నిఘంటువు’ (2018), ‘కోయలిపి’ (2019), పుస్తకాలు వెలువరించగా, పరిశోధక విద్యార్థి అరుణ్ ‘ఆదివాసి జీవన విధ్వంసం’ (2018), ‘సమ్మక్క సారలమ్మ పూర్వ చరిత్ర’ (2020) అనే ప్రామాణిక పుస్తకాలు రాసి మేడారం సమ్మక్క సారక్కల అసలు చరిత్ర ఆధారాలతో అందించే కృషి చేస్తున్నారు.

మొదట్లో గిరిజనేతరులు రాసిన గిరిజన సాహిత్యం నిండా గిరిజనులపై జరిగిన దోపిడీలు అవమానాలు పోరాటలే కనిపిస్తాయి, కానీ గిరిజనులు రాసుకుంటున్న సాహిత్యంలో సంస్కృతులు సాంప్రదాయాలు అవి రక్షించుకోవడంలో వారి ఆవేదనలు కనిపిస్తున్నాయి.

అమ్మిన శ్రీనివాసరాజు

77298 83223

ఇవి కూడా చదవండి:

వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..

డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా

Updated Date - Mar 16 , 2026 | 01:54 AM