నాగావళి అలల మీద కథల వెన్నెల
ABN , Publish Date - Aug 03 , 2026 | 03:06 AM
ఏదన్నా ఒక విలువైన కథ చదివినప్పుడు మన రోజువారీ నడవడిక మీద తెలియకుండానే దాని ప్రభావం పడుతుంది. అటువంటి కథలు వెన్నాడటం వల్ల అది అభిరుచుల మార్పు దాకా పరిణమించవచ్చు...
ఏదన్నా ఒక విలువైన కథ చదివినప్పుడు మన రోజువారీ నడవడిక మీద తెలియకుండానే దాని ప్రభావం పడుతుంది. అటువంటి కథలు వెన్నాడటం వల్ల అది అభిరుచుల మార్పు దాకా పరిణమించవచ్చు. గంటేడ గౌరునాయుడు కథలు చదివినవారికి అటువంటి అనివార్యత సులువుగా అర్థమవుతుంది. కుల, మత, ప్రాంతీయ అసమానతల మధ్య, ఆధిపత్య వర్గాల మధ్య అమాయక ప్రజల పెనుగులాట చిత్రించడానికి గౌరునాయుడు కథని సమర్థవంతంగా వినియోగించారు. దహనానికి శ్మశానం కూడా దొరకని తోటపల్లి డ్యాం నిర్వాసితుల కష్టాలను కథావస్తువు చేసుకున్నా, గిరిజన ఆశ్రమ విద్యా వ్యవస్థ చుట్టూ ఉన్న అనేక చిక్కుముళ్ళను విప్పే ప్రయత్నం చేసినా అది తన సంవేదనలోంచి భాగంగానే చేశారు. అందుకే అంత త్వరగా ఆ భావనల తడి ఆరదు.
‘సంధ్య’ అనే కథలో గిరిజన గ్రామాల్లో నిరంతరం అన్నలు తిరుగుతారు కనుక, పోలీసు క్యాంపులు ఉంటాయి కనుక కొందరు ఆదివాసీ అమ్మాయిల కన్నూ ముక్కూ బాగుంటాయన్న అర్థం వచ్చే వాక్యం ఉంది. దిగువ కులం పురుషుడికంటే కూడా అతను ప్రేమ వివాహం చేసుకున్న ఏ అగ్ర కులానికి చెందిన స్త్రీ అయినా ఒక మెట్టు కిందనే ఉంటుందని, స్త్రీని వేధించడానికి కులంతో సంబంధం లేదని ‘అల్పపీడనం’ కథలో చెబుతారు. అదే కథలో ‘‘ఒరే నాయనలారా, మేము నాయుళ్ళమూ మాకేటీ అని ఎగురుతున్నారు. వాళ్ళు గానీ కేసు గానీ పెడితే మనమా ముడి ఇప్పుకోడానికి ముప్పతిప్పలు పడాల’’ వంటి వాక్యాలు ప్రాధాన్యత గలవి. ఇక్కడ వద్దన్నా మనకి తప్పక ‘లక్షింపేట’ గుర్తొస్తుంది. అంతే కాదు, కొన్ని కథల్లో ఉత్తరాంధ్రా ప్రాంతంలో నాయుళ్ళకున్న ‘ఆధిపత్య’ స్వభావాన్ని తెలిపే వాక్యాలు తారసపడతాయి. పనిగట్టుకుని దాన్ని రచయిత రొమాంటిసైజ్ చేయలేదు. విమర్శించే ప్రయత్నమే ఎక్కువ చేశారు. అయితే ఇందులో తాటస్త్యం ఉంది. కానీ అది అస్పష్టత కాదు. ఇలాంటివాటిని నిర్వహించడం ఏ కథకుడికైనా కత్తి మీద సామే.
‘ఇండియాగాడి టీసీ’లో ఒక ఎస్టీ వాడి టీసీ మీద చదవాల్సిన ‘ఖర్మ’ ఓసీ వాడికెందుకు అంటారు. రచయిత ఓసీలను గొప్పవాళ్ళంటున్నారా? దళిత బహుజన పీడిత వర్గాలను రాజకీయ పావులుగా వాడుకుంటున్నారని నిజాయితీగానే చెబుతున్నారా? ‘తిరుగుడు గుమ్మి’, ‘నరాలు తెగుతున్న నేల’ వంటి కథల్లో కృష్ణా గోదావరీ పరివాహక ప్రాంతపు ఒక కులస్థులు ఉత్తరాంధ్రాలో వ్యవసాయ భూముల్ని ఆక్రమించుకోవడాన్ని (?) బాహాటంగా విమర్శిస్తారు. ‘‘ఔనౌనుగానీ మనూరు కమ్మావోలు ఎలగెలపొచ్చినారు సెప్మీ. నేపోతే ఎక్కడ తాడేపల్లిగూడెము ఎక్కడ దలే పేట. ఒరే అక్కడెక్కడో ఆడి భూములమ్ముకోని ఇక్కడ భూములు సవాగ్గ కొనేసి ఎవసాయం సేత్తనారంటే మనం ఎర్రోలం గాబట్టే. ఇప్పుడా కమ్మదొర తెల్లదొరైపోతండు’’ అనడం ఆ ప్రాంతపు వ్యవసాయభివృద్ధిలో ఉన్న చీకటి వెలుగుల్ని చూపిస్తుంది. ఈ వ్యతిరేకత సామాజిక రాజకీయార్థిక తులనాత్మకతలోనిది. ఇక్కడే గౌరు నాయుడు కథా బలం దాగి ఉంది.
రైతు కేంద్రకంగా విస్తరించడం వల్ల భూముల యాజమాన్యం, పంటల సాగు, పెట్టుబళ్ళు, రాబడి వంటివి గౌరునాయుడు సృజన వస్తువులయ్యాయి. నేలతో మనిషికుండే అనుబంధం కథల్లో అడుగడుగునా ప్రతిఫలిస్తుంది. అయితే ఈ పని కాళీపట్నం రామారావు ‘కీర్తి కాముడు’ కథ చేయలేదా? కేతు విశ్వనాథరెడ్డి ‘నమ్ముకున్న నేల’ చేయలేదా? సింగమనేని నారాయణ ‘జూదం’, పాపినేని శివశంకర్ ‘చింతల తోపు’ వంటి కథలకన్నా గౌరునాయుడు కథల ప్రత్యేకత ఏమిటి? రావిశాస్త్రి పట్టణ సామాన్యుడ్నీ, కాళీపట్నం పల్లెటూరి శ్రామికుడ్నీ, భూషణం గిరిజనుల్నీ చిత్రించినట్టు ఉత్తరాంధ్రలో భూస్వాములకీ పాలేరుకీ మధ్య ఉండిపోయిన ‘చిన్న సన్నకారు’ రైతు జీవితాన్ని గౌనా తన కథల్లోకి ప్రభావవంతంగా తీసుకొచ్చారు. వి. చంద్రశేఖరరావు కథల్లోలాగా ఇది రిపిటీషన్‌కు గురైన లక్షణం. వి. చంద్రశేఖరరావు ‘‘ఒక అనాగరిక ఆటవిక సామాజిక హింస పునరావృతం అవుతున్నంత కాలం అనుభవాల సామాన్యీకరణ తప్పనిసరి’’ అంటాడు. నాయుడిది ‘‘యవసాయం దైవ సాయం’’ అనేంత శుద్ధ వ్యవసాయవాదం. లేకపోతే ట్రాక్టరు, హార్వెష్టరు (కోత మిషన్) వంటి యాంత్రీకరణలను బకాసురుడితో పోల్చరు. యంత్రాలతో చేసేదాన్ని ‘‘నేనైతే వ్యాపారం అంతాను’’ అనరు.
అస్తిత్వవాదాల పట్ల, వర్గ పోరాటాల పట్ల నాయుడిది మిశ్రమ దృష్టి. పూర్తిగా ఒకవైపు ఒరిగిన దాఖలా ఉండదు. గెంజి మెతుకులు, ఏటిపాట, చొక్కా గుడ్డ కోసం, విముక్తి వంటివి దళిత బహుజన స్పృహని ‘రవంత’ తాకిన కథలు. ‘ఆసరసాల’లో ‘‘ఒరేయ్ గుంటల్లారా, నాను సేసిన మంచాల మీద మిమ్మల్ని కన్నార్రా మీ యమ్మలు’’ అనడం చేతివృత్తుల ఆక్రోశాన్ని దృశ్యమానం చేయడమే. విముక్తి (1989) తర్వాత గౌరునాయుడు కథా వస్తువులు మారిపోయాయి. ఒక కథకుడికున్న దృక్పథాన్ని సాహిత్యానువర్తితంగానే చూడదలిస్తే గౌరునాయుడు ఏ ఫలానా కథా శిల్పాన్నీ గుడ్డిగా అనుసరించలేదు. తన ఒరవడి తాను ఏర్పరుచుకున్నారు. ‘‘జీవితం కొన్ని నమ్మకాలకీ సూత్రాలకీ సిద్ధాంతాలకీ లొంగేది కాదనిపిస్తుంద’’న్న ఆయన మాటల్ని ఆయన కథలకే అన్వయించవచ్చు.
వలసపక్షి, నీడనివ్వని పందిరి, మాయ, ముంపు వంటి కథలు వలస వేదనని తెలుపుతాయి. అభివృద్ధిని చూపకుండా విషాదాల్ని పండిస్తున్నాడని గౌరునాయుడి కథల్ని గతంలో ఆక్షేపించారు. కానీ మానవ దుఃఖం ముందు ఎంత అభివృద్ధయినా చిన్నదే. మనసులో చింతను కొత్త ఆనకట్టలు ఎన్నని నిలువరించగలవు? సాహిత్యాన్ని మించి మనిషి బాధని కొలవగల పరికరమేదైనా భూమ్మీద పుట్టిందా? అది అసాధ్యం కనుకనే అప్పటి గురజాడ, శ్రీపాద, చలం, కొకు, పతంజలి మొదలు నేటి ఇండస్ మార్టిన్, ఎండపల్లి భారతి, సురేంద్ర శీలం, అపర్ణ, మేఘనాథ్, సొలోమోన్, చరణ్ పరిమి దాకా ఎంతోమంది యువ కథకులు సామాన్యుల జీవితాన్ని అర్థవంతమైన కథలుగా మలుస్తున్నారు. ఈ రెండు తరాల మధ్యనే సమాజం భిన్న ధ్రువాలవుతున్న సంక్లిష్ట పరిణామ దశలోంచి నాయుడి కథని విశ్లేషించుకోవాలి.
‘‘చెప్పాల్సింది నిజాయితీగా చెప్పడానికి టెక్నిక్కుల సర్కస్సులు చెయ్యక్కర్లేదు. సగటు పాఠకుడికి అందని మేధస్సును ప్రదర్శించి హింస పడక్కర్లేదు, హింస పెట్టక్కర్లేదు’’ అన్నప్పటికీ, నాయుడి కథా శిల్పం వ్యాకులత, సహానుభూతిలోంచి నియమితమవుతుంది. ఉత్తరాంధ్ర యాసలో పలికే సామెతలూ పలుకుబళ్ళూ కథల్ని పరమ సౌందర్యాత్మకం చేస్తాయి. ‘‘చీకట్లో కొండలు బారులు తీరి నిలబడ్డ ఏనుగుల్లా ఉన్నాయి’’, ‘‘అతని కళ్లు టేకు చిగుళ్లు నలిపిన చేతుల్లా ఎర్రగా ఉన్నాయి’’, ‘‘మేకల్ని మింగి మత్తుగా తొంగున్న ఉల్లిబాములా ఉంది గట్టు’’ వంటి కవితాత్మక వ్యక్తీకరణలు మనల్ని సమ్మోహపరుస్తాయి. నాగావళి–జంఝావతి నదులంటే ఆయనకు తగని ఆపేక్ష ఉంది. అందుకే నాగావళి నది మరో పేరైన ‘లాంగుల్యా’ను తన కలం పేరు చేసుకున్నారు.
కొలకలూరి ఇనాక్ ‘‘ప్రపంచవ్యాప్తంగా వెలువడ్డ మహోత్తమ సాహిత్యం అది పుట్టిన కాలంలో ఆయుధంగా తదనంతర కాలంలో కళాత్మకంగా మిగులుతుంది’’ అంటారొకచోట. సామాజిక జీవితాల్లోకి దళారీ అభివృద్ధి నమూనాల జొరబాటు ఆపతరం కావట్లేదు. వాటిని ఎప్పటికప్పుడు పసిగట్టడమే గాక అన్నికాలాల్లో వాటితో పోరాడేందుకు గౌరునాయుడి కథలు కళాత్మక ఆయుధాలయ్యాయంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
(ఆగస్టు 8న పార్వతీపురంలో గౌరునాయుడి సాహితీ స్వర్ణోత్సవం)
శ్రీరామ్ పుప్పాల
99634 82597
ఇవి కూడా చదవండి:
దేశానికి ఆడేశా.. ఇక సాధించాల్సింది ఏమీ లేదు: భువనేశ్వర్
ఆసియా కప్ 2026.. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో భారత జట్టు ప్రకటన