ఉచితాలతో కాదు, ఉత్పత్తితోనే దేశాభివృద్ధి!
ABN , Publish Date - Aug 11 , 2026 | 01:40 AM
దేశ రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరమైన పోటీ ఏదైనా ఉందంటే అది ఉచితాలే. ఒక పార్టీ ఎన్నికల్లో ఉచితంగా ఒకటి ఇస్తామని ప్రకటిస్తే, మరో పార్టీ దానికి మించి ఇస్తామని హామీలు ఇస్తున్నది. ఎన్నికలు అంటే అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు...
దేశ రాజకీయాల్లో అత్యంత ప్రమాదకరమైన పోటీ ఏదైనా ఉందంటే అది ఉచితాలే. ఒక పార్టీ ఎన్నికల్లో ఉచితంగా ఒకటి ఇస్తామని ప్రకటిస్తే, మరో పార్టీ దానికి మించి ఇస్తామని హామీలు ఇస్తున్నది. ఎన్నికలు అంటే అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై చర్చ జరగాలి. కానీ నేడు అది ఉచితాల వేలంపాటగా మారిపోయింది.
ప్రపంచంలో అగ్రగామిగా ఎదిగిన ఏ దేశాన్ని చూసినా, వారి ప్రస్థానం వెనుక ఉన్నది శ్రమ, ఉత్పత్తి. జపాన్, అమెరికా, చైనా, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలు పరిశ్రమలు, విద్య, సాంకేతికతపై పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చెందాయి. రెండో ప్రపంచ యుద్ధంలో పూర్తిగా ధ్వంసమైన జపాన్ నేడు ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగింది. కారణం– కష్టపడే సంస్కృతి, పనికి గౌరవం, ఉత్పత్తిపై దృష్టి. జపాన్‌లో ఉచిత వంటగ్యాస్, విద్యుత్, రేషన్ వంటి సంక్షేమ పథకాలు లేవు. అయితే సంక్షేమం అవసరమే, కానీ అదే పరమావధి కాకూడదు. పేదలు, వృద్ధులు, వికలాంగులు, ఆపదలో ఉన్నవారికి, ప్రకృతి విపత్తుల బాధితులకు ప్రభుత్వ అండ తప్పనిసరి. అది ప్రభుత్వాల బాధ్యత కూడా. కానీ సంక్షేమానికి, ఉచితాల రాజకీయాలకు మధ్య స్పష్టమైన తేడా ఉంది. సంక్షేమం మనిషిని నిలబెడుతుంది. ఉచితాల సంస్కృతి మనిషిని ఆధారపడేలా చేస్తుంది. ప్రజల్లో శ్రమకు బదులుగా ఉచితాలపై ఆధారపడే తత్త్వం పెరిగితే, అది దేశ ఉత్పాదక శక్తిని బలహీనపరుస్తుంది. అలాగే ప్రభుత్వ ఖజానాపై అప్పుల భారం పెరుగుతుంది. వడ్డీ చెల్లింపులు పెరిగి చివరికి అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన నిధులు కూడా సంక్షేమ వ్యయాలకే ఖర్చు చేస్తున్న ఫలితంగా రహదారులు, విద్య, ఆరోగ్యం, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల వంటి రంగాలు నిర్వీర్యం అవుతున్నాయి. విద్యపై ప్రభుత్వాలు వీలైనంత ఎక్కువగా ఖర్చు పెడితే మేలిమి మానవ వనరులు రూపొందుతాయి. తద్వారా నూతన ఆవిష్కరణలు ఊపందుకొంటాయి. ఉత్పాదకత పెరిగి పేదరికం తగ్గుతుంది.
అపరిమితమైన అప్పులు దేశాన్ని, రాష్ట్రాలను కోలుకోలేని సంక్షోభంలోకి నెడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం రుణభారం నేడు దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో దాదాపు 80 నుంచి 85శాతానికి చేరుకుంటోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ప్రభుత్వమూ అభివృద్ధి పేరుతో రుణాలను పెంచుకుంటూనే పోతున్నది. గత కొన్నేళ్లుగా ఈ ధోరణి ప్రమాదకర స్థాయికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వాలు రోజువారీ పాలన కోసం కొత్తగా అప్పులు చేయాల్సిన దుస్థితి. దీనివల్ల అభివృద్ధి పనులకు నిధులు ఉండటం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో అందవు. మౌలిక సదుపాయాల కల్పన లేక పరిశ్రమలు రావు, తద్వారా నిరుద్యోగం పెరుగుతుంది. ఈ రోజు పుట్టిన బిడ్డ.. కళ్లు తెరవకముందే వేల రూపాయల అప్పును తలపై మోస్తూ భూమి మీదకు వస్తోంది. అభివృద్ధి పేరు చెప్పి మనం పొందుతున్న తక్షణ ప్రయోజనాల ఖర్చును రేపటి తరాలకు బదలాయించడం ఏ రకమైన ధర్మం? ఒక దేశం నిజమైన అభివృద్ధిని సాధించాలంటే ఉచితాల సంస్కృతి నుంచి ఉత్పాదకత వైపుగా పయనించాలి.
నీరుకొండ ప్రసాద్
ఈ వార్తలు కూడా చదవండి
ఈ జీవోకు, ఫార్చ్యూన్ ఇండియా కథనానికి సంబంధం లేదు: ఏపీ ప్రభుత్వం క్లారిటీ
వైసీపీ నేత చింతాడ రవికుమార్‌కు బిగుస్తోన్న ఉచ్చు