Share News

ఉచితాలిలాగే సాగితే మనకూ వెనెజువెలా గతే!

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:02 AM

దేశంలో సంక్షేమం పేరిట ఉచితాలు అందించే రాష్ట్రాలలో తమిళనాడుదే అగ్రస్థానం. ఆ రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు– డీఎంకే, అన్నాడీఎంకేలు గత రెండు దశాబ్దాలకుపైగా ఎన్నికలలో....

ఉచితాలిలాగే సాగితే మనకూ వెనెజువెలా గతే!

దేశంలో సంక్షేమం పేరిట ఉచితాలు అందించే రాష్ట్రాలలో తమిళనాడుదే అగ్రస్థానం. ఆ రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు– డీఎంకే, అన్నాడీఎంకేలు గత రెండు దశాబ్దాలకుపైగా ఎన్నికలలో ప్రజలను బుట్టలో వేసుకోవడానికి పోటాపోటీగా ఉచితాలు ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు వెర్రితలలు వేసే స్థాయికి చేరిపోయాయి.

తొలుత మహిళల్ని ఆకట్టుకోవడానికి అన్నాడీఎంకే తమిళనాడులో టేబుల్‌ ఫ్యాన్లు, మిక్సర్లు, గ్రైండర్లు ఇస్తామంది. పోటీగా డీఎంకే కూడా యువతకు ట్యాబ్‌లు, లాప్‌ట్యాప్‌లు, టీవీలు తదితర ఖరీదైన బహుమతుల ఆశ చూపింది. ప్రస్తుతం తమిళనాడులో అనేక ఉచితాలతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చదువుకునే బాలికలకు నెలకు రూ.1000ల నగదు, రూ.24,000 వార్షిక ఆదాయం కలిగిన పేద కుటుంబాల వధువులకు రూ.50,000 నగదు, ఒక బంగారు నాణెం అందిస్తున్నారు. నిరాశ్రయులైన మహిళలకు, వికలాంగులైన పురుషులకు ఉచిత కుట్టు మిషన్‌లు అందిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్లకు నెలకు రూ.1000ల పెన్షన్‌, యువతకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం, పేదలకు ఉచితంగా గృహాలు, ఉచిత వైద్యం, 2 కోట్ల వినియోగదారులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సదుపాయం మొదలైనవి ఎన్నో ఉన్నాయి.


రూ.4 లక్షల 40 వేల కోట్ల వార్షిక బడ్జెట్‌ కలిగిన తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏటా లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేస్తోంది. రాష్ట్రానికొచ్చే సొంత రాబడి, కేంద్రం అందించే గ్రాంటులు అన్నీ కలిపితే వచ్చే మొత్తం కేవలం రూ.3 లక్షల 30 వేల కోట్లు. రాష్ట్ర వార్షిక ఆర్థికాభివృద్ధి రేటు చూస్తే 7–8 శాతం మించడం లేదు. కానీ, అప్పులు మాత్రం ఏటా 20 నుంచి 25శాతం పెరుగుతున్నాయి. ఇప్పటికే తడిసిమోపెడుగా ఉన్న ఉచితాల చిట్టాకు మరికొన్ని చేరుస్తామని, తమకు అధికారం ఇవ్వాలంటూ ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకే తాజాగా ఓ ప్రకటన చేసింది. అధికారంలో ఉన్న డీఎంకే తామేమీ తక్కువ తినలేదన్నట్లు మరికొన్ని ఉచిత పథకాలకు రూపకల్పన చేస్తోంది. కొన్ని రాజకీయ పార్టీలు బాధ్యతా రహితంగా ప్రజలకిస్తున్న ఈ ఉచితాలు ఓ అంటువ్యాధిలా దేశం మొత్తం పాకుతున్నాయి. దక్షిణాదిలో మొదలైన ఈ జాడ్యం క్రమంగా ఉత్తరాది రాష్ట్రాలకూ అంటుకుంది.

ఒకవైపు సంపన్నులకు ఎన్నో రాయితీలు కల్పిస్తున్న ప్రభుత్వాలు– పేదలకిచ్చే సబ్సిడీలు, ఉచితాలపై ఎందుకు వెనక్కు పోవాలని ప్రశ్నిస్తున్నవారు ఉన్నారు. పేదలకు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకించడం అంటే అది క్యాపిటలిస్ట్‌ మనస్తత్వం అని దుయ్యబట్టేవారూ ఉన్నారు. విద్య, వైద్యం మినహా మిగతావేవీ ఉచితంగా ఇవ్వరాదని చెబుతున్న వారిని పేదల వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. ప్రజా బాహుళ్యంలో ఉన్న ఈ భిన్నాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని.. కొందరు సీనియర్‌ రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత అభిప్రాయమంటూ ఉచితాలను వ్యతిరేకిస్తున్నారు గానీ.. దానిని ఓ విధానపరమైన అంశంగా తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలో చర్చకు పెట్టకపోవడం విషాదం. ఈ ఉచితాల వల్ల రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. వడ్డీ చెల్లింపులకే ఏటా 10 నుంచి 15వేల కోట్లు అవుతోంది. ఇది మరింత పెరిగే ప్రమాదం ఉంది.


ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణతో వ్యవహరించాలని, ఉదారంగా సబ్సిడీలు ఇచ్చే విధానానికి స్వస్తి పలికి తగిన మోతాదులోనే సబ్సిడీలు ఉండాలని రాష్ట్రాల స్థాయిలో మొట్టమొదట గళం విప్పిన నాయకుడు చంద్రబాబునాయుడు. 1995లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు– నాడు ఆర్థికంగా ఒట్టిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబునాయుడు కొన్ని కఠోర నిర్ణయాలు తీసుకొన్నారు. సబ్సిడీ బియ్యం ధర పెంపుదల, మద్యపాన నిషేధం ఎత్తివేత తదితర నిర్ణయాలతోపాటు విద్యుత్‌ రంగంలో పెద్దఎత్తున సంస్కరణలు చేపట్టారు. దాంతో, ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీలో కూడా గగ్గోలు మొదలైంది. ఉచితంగా విద్యుత్‌ ఇస్తే విద్యుత్‌ రంగం కుప్పకూలుతుందని చంద్రబాబు గట్టిగా వాదించారు. ఆర్థిక రంగాన్ని చక్కదిద్దాలనుకున్న చంద్రబాబునాయుడి విధానాలను ప్రజలు అర్థం చేసుకోలేదు. దాంతో ఆయన 2004 ఎన్నికలలో ఓటమి చవి చూశారు. ఒకవేళ, ఆ ఎన్నికలలో చంద్రబాబునాయుడు గెలిచి ఉంటే చరిత్ర మరొకలా ఉండేది. ముఖ్యంగా రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అయివుండేది. ఆ ఓటమితో ఆయన కూడా ప్రజాకర్షక పథకాల వైపు మొగ్గుచూపక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ప్రజలకు ఉచితాలు ఇవ్వడం కంటే ఎక్కువగా వారిని ఏ పనీ చేయనక్కర్లేనివారిగా ఓ ప్రమాదకరమైన మార్గం వేసింది మాత్రం 2019–24 మధ్య అయిదేళ్ల కాలంలో, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డే. లబ్ధిదారులకు నేరుగా ఖాతాల్లోకి ఎప్పటికప్పుడు డబ్బు జమ చేసే విధానాన్ని ప్రారంభించి, దానిని ఒక ఘనతగా చాటుకున్నారు. ఆయన పాలనలో దాదాపుగా ప్రతి వ్యవస్థ సుషుప్తిలోకి జారి పోయింది. జగన్‌ అయిదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక రంగం అప్పుల ఊబిలోకి, జడత్వంలోకి జారిపోయింది. దానినుంచి బయటపడడానికి ప్రస‍్తుతం చంద్రబాబునాయుడు అలవికాని అవస్థలు పడుతున్నారు.


మితిమీరిన పాప్యులిజం, అవినీతి, ద్రవ్యోల్బణం తదితర కారణాల వల్ల వెనెజువెలా దేశం ఆర్థికంగా కుప్పకూలిన ఉదంతాన్ని ఇపుడు అందరూ ఎత్తి చూపుతున్నారు. భారీ చమురు నిల్వలతో సంపన్న దేశంగా ఉండిన వెనెజువెలా ఎదుర్కొన్న సంక్షోభాన్ని పాలకులు ఓ గుణపాఠంగా తీసుకోవాలి. మన దేశంలో ఓట్ల కోసం అందించే ఉచితాలను కట్టడి చేయాలి. ఇటీవలి కాలంలో ఉచితాలను గట్టిగా వ్యతిరేకిస్తున్న మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ అంశంపై జాతీయ స్థాయిలో పెద్దఎత్తున గళం విప్పితే కొంత ఫలితం ఉంటుంది. ఆయనకు జతకలిసేవారు మరికొందరు చేరొచ్చు. ఎన్నికల ప్రధాన సంఘం రాజకీయ పార్టీల మేనిఫెస్టోలను నియంత్రించడానికి గల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సర్వోన్నత న్యాయస్థానం, పార్లమెంట్‌ల జోక్యం కూడా ఇందులో తప్పనిసరి. ఉచితాల సంస్కృతి పెరిగి భారత్‌ మరో వెనెజువెలా కాకముందే అందరూ కళ్లు తెరవాలి. ఇష్టానుసారంగా హామీలిస్తున్న రాజకీయ పార్టీలకు ముకుతాడు వేయాలి.

సి.రామచంద్రయ్య

శాసనమండలి సభ్యులు

ఇవి కూడా చదవండి

మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం

మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Feb 26 , 2026 | 03:02 AM