Share News

Adivasi Rights India: అడవి.. ఆదివాసులు.. ఆక్సిజన్‌

ABN , Publish Date - Jan 07 , 2026 | 02:51 AM

మధ్యప్రదేశ్ రాష్ట్ర తూర్పు ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితంగా, 2000 సంవత్సరంలో నాటి కేంద్ర ప్రభుత్వం ‘ఛత్తీస్‌గఢ్‌’ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర దక్షిణ...

Adivasi Rights India: అడవి.. ఆదివాసులు.. ఆక్సిజన్‌

మధ్యప్రదేశ్ రాష్ట్ర తూర్పు ప్రాంత ప్రజలు దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితంగా, 2000 సంవత్సరంలో నాటి కేంద్ర ప్రభుత్వం ‘ఛత్తీస్‌గఢ్‌’ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో ఉన్న బస్తర్ జిల్లా ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద జిల్లా. నాటి ఈ ఉమ్మడి బస్తర్ దాదాపు 46,000 చ.కి.మీ వైశాల్యం కలిగివుండగా, మొత్తం దండకారణ్యం 92,300 చ.కి.మీ వైశాల్యం కలిగివుంది. అపారమైన అడవి, విశాలమైన కొండలు, పర్వతాలు, లోయలతో పాటు, ఇంద్రావతి, వెన్‌గంగ, శబరి, ప్రాణహిత, గోదావరి, మహానది వంటి జీవనదులు పారుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధికి కనీసం కృషి చేయలేదు.

ఈ ఆదివాసీ తెగల జీవన ప్రమాణాలయిన విద్య, వైద్యం, జీవన భృతి అభివృద్ధి పట్ల గత 75 ఏళ్లుగా భారత ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపలేదు. ఆదివాసులు జీవిస్తున్న అడవి మీద, లక్షల కోట్ల రూపాయల విలువైన పదకొండు రకాల ఖనిజ నిక్షేపాల వెలికితీతపై బహుళజాతి సంస్థలు, దేశీయ బడా పెట్టుబడిదారులు కన్నేశారు. కార్పొరేట్‌ సంస్థలు నాలుగు దశాబ్దాల క్రితమే ‘బైలదిల్లా’లో పాగా వేశాయి. గత 30 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తున్న ‘ఖనిజ వెలికితీత పాలసీ’ల వల్ల– లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు రాజ్యాంగం, చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పులకతీతంగా ఆదివాసుల జీవితాలను బడా పెట్టుబడిదారులు ఛిద్రం చేస్తున్నారు.

నాడు దేశంలో వలస పాలకులకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిన స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఉత్తర, దక్షిణ, మధ్య భారతదేశంలోని ఆదివాసీ ప్రాంతాల్లో బిర్సాముండా (జార్ఖండ్), రాంజీ గోండు, కొమురం భీం (తెలంగాణ), అల్లూరి సీతారామరాజు (ఆంధ్రా)ల నాయకత్వంలో ఆదివాసీ ప్రజలు ‘అడవిపై హక్కు మాదే’నంటూ ఉద్యమించారు. ఆ క్రమంలోనే దండకారణ్యంలో కూడా బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా వచ్చిన ‘భూమ్ కాల్’ ఉద్యమానికి ‘గుండాదూర్’ అనే ఆదివాసీ నాయకుడు నాయకత్వం వహించారు. పైన చెప్పిన తెగల ప్రజలను ఐక్యం చేసి ‘అడవిపై హక్కు ఆదివాసులదే’నంటూ పోరాడిన వీరుడు గుండాదూర్. తన జీవితకాలమంతా ‘జల్–జంగిల్–జమీన్’ ఆదివాసులదేనని ప్రజలను ఐక్యంచేసి పోరాడిన ఆయన ఆదివాసీ ప్రజల ఆరాధ్యవీరుడయ్యాడు.


ఆ పోరాట చరిత్ర మళ్లీ 1980లో పునరావృతమైంది. అభివృద్ధి అంటే ఏమిటో తెలియని ఆదివాసీలను సంఘటితం చేసి మూడు దశాబ్దాల పాటు గొప్ప పోరాటం కొనసాగించిన విప్లవోద్యమ నాయకులు ఆదివాసీ ప్రజల జీవితాల్లో భాగమయ్యారు, వారి జీవన ప్రమాణాలు పెంచారు. ప్రజల పట్ల నిబద్ధతతో వారు చేసిన విస్తృత నిర్మాణ కృషి వల్ల, ఆదివాసీ సమాజంలో అది ‘భౌతిక శక్తి’గా మారింది. ఇదే ప్రభుత్వాల వెన్నులో చలి పుట్టించింది. ఈ క్రమంలోనే ఆ ఉద్యమ అణచివేతను ఆరంభించారు. 1997లో సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ‘సమతా రవి వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో– ‘‘అయిదవ షెడ్యూల్ రాజ్యాంగ మౌలిక స్వరూపం. దీనిని మార్చేందుకు పార్లమెంట్‌కు కూడా అధికారం లేదు. ఆదివాసుల సమగ్ర జీవన విధానం అడవితో, అక్కడ లభించే వనరులతో ముడిపడి ఉన్న వారి ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక జీవనాన్ని ప్రభుత్వాలు రక్షించాలి’’ అని సమగ్ర తీర్పునిచ్చింది. ఆ తీర్పునకు ప్రజల పోరాటాలు కూడా తోడై, బీడీ శర్మ, ఎస్.ఆర్ శంకరన్ వంటి నిబద్ధత కలిగిన ఉన్నతాధికారుల కృషి వల్ల నాటి కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ ప్రాంత గ్రామీణ పంచాయతీ విస్తరణ చట్టం, 1998 (PESA), ఆదివాసుల అటవీ హక్కుల రక్షణ చట్టం–2006 తెచ్చినా, అవి నిజమైన స్ఫూర్తితో అమలుకావడం లేదు. ఫలితంగా ఆదివాసుల అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా ఉంది. అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు ఇవ్వని ఈ ప్రభుత్వాలతో పాటు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ITDA) కూడా నామమాత్రంగా మిగిలింది.

ఈ పరిస్థితుల్లో అడవి మీద, అడవిలోని అపార ఖనిజ సంపద మీద కన్నేసిన కార్పొరేట్‌ సంస్థలు దండకారణ్యంలోని ఖనిజ నిక్షేపాలను కొల్లగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి ఆదివాసుల న్యాయమైన పోరాటంపై చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఎన్‌కౌంటర్లు చేస్తున్నాయి. సైనిక బలగాలు దండకారణ్యంలో ఆదివాసులను చెట్లకు కట్టి కాల్చి చంపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఛత్తీస్‌గఢ్‌లో 2004 నుంచి జనజాగరణ్‌ అభియాన్, సల్వాజుడుం, ఇతర ఆపరేషన్ల పేరు మీద ఆదివాసులను పెద్దసంఖ్యలో చంపి, ఇండ్లు తగలబెట్టి, పంట పొలాలను నాశనం చేసి, వేల సంఖ్యలో వారిని అడవి నుంచి తరిమికొట్టారు. గత రెండు సంవత్సరాలుగా ‘కగార్’ పేరుతో విచ్చలవిడిగా నరమేధం కొనసాగిస్తూ అడవిలో ఆదివాసులు లేకుండా చేస్తున్నారు. అడవిని అంబానీకి, అదానీకి అప్పజెప్పేందుకే ఈ మారణకాండ కొనసాగిస్తున్నారు. అడవిలో పుట్టి, పెరిగి, శతాబ్దాల తరబడి అడవిని రక్షిస్తూ, సమాజానికి ప్రాణవాయువు అందిస్తున్న అడవి ఆదివాసులదా? లేక అంబానీ–అదానీలదా? వారి వారసులైన జిందాల్, మిట్టల్, బహుళజాతి సంస్థలదా? ఈ విషయం గురించి దేశ ప్రజలు ఆలోచించాలి.

‘కగార్’ యుద్ధం బారి నుంచి అడవిని, దానిని రక్షిస్తున్న ఆదివాసులను పౌర సమాజం కాపాడుకోలేకపోతే సమాజ భవిష్యత్తు అంధకారమే. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల అడవిని నాశనం చేయడం వల్ల, నేడు ఢిల్లీ ప్రజలు మాత్రమే ప్రాణవాయువు అందక ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ పేరుతో ఆదివాసుల మీద కొనసాగిస్తున్న నరమేధం వల్ల, రేపు అడవి బడా పెట్టుబడిదారుల చేతుల్లో ధ్వంసమై, ఢిల్లీ ప్రజలవలె దేశ ప్రజలకు కూడా ప్రాణవాయువు అందదు. ఇది నేటి కఠోర వాస్తవం.

చిక్కుడు ప్రభాకర్

కన్వీనర్, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక

ఇవీ చదవండి:

హైకోర్టును ఆశ్రయించిన రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్.. అందుకేనా?

కవిత కాంగ్రెస్‌లో చేరినా ఆశ్చర్యమేమీ లేదు: మల్‌రెడ్డి రంగారెడ్డి

Updated Date - Jan 07 , 2026 | 02:52 AM