Share News

విదేశీ కుట్రలూ.. స్వదేశీ విమర్శలూ..!

ABN , Publish Date - Nov 27 , 2026 | 03:54 AM

ఓట్ల దొంగలూ గద్దె దిగండి.. అన్న నినాదం ఇటీవల కాలంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) పేరుతో పెద్ద ఎత్తున ఓటర్లను తొలగిస్తున్నారన్న...

విదేశీ కుట్రలూ.. స్వదేశీ విమర్శలూ..!

ఓట్ల దొంగలూ గద్దె దిగండి.. అన్న నినాదం ఇటీవల కాలంలో చాలా ప్రాచుర్యం పొందింది. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్‌) పేరుతో పెద్ద ఎత్తున ఓటర్లను తొలగిస్తున్నారన్న ఆరోపణలతో కాంగ్రెస్‌ పార్టీ ఈ నినాదాన్ని ఇచ్చింది. ఇదిప్పుడు దేశాల సరిహద్దులు దాటుతోంది. విదేశాల్లో కూడా కొందరు దీన్ని నినదిస్తున్నారు. అంతటితో ఆగితే పర్వాలేదు. భారత్‌కు వచ్చి నినదించటం కూడా మొదలైంది. హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన భారత్‌ సమ్మిట్‌లో పార్టీ ఆఫ్‌ యూరోపియన్‌ సోషలిస్ట్స్‌ (పీఈఎస్‌) ప్రధానకార్యదర్శి ఫిలిబెక్‌ గియాకోమో కూడా దీన్ని అందుకోవటంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫిలిబెక్‌పై చర్య తీసుకోవాలని కోరుతూ సాక్షాత్తూ సుప్రీంకోర్టులోనే పిటిషన్‌ దాఖలైంది. ఇటలీలో అధికార కూటమికి చెందిన ప్రతినిధి సైతం ఫిలిబెక్‌ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఒక దేశానికి చెందిన నాయకుడు ఇంకో దేశానికి వచ్చి అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని గద్దెదిగాలని డిమాండు చేయటం విదేశీ కుట్రలో భాగమేనన్న దాకా విమర్శలు వెల్లువెత్తాయి. భారత్‌ను బలహీనపరచటానికి ఇటీవల కాలంలో పెద్దఎత్తున విదేశీ కుట్రలు మొదలయ్యాయని వాటికి పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ చేయూతనిచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపణలను ఉధృతం చేశారు. నిజానికి ఫిలిబెక్‌ లాంటి సోషలిస్టు నాయకులకు దేశాల సరిహద్దులు అంతగా పట్టవు. రాజకీయాలను వాళ్లు దేశాల సరిహద్దులకు పరిమితం చేయటానికి సిద్ధాంతరీత్యా అంగీకరించరు. అంతర్జాతీయ దృక్పథమే వాళ్లను నడిపిస్తుంది. శ్రామికవర్గాలు దేశాలకు అతీతంగా ఏకంకావాలన్న రాజకీయాలే వాళ్లకు ప్రధానం. ఇటీవల కాలంలో రాహుల్‌గాంధీ ప్రకటనలూ, విమర్శలూ, వ్యాఖ్యానాలన్నీ కూడా సోషలిస్టు వాసనలతో ఉండటంతో ఫిలిబెక్‌ లాంటి వాళ్లకు అవి బాగా నచ్చుతున్నాయి. ‘ఓట్‌ చోర్‌ గద్దీ చోడ్‌’ అన్న నినాదం కూడా ఫిలిబెక్‌ అలా అందిపుచ్చుకున్నదే.

సర్‌ పేరుతో ఓట్ల తొలగింపు ప్రక్రియ వివాదాస్పదం కావటం పూర్తిగా రాజకీయాల వల్లే జరిగిందని చెప్పలేం. మొదట్లో కాదన్నా ఆ ప్రక్రియలోని తప్పిదాలను సుప్రీంకోర్టూ గుర్తించక తప్పలేదు. ఎన్నికల సంఘం కూడా ఒక్కొక్క తప్పునూ సవరించుకుంటూ ఆదేశాలనూ ఇస్తూ వస్తోంది. దీన్ని ముగిసిన ప్రక్రియగా ఇప్పటికీ చెప్పుకోలేం. తప్పిదాలపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్న కొద్దీ సవరణలు తప్పవు. ఆలస్యంగా తప్పులను సవరించుకోవటం మెచ్చుకోతగినదైనా జరిగిన నష్టాలను అది పూడ్చలేదు. శాసనసభ ఎన్నికలకు ముందు హడావుడిగా సర్‌ను చేపట్టిన చోట్ల రాజకీయంగా నష్టాలు అవి ఉద్దేశించిన వాళ్లకు జరిగిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కమిషన్‌ ఆత్మరక్షణలో పడిపోయింది. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే వ్యక్తులూ, సంస్థలూ కమిషన్‌ నిష్పాక్షికతపై సందేహాలు వెలిబుచ్చటం ఇంటా బయటా కూడా బాగా పెరిగింది.


వేరే దేశానికి చెందిన వ్యక్తి ఇక్కడి ప్రభుత్వం మారిపోవాలని నినదించటం రాజకీయ, దౌత్య మర్యాదల దృష్ట్యా అసంబద్ధంగానే ఉండొచ్చు. కానీ ఆ మర్యాదలను దాటి పరదేశాల్లో విమర్శలనూ ఆరోపణలనూ చేయటం దశాబ్దం పైచిలుకుగా మన నాయకులకూ సర్వసాధారణమై పోయింది. విదేశాలకు వెళ్లి స్వదేశంలోని ప్రత్యర్థి పార్టీలను తూర్పారబట్టటం రాజకీయ వ్యూహంలో భాగంగా మారిపోయింది. విదేశీగడ్డపై అక్కడి రాజకీయాల గురించి మాట్లాడటం అరుదైనా అది కూడా జరిగిపోయింది. అమెరికా వెళ్లి ‘అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌’ అంటూ స్వయంగా ప్రధానమంత్రి మోదీ 2019 సెప్టెంబరు 22 ర్యాలీలో ప్రకటించటం పెద్ద వివాదమైంది. గతంలో ఏ భారత ప్రధానీ అమెరికా ఎన్నికలకు సంబంధించి ఆ తరహా వ్యాఖ్యలు చేయలేదు. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వస్తే భారత్‌కు మేలు జరుగుతుందనే భావనతో మోదీ ఆ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. కానీ జరిగింది అందుకు పూర్తిగా భిన్నమైంది. భారత్‌ను ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని విధాలుగా ట్రంప్‌ పెట్టారు. భారత వస్తువులపై విపరీతంగా దిగుమతుల సుంకాలను విధించి ఎగుమతులకు తీవ్ర అవరోధం కల్పించారు. భారత్‌ను చిన్నబుచ్చే విధంగా ఎన్నో వ్యాఖ్యలు చేశారు. భారత్‌ది మృత ఆర్థిక వ్యవస్థనీ విమర్శించారు. చైనాను నిలువరించే విధంగా ట్రంప్‌ వ్యవహరిస్తారని ఆశిస్తే దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. అన్ని రకాలుగా చైనాను అమెరికాకు సమవుజ్జీగా పరిగణించేటట్లుగా అడుగులు వేశారు. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌ పార్టీ ఓటమి తర్వాత ఇది మరింత స్పష్టంగా కనపడుతోంది.

విదేశాల్లో రాజకీయ విమర్శలు చేయటంలో ఎవరు ఎక్కువ? ఎవరు తక్కువ? అని అంటే కచ్చితంగా చెప్పలేం. సందర్భానుసారం రాజకీయ అవసరార్థంగా అవన్నీ విపరీతంగానే సాగాయి. కాంగ్రెస్‌ పాలనలో భారత్‌కు ‘స్కామ్‌ ఇండియా’గా గుర్తింపు వచ్చిందని, దాన్ని ఇప్పుడు తాము స్కిల్‌ ఇండియాగా మారుస్తున్నామనీ టొరంటోలో ప్రధాని మోదీ (2015 ఏప్రిల్‌ 16) వ్యాఖ్యానించారు. ‘ఎవరు దేశంలో గందరగోళాన్నీ, చెత్తనూ సృష్టించారో వాళ్లు వెళ్లిపోయారు. మేము ఆ చెత్తను శుభ్రం చేయబోతున్నాం’ అని కూడా అన్నారు. ‘గత ప్రభుత్వం నుంచి నిర్ణయరాహిత్యాన్నీ, అలసత్వాన్నీ నేను వారసత్వంగా పొందాను’ అని యూఏఈ (2015 ఆగస్టు 17)లో వ్యాఖ్యానించారు. గతంలో విదేశాల్లో భారతీయులకు గౌరవం తక్కువగా ఉండేదనీ, 2014 నుంచీ పరిస్థితి మారిందనీ చైనా గడ్డ మీదే (2015 మే 16) విమర్శించారు. దక్షిణ కొరియాలో (2015 మే 18) అయితే ఇంకా తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. దేశంలో పుట్టినందుకే భారత పౌరులు ఒకప్పుడు విచారం వ్యక్తం చేసేవారనీ అన్నారు. అందుకే మంచి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడాలని అనుకునేవారనీ, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్కువ ఆదాయం వచ్చినా స్వదేశానికి తిరిగి రావటానికి వారు సిద్ధపడుతున్నారనీ వ్యాఖ్యానించారు. భారతదేశం గతంలో ప్రపంచదేశాల ముందు ప్రాధేయపడే స్థితిలో ఉండేదని జర్మనీలో (2015 ఏప్రిల్‌ 12) విమర్శించారు. ప్రధాని హోదాలో చేసిన ఈ విమర్శలన్నీ అవాస్తవాలుగా కొట్టేయలేం. తరచిచూస్తే ప్రతి విమర్శలోనూ ఎంతోకొంత నిజపరిస్థితే కనపడుతుంది. కానీ స్వదేశంలో చేయాల్సిన రాజకీయ ఎదురుదాడులు విదేశీగడ్డమీద చేయకూడదనే మర్యాదలనూ, నీతులనూ పాటించాలనే నిబద్ధత నుంచి చూస్తే వీటిని సమర్థించుకోవటం అంత సులువుకాదు. రాహుల్‌గాంధీ విదేశాల్లో చేసిన విమర్శలకూ ఇదే వర్తిస్తుంది. వాటిల్లో ఎంతోకొంత నిజం తప్పనిసరిగా ఉంది. దర్యాప్తు సంస్థలను ప్రత్యర్థులకు వ్యతిరేకంగా వాడుకుంటున్నారన్న ఆయన ఆరోపణలను తేలికగా కొట్టేయలేం. భారతీయ బహుళ సంస్కృతినీ దెబ్బతీస్తున్న సంఘటనల జాబితాను చెప్పుకొంటే చాలా పెద్దదిగానే ఉంటుంది.


సంపదంతా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతోందన్న రాహుల్‌ విమర్శలను సమర్థించే గణాంక సమాచారమూ ఉంది. ఉద్యోగాల కల్పనలో మన పరిస్థితి సంతృప్తికరంగా లేదన్న దానికీ ఇదే వర్తిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ క్రమేపీ బలహీనపడుతున్నాయన్నదీ రాజకీయ పరిశీలకుల అనుభవంలో ఉన్నదే. భారత్‌ ఆర్థిక విపత్తును ఎదుర్కొంటోందని న్యూయార్క్‌లో వారంరోజుల క్రితం రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. భారత్‌లో ఎన్నికల్లో పోటీకి అందరికీ సమాన అవకాశాల్లేవని వాషింగ్టన్‌లో రెండేళ్ల కిందట (2024 సెప్టెంబర్‌ 10) ఘాటుగా విమర్శించారు. దేశంలో 90శాతం మందికి సమాన అవకాశాల్లేవనీ, భారత్‌ న్యాయమైన సమాజం కాదని వ్యాఖ్యానించారు. గత పదేళ్ల కాలంలో భారత ప్రజాస్వామ్యం ముక్కలైందని వాషింగ్టన్‌లోని నేషనల్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆరోపించారు. భారత్‌లో న్యాయవ్యవస్థ, బ్యురాక్రసీ, మీడియా బలహీనమై పోయాయనీ మొత్తంగా ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడిపోయిందనీ లండన్‌లోనూ (2023 మార్చి) విమర్శించారు.

ఇటలీ సోషలిస్టు ఫిలిబెక్‌ హద్దులు మీరారనే అనుకుందాం. ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండు చేయటాన్నీ అలాగే భావిద్దాం. కానీ విదేశీయులన్న పేరుతో అన్ని విమర్శలనూ కొట్టేస్తే మనం కోల్పోయేదే ఎక్కువ ఉంటుంది. భారత్‌ మీద ప్రేమతోనూ, ఇతరత్రా కారణాలతోనూ ఎందరో మేధావులూ, ఆర్థికవేత్తలూ, చరిత్రకారులూ, సామాజిక శాస్త్రవేత్తలూ ఇక్కడకు వచ్చి పరిశోధన చేశారు. భారత సమాజం మంచి చెడులనూ విశ్లేషించారు. రాజకీయాలను లోతుగా పరిశీలించి మన ప్రజాస్వామ్యం ఘనతలనూ లోపాలనూ చెప్పారు. భారత్‌లో అంతా సజావుగానే ఉందని చెప్పే విదేశీ పరిశోధకులు చాలా తక్కువ. అందులోనూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి అలాంటి వారిని ఊహించలేం. ఎంతో ప్రామాణికతతో కూడిన పరిశోధనలనూ, విమర్శలనూ విదేశీయులన్న పేరుతో, హిందూ సంస్కృతీ ఔన్నత్యాన్ని నిరాకరిస్తున్నారన్న ముద్రతో వ్యతిరేకించటం ఇప్పుడు మామూలైపోతోంది.


గతాన్ని మతదృష్టితో చూడకుండా సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పులను విశ్లేషిస్తున్న వారిపై ప్రత్యక్షంగా పరోక్షంగా విద్వేషాన్ని రగల్చటమూ పెరుగుతోంది. బ్రిటీషు పాలకులు ఒకప్పుడు తమ పాలనను సమర్థించుకోటానికి తమకు ముందున్న సుల్తానులు, పాదుషాలను నియంతలుగా, మతోన్మాదులుగా వర్ణించారు. ఆనాటి రాజకీయ అవసరాలకు అది పనికి వచ్చింది. ఈ ఏకపక్ష వర్ణనలోని డొల్లతనాన్ని ఆధారాలతో బట్టబయలు చేయటంలో విదేశీ పరిశోధకుల పాత్ర చాలా ఉంది. 18వ శతాబ్దం ఆరంభం నాటికి భారత్‌ ప్రపంచ ఆర్థికవ్యవస్థలో పోషించిన కీలకపాత్రను వాళ్లే బలంగా వెలుగులోకి తెచ్చారు. కులవ్యవస్థను కూడా కొత్తకోణం నుంచీ చూశారు. ఎన్ని కులాలు కిందామీదా అయ్యాయో చెప్పటానికి స్థానికంగా లోతైన పరిశోధనలు చేశారు. భారత సమాజంలో ఎంతో గతిశీలత ఉందని స్పష్టంగా నిరూపించారు. అజ్ఞానాంధకారంలో భారతీయులందరూ కూరుకుపోలేదనీ చెప్పారు. పరలోక చింతనతోనే వారు జీవితాన్ని గడపలేదనీ పేర్కొన్నారు. ఫిలిబెక్‌ వ్యాఖ్యలను అతిగా పరిగణించటంలో తప్పులేదు. కానీ విదేశీయుల రచనలన్నిటికీ, విమర్శలన్నిటికీ ఏదో విధమైన కుట్రకోణాన్ని ఆపాదించటంలోనే అసలైన అతి ఉంది. ఈ అతి కొన్ని సంవత్సరాలుగా శ్రుతిమించుతోంది. మన బలాన్నీ, బలహీనతలనూ స్పష్టంగా గుర్తించలేని విధంగా ఈ అతికి అనుకూలంగా ప్రచార ఉధృతి హోరెత్తిపోతోంది. నిజానికిదే మనకు అసలుసిసలైన ప్రమాదం! సద్విమర్శలకు సరిహద్దులు కట్టటం వల్ల అజ్ఞాన అవధులు విస్తరిస్తాయి! విజ్ఞాన వీధులు కుంచించుకుపోతాయి!

రాహుల్ కుమార్

(ఆంధ్రజ్యోతి ఎడిటర్‌)

ఇవి కూడా చదవండి..

అమెరికాను వదిలేయాలి లేదా ఉద్యోగం మానేయాలి.. హెచ్-1బీ ఉద్యోగులకు ఐబీఎం షాక్..

అమితాబ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు.. ముంబైలో మరిన్ని ప్రాంతాలకు హెచ్చరిక..

Updated Date - Nov 27 , 2026 | 03:54 AM