Share News

ఎఫ్ఆర్సీఏ బిల్లు: సేవకు రక్షణ, అక్రమాలకు శిక్ష!

ABN , Publish Date - Aug 14 , 2026 | 03:40 AM

సహాయం ఎవరు చేసినా సంతోషంగా ఆహ్వానిద్దాం... కానీ దాని వెనుక ఉండే ప్రయోజనాలపై మాత్రం కన్నేసి ఉంచుదాం! విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్ఆర్సీఏ) సవరణ బిల్లు–2026 ఆంతర్యం ఇదే. దేశవ్యాప్తంగా బడులు, ఆస్పత్రులు...

ఎఫ్ఆర్సీఏ బిల్లు: సేవకు రక్షణ, అక్రమాలకు శిక్ష!

సహాయం ఎవరు చేసినా సంతోషంగా ఆహ్వానిద్దాం... కానీ దాని వెనుక ఉండే ప్రయోజనాలపై మాత్రం కన్నేసి ఉంచుదాం! విదేశీ విరాళాల నియంత్రణ (ఎఫ్ఆర్సీఏ) సవరణ బిల్లు–2026 ఆంతర్యం ఇదే. దేశవ్యాప్తంగా బడులు, ఆస్పత్రులు, సేవా సంస్థలు, విపత్తు సహాయక చర్యలకు విదేశీ విరాళాలు ఎంతో చేయూతనందించాయి. సమాజానికి మేలు చేసిన ఆయా సంస్థల సేవలను మనం ఖచ్చితంగా గుర్తించి తీరాలి. అయితే, విదేశీ నిధులు మన దేశీయ సామాజిక, వ్యవస్థాగత పరిధిలోకి వచ్చినప్పుడు... లెక్కాజమానా లేకపోతే ఎలా? ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది? ఎక్కడికి వెళ్తున్నది? దేనికోసం ఖర్చు చేస్తున్నారు? అంతిమంగా దానివల్ల ఎవరి ప్రయోజనాలు నెరవేరుతున్నాయి?... ఇలాంటి ప్రశ్నలు స్వచ్ఛంద సంస్థలను అనుమానించాలనే ఉద్దేశంతో వేస్తున్నవి కావు. విదేశీ నిధుల ప్రవాహాన్ని క్రమబద్ధీకరించేటప్పుడు ఏ ప్రజాస్వామ్య దేశమైనా అడిగే ప్రాథమిక ప్రశ్నలు.

గతేడాది మార్చి 25న లోక్‌సభ ముందుకు వచ్చిన ఈ ఎఫ్ఆర్సీఏ సవరణ బిల్లు, పాలనలోని ఒక ప్రధాన లోపాన్ని సరిదిద్దేందుకే రూపుదిద్దుకుంది. అంతమాత్రాన విదేశీ సహాయానికి మన దేశం తలుపులు మూసేస్తోందని కాదు. ఏదైనా సంస్థ ఎఫ్ఆర్సీఏ రిజిస్ట్రేషన్ రద్దయినా, దాన్ని వెనక్కి తీసుకున్నా లేదా దాని గడువు ముగిసినా... ఆ సంస్థకు చెందిన విదేశీ నిధులు, ఆస్తుల నిర్వహణపై ఒక స్పష్టమైన, చట్టబద్ధమైన విధానాన్ని ఈ బిల్లు తీర్మానిస్తుంది. ఒక సంస్థ ఎఫ్ఆర్సీఏ హోదా కోల్పోవడంతోనే కథ ముగిసిపోదు కదా! మరి ఆ సంస్థ కట్టిన ఆస్పత్రి ఏమవుతుంది? ఏర్పాటు చేసిన బడి పరిస్థితేంటి? విదేశీ నిధులతో సమకూరిన ఆస్తులు ఏమవుతాయి? ఆ ఆస్తులు ప్రజా సంక్షేమానికి కాకుండా వేరే దారుల్లోకి మళ్లకుండా చూసే బాధ్యత ఎవరిది? ఈ ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానమే బిల్లులోని ‘నిర్దేశిత అధికారి’ వ్యవస్థ. దీని ప్రకారం, మొదట ఆ ఆస్తుల పర్యవేక్షణ తాత్కాలికంగా ఈ అధికారి వద్దే ఉంటుంది. ఒకవేళ ఆ సంస్థ నిర్ణీత గడువులోగా తన లైసెన్సును పునరుద్ధరించుకున్నా లేదా కొత్త సర్టిఫికెట్ పొందినా... చట్టప్రకారం ఆ ఆస్తులను, మిగిలిన నిధులను తిరిగి ఆ సంస్థకే అప్పగిస్తారు. గడువు దాటినా పునరుద్ధరణ జరగకపోతేనే ఆ ఆస్తులు శాశ్వతంగా ప్రభుత్వం ఆధీనంలోకి వస్తాయి. వాటిని ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగిస్తారు.


ఆస్పత్రి అంటే కేవలం నాలుగు గోడలు కాదు. ఒక రోగికి అది పునర్జన్మ. బడి అంటే ఒట్టి భవనం కాదు. చిన్నారులకు అది రేపటి భవిష్యత్తు. వృద్ధాశ్రమం లేదా అనాథ శరణాలయం అంటే కేవలం సంస్థాగత ఆస్తి కాదు. అక్కడున్నవారికి అది కొండంత ఆసరా. అందుకే చట్టం అమలు చేసేటప్పుడు తప్పు చేసిన వారిపై చర్యలు ఉండాలే తప్ప, దానిపై ఆధారపడిన లబ్ధిదారులకు ఎలాంటి నష్టం జరగకూడదు. కఠినమైన నియమాలు ఉన్నప్పుడు చట్టబద్ధమైన ప్రక్రియ కూడా అంతే పారదర్శకంగా ఉండాలి. అందుకే ఈ చట్టంలో నిర్ణయాల సమీక్షకు, న్యాయపరమైన అప్పీలుకు తగిన అవకాశాలు కల్పించారు. నిబంధనలను ఉల్లంఘించినప్పుడు తీసుకునే చర్యలకు, వాటిని అమలు చేసే తీరులోనే అసలైన నిష్పాక్షికత ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో, కావాలని చేసే అక్రమాలకు, సాంకేతిక లేదా పరిపాలనాపరమైన పొరపాట్లకు మధ్య తేడాను స్పష్టంగా చూడాలి. విదేశీ నిధులను కావాలని చట్టవిరుద్ధ పనులకు మళ్లించే సంస్థలను, కేవలం సాంకేతిక కారణాల వల్ల తప్పు చేసిన సంస్థలను ఒకేలా చూడలేం.

మరొక ముఖ్యమైన అంశం ‘మిశ్రమ ఆస్తులు’. ఒక సంస్థకు చెందిన ఆస్తుల్లో విదేశీ విరాళాలతో పాటు భారతీయ విరాళాలు, ప్రభుత్వ సాయం లేదా వారి సొంత ఆదాయం కూడా కలిసి ఉండవచ్చు. అందువల్ల నియంత్రణ వ్యవస్థ అనేది విదేశీ నిధులతో వచ్చిన ఆస్తులను సరిగ్గా గుర్తిస్తూనే, భారతీయ విరాళాలకు తగిన రక్షణ కల్పించేలా ఉండాలి. అలాగే, ఆరాధనా స్థలాల విషయంలో ఈ బిల్లు చూపిన చొరవ ప్రశంసనీయం. ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చిన ఆస్తుల్లో ప్రార్థనా మందిరాలు ఉన్నట్లయితే, వాటి ఆధ్యాత్మిక స్వరూపాన్ని యథాతథంగా కాపాడాలని ఈ చట్టం చెప్తున్నది.

విదేశీ నిధుల విషయంలో పారదర్శకత ఎందుకు అవసరమో మన దేశ అనుభవాలే చెప్తాయి. పార్లమెంటరీ నివేదికల ప్రకారం, 2019 నుంచి 2022 మధ్య కాలంలోనే దాదాపు 13,520 సంస్థలకు సుమారు రూ.55,741 కోట్ల విదేశీ విరాళాలు వచ్చాయి. ఈ స్థాయి ఆర్థిక ప్రవాహాలు ఉన్నప్పుడు, ప్రభుత్వ పర్యవేక్షణ కేవలం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు, అత్యంత ఆవశ్యకమైన అంశం కూడా. ఇక్కడ చూడాల్సింది... నిజమైన సేవకు, దుర్వినియోగానికి మధ్య ఉన్న తేడాను! నిజాయితీతో కూడిన అంతర్జాతీయ భాగస్వామ్యానికి, మన దేశ సార్వభౌమాధికారం, భద్రత, సామాజిక సామరస్యానికి భంగం కలిగించే చర్యలకు మధ్య ఉన్న తేడాను!


ఆత్మవిశ్వాసం ఉన్న భారతదేశం ప్రపంచాన్ని ఎల్లప్పుడూ ఆదరిస్తుంది. కానీ స్వేచ్ఛాయుత సమాజం రక్షణ లేని సమాజంగా మారకూడదు. పారదర్శకమైన లెక్కలున్న నిధులకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. కానీ అదే డబ్బు చట్టవిరుద్ధ పనులకు, వ్యక్తిగత ప్రయోజనాలకు, రాజకీయ స్వార్థానికి లేదా దేశ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారితే మాత్రం... దాన్ని అడ్డుకునే చట్టబద్ధమైన అధికారం ప్రభుత్వానికి ఉండి తీరాలి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు, డిజిటల్ చెల్లింపులు పెరిగిపోయిన ఈ డిజిటల్ యుగంలో సరిహద్దులు దాటి డబ్బు మళ్లించడం చాలా తేలికైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మన నియంత్రణ వ్యవస్థలు కూడా కాలానికి అనుగుణంగా మారక తప్పదు.

భారతదేశ సమగ్ర వికాసం, ప్రపంచ భాగస్వామ్యాలు అనేవి దేశ సార్వభౌమాధికారం, జాతీయ ప్రయోజనాల రక్షణతో సమాంతరంగా సాగాలని నమ్ముతున్నాను. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడూ ‘నేషన్ ఫస్ట్’ అనే సిద్ధాంతాన్నే ముందుంచుతారు. ఇందులో భాగంగా ఈ బిల్లు మన దేశానికి ఉపయోగకరంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. ఈ ఎఫ్ఆర్సీఏ సవరణ బిల్లు సరిగ్గా ఆ దిశగానే అడుగులు వేస్తున్నది.

లింగమనేని రమేశ్

రాజ్యసభ సభ్యులు, జనసేన పార్టీ

ఇవి కూడా చదవండి..

మావోయిస్టు క్యాంప్‌ నుంచి మోడలింగ్ ర్యాంప్ వరకు.. మారిన మాజీ మహిళా నక్సల్స్ జీవితాలు..

మీరు చేయలేకపోతే మేమే చేస్తాం.. లేబుల్స్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు హెచ్చరిక..

Updated Date - Aug 14 , 2026 | 03:40 AM