రైతన్నకు తప్పని తిప్పలు!
ABN , Publish Date - Jun 05 , 2026 | 01:11 AM
దేశంలో అత్యధిక ప్రజానీకానికి ప్రధాన ఉపాధి, ఆదాయ వనరు వ్యవసాయమే. ఒకప్పుడు వ్యవసాయం అంటే కేవలం ‘పంట పండించడం’ వరకే పరిమితం అనుకునేవారు. కానీ ఈ రోజుల్లో పంట పండించడం ఒక ఎత్తయితే...
దేశంలో అత్యధిక ప్రజానీకానికి ప్రధాన ఉపాధి, ఆదాయ వనరు వ్యవసాయమే. ఒకప్పుడు వ్యవసాయం అంటే కేవలం ‘పంట పండించడం’ వరకే పరిమితం అనుకునేవారు. కానీ ఈ రోజుల్లో పంట పండించడం ఒక ఎత్తయితే... దాన్ని కాపాడుకుని, మార్కెట్‌కు తీసుకెళ్లి, మద్దతు ధరతో అమ్ముకోవడం అంతకంటే పెద్ద యుద్ధంలా మారింది. దేశంలో, రాష్ట్రంలో క్రమంగా సాగు విస్తీర్ణం పెరుగుతున్నా, దానికి తోడుగా రైతుల సమస్యలు కూడా రెట్టింపవుతున్నాయి.
వ్యవసాయ రంగంలో విత్తనాలు వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతులు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా పంట అమ్మకాలలో రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. గ్రామాల్లో పండిన పంటను నిల్వ చేయడం కోసం ప్రభుత్వాలు సరైన స్థలాలు సేకరించకపోవడం, ఒకవేళ సేకరించినా రైతులందరి పంట పట్టేంత స్థలం లేకపోవడం తీవ్రమైన సమస్యగా మారింది. ఎంతో కష్టపడి నిల్వ చేసుకున్న పంటను మార్కెట్‌కు తరలించడానికి కనీసం గోనె సంచులు కూడా సకాలంలో అందకపోవడం వ్యవస్థ వైఫల్యం. దీనికి తోడు రవాణా ఖర్చులు భారం కావడంతో రైతు మరింత కుంగిపోతున్నాడు.
మరోవైపు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచినా, అక్కడ సరుకు కొనడానికి అధికారులు రకరకాల నిబంధనలు పెడుతున్నారు. పంటలో తేమ శాతం ఎక్కువగా ఉందనే నెపంతో రోజుల తరబడి రైతులను వీధుల్లోనే వేచి చూసేలా చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో క్వింటాకు ఇన్ని కిలోల ‘తరుగు’ అంటూ రైతు శ్రమను దోచుకుంటున్నారు. ఒకవేళ ఆ నిరీక్షణలో అకాల వర్షం పడి పంట తడిస్తే... కనీసం సగం ధరకు కూడా కొనే నాథుడు కరువవుతున్నాడు.
దేశ జనాభాకు అన్నం పెట్టే వ్యవసాయ రంగం ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ప్రభుత్వాలు కేవలం సబ్సిడీలు ఇస్తే సరిపోదు. పంట పండిన తర్వాత రైతుకు అవసరమైన కోల్డ్ స్టోరేజీలు, గోదాములు వంటి మౌలిక వసతులు కల్పించినప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది. పంట అమ్ముకోవడానికి రైతులకు అన్ని విధాలా సహకరించి, మద్దతు ధరతో పాటు కొనుగోళ్లు కూడా సజావుగా, పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది.
అలుగువెల్లి ఉభయ్‌రెడ్డి, పెద్దపల్లి
ఇవి కూడా చదవండి...
రెండేళ్లలో ఏం చేశామో ప్రజలకు వివరించండి.. మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశం
బలమైన భారత్ కోసం యువత ఎదురుచూపు: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News