Share News

‘నెయ్యి కాని నెయ్యి’తో వైసీపీ అపచారం!

ABN , Publish Date - Feb 11 , 2026 | 01:25 AM

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలో సిట్‌ 2026 జనవరి నెలాఖరులో నివేదిక ఇచ్చింది. లడ్డూ తయారీలో వాడిన నేతిలో కల్తీ...

‘నెయ్యి కాని నెయ్యి’తో వైసీపీ అపచారం!

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ నేతృత్వంలో సిట్‌ 2026 జనవరి నెలాఖరులో నివేదిక ఇచ్చింది. లడ్డూ తయారీలో వాడిన నేతిలో కల్తీ జరిగిందని, అది అసలు నెయ్యే కాదని రసాయనాలు, పామాయిల్ ఉపయోగించి తయారు చేసిన నూనెతో లడ్డూలు తయారుచేశారని ఆ నివేదికలో పేర్కొంది. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని– ఆ రసాయనాల్లో జంతువుల కొవ్వు కలిసిందా? లేదా? అనే విషయాన్ని సిట్ బహిర్గతం చేయలేదు.

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపి భక్తుల మనోభావాలను, లడ్డూ పవిత్రతను వైసీపీ ప్రభుత్వం అపహాస్యం చేసిందంటూ జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యల నడుమ, లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని వైసీపీ నేతలు ఇప్పుడు గోబెల్స్ ప్రచారానికి పూనుకున్నారు. నిబంధనలను అడ్డగోలుగా మార్చేసి, టన్నుల కొద్దీ కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి లడ్డూలో కలిపేశారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత, వైవి సుబ్బారెడ్డి నేరుగా అంగీకరించారు. కాసులకు కక్కుర్తిపడి వైసీపీ నాయకులు శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు.

అవినీతికి, అక్రమ సంపాదనకు టీటీడీనే కాక, హిందూ విశ్వాసాలను సైతం వైసీపీ కేంద్రంగా చేసుకుంది. నిబంధనలను తుంగలో తొక్కి ఒక పద్ధతి ప్రకారం తమ అనుయాయులకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులు అప్పగించింది. వందల కోట్లు కొల్లగొట్టాలని నాటి ప్రభుత్వం పథక రచన చేసింది. కిలో నెయ్యికి రూ.25 కమీషన్‌తో చిన్న స్థాయి నాయకుల నుంచి కోట్ల రూపాయలను హవాలా రూపంలో ఆ పార్టీ నేతలు జేబులో వేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ‘నెయ్యి కాని నెయ్యి’తో 20 కోట్ల శ్రీవారి లడ్డూలు తయారు చేసి తీవ్ర అపచారం చేయడమే కాకుండా, హిందూ భక్తుల మనోభావాలను వైసీపీ దెబ్బతీసింది. ఈ నేపథ్యంలోనే, చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికి తాము ఏ నేరం చేయలేదని, తాము అసలు కల్తీ నెయ్యి, జంతు కొవ్వులతో తయారు చేసిన నెయ్యి వాడలేదని బుకాయిస్తున్నది.


పవన్ కల్యాణ్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న అంశం– కేవలం లడ్డూ కల్తీ మాత్రమే కాదు. హిందూ సంప్రదాయాల, ఆధ్యాత్మిక విశ్వాసాల సంరక్షణ, ప్రజల ప్రాణాల పరిరక్షణ. తమ అక్రమ సంపాదనకు అత్యంత నీచ స్థాయికి దిగజారి భక్తుల విశ్వాసాలకు నీళ్లొదిలి, కలియుగ దైవాన్ని సైతం నిలువు దోపిడీ చేయాలన్న కుట్రలకు అడ్డుకట్ట వేయడం. ఇటువంటి కుట్రను బహిర్గతం చేసిన పవన్ కల్యాణ్‌పై అసత్య ప్రచారం చేయడం క్షమించరాని నేరం. లడ్డూ కల్తీ వివాద అంశంలో ఆయనపై మతతత్వ ముద్ర వేయడం, ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని వైసీపీ దుష్ప్రచారం చేయడం అభ్యంతరకరం. ఆయన ఏనాడూ క్రైస్తవులను, ముస్లింలను ఒక్క మాట అనలేదు. ఒక్క లడ్డూ కల్తీ విషయంలోనే కాక, అనేకానేక అంశాల్లో హిందూ ధర్మానికి ఎదురవుతున్న ప్రమాదాలను గుర్తించడంలో సమాజ నిర్లక్ష్యాన్నే ఆయన ఎత్తి చూపారు. ఇతర మతాలతో పోలిస్తే హిందూ విశ్వాసాల పరిరక్షణ పట్ల ప్రభుత్వాలు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రతి వ్యక్తీ ధార్మిక బాధ్యత తీసుకోవాలని కోరుతూ, హిందువుల్లో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ధార్మిక అంశాల్లో అన్ని మతాలకు సమాన అవకాశాలు అందించడమే లౌకికత్వమనీ, మెజారిటీ మతం పేరుతో ఒక మతాన్ని నిత్య నిరాదరణకు గురిచేయడం సరికాదని, ఈ అపసవ్యతను సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, సంస్థలు, వ్యక్తులపై ఉంటుందనే నైతిక లౌకిక భావనను ప్రచారం చేస్తున్నారు. దానిలో భాగంగానే, ఇతర మత విశ్వాసాల రక్షణకు ఉన్నట్లే, హిందూ మత విశ్వాసాల రక్షణకూ జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించి, తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్న వైసీపీ కుట్రలను తిప్పి కొట్టాలి. ఆలయాల పవిత్రతను దెబ్బతీసిన గత ప్రభుత్వ నిర్వాకాన్ని అసెంబ్లీలో చర్చించి, ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి. నిందితులను చట్టబద్ధంగా శిక్షించి భక్తుల్లో ధైర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డా. పెదపూడి విజయకుమార్

జనసేన పార్టీ నాయకులు,

ఎస్సీ(మాల) కార్పొరేషన్‌ చైర్మన్‌

ఇవి కూడా చదవండి..

సవరణతో తిరిగి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విపక్షాలు

బాబ్రీ పునర్నిర్మాణం అసాధ్యం: యోగి ఆదిత్యనాథ్

Updated Date - Feb 11 , 2026 | 01:25 AM