ఇథనాల్ విప్లవం కాదు, విషం!
ABN , Publish Date - Jun 09 , 2026 | 01:04 AM
తెలంగాణ రాష్ట్ర పర్యావరణాన్ని ఇథనాల్ పెద్ద ఎత్తున కబళించబోతున్నది. రాష్ట్రంలో భారీగా క్యాన్సర్ రోగులను పెంచబోతున్నది. 2021లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఇథనాల్ పాలసీని ప్రకటించిన తరువాత, ఇప్పటివరకూ...
తెలంగాణ రాష్ట్ర పర్యావరణాన్ని ఇథనాల్ పెద్ద ఎత్తున కబళించబోతున్నది. రాష్ట్రంలో భారీగా క్యాన్సర్ రోగులను పెంచబోతున్నది. 2021లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఇథనాల్ పాలసీని ప్రకటించిన తరువాత, ఇప్పటివరకూ రాష్ట్రంలో 30 ఇథనాల్ కంపెనీలు అనుమతులు పొందాయి. ఈ కంపెనీల వెనుక బడా రాజకీయ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూరులోనూ, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లిలోనూ ఇథనాల్ కంపెనీల నిర్మాణం పూర్తయి ఉత్పత్తిని ప్రారంభించాయి. చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ వాయు కాలుష్యం నాలుగు మండలాల్లోని 50 గ్రామాలకు విస్తరించింది. ఆరు నెలల క్రితం ప్రారంభమైన లింగంపల్లి ఇథనాల్ కంపెనీ వాయు కాలుష్యం చుట్టూ మూడు గ్రామాలకు నిద్ర పట్టకుండా చేస్తోంది. నిజానికి ఈ ప్రాంతంలో ఆహార శుద్ధి పార్క్ ఏర్పాటు చేయడానికి TGIIC సంస్థ పర్యావరణ అనుమతులను పొందింది. వీటి ప్రకారం అక్కడ కాలుష్య కారక ఇథనాల్ కంపెనీ ఏర్పాటు చేయడానికి వీలులేదు. కానీ రాష్ట్ర అధికార వ్యవస్థ ప్రైవేట్ కంపెనీలతో చేతులు కలపడంతో ఈ జోన్‌లోకి ఇథనాల్ కంపెనీ వచ్చి, ఉత్పత్తి కూడా ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీకి సబ్సిడీ బియ్యం సరఫరా చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ కింద రోజూ లక్షలాది లీటర్ల నీళ్లను సరఫరా చేస్తోంది.
రాష్ట్రంలో ఇంకా కొన్ని ఇథనాల్ కంపెనీలు నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రజల ఆందోళనల కారణంగా కొన్ని చోట్ల కంపెనీలయితే రాలేదు కానీ, ఆందోళనల సందర్భంలో స్థానిక ప్రజలపై పెట్టిన అక్రమ కేసులను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. రైతులపై, సామాజిక కార్యకర్తలపై పెట్టిన ఈ అక్రమ కేసులను ఎత్తేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వానికి చెవికి ఎక్కడం లేదు.
కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండింగ్ (పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం) విధానాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక వరంగా ప్రచారం చేస్తోంది. ఇథనాల్ కలపడం వల్ల ప్రభుత్వానికి, చమురు కంపెనీలకు నిజంగానే బేసిక్ ఇంధన ఖర్చు తగ్గుతోందని అనుకుందాం. కానీ ఆ లాభాన్ని పెట్రోల్ ధరలు తగ్గించి సామాన్య వినియోగదారుడికి కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయడం లేదు. ఇప్పటికీ పెట్రోల్ ధర లీటరుకు రూ.110 పైనే ఉంటోంది. ఒక లీటర్ పెట్రోల్‌తో పోలిస్తే ఒక లీటర్ ఇథనాల్ ఉష్ణ సామర్థ్యం (Calorific Value) దాదాపు 33 శాతం తక్కువ. దీనివల్ల ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న E–20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల మైలేజ్ 6శాతం నుంచి 12శాతం వరకు పడిపోతోంది. అంటే, వినియోగదారుడు లీటరుకు పూర్తి డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ, మైలేజ్ తగ్గడం వల్ల పరోక్షంగా లీటరుకు రూ.6 నుంచి రూ.12 వరకు నష్టపోతున్నాడు. ఇది సామాన్యుడిపై పడుతున్న అదనపు ఆర్థిక భారం.
దేశంలో ప్రస్తుతం ఇథనాల్ పరిశ్రమ పూర్తిగా ప్రభుత్వ ‘పాలసీ రక్షణ’, సబ్సిడీల శ్వాసపైనే నడుస్తోంది. ఇథనాల్ తయారీకి అవసరమైన ముడి సరుకు ఎఫ్‌సీఐ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం (DFPD) ద్వారా ఇథనాల్ డిస్టిలరీలకు క్వింటాలుకు రూ.2,320 (కిలో రూ.23.20) చొప్పున అత్యంత చౌకగా స్థిర ధరతో కేటాయిస్తోంది. ఇందుకోసం ఏకంగా 72 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇథనాల్ కోటా కింద లాక్ చేశారు. అలాగే నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్ ద్వారా సేకరించిన మొక్కజొన్నను కూడా కంపెనీలకు సర్దుబాటు ధరలకే ఇస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ సబ్సిడీ బియ్యాన్ని ఆపేసి, ఓపెన్ మార్కెట్ రేటుకే ముడిసరుకు కొనాలని నిబంధన పెడితే ఈ ప్లాంట్లు వెంటనే మూతపడతాయి. ఇథనాల్ కంపెనీలకు ప్రభుత్వాలు బ్యాంకులోన్లపై 6శాతం వడ్డీ రాయితీని ఇస్తున్నాయి. పైగా ఈ రాయితీని ఆహార భద్రత చట్టం కింద కేటాయించిన నిధుల నుంచి ఇవ్వడం మరో అన్యాయం.
ఇథనాల్ కోసం పంటలు సాగు చేయడానికి ఎక్కువ నీరు అవసరం. వరి, మొక్కజొన్న వైపు ఇథనాల్ కంపెనీలు మళ్లినప్పటికీ, బియ్యం సరఫరాకు అవసరమైన వరి సాగుకు కూడా కిలో బియ్యం ఉత్పత్తికి 5,000 లీటర్ల నీరు కావాలి. పైగా ఇథనాల్ ఉత్పత్తి ప్రక్రియలో ప్రతి లీటర్ ఇథనాల్ ఉత్పత్తికి 4 లీటర్ల నీటి వినియోగం ఉంటుందని చెప్పినప్పటికీ, 8 లీటర్ల నీటిని ఉపయోగిస్తున్నారని కాలుష్య నియంత్రణ మండలి తనిఖీలోనే నిర్ధారణ అయింది. తెలంగాణలో ఇథనాల్ ఉత్పత్తికి అవసరమైన పంటలను పండించడానికి రైతులు బోర్ల ద్వారా తోడే భూగర్భ జలాలు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా తెచ్చే నీరు, అందుకు ప్రభుత్వం ఇచ్చే ఉచిత/ సబ్సిడీ విద్యుత్ అంతా పరోక్షంగా ఇథనాల్ కంపెనీల కోసమే ఖర్చవుతోంది. ఈ ప్రక్రియ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి.
నగరాల్లో వాహనాల నుంచి వచ్చే పొగను తగ్గించడం ఇథనాల్ పాలసీ లక్ష్యం కావచ్చు, కానీ ఇథనాల్ తయారీ కేంద్రాలు ఉన్న గ్రామీణ ప్రాంతాలను ఈ కంపెనీలు నరకప్రాయంగా మారుస్తున్నాయి. వాహనాల్లో ఇథనాల్ వాడకం వల్ల కార్బన్ మోనాక్సైడ్ కొంత తగ్గినా ఇథనాల్ ఉత్పత్తిలో ఎసిటాల్డిహైడ్, ఫార్మాల్డిహైడ్ వంటి అత్యంత హానికరమైన ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఇవి దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు దారితీసే విష రసాయనాలు.
ఈ ఫ్యాక్టరీల నుంచి ఒక్క చుక్క వ్యర్థ జలం కూడా బయటకు రాకూడదనే నిబంధన (ZLD) ఉంది. కానీ ఆ వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి అవసరమయ్యే కరెంట్, బొగ్గు ఖర్చులను తప్పించుకోవడానికి చాలా కంపెనీలు రాత్రి వేళల్లో రహస్యంగా వాటిని స్థానిక వాగుల్లోకి వదిలేస్తున్నాయి. మరి కొన్ని కంపెనీలు బోరు బావుల ద్వారా ఈ రసాయన నీటిని నేరుగా భూగర్భంలోకి ఇంజెక్ట్ చేస్తున్నాయి. ఇథనాల్ వ్యర్థ జలాలలో BOD (Biochemical Oxygen Demand), COD విలువలు విపరీతంగా ఉంటాయి. ఇది కలిసిన నీటిలోని ఆక్సిజన్ పూర్తిగా నశించి చేపలు, జలచరాలు చనిపోతాయి. నేలలు చవిటి నేలలుగా మారిపోతాయి. ప్లాంట్ల నుంచి వచ్చే విపరీతమైన రసాయన దుర్వాసన చుట్టుపక్కల గ్రామస్థులకు శ్వాసకోశ వ్యాధులను తెచ్చిపెడుతోంది.
ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఇథనాల్ కంపెనీల ZLD నిబంధనల అమలుపై పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ‘థర్డ్ పార్టీ ఆడిట్’ జరపాలి. కాలుష్యం వెదజల్లుతున్న ఇథనాల్ ప్లాంట్లను వెంటనే మూసివేయాలి. కొత్తగా నిర్మాణంలో ఉన్న ఇథనాల్ పరిశ్రమలకు రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలి. అసలు ఈ ఇథనాల్ కంపెనీల వల్ల రాష్ట్రానికి ఏదైనా లాభం ఉందా? రాష్ట్ర ప్రజలకు, పర్యావరణానికి ఏదైనా మేలు జరుగుతుందా? ఆ కంపెనీల పనితీరుపై, అవి సృష్టిస్తున్న సమస్యలు ఎటువంటివి అన్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష జరపాలి.
కన్నెగంటి రవి
తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ
ఇవి కూడా చదవండి..
ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి నేతలు..
మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ ఖర్గే..