Share News

ఎల్‌నినోతోనైనా కళ్లు తెరుద్దాం!

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:30 AM

ఈ ఏడాది దేశంలో ఖరీఫ్ వర్షపాతం 13శాతం తగ్గిందని అంచనా. తెలుగు రాష్ట్రాలు, ఇంకా కొన్ని చోట్ల ఇది 18– నుంచి 25శాతం ఉండొచ్చు. ఉత్తర కర్ణాటక వంటి వర్షాభావ, మెట్టప్రాంతాలు ఇంకా ఇబ్బందుల్ని....

ఎల్‌నినోతోనైనా కళ్లు తెరుద్దాం!

ఈ ఏడాది దేశంలో ఖరీఫ్ వర్షపాతం 13శాతం తగ్గిందని అంచనా. తెలుగు రాష్ట్రాలు, ఇంకా కొన్ని చోట్ల ఇది 18– నుంచి 25శాతం ఉండొచ్చు. ఉత్తర కర్ణాటక వంటి వర్షాభావ, మెట్టప్రాంతాలు ఇంకా ఇబ్బందుల్ని ఎదుర్కోవచ్చు. తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయే అవకాశం ఉంది. ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో వల్ల 30 లక్షల టన్నులు తగ్గుతాయని అంటున్నారు. అంటే 1 శాతమే కాబట్టి ఆహారపరంగా భయపడనక్కర్లేదు.

మన దేశంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల శ్రద్ధ వల్ల సుమారు 60 శాతం పంట భూములకు నికర నీటి వసతి అందుబాటులోకొచ్చింది. రెండు పంటలైతే 73 నుంచి 75 శాతం ఉన్నట్లు. కానీ నీరు అందుబాటు, ఎప్పుడో కరవు కాలంలో ప్రవేశపెట్టిన ఎంఎస్‌పీ పద్ధతిని ఇంకా కొనసాగించటం, ఉచిత విద్యుత్ వల్ల.. డిమాండ్ తగ్గుతున్న వరి పండించే ఆనవాయితీ నుంచి ఇంకా మనం బయటపడలేదు. తెలంగాణలో చిన్న నీటి, ఎత్తిపోతల పథకాల బదులు భారీ, అసంబద్ధ ప్రాజెక్టుల్ని కట్టటం తీవ్ర అభ్యంతరకరమైనా.. రుతుపవనాలపై ఆధారపడ్డ దేశంగా నీటి రిజర్వాయర్లు, బ్యారేజీలు అవసరం. ప్రస్తుతం తెలంగాణలో 62 శాతం నికర నీటి వసతి పొలాలకు ఉంది. కానీ ప్రజలు అన్నం తగ్గించి, గుడ్లు, మాంసం, చిరుధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు వంటివి ఎక్కువ ఉపయోగిస్తున్నా.. నీటి వనరులున్నాయి గదా అని వరి ఎక్కువగా పండిస్తున్నాం. డిమాండ్‌ లేని వరి సాగు వద్దన్న వారిని తిట్టిపోస్తున్నాం. దీనివల్ల రాష్ట్రం ఏర్పడినప్పుడు 44 లక్షల టన్నులున్న వరి ఉత్పత్తి.. గత ఏడాది 1 కోటీ 75 లక్షలకి చేరింది. 400శాతం పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండేళ్ల క్రితం వరి దిగుబడి 72 లక్షల టన్నులుంటే, ఇప్పుడు 81 లక్షల టన్నులకి పెరిగింది. అంటే 10 శాతం దాకా. ఏపీలో నికర నీటి వసతి ఎక్కువనుకుంటాంగానీ.. రాజస్థాన్‌తో సమానంగా 52 శాతం మాత్రమే. అయితే డిమాండ్ ఉన్న పండ్లు, కూరగాయలు, ఇతర ఉద్యానవన పంటల దిగుబడి తెలంగాణలో తగ్గగా, ఏపీలో భారీగా పెరిగింది. ఏపీలో 1.4 కోట్ల టన్నుల నుంచి 2.8 కోట్ల టన్నులకు, యూపీలో గత పదేళ్లలో 3.3 కోట్ల టన్నుల నుంచి 5.3 కోట్ల టన్నులకు, మహారాష్ట్రలో 1.8 కోట్ల టన్నుల నుంచి 3.3 కోట్ల టన్నులకు ఉద్యాన దిగుబడి పెరిగింది. తెలంగాణలో 83 లక్షల టన్నుల నుంచి 30 లక్షలకు తగ్గింది.


వ్యవసాయంలోని మరో అంశం విద్యుత్తు. భూగర్భ జలాలు ఎండిపోవటం వల్ల తెలంగాణలోని 30 లక్షల బోర్లతో ఉచిత విద్యుత్ వినియోగం పెరగటం తప్ప నీరు రావటం లేదు. దీంతోపాటు, ఇళ్లలోనూ ఫ్యాన్లు, ఏసీల వినియోగం పెరగటంతో.. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గత సంవత్సరం అక్టోబర్‌లో 15,000 మెగావాట్లుండగా, ఈ ఏడాది 20,000 మెగావాట్లకి పెరిగింది. ఇందులో 25 నుంచి 27 శాతం రైతుల ఉచిత విద్యుత్ ఖాతాలోకి పోతోంది. మీటర్లు బిగించకపోవటం వల్ల రైతుల పేరుతో ఇతరులు దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. విద్యుత్‌కు యూనిట్‌ రూ.15 ఇస్తానన్నా మార్కెట్‌లో దొరకటం లేదని ముఖ్యమంత్రి వాపోతున్నారు. మనం కూడా పౌరులుగా ఇళ్లలో విద్యుత్‌ను పొదుపుగా ఉపయోగించుకోవటం వంటి మార్గాల్లో సహకరించాలి.

సూపర్ ఎల్‌నినో ప్రభావిత ఇంకో అంశం తాగునీరు. హైదరాబాద్‌నే తీసుకుందాం. లండన్, టోక్యో వంటి మహానగరాల కంటే ఎక్కువ నీటి సరఫరా జరుగుతోంది. హైదరాబాద్‌కి రోజుకి 260 కోట్ల లీటర్లు. అంటే, తలసరి 210 లీటర్లు. మన అవసరం 135 లీటర్లు. అయినా మంచినీటికి కటకట. లండన్‌లో 135 లీటర్లు, బెర్లిన్‌లో 110, టోక్యోలో 170, డాలస్‌లో 204 లీటర్లు మాత్రమే తలసరి సరఫరా చేస్తున్నారు. ఈ నగరాలన్నిటిలోనూ 24 గంటలూ తాగునీరు అందిస్తున్నారు. హైదరాబాద్‌లో 210 లీటర్లు ఇస్తున్నా, రెండురోజులకోసారి కొద్ది గంటలు వస్తే అదృష్టమనుకునే ప్రాంతాలు చాలా ఉన్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న ప్రాంతంలో కూడా మంచినీటికి కటకట. ఇందుకు కారణం, ‘మనం మంచినీరు తెస్తున్నాం, పంపిణీ వ్యవస్థను నిర్లక్ష్యం చేశాం. సంపన్నులకీ ఉచితంగా మంచినీరు ఇస్తున్నాం’. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఉచితంగా తాగునీరు ఎవరిమ్మన్నారు? మన సొంత సొమ్మయితే అలా ఖర్చు చేస్తామా? ఇది కాక 50శాతం మూసీలో కలిసిపోతోంది. మంచినీరు, మురుగునీరు కలసి ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్‌కి అదనంగా 50 మిలియన్ గ్యాలన్లు మంచినీరు తెస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ అంతకంటే ముఖ్యం తాగునీటి పంపిణీ వ్యవస్థను బాగుచేసి 24 గంటలూ మంచినీరు అందించటం. పైప్‌లలో తాగునీరు నిరంతరం ప్రవహిస్తుంటే, మురుగునీరు కలిసే అవకాశాలు తక్కువ.


పొరుగున ఉన్న చెన్నైకి హైదరాబాద్‌లా గోదావరి, కృష్ణా వంటి పెద్ద నదుల ద్వారా తాగునీటి అవకాశం లేదు. కొన్నేళ్ల క్రితం రైళ్లలో తాగునీరు తెప్పించుకున్నారు. కానీ నీటి నిల్వ, పంపిణీని సమర్థంగా బాగుచేసుకోవటంతో ఇప్పుడు మండు వేసవిలోనూ మంచినీటి కొరత లేదు. హైదరాబాద్ నగరం కోసం కృష్ణా, గోదావరి నదుల నుంచి రోజూ 260 కోట్ల లీటర్ల నీటిని తోడి తెస్తున్నాం. అయినా నీటి పంపిణీ లోపం వల్ల నీళ్ళ కొరత మనల్ని ఇబ్బంది పెడుతోంది. బెంగళూరు జనాభా హైదరాబాద్ కంటే ఎక్కువ. అయినా ఆ నగరంలో 160 కోట్ల లీటర్ల సరఫరాతో మన కంటే బాగా నీటిని పంపిణీ చేస్తున్నారు. రోజూ 120 కోట్ల లీటర్ల నీటిని చెన్నైలో సరఫరా చేస్తున్నారు. అయినా సంక్షోభం, కొరత లేకుండా నీటిని సరిగ్గా పంపిణీ చెయ్యగలుగుతున్నారు. హైదరాబాద్ నీటి సమస్య ప్రధానంగా పంపిణీ వ్యవస్థ శిథిలమైపోవటం వల్ల ఉత్పన్నమయింది.

ప్రస్తుత వర్షాభావం రీత్యా రైతులు ఆందోళన చెందకుండా రెండో పంటగా అపరాలు, నూనె గింజలకి లేదా క్రాప్ హాలిడేకి నచ్చచెప్పటం, లాభాలొచ్చేలా మార్కెటింగ్ వ్యవస్థలో తగిన ఏర్పాట్లు, భరోసానిచ్చే ప్రత్యామ్నాయాలు చూపుతూ వరి పంట సాగుని తగ్గించటం, ఉద్యానవన, తృణధాన్యాలు వంటి ప్రజారోగ్యానికి మేలుచేసే, డిమాండున్న పంటలకు ప్రోత్సాహకాలు, పెట్టుబడి వ్యయానికి తగిన రుణసదుపాయాలు, ఉచిత విద్యుత్‌కు మీటర్లు బిగించి బాధ్యత కోసం కొద్దిపాటి రుసుము వసూలు చేయటం వ్యవసాయంలో యుద్ధప్రాతిపదికన చేయాల్సిన పనులు. అధిక వర్షపాతాన్ని ఒడిసిపట్టేలా హేతుబద్ధ ప్రాజెక్టుల్ని పెంచాలి. చెరువులు, ఇతర సంప్రదాయ నీటి వసతుల్ని కాపాడుకోవాలి. పప్పు దినుసులు, పామాయిల్, ఇతర వంటనూనెలపై దిగుమతి సుంకం నిలకడగా కొనసాగించి, ఆ డబ్బు రైతులకే అందించి ఏపీ, తెలంగాణల్లో పెరుగుతున్న సాగును ఇంకా ప్రోత్సహించాలి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా మలేసియా, ఇండోనేసియా నుంచి 20 నుంచి 30 బిలియన్ డాలర్లను ఖర్చుపెట్టి వంటనూనె దిగుమతి చేసుకుంటున్నాం.


తెలంగాణకు నీటి సరఫరా చేసే కృష్ణాలో ఈ సీజన్‌లో 72 శాతం లోటు, గోదావరిలో 42శాతం లోటు ఏర్పడింది. 460 టీఎంసీల అవసరం ఉండగా, కేవలం 209 టీఎంసీలు ఉన్నాయి. తాగునీరు తొలి ప్రాధాన్యం కాబట్టి ఈ ప్రత్యేక పరిస్థితుల్లో రైతులు కూడా సహకరించాలి. యూరియా బస్తా ఖరీదు రూ.4,600 అయినా రైతులకు ప్రభుత్వం కేవలం రూ.266కి ఇస్తోంది. కాబట్టి, ప్రతిదానికీ ప్రభుత్వాన్ని విమర్శించటం తగదు. హోర్ముజ్ జలసంధి మూతపడినా, ఎల్‌నినో వచ్చినా విద్యుత్, వంటగ్యాస్ వినియోగానికి భారీ ఆర్థికభారం పడకుండా ‘పునరుత్పాదక సౌర ఇంధనం, రైతులకు ఆదాయాన్నిచ్చే కంప్రెస్డ్ బయో గ్యాస్ ఇంధన పంటల సాగు’ వంటి మార్గాలకు వేగంగా మళ్లాలి. సూపర్ ఎల్‌నినోపై పార్టీలకతీతంగా స్పందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన విజ్ఞప్తి రాజ్యాంగ ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. ప్రభుత్వాలు, పార్టీలతోపాటు పౌర సమాజం కూడా ఇందుకు పూర్తిగా కలసిరావాలి. ఇప్పుడు సమస్యను పరిష్కరించుకోవటంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఇక ముందు సాగు, తాగు, విద్యుత్ రంగాలలో సమస్యలు లేకుండా, రైతులకు, వినియోగదారులకు, పెట్టుబడులకు, యువత ఉపాధికి దోహదం చేసేలా శాశ్వత, పర్యావరణహిత ఏర్పాట్లకి ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుందాం.

జయప్రకాశ్‌ నారాయణ్

లోక్‌సత్తా వ్యవస్థాపకులు

ఈ వార్తలనూ చదవండి:

ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..

భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి

Updated Date - Oct 22 , 2026 | 04:30 AM