ద్రావిడ సమాజ ఉద్యమం అనివార్యం
ABN , Publish Date - Feb 06 , 2026 | 01:24 AM
మధ్య, దక్షిణ ద్రావిడ భాష కుటుంబానికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు మాట్లాడే నైసర్గిక ప్రాంతమంతా అనేక మౌలిక సంక్షోభాలను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. భారత రాజ్యాంగంలోని...
మధ్య, దక్షిణ ద్రావిడ భాష కుటుంబానికి చెందిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలు మాట్లాడే నైసర్గిక ప్రాంతమంతా అనేక మౌలిక సంక్షోభాలను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. భారత రాజ్యాంగంలోని ఫెడరల్ కూర్పును పూర్తిగా మాయం చేస్తూ ‘కేంద్రస్వామ్యం’ ఏర్పాటు యత్నాలతో ద్రావిడ రాష్ట్రాల రాజకీయ ఉనికి ప్రశ్నార్థకమవుతోంది. దక్షిణాది కుత్తుకపై వేలాడుతున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మరో ప్రమాదం. దేశ సమైక్యత పేరిట ఒకే భాష, తిండి, వేషధారణ ఒత్తిళ్ల వల్ల, మధ్య, దక్షిణ ద్రావిడ భాషలు మాట్లాడే ప్రాంతాల వైవిధ్య జీవనానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయి.
ద్రవిడ భాషలు మాట్లాడే నేలంతా, పర్వతప్రాంతాల మయం. ఇది వైవిధ్య జీవనానికి ఆలవాలం. మలయాళ భాషను పర్వత భాష అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ పర్వత ప్రాంతాలన్నీ నూతన అభివృద్ధి నమూనాతో ప్రాజెక్టులు, గనుల తవ్వక కేంద్రాలుగా రూపొంది నిర్జీవంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో, రానున్న కాలంలో గిరిజన వలసలు అడ్డూ అదుపు లేకుండా పెరిగి, ద్రవిడ కుటుంబంలోని అనేక భాష మాండలికాల, సాంస్కృతిక, సామాజిక జీవనం అంతరించే ప్రమాదం ఉంది. తమిళనాడులో పెరియారు నిర్మించిన అస్తిత్వ ఉద్యమాన్ని అన్నాదురై నుంచి స్టాలిన్ వరకు ఎంతో కొంత కొనసాగించారు. చదువు చుక్కానిగా ఎదిగిన కేరళ కూడా, అనేక సాంస్కృతిక, సాంఘిక సంక్షోభాలను ప్రస్తుతం ఎదుర్కొంటోంది. పరాయీకరణకు స్వతంత్ర భారతంలో నమూనాగా మారిన కన్నడ రాష్ట్రంలో స్థానీయ భాషా సంస్కృతుల పరిరక్షణ ప్రమాదకరంగా మారింది. సవర్ణ రాజకీయ ప్రయోగశాలగా మారిన కన్నడ దేశంలో బసవేశ్వరుడు ఎక్కడ, లింగాయత సంస్కృతి ఎక్కడ...! గౌరీ లంకేష్ అమరత్వం జాడలేవి...! దక్షిణాది వైవిధ్య జీవన సంస్కృతి శైలిపై ఏకశిల సాంస్కృతిక దాడి జరుగుతోంది.
ఆత్మగౌరవం స్ఫూర్తితో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రాంతీయ పార్టీలు, ‘జీ హుజూర్’ వ్యవహారంతో నెట్టుకొస్తున్నాయి. పెరియార్ అస్తిత్వ ఉద్యమ నేపథ్యంలో తమిళ సినిమా చలనశీలతతో ముందడుగు వేస్తే, అక్కడే స్థిరపడిన తెలుగు సినిమా మాత్రం నవ్య భూస్వామ్య, వ్యాపార సినిమాలు నిర్మిస్తూ మార్కెట్ ఫార్ములా కథలతో ఒకనాడు నడిచింది. దక్షిణ భారత రాష్ట్రాలలో చలనశీల సాహితీ సాంస్కృతిక అస్తిత్వ ఉద్యమాలు ఇప్పటికే కొనసాగుతున్నా, మొత్తం ద్రవిడ నేలపై గుత్తాధిపత్యం కోసం ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఈ రాష్ట్రాల సాంస్కృతిక, సాహిత్య సమూహాల మధ్య ఓ అనివార్య మైత్రి తక్షణావసరం. కచ్చితమైన తాత్విక పునాదిపై దక్షిణాత్య సాంస్కృతిక, సాహిత్య ఉద్యమం రూపొందితేనే, నిర్దిష్ట అస్తిత్వ లక్ష్యాల సాధన సమకూరుతుంది. అందుకు ‘మీ పాటనై వస్తున్నానమ్మో’ అంటూ అగ్రేసర గళాన్ని వినిపించాలి!
జహా ఆరా
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్ర.ర.వే)
(‘‘ద్రావిడ సమాజ సాహిత్యాలు (సారూప్యత–ఐక్యత–పోరాటం)’’ అంశం మీద ఫిబ్రవరి 7–8 తేదీలలో కర్నూలులోని కేవీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్ర.ర.వే. మహాసభలు.)
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు: సీఎం
హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ఉమెన్స్ హాస్టల్లో చెలరేగిన మంటలు