Share News

సాహసికం  ఈ సీమ అక్షరం

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:20 AM

ఈ క్షామము దాపురించిన నేలలో పుట్టి, రసజ్ఞతా నిర్మాణంలో తనదైన పాత్ర పోషించిన రచయిత డా. శాంతి నారాయణ. రాయలసీమ మట్టివాసనలు గుభాళించే శ్రామిక వర్గ రచయిత. సాహసవంతుడైన రచయిత.

సాహసికం  ఈ సీమ అక్షరం

‘‘క్షామము దాపురించి పలుసారులు చచ్చెను జంతుసంతతుల్

వేమరు చచ్చినారు ప్రజ వేనకువేలు చరిత్రలోపలన్

క్షామము లెన్ని వచ్చిన రసజ్ఞత మాత్రము చావలేదు జ్ఞా

నామృతవృష్టికిన్ కొరత నందని రాయలసీమ లోపలన్’’

– (నండూరి రామకృష్ణమాచార్య)

క్షామము దాపురించిన నేలలో పుట్టి, రసజ్ఞతా నిర్మాణంలో తనదైన పాత్ర పోషించిన రచయిత డా. శాంతి నారాయణ. రాయలసీమ మట్టివాసనలు గుభాళించే శ్రామిక వర్గ రచయిత. సాహసవంతుడైన రచయిత.

1946 జూలై 1న, అనంతపురం జిల్లాలోని బండమీద పల్లెలో, ఉప్పరవంశంలో వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులకు పెద్ద కొడుకుగా పుట్టిన శాంతి నారాయణ, చదువుకోవడం, డిగ్రీ కళాశాల అధ్యాపకుడుగా ఎదగడం, అక్షరంముక్క చదువులేని దంపతులకు కొడుకుగా పుట్టి జగమెరిగిన రచయిత కావడం, పదిమందికి చదువు చెప్పే దశకు చేరడం– ఇదంతా చూసినపుడు రాతిపగుళ్ళలోంచి మొలకెత్తిన విత్తనమే గుర్తుకు వస్తుంది.

ఈ జూలై 1తో శాంతి నారాయణకి ఎనభై ఏళ్ళు నిండుతున్నాయి. ఆయన 1968లో రచనా రంగంలోకి అడుగుపెట్టారు. ఈ 80ఏళ్ళ జీవిత కాలంలో దాదాపు అరవయ్యేళ్ళ సాహిత్య జీవితం గడిపారు. ఈ సాహిత్య జీవితంలో మూడు పార్శ్వాలుఉన్నాయి: 1. సాహిత్య సృజన, 2. సాహిత్య ప్రచారం,

3. సాహిత్య ప్రోత్సాహం.

కవిగా ఆయన ‘నడిరేయి నగరం’ (1979), ‘కొత్త అక్షరాలమై’ (2024) సంపుటాలు ప్రచురించారు. 1968లోనే ఒక నవల రాసి, ప్రచురించకుండా మానేశారు. తర్వాత ‘మాధురి’ (1980), ‘పెన్నేటి మలుపులు’ (2000), ‘ముడి’ (2022), ‘సాధన’ (2022) అనే నవలలు ప్రచురించారు. ఏడు కథాసంపుటాలు ప్రచురించారు: ‘రక్తపుముద్ద పిలిచింది’ (1972), ‘రస్తా’ (1976), ‘పల్లేరు ముళ్ళు’ (1998), ‘నమ్ముకున్న రాజ్యం’ (2004), ‘కొండచిలువ’ (2014), ‘బతుకుబంతి’ (2017), ‘గీతలు చెడిపి’ (2023). వీటిలో వందకి పైగా కథలు ఉన్నాయి. ఇవికాక ‘నాగలకట్ట సుద్దులు’ పేరుతో అనంతపురం జిల్లా భాషలో ఒక చెరువుకట్ట కథా స్థలంగా ఇద్దరు గ్రామీణుల సంభాషణ రూపంలో రెండు సంపుటాలు ఫీచర్ రచన చేశారు. శాంతి నారాయణ సాహిత్యజీవితం అనంతపురం జిల్లాలో అప్పుడప్పుడు కురిసేవాన వంటిది కాదు, ఎప్పుడూ ఎడతెగక పారే ఏరు వంటిది.


సాహిత్య ప్రచారకుడుగా శాంతి నారాయణ, నిద్రపోతున్న అనంతపురం జిల్లా రచయితల సంఘాన్ని పునరుద్ధరించి దాదాపు పన్నెండేళ్లు చరిత్రాత్మకమైన సభలు, సదస్సులు నిర్వహించారు. తెలుగునాట ప్రసిద్ధులైన రచయితలు, విమర్శకులందరినీ అనంత పురం రప్పించారు. భూస్వామ్య లక్షణాల బరువుతో వంగిపోయిన రాయదుర్గం, అనంతపురం సాహిత్య వాతావరణంలో గొప్ప సంచలనం తీసుకొచ్చారు. నిటారుగా నిలబెట్టారు. ‘ప్రాచీన తెలుగు సాహిత్యం – పునర్మూల్యాంకనోపన్యాసాలు’, ‘116 ఏళ్ళ తెలుగు నవల’ వంటివి ఆయన నిర్వహించిన విలువైన కొన్ని కార్యక్రమాలు. సాహిత్య ప్రోత్సాహకుడుగా ఆయన పదిహేనేళ్ళ నుంచి విమలా శాంతి సాహిత్య, సాంస్కృతిక సేవాసంస్థను స్థాపించి ప్రగతిశీల రచయితలకు పురస్కారాలు ఇస్తున్నారు. అయిదేళ్ళుగా సీనియర్ మోస్ట్ రచయితలకు జీవిత సాఫల్య పురస్కారాలు ఇస్తున్నారు. ఎక్కడ బండమీద పల్లిలో పుట్టిన శాంతి నారాయణ! ఎక్కడ పురస్కారాల ప్రదాత!

శాంతి నారాయణ 1968 నుంచి రచనలు చేస్తున్నా 1989 నాటి ‘దళారి’ కథతోనే ఆయనకు రచయితగా గుర్తింపు వచ్చింది. ఆయన రచనా జీవితంలో 1985 దాకా మొదటి దశ, తర్వాత రెండోదశ అవుతుంది. రెండోదశ వచ్చేసరికి రాయలసీమ వెనుకబాటుకు వ్యతిరేక ఉద్యమం మొదలై, దాని ప్రభావం శాంతి నారాయణ మీద పడడంతో ఆయన, రాయలసీమ నిర్దిష్ట వాస్తవికత మీద రచన చేయడం మొదలుబెట్టారు. ఇదే సమయంలో అస్తిత్వ ఉద్యమాలు మొదలయ్యాయి. రాయలసీమ వెనుకబాటుతనం మీద రాజకీయ ఉద్యమం మొదలైంది. 1984 నుండే స్త్రీవాదం, 1990ల నుండి దళిత బహుజన వాదం, 1992 నుండి ముస్లిం వాదం, ఆ ప్రాంతం నుండే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వంటివి జమిలిగా తెలుగు సమాజంలోకి, తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించాయి. అందుకే శాంతి నారాయణ అస్తిత్వవాద రచయిత అయ్యారు. అంతకుముందు ఆయనలో ఉన్న వర్గస్సృహకు అస్తిత్వ స్పృహ తోడయింది. ఈ సామాజిక పార్శ్వాల ప్రతిఫలనమే శాంతి నారాయణ సాహిత్యం.


శాంతి నారాయణ సాహసిక రచయిత కాకపోతే, భౌతికవాది కాకపోతే మతం రాజకీయాలలో ఆధిపత్యంలోకి వస్తున్న సమయంలో, పాత మీద ఈగవాలినా దౌర్జన్యం జరిగే సమయంలో, గతాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహిగా ముద్రపడుతున్న నేపథ్యంలో ‘విజయ విహారం’, ‘స్వాములు’, ‘దేవుడా! రక్షించు నా దేశాన్ని’, ‘కాలం వెంట’, ‘కాషాయ వైద్యం’... వంటి కథలు రాసేవారు కాదు. సంప్రదాయం పేరుతో, ఆచారం పేరుతో ఇంకా కొనసాగుతున్న ముట్టు, జల్లికట్టు వంటివాటి మీద ‘చనుకట్టు జాతర’, ‘ముట్టు గుడిసెలు’ వంటి కథలు రాసేవారు కాదు.

శాంతి నారాయణకు తాను పేదరికంలో అనుభవించిన బాధలకు బాధ్యులు రాయలసీమలో ఉన్నా, ఆయనకు రాయలసీమ పేదది అయిపోయిందే అనే ఆవేదన ఎక్కువ. రాయలసీమ కరువు సృష్టించిన విధ్వంసాన్ని ఆయన కళ్ళారా చూసి విమర్శనాత్మక దృష్టితో తన కథలలో చిత్రించారు. కరువుకు తోడు ఫ్యాక్షనిజం చేసే విధ్వంసాన్ని కూడా ఆయన ‘గర్భ స్రావం’ వంటి కథల్లో ఆవిష్కరించారు. రాయలసీమ కరువుకు శాంతి నారాయణ ప్రకృతిని దోషిగా చూపలేదు. రాజ్యాన్నే దోషిగా చూపారు. కరువులో రాయలసీమ మహిళలు నీటి కోసం, కడుపు తిండి కోసం మానం అమ్ముకోవలసి రావడాన్ని చిత్రించి పాఠకుల హృదయాలను ద్రవింపజేశారు. రాష్ట్రంలో ప్రాంతీయాభివృద్ధిలోని అసమానతలు రాయలసీమ ప్రజలను వలస పక్షులను చేస్తున్న తీరును రచయిత ఆలోచనాత్మకంగా ప్రదర్శించారు.


బహుజనుడైన శాంతి నారాయణ దళితుల జీవన సమయాన్ని దళిత పక్షపాతంతో చిత్రిస్తూ పలు కథలు రాశారు. కుల వ్యవస్థ మానవ సంబంధాలలోని సహజత్వాన్ని ఎలా నాశనం చేస్తున్నదో ఆయన కథలు తెలియజేస్తాయి. ‘ఉక్కు పాదం’ కథ చదువుతుంటే, 1950లలో అడవి బాపిరాజు కథ ‘నరసన్న పాపాయి’కి కొనసాగింపు అనిపిస్తుంది. తాను ఏ సామాజిక సమూహం వైపు నిలబడ్డారో ఆ సమూహ ప్రజల జీవన పోరాటాన్ని చిత్రించిన శాంతి నారాయణ, ఆ సమూహంలో కనిపించే అవలక్షణాలను బహిర్గతం చేయడానికి కూడా వెనుకాడరు. అందుకే ఆయన దళితుడుగా పుట్టి రిజర్వేషన్ ఉపయోగించుకొని యూనివర్శిటీ ఆచార్యుడైన వ్యక్తి, తన అమ్మను దిక్కులేని దానిని చేయడం మీద ‘తులసివనంలో తుమ్మచెట్టు’ కథ రాయడానికి సంకోచించలేదు.

శాంతి నారాయణ సాహిత్యంలో ప్రాంతీయ దళిత అస్తిత్వాల తర్వాత స్త్రీ అస్తిత్వం ఒక ముఖ్య పార్శ్వం. ఆయనకు స్త్రీల వ్యక్తిత్వం, స్త్రీ స్వేచ్ఛల పట్ల కల్తీలేని మమకారం ఉంది. అది కనిపించని చోట ఆయన ఆగ్రహం చూపారు. అందులోంచి పుట్టుకొచ్చిందే ‘ముడి’ నవల, ఇంకా అనేక కథలు. ఇవి భారతీయ మహిళాజీవిత విషాదాలనే కాదు, సాహసాలను కూడా చిత్రించాయి. అస్తిత్వవాదాలు మన సమాజంలో ప్రవేశి స్తున్న సమయంలోనే ప్రపంచమంతా చుట్టుముట్టుతూ వచ్చిన ప్రపంచీకరణ చేస్తున్న విధ్వంసాన్ని శాంతి నారాయణ ‘కొండ చిలువ’, ‘మోహినీ మోహనం’ వంటి కథల్లో ప్రదర్శించారు.

శాంతినారాయణ గత ఆరు దశాబ్దాలుగా మన సమాజానికి వైజ్ఞానిక నాయక పాత్ర నిర్వహిస్తున్నారు. సమాజం నుండి తాను నేర్చుకుంటూ, తన పంచేంద్రియాల ద్వారా గ్రహించిన జ్ఞానాన్ని సమాజానికి పంచుతున్నారు.

- రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

Updated Date - Jun 29 , 2026 | 04:23 AM