Share News

వరకట్నపు హత్యలు ఇంకెన్నాళ్లు?

ABN , Publish Date - Jun 09 , 2026 | 01:07 AM

ఐక్యరాజ్యసమితి మహిళా విభాగంలో నేను పనిచేసిన కాలంలో స్త్రీ హత్య (ఫెమిసైడ్‌–స్త్రీలను, బాలికలను కేవలం జెండర్‌ కారణంతో చంపడం. 1970వ దశకంలో ఈ పదం ప్రాచుర్యం పొందింది) భావనకు...

వరకట్నపు హత్యలు ఇంకెన్నాళ్లు?

ఐక్యరాజ్యసమితి మహిళా విభాగంలో నేను పనిచేసిన కాలంలో స్త్రీ హత్య (ఫెమిసైడ్‌–స్త్రీలను, బాలికలను కేవలం జెండర్‌ కారణంతో చంపడం. 1970వ దశకంలో ఈ పదం ప్రాచుర్యం పొందింది) భావనకు గుర్తింపు సాధించేందుకు విశేష కృషి జరిగింది. ఆ కృషి 1994లో బెలెండో పారా ఒప్పందం (మహిళలపై హింసను మానవ హక్కుల ఉల్లంఘనగా గుర్తించిన ప్రప్రథమ అంతర్జాతీయ ఒడంబడిక)లోను ప్రతిబింబించింది. భారత్‌లో ఏ నేరాన్ని అయినా నిజంగా ఫెమిసైడ్‌ అని చెప్పాలంటే అది వరకట్న మరణమే అవుతుంది.

వరకట్న సంబంధిత ప్రతి విషాదమూ జాతి అంతరాత్మను అమితంగా కలచివేస్తుంది. ఈ విషాదాలు వార్తల్లోకి వచ్చినా రాకపోయినా ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట సంభవిస్తూనే ఉన్నాయి. స్త్రీలను దేవీత్రయం– లక్ష్మి, సరస్వతి, పార్వతి–గా పూజించే భారతదేశం స్త్రీల గౌరవాన్ని ఒక వినిమయ సరుకుగా ఎందుకు పరిగణిస్తోంది? స్వాతంత్ర్య శతాబ్ది (2047) నాటికి వికసిత భారత్‌గా ప్రభవించాలని ఆరాటపడుతున్న భారత్‌ తన కుమార్తెల విలువను వాహనాలు, నగదు, బంగారం, గృహాలతో నిర్ణయించడం క్షమార్హం కాని అవివేకం కాదా?

వరకట్నం ఒక ఆచారం కాదు, ఒక కానుక కాదు, వివాహ మహోత్సవాలలో ఆడంబరపూర్వకంగా ప్రదర్శితమయ్యే ‘కుటుంబ ప్రతిష్ఠ’ కాదు. అదొక విపణి. వివాహం తన ఆత్మను కోల్పోతున్న సంత అది. వివాహ సమయంలో తల్లిదండ్రులు తమ కుమార్తెకు స్వచ్ఛందంగా ఇచ్చే భూమి, ఆభరణాలు, గృహోపకరణాలు మొదలైన వాటిని స్త్రీ ధనంగా పరిగణించడం మన సమాజంలో పురాతన కాలం నుంచీ వస్తోన్న సంప్రదాయం. మెట్టింటిలో తమ బిడ్డ ఆర్థిక భద్రతకు, గౌరవానికి, స్వతంత్ర ప్రతిపత్తికిగాను కన్నవారు ఆ ఆస్తులను ఇస్తారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆ సిరి సంపదలపై కుమార్తే ఏకైక హక్కుదారు. భర్త కుటుంబాన్ని సంపద్వంతం చేసేందుకు కాక, మహిళా సాధికారతకు ఆలంబన అయ్యే సంప్రదాయమే స్త్రీ ధనం. ఆధునిక వరకట్నం అనేది స్త్రీ ధనం భావన వికృత రూపం. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడానికి రూపొందించిన ఒక సాధికారిక యంత్రాంగం నుంచి.. మహిళలను సరుకులుగా మార్చే, తరచుగా గృహహింసను ప్రేరేపించే ఒక బలవంతపు లావాదేవీల డిమాండ్‌గా ఇది రూపాంతరం చెందింది.


వరకట్నం సాంఘిక దురాచారం మాత్రమే కాదు, అది పచ్చని సంసారంలో హింసకు తావిచ్చే ఒక అనాగరిక వ్యవహారం. డిమాండ్‌తో ప్రారంభమై హక్కుగా అది పరిణమిస్తుంది. ఈ క్రమంలో భౌతిక హింస చోటుచేసుకుని ఆత్మహత్య, హత్యకు పురిగొల్పుతుంది. కులమతాలు, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా కుటుంబ వ్యవస్థ అంతటా ఈ దురాచారం ప్రబలంగా ఉన్నది. 2024లో భారతదేశంలో 5,737 వరకట్న మరణాలు నమోదయ్యాయి. ప్రతిరోజూ ఇంచుమించు 16 మంది మహిళలు మరణం పాలయ్యారు. కేవలం 35శాతం కేసులలో మాత్రమే విచారణ పూర్తయి నిందితులకు శిక్షలు పడ్డాయి.

వరకట్నం ఒక పురుషుడి గౌరవానికి భంగం కలిగించే వ్యవహారం. కట్నాన్ని డిమాండ్‌ చేసి తీసుకునే పురుషుడు తనకుతానుగా తన మార్కెట్‌ ధరను నిర్ణయిస్తున్నాడు. తన పురుషార్థాన్ని, పురుషత్వం –జీవన సామర్థ్యాలు, వ్యక్తిత్వం– విలువను తగ్గించుకుంటున్నాడు. విషాదమేమిటంటే వరకట్నం డిమాండ్లు అరుదుగా మాత్రమే బహిరంగంగా వ్యక్తమవుతాయి. సర్వసాధారణంగా అవి మర్యాదపూర్వకమైన సామాజిక భాషచాటున దాగి ఉంటాయి. నూతన వధూవరులు కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సహాయపడడం, పెళ్లి ఖర్చులన్నీ వధువు కుటుంబం వారే భరించాలనడం మొదలైన కోరికలుగా అవి ఉండడం కద్దు. అమ్మాయికి ఇచ్చే ఆస్తుల గురించి తేలేదాకా వరుడి కుటుంబం ఆ సంబంధాన్ని ఒప్పుకుంటున్నదీ లేనిదీ చెప్పదు. యువతులు దీన్నొక ముందస్తు హెచ్చరికగా తీసుకోవాలి. విద్య, ఉద్యోగ హోదా కూడా చాలా ముఖ్యం. మానసిక సంసిద్ధత కూడా అంతకంటే ముఖ్యమైనది. వరకట్నం ఆశించే సంబంధం నుంచి వైదొలగడం అంటే నిశ్చితార్థం లేదా వివాహం రద్దు కావడం కాదు. అది ఆత్మరక్షణ. వధువుల వ్యక్తిగత సాధికారతకు అదొక కీలకమైన చర్య.

వరకట్న విషాదాలను నివారించడంలో యువతుల తల్లిదండ్రులకు చాలా బాధ్యత ఉన్నది. తొలుత అసలు వరకట్నం ఇచ్చేందుకు అంగీకరించకూడదు. వివాహానంతరం వరకట్నాన్ని డిమాండ్‌ చేస్తే ‘ఆ వివాహ బంధాన్ని ఎలాగైనా కాపాడాలి’ అనీ, ‘ఎట్టి పరిస్థితులలోను కూతురి కాపురాన్ని నిలబెట్టాలి’ అని ఆలోచనలు చేయవలసిరావడం అనివార్యమవుతుంది. భర్తతో సర్దుకుపోవాలని, రాజీపడాలని లేదా కుటుంబ గౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాలని యువతులకు ప్రతి ఒక్కరూ సలహా ఇస్తుంటారు. హింసాత్మక వాతావరణం నెలకొన్న సంసారంలో గౌరవం లభిస్తుందా? కష్టాల్లో పడ్డ ఆడపడుచులకు తల్లిదండ్రుల గృహం ఒక రక్షణాశ్రయం కావాలేగానీ, ఒక న్యాయస్థానం కాకూడదు. వరకట్న వేధింపులలో అత్త, ఆడబిడ్డ, మహిళా బంధువుల పాత్ర సైతం క్రూరంగా ఉండడం కద్దు. ఒక మహిళ కష్టాలకు తోటి మహిళే కారణమవడం విచారకరం! మన సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ సంప్రదాయాలు ఇంకా బలంగా వర్ధిల్లుతున్నాయంటే అందుకు కారణం పితృస్వామ్య అణచివేతలలో మహిళలు భాగస్వాములవడం కూడా అని చెప్పక తప్పదు.


భారతదేశంలో వరకట్నాన్ని ఇవ్వడం, తీసుకోవడం నిషిద్ధం. 1961లోనే వరకట్న నిషేధ చట్టం అమలులోకి వచ్చింది. భారతీయ న్యాయసంహితలోని సెక్షన్‌ 80 వరకట్న మరణాలకు సంబంధించినది. అది నిందితులకు కఠిన శిక్షలు నిర్దేశించింది. క్రూరత్వం, వేధింపులు మొదలైన నేరాలపై విచారణ సెక్షన్‌ 85 కింద జరుగుతుంది. చట్టం పటిష్ఠంగా ఉన్నది. మరి అది సరైన రీతిలో అమలవుతున్నదా? చట్టాలను అమలుపరచనప్పుడు నేరాలను ఎలా నిరోధించగలుగుతాము? వరకట్న సంబంధిత కేసులలో చాలామంది నిందితులు నిర్దోషులుగా విడుదలవుతున్నంతమాత్రాన అవి తప్పుడు కేసులు కావు. విచారణలో జాప్యం, సామాజిక ఒత్తిడి, కోర్టు వెలుపల పరిష్కారాలు మొదలైన కారణాలతోనే చాలామంది నిర్దోషులుగా విడుదలవుతున్నారు.

మరి వరకట్న నేరాలను అరికట్టడమెలా? వరకట్న ఆచారాన్ని నిరోధించడమే. యువతులకు సాధికారత కల్పించడం ద్వారా వరకట్నాన్ని వ్యతిరేకించేలా చేయాలి. సంబంధిత చట్ట నిబంధనలను కచ్చితంగా అమలుపరచాలి; సంరక్షణ చర్యలు ముఖ్యం. ఈ నేరాలు, ఘోరాలు జరిగినప్పుడు వెన్వెంటనే అధికార వ్యవస్థకు సమాచారమందించి, బాధితులకు సహాయక చర్యలు చేపట్టాలి. బాధ్యతాయుతమైన పోలీసింగ్‌కు ప్రాధాన్యమివ్వాలి. నమోదైన కేసులపై విచారణ సత్వరమే జరిగేలా చూడాలి. జరిగిన నేరానికి భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు, ఇతర బంధువులను జవాబుదారీ చేయాలి. బాధితుల మానసిక ఆరోగ్యంపై కూడా శ్రద్ధ చూపాలి.

వరకట్న దురాచారాన్ని నిర్మూలించి తీరాలి. అది ధర్మ విరుద్ధమైనది, అనాగరికమైనది. మహిళ హుందాను ఉల్లంఘిస్తుంది. పురుషుడి గౌరవాన్ని తగ్గిస్తుంది. కుటుంబాన్ని అవినీతిపాలు చేస్తుంది. సమభాగస్వామ్యమైన వివాహవ్యవస్థను విషతుల్యం చేస్తుంది. బలవంతపు చర్యలను ఏ ఆచారమూ అంగీకరించదు. వరకట్నాన్ని తీసుకోవడం ఏ కుటుంబానికీ గౌరవనీయం కాదు. ఆర్థిక లావాదేవీతో ప్రారంభమయ్యే ఏ వివాహమూ పవిత్రమైనది కాజాలదు.

లక్ష్మీ పూరి

మాజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం

(ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌)

ఇవి కూడా చదవండి..

ఐదు కీలక నిర్ణయాలు తీసుకున్న ఇండియా కూటమి నేతలు..

మోదీ పాలనలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయి: ఏఐసీసీ చీఫ్ ఖర్గే..

Updated Date - Jun 09 , 2026 | 01:07 AM