అమెరికాపై ట్రంప్ దురాగతాలు!
ABN , Publish Date - Apr 17 , 2026 | 02:14 AM
జాతుల, సమాజాల భవితవ్యాలను నిర్మించడంలో వ్యక్తుల పాత్రకు తక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వడం చరిత్రకారులకు పరిపాటి. బ్రిటిష్ చరిత్రకారుడు ఈ.హెచ్.కార్ తన ‘చరిత్ర అంటే ఏమిటి?’ అన్న పుస్తకంలో చరిత్రను ‘మంచి’, ‘చెడు’ వ్యక్తుల...
జాతుల, సమాజాల భవితవ్యాలను నిర్మించడంలో వ్యక్తుల పాత్రకు తక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వడం చరిత్రకారులకు పరిపాటి. బ్రిటిష్ చరిత్రకారుడు ఈ.హెచ్.కార్ తన ‘చరిత్ర అంటే ఏమిటి?’ అన్న పుస్తకంలో చరిత్రను ‘మంచి’, ‘చెడు’ వ్యక్తుల కథలుగా కుదించివేసే చరిత్ర రచనా పద్ధతిని తిరస్కరించారు. చరిత్ర అనేది కేవలం నిష్పాక్షిక వాస్తవాల సమాహారం కాదని, అది వర్తమానానికి, గతానికి మధ్య జరిగే ఒక ‘అంతులేని సంభాషణ’ అని, అది తరచుగా చరిత్రకారుడి సొంత దృక్పథం ద్వారా రూపు దిద్దుకుంటుందని కార్ వాదించారు. ‘మానవులు తమ చరిత్రను తామే సృష్టించుకుంటారు, కానీ వారు దానిని తమకు నచ్చినట్లుగా సృష్టించుకోరు. వారు దానిని తాము ఎంచుకున్న పరిస్థితులలో కాకుండా ఇప్పటికే ఉన్న, గతం నుంచి ఇవ్వబడిన, సంక్రమించిన పరిస్థితులలో సృష్టించుకుంటారు’ అని కార్ల్ మార్క్స్ అన్నారు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో వ్యక్తులు మంచికో, చెడుకో చరిత్ర నిర్మాణంలో కీలక, నిర్ణయాత్మక పాత్ర వహిస్తారు.
మనం నివసిస్తున్న ఈ కాలపు చరిత్రను ప్రభావితం చేస్తున్న వ్యక్తులలో డోనాల్డ్ ట్రంప్ మరెవ్వరి కంటే ప్రముఖుడు. అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఉత్థానాన్ని విస్తృత ఆర్థిక వ్యవస్థలో విస్తృత మార్పులు, సాంకేతికతల్లో వినూత్న పురోగతి నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. ఆర్థిక వ్యవస్థల ప్రపంచీకరణ పర్యవసానాల పట్ల శ్వేతజాతి అమెరికన్ కార్మిక శ్రేణుల్లో తీవ్ర నిరాశానిరుత్సాహాలు నెలకొనడంతో పాటు నవ నవీన వార్తా మాధ్యమాలు సుసాధ్యం చేసిన విశేష ప్రచారం లేని పక్షంలో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికయ్యేవాడే కాదు. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత కోట్లాది వ్యక్తుల అదృష్ట దురదృష్టాలను అతడు నిర్ణయాత్మకంగా ప్రభావితం చేస్తున్నాడు. 2026లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కాకుండా మరో వ్యక్తి ఉన్నట్టయితే ఇజ్రాయెల్ ప్రోద్బలంతో అమెరికా పశ్చిమాసియాలోని ఇరాన్ పైకి యుద్ధానికి వెళ్లి ఉండేదేకాదు. అపార ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించి ఉండేది కాదు. అలాగే పశ్చిమాసియా వెలుపలి దేశాలలో చమురు, వంటగ్యాస్, ఎరువుల ధరలు పెరిగి ఉండేవే కావు.
ఇరాన్‌కు వ్యతిరేకంగా యుద్ధానికి దిగడం ద్వారా ప్రపంచానికి ట్రంప్ చేసిన చెరుపు కంటే, పదిహేను నెలల క్రితం రెండోసారి అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అతడు తన సొంత దేశానికి చేసిన హానిపై ఈ కాలమ్‌లో దృష్టి పెట్టదలుచుకున్నాను. ‘అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా చేస్తాను’ అని హామీ ఇచ్చిన ట్రంప్, అదే దేశాన్ని అనేక విధాలుగా బలహీనపరిచాడు. కనీసం ఏడు ముఖ్య మార్గాలలో అమెరికాను అతడు భ్రష్టపరిచాడు.
ట్రంప్ తన దేశానికి వ్యతిరేకంగా పాల్పడిన దురాగతాలలో మొదటిది ప్రభుత్వ పరిధిలో విధాన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియపై దాడి. అమెరికా అధ్యక్షుడు వెస్ట్ మినిస్టర్ తరహా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధానమంత్రి కంటే సాంకేతికంగా మహా శక్తిమంతుడే అయినప్పటికీ విధాన నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరులను తప్పనిసరిగా సంప్రదించవలసి ఉంటుంది. అయితే ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేందుకు, ఏకపక్షంగా వ్యవహరించేందుకే ప్రాధాన్యమిచ్చాడు. జాతీయ చట్టసభ కాంగ్రెస్‌ను బేఖాతర్ చేయడంతో పాటు సొంత కేబినెట్‌ను సైతం విశ్వాసంలోకి తీసుకోకుండానే నిర్ణయాలు చేయడం ఆయనకు పరిపాటి అయింది. వెనెజువెలా, ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రకటించడమే అందుకు నిదర్శనం.
అమెరికాపై ట్రంప్ దాడులలో రెండోది నిష్పక్షపాత కార్యనిర్వాహక శాఖ అనే భావన పట్ల బద్ధ వ్యతిరేకత చూపడం. న్యాయశాఖను తన ప్రత్యర్థులకు వ్యతిరేకంగా ఉపయోగించడమే ఇందుకు నిదర్శనం. చట్టం ప్రకారం నడుచుకున్న నిజాయితీపరులు అయిన అధికారులను సైతం వేధించేందుకు న్యాయశాఖను ట్రంప్ దుర్వినియోగపరిచాడు. తన విధానాలతో ఏకీభవించని పౌరులను బెదిరించేందుకు డెమొక్రాట్ల పాలనలో ఉన్న రాష్ట్రాలకు ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెంట్లను ట్రంప్ నిరంతరాయంగా పంపుతున్నాడు. యుక్తాయుక్త విచక్షణ, న్యాయనిష్ఠతో కాకుండా పగ తీర్చుకోవడం, ప్రతీకారానికి పాల్పడడానికే ట్రంప్ పాలన ప్రాధాన్యమిస్తోంది. కక్షలు, కార్పణ్యాలు ఆయన నిర్ణయాలను బాగా ప్రభావితం చేస్తున్నాయి.
ట్రంప్ తన దాడులలో అమెరికా సైన్యాన్ని సైతం మినహాయించలేదు. ఇది అమెరికాకు వ్యతిరేకంగా ఆయన మూడో దురాగతం. చట్టం ప్రకారం అధ్యక్షుడి నుంచి సైనికాధికారులు ఆదేశాలు తీసుకోవలసి ఉంటుంది. సైనిక వృత్తిలో ఉన్నవారు ఏ ఒక్క నిర్దిష్ట రాజకీయవేత్తకే కాకుండా ఏ రాజకీయ పార్టీ పట్ల సానుకూల వైఖరితో వ్యవహరించడం పూర్తిగా నిషిద్ధం. ఈ సంప్రదాయాన్ని ట్రంప్ ఉల్లంఘించాడు. తన పుట్టినరోజు సందర్భంగా వాషింగ్టన్‌లో సైనిక కవాతును నిర్వహించాడు. ఇటీవల సైనిక దళాల ప్రధాన అధికారికి ఉద్వాసన చెప్పేందుకు తన రక్షణ మంత్రికి ట్రంప్ అనుమతినిచ్చాడు. జెండర్, జాతి వివక్షలకు తావు లేకుండా సైనిక దళాలలో ప్రమోషన్లను ప్రోత్సహించడమే బర్తరఫ్ అయిన ఆర్మీ చీఫ్ నేరమయిపోయింది!
ట్రంప్ దాడులలో నాల్గవది పత్రికా స్వాతంత్ర్యంపై జరుగుతోంది. తనకు, తన పాలనా విధానాలకు అనుకూలంగా వ్యవహరించాలని పలు మీడియా సంస్థల యజమానుల (ముఖ్యంగా వాషింగ్టన్ పోస్ట్ యజమాని జెఫ్ బెజోస్)ను ట్రంప్ బెదిరించాడు. మీడియా సంస్థలను కొనుగోలు చేసేందుకు కోటీశ్వరులు అయిన తన స్నేహితులను ప్రోత్సహిస్తున్నాడు. సీబీఎస్ ఇలానే చేతులు మారింది.
జగద్విఖ్యాత అమెరికా విశ్వవిద్యాలయాలపై ట్రంప్ ఐదో దాడి జరుగుతోంది. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమానికి వ్యతిరేకంగా విద్యార్థులు, అధ్యాపకులు ఉద్యమించడం పట్ల ట్రంప్ అగ్రహోదగ్రుడు అయ్యాడు. పలు విశ్వవిద్యాలయాలకు ఫెడరల్ నిధులు నిలిపివేశాడు. అన్ని విశ్వవిద్యాలయాలు తన రాజకీయాలకు అనుగుణంగా నడుచుకోవాలని ట్రంప్ హుకుం జారీచేశాడు. అంతర్జాతీయంగా తమకు ఎనలేని పేరు ప్రతిష్ఠలు సమకూర్చిన విద్వత్ సంప్రదాయాలు, విలువలకు తిలోదకాలు ఇవ్వక తప్పని విపత్కర పరిస్థితిని అమెరికన్ విశ్వవిద్యాలయాలకు ట్రంప్ కల్పించాడు.
అత్యంత విశ్వసనీయమైన మిత్రదేశాల పట్ల దుర హంకారపూరితంగా వ్యవహరించడం ట్రంప్ దురాగతాలలో ఆరవది. పొరుగున ఉన్న కెనడాతో అమెరికాకు మొదటి నుంచీ ప్రశస్త, ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చీ రాక ముందే ఆ మిత్రరాజ్యంతో వాణిజ్య సమరానికి తలపడ్డాడు. బలవంతంగా కలుపుకునే ప్రయత్నాలకూ నాంది పలికాడు. కెనడా ప్రధానమంత్రిని అమెరికా 51వ రాష్ట్ర గవర్నర్‌గా పరిగణిస్తున్నట్టు ప్రకటించాడు. ట్రంప్ ఇప్పుడు కెనడాను పరిహసించే, చిన్నబుచ్చే వైఖరులకు తాత్కాలికంగా స్వస్తి చెప్పాడు. అయితే నాటో సభ్య దేశాల పట్ల దౌత్య మర్యాదలకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని ట్రంప్ కొనసాగిస్తున్నాడు. యూరోపియన్ దేశాల విధానాల పట్ల ట్రంప్ వ్యతిరేకత ఆ దేశాల నాయకుల పట్ల ఆయన వ్యక్తిగత ద్వేషంగా పరిణమించింది. పలువురు యూరోపియన్ నాయకులను ముఖ్యంగా బ్రిటన్, స్పెయిన్ ప్రధానమంత్రులను బహిరంగంగా చులకన చేసేందుకు కూడా ట్రంప్ వెనుకాడడం లేదు.
అమెరికా అధ్యక్ష పదవి ప్రజాస్వామ్య విలువలు, సంప్రదాయాలను ఉద్దేశపూర్వకంగా బలహీనపరచడం కూడా ట్రంప్ దురాగతాలలో ఒకటిగా పేర్కొని తీరాలి. తన సోషల్ మీడియా పోస్టులో ఉపయోగిస్తున్న సంస్కార రహిత భాష, చేస్తున్న దుర్భాషలు.. తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఆర్థిక లబ్ధిని సమకూర్చేందుకు అధ్యక్ష పదవీ అధికారాలను దుర్వినియోగం చేయడంలో అది స్పష్టంగా కనిపిస్తోంది. మొరటుతనం, అవినీతిలో ట్రంప్ తన పూర్వ అధ్యక్షుల నందరినీ మించిపోయాడు. మరింత స్పష్టంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్ష పదవి ప్రతిష్ఠను బాగా దెబ్బతీశాడు.
రెండో రాకడ అనంతరం ట్రంప్ తన సొంత దేశానికి వ్యతిరేకంగా పాల్పడిన దాడులు, దురాగతాలకు ఇవన్నీ దృష్టాంతాలు. తాను ఎంతగానో ప్రేమించే దేశానికి, మళ్లీ ప్రపంచ గొప్ప శక్తిగా నిలబెడతానని వాగ్దానం చేసిన దేశానికి ట్రంప్ మూలంగా వాటిల్లిన నష్టాన్ని అవి సూచనప్రాయంగా వెల్లడిస్తాయి. మొత్తం మీద అమెరికాను ట్రంప్ బలహీనపరిచాడు. ఎన్నడూ లేని విధంగా అమెరికాను తక్కువ గౌరవాస్పద దేశంగా దిగజార్చాడు. మొదటిసారి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ట్రంప్ తరచూ మొండిగా, విడ్డూరంగా వ్యవహరించేవాడు. రెండోసారి అధ్యక్షుడు అయిన తరువాత అతడి చర్యలు ప్రమాదకరమైనవిగాను, దురాశాప్రేరితంగానూ ఉంటున్నాయని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రథమ, ద్వితీయ అధ్యక్ష పదవీ కాలాల మధ్య విరామంలో ట్రంప్, అతడి సలహాదారులు ఇతర నిరంకుశ పాలకుల తీరుతెన్నులను నిశితంగా అధ్యయనం చేసి, ఇప్పుడు వాటిని అమలుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. హంగరీలో ఓర్బాన్, తుర్కీయేలో ఎర్డోగన్, ఇజ్రాయెల్‌లో నెతన్యాహు... సరే, మన నరేంద్ర మోదీ తదితరులు ట్రంప్ మొదటిసారి అధికారంలోకి రాక మునుపే పత్రికా స్వేచ్ఛను హరించివేసేందుకు, న్యాయవ్యవస్థను ప్రత్యర్థులపైకి ఉసిగొల్పేందుకు, సాయుధ బలగాలను రాజకీయీకరణ చేసేందుకు, విశ్వవిద్యాలయాలను వశం చేసుకునేందుకు చాలా పట్టుదలగా కృషి చేశారు. ఈ వ్యక్తులందరూ తమ దేశాల ప్రజాస్వామిక శక్తిసామర్థ్యాలను బలహీనపరిచారు. ప్రపంచం దృష్టిలో తమ మాతృదేశాల ప్రతిష్ఠను ఎంతగానో మసకబరిచారు. ట్రంప్‌పై చరిత్ర తీర్పు ఏ విధంగా ఉండవచ్చు? మరే యితర సమకాలీన నాయకుడి కంటే అతడి చర్యలు అమెరికాకు, విశాల ప్రపంచానికి అపరిమిత నష్టాన్ని చేకూర్చాయని, బహుశా, ఘంటాపథంగా చెప్పవచ్చు. ఆర్థికంగా, సైనికంగా, శాస్త్ర సాంకేతికతలలో ప్రపంచ అగ్రగామిగా, ఈ ధరిత్రిపై అత్యంత ప్రభావవంతమైన దేశంగా ఉన్న అమెరికా ట్రంప్ మూలంగా ఇంకా ఎంతో కోల్పోవడం ఖాయం.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
ఇవీ చదవండి:
మహిళా రిజర్వేషన్ బిల్లు ముస్లిం ప్రాతినిధ్యాన్ని తుడిచివేసే చర్య: ఒవైసీ
డీలిమిటేషన్ బిల్లుపై ప్రతిష్ఠంభన.. ఎంపీలంతా హాజరుకావాలని కాంగ్రెస్ విజ్ఞప్తి